చినువ అచెబె
Chinua Achebe | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | ఆల్బర్ట్ చినువాలుమొగు అచెబె 1930 నవంబరు 16 ఒగిడి, నైజీరియా |
మరణం | 2013 మార్చి 21 బోస్టన్,మసాచుయేట్స్, అమెరికా | (వయసు 82)
వృత్తి | David and Marianna Fisher University Professor and Professor of Africana Studies Brown University |
జాతీయత | నైజీరియన్ |
కాలం | 1958–2013 |
గుర్తింపునిచ్చిన రచనలు | The African Trilogy: –Things Fall Apart, –No Longer at Ease, –Arrow of God; Also, A Man of the People, and Anthills of the Savannah. |
ఆధునిక ఆఫ్రికన్ సాహిత్య పితా మహుడిగా పేరుగాంచిన చినువ అచెబె 1930 నవంబరు 16న తూర్పు నైజీరియా లోని ఒగిడిలో జన్మించారు. ఆయన తండ్రి ఒక మిషన్ స్కూలు టీచరు. ఆయన తల్లిదండ్రులు తమ సంప్రదాయ ఇబో సంస్కృతికి చెందిన విలువలను అనేక రకాలుగా అచెబెలో నాటినప్పటికీ వారు గట్టి విశ్వాసమున్న క్రైస్తవులు. అందుచేతనే అచెబెకు అప్పటి విక్టోరియా రాణి భర్త ప్రిన్స్ ఆల్బర్ట్ పేరుతో ఆల్బర్ట్ అని నామకరణం చేశారు. ఆఫ్రికన్ ప్రజల జీవనచిత్రాన్ని, అత్యంత సహజంగా, శక్తివంతంగా తన రచనల ద్వారా ప్రపంచానికి చాటిన మహా రచయిత చిను అచెబె.[1]
బాల్యం
[మార్చు]అచెబె జన్మించిన ఇబో సంప్రదాయంలో కథలు చెప్పటానికి అధిక ప్రాధాన్యం ఇచ్చేవారు అది వారి జాతి సాంస్కృతిక ఆచారంలో మమేకమై ఉండేది. అందువల్ల అచెబెకి బాల్యంలో తల్లి, అక్క చెప్పే కథలు శ్రధ్ధగా వినటం అలవాటయ్యింది.
చదువు
[మార్చు]1944లో అచెబె ఉముహాయియా లోని ప్రభుత్వ కళాశాలలో చేరారు. ఆ తర్వాత వోలే సోయింకా, ఎలెచి అమడి, జాన్ ఒకీబో లాంటి ప్రముఖ నైజీరియా రచయితలందరి మాదిరిగానే ఇబడాన్ యూనివర్శిటీ కాలేజీలో అచెబె ప్రవేశించారు. అక్కడ ఇంగ్లీషు, చరిత్ర, థియాలజీలను అభ్యసించారు. అక్కడే తన ఇంగ్లీషు పేరును తిరస్కరించి చినువాగా మార్చు కున్నారు. 1953లో బిఏ పట్టా పుచ్చుకుని నైజీరియా బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీలో ఉద్యోగిగా చేరారు. ఆ కాలంలో ఆయన ఆఫ్రికాలోను, అమెరికాలోను పర్యటించారు. కొద్ది కాలం పాటు టీచరుగా కూడా పనిచేశారు. 1960వ దశకంలో నైజీరియా విదేశాంగ శాఖలో డైరెక్టరుగా ఉంటూ 'వాయిస్ ఆఫ్ నైజీరియా' కు బాధ్యత వహించారు.
రచనలు
[మార్చు]"సంత జరిగే ప్రదేశంలో ఆ ఉదయం పూట అంతా సందడిగా ఉంది. అక్కడ దాదాపు పదివేల మంది పోగయ్యారు. అంతా చాల నెమ్మదిగా మాట్లాడు కుంటున్నారు. ఒగుఫె ఎజుగో లేచి నిలబడ్డాడు.
