Jump to content

జశ్వంత్‌సింగ్ రావత్

వికీపీడియా నుండి
(జశ్వంత్‌సింగ్‌ రావత్ నుండి దారిమార్పు చెందింది)
రైఫిల్‌మాన్
జశ్వంత్‌సింగ్‌ రావత్
మహావీర చక్ర
1960ల నుండి రావత్ చిత్రం
జన్మనామంజశ్వంత్‌సింగ్‌ రావత్
జననం(1941-08-19)1941 ఆగస్టు 19
బార్యూన్, బ్రిటిష్ గర్వాల్ జిల్లా, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం గర్వాల్ జిల్లా, ఉత్తరాఖండ్ం భారతదేశం)
మరణం1962 నవంబరు 17 (Aged 21)
నూరనంగ్, నార్త్-ఈస్ట్ ఫ్రంటియర్ ఏజెన్సీ, భారతదేశం ( ప్రస్తుతం అరుణాచల ప్రదేశ్, భారతదేశం )
రాజభక్తిIndia రిపబ్లిక్ ఆఫ్ ఇండియా
సేవలు/శాఖ Indian Army
సేవా కాలం1
ర్యాంకురైఫిల్‌మాన్
యూనిట్4వ గఢ్వాల్ రైఫిల్స్
పోరాటాలు / యుద్ధాలుభారత చైనా యుద్ధం
పురస్కారాలు మహావీర చక్ర

రైఫిల్మన్ జశ్వంత్‌సింగ్‌ రావత్, మహావీర చక్ర (1941 ఆగస్టు 19 - 1962 నవంబరు 17) గఢ్వాల్ రైఫిల్స్‌లో పనిచేసిన భారతీయ సైనిక దళ సైనికుడు. అతను 1962 లో భారత చైనా యుద్ధం సందర్భంలో, అరుణాచల్ ప్రదేశ్‌లో జరిగిన నూరనాంగ్ యుద్ధంలో అతని పోరాటం ఫలితంగా మరణానంతరం మహా వీర చక్ర పురస్కారాన్ని గెలుచుకున్నాడు.

భారత చైనా యుద్ధంలో భారత సైనికులు వెనుతిరిగిన సందర్భంలో అతను ఒక్కడే తన స్థానం నుంచి కదలకుండా చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సేనలపై గుళ్ల వర్షం కురిపించాడు. ఒక్కడే దాదాపు మూడు రోజుల పాటు వారిని నిలువరించి 150 మంది చైనా సైనికులను మట్టుబెట్టాడు. [1]

భారత చైనా యుద్ధం

[మార్చు]
జశ్వంత్‌గఢ్ వార్ మెమోరియల్, జస్వంత్‌గఢ్, అరుణాచల్ ప్రదేశ్

జశ్వంత్ సింగ్ రావత్ ఈశాన్య సరిహద్దు ఏజెన్సీ (ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ ) లోని నూరనాంగ్ యుద్ధంలో 1962 నవంబరు 17న 4 వ బెటాలియన్, 4 వ గఢ్వాల్ రైఫిల్స్‌లో పనిచేస్తున్నాడు. చైనా భారతదేశంపై దాడి చేసినపుడు సరిహద్దులోని తవాంగ్ ప్రాంతాన్ని జయించి వచ్చిన తరువాత వారు అస్సాం లోకి ప్రవేశించడానికి చేసే ప్రయత్నంలో నూరనాంగ్ ప్రాంతంలో పెద్ద పోరాటం జరిగింది. ఈ పోరాటంలో భారతీయ సైనికుల దగ్గర వసతులు లేవు, వనరులు లేవు, కావలసిన ఆయుధాలు లేవు. చాలా తక్కువ ఆయుధాలు ఉండడంతో భారత సైనికాధికారులు, పోరాడుతున్న సైనికులను వెనుకకు రావలసినదిగా ఆజ్ఞాపించారు. మొత్తం సైనికులు వెనుదిరిగారు. కానీ జశ్వంత్ సింగ్ రావత్, గోపాల్ సింగ్ గోసాయ్, త్రిలోక్ సింగ్ నేగీ అనే ముగ్గురు సైనికులు మాత్రం అక్కడే ఉండిపోయారు. వీరు అధికారుల ఆదేశాలను ధిక్కరించి ఒక కొండ పైన గల కనుమలో దాక్కుని కొండ పైనుండి శత్రువులతో యుద్ధం చేసారు. వారి వద్ద ఉన్న కొద్ది పాటి ఆయుధాలతో శత్రువులను నిలువరించారు. దాదాపు 72 గంటల పాటు వీరు శత్రువులను నిలువరించారు. కొండ దిగువన దాదాపు 300 మంది చైనా సైనికులు ఆయుధాలతో ఉన్నారు. వారిని ఈ ముగ్గురు సైనికులు మాత్రమే నిలువరించారు. చివరికి యుద్ధంలో జరిగిన కాల్పులలో నేగీ, గుసాయ్ లు మరణించారు. రావత్ తీవ్రంగా గాయపడ్డాడు. అయినప్పటికీ అతను పోరాటాన్ని కొనసాగించాడు.