బిగించిన పిడికిలి గాలిలోకి విసురుతూ 'ఉమోఫియా క్వేను' అంటూ నాలుగు సార్లు ఒక్కో సారి ఒక్కో వైపుకు తిరుగుతూ బిగ్గరగా నినదించాడు. ప్రతి సారి ఆ పదివేల మంది జనం 'యా' అంటూ సమాధానమిచ్చారు. మళ్లీ అంతా ప్రశాంతం. ఎజుగో గొప్ప శక్తివంతమైన వక్త. ఐదో సారి 'ఉమోఫియా క్వేను' అంటూ నినదించాడు. జనం అంతా 'యా' అంటూ ప్రతిధ్వనించారు. అప్పుడు ఎంబయానో తెగ ఉండే దిశగా చూపించి, పళ్లు పటపట కొరుకుతూ 'ఆ అడవి జంతువుల కొడుకులు ఉమోఫియా బిడ్డను హత్య చేయడానికి సాహసించారు.' అని ఎజుగో చెప్పి... జనంలో ఆగ్రహం నెలకొనేందుకు కొంత వ్యవధి ఇచ్చాడు. ఆ తర్వాత నిరావేశపూరిత స్వరంతో ఉమోఫియా ఆడపడుచు ఎంబయానో సంతకు వెళ్లడం, అక్కడ హత్యకు గురికావడం గురించి వివరించాడు. ఆ స్త్రీ ఒగ్బొఫె ఉడో భార్య అంటూ తన సమీపంలోనే తలవంచుకొని కూర్చొన్న వ్యక్తి వైపుకు చూపించాడు. జనంలో ఒక్కసారిగా ఆగ్రహం కట్టలు తెంచుకుంది...."
ఇది నైజీరియా సీనియర్ రచయిత చినువ అచెబె ప్రసిద్ధ నవల చిన్నాభిన్నం (థింగ్స్ ఫాల్ అపార్ట్) లోని ఓ శకలం.
అచెబె రచనలు ప్రపంచంలోని అనేక భాషల్లోకి అనువదించబడ్డాయి. ముఖ్యంగా 1958లో రాసిన 'థింగ్స్ ఫాల్ ఎపార్ట్' నవల 50 భాషల్లోకి అనువదించ బడింది. కోటి కాపీలకు పైగా అమ్ముడు పోయింది. ఆఫ్రికాకు చెందిన ఏ ఇతర రచయిత రచనలు ఇన్ని ప్రపంచ దేశాలకు చేరలేదు. 'థింగ్స్ ఫాల్ అపార్ట్' తర్వాత చాల కాలం వరకు ఆయన మరో ప్రధాన రచన చేయలేదు. 1987లో మాత్రమే ఆయన రాసిన 'యాంట్ హిల్స్ ఆఫ్‌ది సవన్నా' నవల వెలువడింది. అచెబె ఇంగ్లీషులోనే రచనలు చేసే వారు. ఎందువల్లనంటే 200కు పైగా విభిన్నమైన భాషలు మాట్లాడే ఆఫ్రికా ప్రజలందరికీ అవి చేరాలంటే ఇంగ్లీషులో రాయడమే ఉత్తమమైన మార్గమని ఆయన భావించారు. విశేషమేమంటే ఎన్నో ప్రపంచ భాషల్లోకి తన రచనలను అనువదించడానికి అనుమతించిన అచెబె తన మాతృభాష ఈబోలోకి మాత్రం వాటిని అనువదించడానికి ఇటీవలి వరకు అంగీకరించలేదు. మూల భాషను వలసపాలకులు భ్రష్టు పట్టించారని, అలాంటి అపభ్రంశపు భాషలోకి తన రచనలను అనుమతించనని ఆయన చెప్పేవారు. తన మూలాల పట్ల ఆయనకున్న ప్రగాఢ అభిమానానికి అది చిహ్నం.
నైజీరియాలో అంతర్యుద్ధం (1967-70) సాగుతున్నపుడు అచెబె బియాఫ్రన్ ప్రభుత్వ సర్వీసులో ఉన్నారు. ఆ తర్వాత అమెరికా, నైజీరియా విశ్వ విద్యాలయాల్లో బోధించారు. అప్పటినుండి ఆయన రచనల్లో స్వాతంత్య్రానంతర నైజీరియాలో పరిణామాల పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతూ వచ్చింది.2004లో నైజీరియా ప్రభుత్వం ప్రకటించిన ద్వితీయ అత్యుత్తమ పురస్కారం 'కమాండర్ ఆఫ్ ది ఫెడరల్ రిపబ్లిక్' ను తిరస్కరించడం కూడా ఈ ధిక్కరణలో భాగమే.
అచెబె తానుగా రచనలు చేయడంతో పాటు ఇతర ఆఫ్రికా రచయిత లను కూడా బాగా ప్రోత్సహించారు. క్రిస్టఫర్ ఒకీబె అనే రచయితతో కలిసి 1967లో ఆయన ఎంగుగోలో ఒక ప్రచురణ సంస్థను స్థాపించారు. ఆ తర్వాత ఆయన నైజీరియా విశ్వవిద్యాలయంలో రీసెర్చ్ ఫెలోగా నియమితులయ్యారు. ఆ విశ్వవిద్యాలయంలో ఇంగ్లీషు ప్రొఫెసర్‌గా పనిచేసి 1981లో పదవీ విరమణ చేశారు. 1971లో ఆయన నైజీరియా నూతన రచయితలకోసం ఏర్పాటయిన ఒకీకె పత్రికకు సంపాదక బాధ్యతలు నిర్వహించారు. అమెరికా, మసాచుసెట్స్ విశ్వవిద్యాలయంలో కూడా ఆయన ఇంగ్లీషు ప్రొఫెసరుగా పనిచేశారు. 1990వ దశకంలో ఆయన బార్డ్ కాలేజీలో ఫాకల్టీ మెంబరుగా ఉన్నారు. ప్రఖ్యాత ప్రచురణ సంస్థ హీన్‌మెన్ వద్ద అచెబె ఆఫ్రికా రచయితల సీరీస్‌కు సంపాదకత్వం వహించారు. ఆ సంస్థ ప్రచురించిన మొదటి రెండు పుస్తకాలు అచెబె నవలలే. ఇటీవల కాలం వరకు ఆ సీరీస్‌లో మూడోవంతు ఆదాయం అచెబె నవలలపైనే వచ్చేదంటే ఆయన రచనల ప్రాచుర్యాన్ని అర్ధం చేసు కోవచ్చు. అదే కాలంలో అచెబె ఇతర ఆఫ్రికా రచయితల నవలలు సైతం ఇతోధికంగా ప్రచురించ డానికి కారణ మయ్యారు. ఒక కారు ప్రమాదంలో అచెబె నడుం క్రింది భాగం అంతా చచ్చుబడి పోవడంతో 1990 నుండి వీల్ చైర్‌కే పరిమితమయ్యారు.
అచెబె తన రచనల నేపథ్యాన్ని తానే చక్కగా వివరించారు: నేను స్కూలుకు వెళ్లడం మొదలు పెట్టి రాయడం, చదవడం నేర్చుకునే టప్పటికి ఇతర దేశాల, ఇతర ప్రజల గాథలు మాత్రమే తెలుసుకోగలిగే వాడిని. అవన్నీ శ్వేత జాతీయుల మంచితనం గురించే ఉండేవి. సహజంగా నేను కూడ శ్వేత జాతీయులంత మంచివారు లేరని నమ్మేవాడిని. వారే తెలివికలవారు, మిగతా వారంతా వెర్రివారని భావించే వాడిని. అప్పుడే నాకనిపించింది, అసలు మనకంటూ మన కథలుండాలి కదా అని. నాకు ప్రసిద్ధ సామెత గుర్తుకు వచ్చింది. సింహానికి తన చరిత్ర తనకు తెలియకపోతే, వేటగాడి చరిత్రే ఎల్లప్పుడూ కీర్తించ బడుతుందన్నది ఆ సామెత.