అతను ఒక్కడే నాలుగు వైపుల తుపాకులు అమర్చి వివిధ స్థానాల నుంచి కాల్పులు జరుపుతూ క్రింద ఉన్న సైనికులకు అనేక భారత సైనికులు కొండపై ఉన్న భావనను కల్పించాడు. మోంటా జాతికి చెందిన ఇద్దరు అరుణాచల ప్రదేశ్ గిరిజన మహిళలు అతనికి సహాయం చేసారు. వారి పేర్లు సెరా, నూరా. ఆ ఇద్దరు బాలికల సహాయంతో చైనీయుల వెన్నులో వణుకు పుట్టించాడు. జశ్వంత్ సూచనలతో సెరా, నూరా లు చైనా సైనికులకి కనిపించేలా దాదాపు 300 రైఫిళ్లను ఆ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. దీంతో అక్కడ వందలాది మంది భారత సైనికులు పోరుకు సిద్ధంగా ఉన్నట్టు చైనా సైన్యం భ్రమపడి ముందుకు వచ్చేందుకు సాహసించలేదు. మూడు రోజులైనా ఈ వ్యూహం ఏంటో అర్థంకాక దిక్కుతోచని స్థితిలో చైనా సైన్యం ఉండిపోయింది.

ఇదే సమయంలో జశ్వంత్ సింగ్‌కు ఆహారాన్ని అందిస్తున్న ఒక గ్రామస్థుడిని చైనా సైనికులు అదుపులోకి తీసుకుని అతడిని చిత్రహింసలు పెట్టడంతో నిజం చెప్పాడు. అసలు విషయం తెలిసి కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో చైనా సైన్యం జశ్వంత్ శిబిరంపై దాడి చేసింది. అలాంటి క్లిష్ట సమయంలోనూ అధైర్యపడని జశ్వంత్, చివరి నిమిషం వరకు వీరోచితంగా పోరాడి దాదాపు 150 మంది శత్రువులను మట్టుబెట్టాడు. గుండ్లు ఖాళీ అయిపోవడంతో చివరి తూటాతో ఆత్మాహుతి చేసుకొని వీరమరణం పొందాడు. అతనికి సహాయం చేసిన నూరాను చైనా సైనికులు చిత్రవథ చేసి చంపారు. సెరా వారికి చిక్కకుండా కొండపై నుండి లోయలోకి దూకి ఆత్మాహుతి చేసుకుంది. తమను మూడు రోజులు ముప్పుతిప్పలు పెట్టిన జశ్వంత్ సింగ్‌పై శత్రువులకు కసి చల్లారలేదు. దీంతో ఆయన తలను వేరుచేసి తమతో పాటు తీసుకెళ్లారు. ఇది జరిగిన కొద్ది రోజుల తర్వాత ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదరడంతో జశ్వంత్ సింగ్ తలను తిరిగి అప్పగించారు. ఆయన ధైర్య సాహసాలను శత్రు సైన్యం కూడా ప్రశంసించింది. [2]

ఈ యుద్ధంలో 300 మంది చైనా సైనికులు మరణించారు, 4 వ గర్వాల్ రైఫిల్ ఇద్దరు సైనికులను కోల్పోయింది. ఎనిమిది మంది గాయపడ్డారు.[3]

జశ్వంత్ సాహసానికి మెచ్చి భారత ప్రభుత్వం మహావీర చక్ర అవార్డును ప్రకటించింది. తవాంగ్ స్థానికులు ఇప్పటికీ జశ్వంత్ సింగ్ రావత్ ను బాబా జశ్వంత్ పేరుతో ఆరాధిస్తారు. ఆయన బలిదానం చేసిన ప్రాంతంలో ఒక మందిరాన్ని నిర్మించారు. ఈ ప్రాంతం మీదుగా విధులకు వెళ్లే భారతీయ సైనికులు ఆ మందిరంలో పూజలు చేస్తారు. ఆయన పోరాడిన ఆ స్థావరానికి "జస్వంత్ గఢ్" అని పేరు పెట్టారు. అతనికి లభించిన మరో గౌరవం ఏమిటంటే, అతను మరణం తరువాత కూడా సేవ చేస్తూనే ఉన్నాడు; అతను ఇప్పటికీ సేవ చేస్తున్నట్లుగా అతనికి పదోన్నతులు లభిస్తున్నాయి.[4]

4 వ గర్వాల్ రైఫిల్స్‌కు తరువాత బ్యాటిల్ ఆనర్ నూరనాంగ్ అవార్డు వచ్చింది. ఇది యుద్ధ సమయంలో ఒక ఆర్మీ యూనిట్‌కు లభించిన ఏకైక యుద్ధ గౌరవం.[5]

జనాదరణ పొందిన సంస్కృతిలో

[మార్చు]

అవినాష్ ధ్యానీ దర్శకత్వం వహించిన హిందీ చిత్రం 72 అవర్స్: మార్టిర్ హూ నెవర్ డైడ్, జశ్వంత్‌సింగ్‌ రావత్ కథ ఆధారంగా రూపొందించబడింది.

మూలాలు

[మార్చు]
  1. "ఒక్కడే 150 మంది చైనా సైనికులను మట్టుబెట్టి..." Samayam Telugu. Retrieved 2020-04-03.
  2. Babu, Ramesh (2017-07-18). "ఫ్లాష్ బాక్: ఒకే ఒక్కడు.. 150 మంది చైనా సైనికులను మట్టుబెట్టాడు". telugu.oneindia.com. Retrieved 2020-04-03.
  3. Col J Francis (Retd) (30 August 2013). Short Stories from the History of the Indian Army Since August 1947. Vij Books India Pvt Ltd. p. 53. ISBN 9789382652175.
  4. Talbot, Ian (2016). A History of Modern South Asia: Politics, States, Diasporas. Yale University Press. ISBN 0300216599.
  5. Singh Gp Capt, Ranbir (2009). Memorable War Stories. Prabhat Prakashan. p. 27. ISBN 8188322660.

మరింత చదవడానికి

[మార్చు]

బాహ్య లింకులు

[మార్చు]