అలాంటి జ్ఞానోదయం ఫలితంగా వెలువడిందే అచెబె మొదటి నవల 'థింగ్స్ ఫాల్ అపార్ట్'. దానిలో భావావేశాలకు అతీతంగా చరిత్రను వస్తుగతంగా చిత్రీకరిస్తారు అచెబె. ఈబో తెగకు చెందిన బలసంపన్నుడైౖన నాయకుడు ఒకాంక్వొ చుట్టు కథ అల్లబడుతుంది. ఒకాంక్వొ జీవితం చాల సాఫీగా, ఆనందంగా సాగిపోతుంటుంది. ముగ్గురు భార్యలు, పదకొండుమంది సంతానం. పుష్కలంగా పంటలు పండు తుంటాయి. గాదెల నిండా ఆహారం నిల్వలు. ఇలాంటి సమయంలో అనుకోకుండా ఓ ఉత్సవంలో ఒకాంక్వొ తన తెగకు చెందిన ఒక పిల్లవాడిని చంపుతాడు. దానితో ఏడేళ్లపాటు తెగను వదిలి పెట్టి కుటుంబంతో సహా ప్రవాసం పోవాల్సి వస్తుంది. ఈ ఏడేళ్లు ముగియగానే తిరిగి వచ్చి ఎప్పటి మాదిరిగా సంతోషంగా జీవితం గడపాలని అనుకుంటాడు ఒకాంక్వొ. కాని ఈ ఏడేళ్ల కాలంలో తన తెగ వారు నివసించే ప్రాంతంలో ఎన్నో మార్పులు సంభవిస్తాయి. తాను ఎంతో మిన్నగా ప్రేమించే సంప్రదాయాల స్థానంలో, క్రిస్టియన్ మిషన్ల ప్రవేశం ఫలితంగా వూహించని పరిణామాలు సంభవిస్తాయి. విదేశీయులు తమ మతాన్ని స్థాపించి, అక్కడి సంప్రదాయాల్ని దెబ్బతీయడమే కాకుండా, స్వంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి వారందరిపై పెత్తనాన్ని చెలాయిస్తుంటారు. ఇలాంటి పరిస్థితిలో ఒకాంక్వొ తిరిగి తన స్వంత స్థలానికి వస్తాడు. కాని తాను ఆశించిన సంతోషం కాని, ఆనందం కాని అతనికి లభించవు. పైగా పరాయి ప్రభుత్వ ప్రతినిధుల చేతిలో నిర్బంధానికి, చిత్రహింసలకు సైతం గురవుతాడు. పరాయి దేశస్తులను, వారి మతాన్ని తీవ్రంగా ద్వేషిస్తాడు. కాని తనలాగే తన తెగకు చెందిన ఇతరులంతా అలా ఎందుకు ద్వేషించడం లేదో అతనికి అర్ధం కాదు. చాల మంది వారి మతాన్ని అనుసరించి, వారి పాలనకు లోబడటం అతను ఎంత మాత్రం జీర్ణించుకోలేకపోతాడు. ఈ పెను మార్పులను, అవమానాల్ని తట్టుకోలేని ఒకాంక్వొ చెట్టుకు వురేసుకొని చనిపోతాడు.
ఇది స్థూలంగా కథ కాగా, దాన్ని అచెబె చెప్పిన తీరు అత్యద్భుతంగా ఉంటుంది. గిరిజన తెగల సంప్రదాయాలు, విశ్వాసాలు, వారి ఉత్సవాలు, ఆడవారి మనోభావాలు, వారి కష్ట సుఖాలు, పిల్లల కోసం తల్లిదండ్రులు పడే ఆరాటాలు, ప్రకృతితో ఆ గిరిజనుల జీవన పోరాటం- ఇలా అన్నీ కళ్లకు కట్టినట్లు చూపించారు అచెబె. చెప్పడం కన్నా చదివి ఆస్వాదిస్తేనే ఆ మాధుర్యం పూర్తిగా అర్ధమవుతుంది. అచెబె ఇంగ్లీషులో రాసినప్పటికీ సందర్భానికి అనుగుణంగా ఆ తెగ మాట్లాడే పదాలనే ఆయన వాడతారు. దానితో ఆ రచనలో నేటివ్ టచ్ ఎక్కువగా కనిపిస్తుంది. పాత్రల పరిచయంతో పాటు, వాడిన ఆఫ్రికా పదాల వివరణలు కూడా ఆ నవల ఆరంభంలో ఉంటాయి.
'థింగ్స్ ఫాల్ అపార్ట్' తర్వాత చాల కాలం వరకు పెద్ద రచనలు చేయనప్పటికీ అచెబె అనేక కథలు రాశారు. వ్యాసాలు సంకలనాలు ప్రచురించారు. కవిత్వం కూడా రాశారు. చిన్న పిల్లల కోసం కూడా అనేక పుస్తకాలు రచించారు. 'నో లాంగర్ ఎట్ ఈజ్', 'యారో ఆఫ్ గాడ్' అనేనవలలను 1964లో రాసినప్పటికీ, వాటి ఇతివృత్తాలు కూడా క్రిస్టియన్ మిషన్ రాక, వలస పాలన ఫలితాలే. 1987లో వెలువడిన 'యాంట్ హిల్స్ ఆఫ్ ది సావన్నా' నవల ఒక వూహాజనిత పశ్చిమాఫ్రికా దేశంలో సమకాలీన పరిస్థితులను వ్యంగ్యంగా వివరిస్తుంది. దానిలో ప్రధాన పాత్ర శామ్ అనే సైనికాధికారిది. అతను ఆ దేశానికి అధ్యక్షుడుగా కూడా అవుతాడు. ఆ తర్వాత విపరీతమైన అధికార దుర్వినియోగానికి పాల్పడతాడు. దాన్ని ప్రతిఘటించిన తన స్నేహితులను సైతం అంతం చేస్తాడు. చివరికి ఒక సైనిక కుట్రతో పదవీచ్యుతుడవుతాడు. ఆఫ్రికా దేశాల్లో పరిణామాలను అనుసరించే వారికి ఇవన్నీ తెలిసిన విషయాలే అయినప్పటికీ అచెబె తనదైన శైలిలో వాటిని వివరించడం, వాటి ద్వారా ఆయన అందించే సందేశం ముఖ్యమైనవి. ఏ రచనకైనా ఒక ప్రయోజనం ఉండాలని, మంచి సందేశం దానిలో ఇమిడి ఉండాలని అచెబె దృఢంగా విశ్వసిస్తారు.
బహుమతులు
[మార్చు]అచెబె 2007లో అంతర్జాతీయ బుకర్ బహుమతి అందుకున్నారు. ఆ బహుమతి తనను తాను గౌరవించుకోవడమేనని ప్రముఖులు పేర్కొన్నారు. ఆధునిక ఆఫ్రికా సాహిత్యానికి పితామహునిగా పరిగణించబడే అచెబెకు నోబెల్ బహుమతి రాకపోవడానికి కారణం తెల్లజాతివారి పట్ల, వలస పాలకుల పట్ల ఆయన రచనల్లో వ్యక్తమయ్యే నిరసనే అన్నది చాల మంది విశ్వాసం. వలసదేశాల ప్రజల పట్ల సానుభూతి చూపుతుందని శ్వేతజాతీయులు పరిగణించే జోసఫ్ కాన్‌రాడ్ రచన 'హార్ట్ ఆఫ్ డార్క్‌నెస్'ను అచెబె తీవ్రంగా విమర్శించడం కూడా సంపన్న దేశాల వారి ఆగ్రహానికి కారణం కావచ్చు. కాన్‌రాడ్ పూర్తి స్థాయి జాతి దురభిమాని అని అచెబె విమర్శించారు. అంతేకాదు, వి.ఎస్ నైపాల్ని ఆధునిక కాన్‌రాడ్ అనికూడ ఎత్తిపొడిచాడు.
వ్యక్తిగత జీవితం
[మార్చు]అచెబెకి భార్య ఒకోలి, ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు.
మరణం
[మార్చు]చిను అచెబె 2013 మార్చి 21న కన్నుమూశారు.
మూలాలు
[మార్చు]- ↑ నమస్తే తెలంగాణ, చెలిమె-ప్రపంచ కవిత (11 November 2018). "శరణార్థి శిబిరంలో మాతృమూర్తి!". మామిడి హరికృష్ణ. Archived from the original on 19 November 2018. Retrieved 9 July 2019.
{{cite news}}
:|archive-date=
/|archive-url=
timestamp mismatch; 6 జూలై 2019 suggested (help)