జాంగో అన్‌చెయిన్డ్
జాంగో ఆన్‌చెయిన్డ్ | |
---|---|
దర్శకత్వం | క్వెంతిన్ తారాంటినో |
రచన | క్వెంటిన్ తరంటినో |
నిర్మాత |
|
తారాగణం |
|
ఛాయాగ్రహణం | రాబెర్ట్ రిచర్డ్‌సన్ |
కూర్పు | ఫ్రెడ్ రాస్కిన్ |
పంపిణీదార్లు | |
విడుదల తేదీs | డిసెంబరు 11, 2012(Ziegfeld Theatre) డిసెంబరు 25, 2012 (United States) |
సినిమా నిడివి | 165 minutes[2] |
దేశం | అమెరికా |
భాష | ఆంగ్లం |
బడ్జెట్ | $100 million[3] |
బాక్సాఫీసు | $425.4 million[3] |
జాంగో అన్‌చెయిన్డ్ క్వెంటిన్ టరంటినో దర్శకత్వం వహించగా జామీ ఫాక్స్, క్రిస్టోఫ్ వాల్ట్జ్, లియోనార్డో డికాప్రియో, కెర్రీ వాషింగ్టన్, శామ్యూల్. ఎల్. జాక్సన్ ప్రధానపాత్రల్లో నటించిన 2012 నాటి అమెరికన్ రివిజనిస్ట్ వెస్టర్న్ సినిమా. ఈ సినిమా కథ 18వ శతాబ్ది చివరి నుంచి అమెరికన్ పౌరయుద్ధం వరకూ బానిసల కాయకష్టంతో తోటల ఆర్థిక వ్యవస్థతో సుసంపన్నమైన అమెరికా దక్షిణాది ప్రాంతం (అంటెబెలం సౌత్)లోనూ, అమెరికన్ కాల్పనిక ప్రపంచంలో ప్రఖ్యాతమైన వైల్డ్ వెస్ట్ శైలి, ప్రదేశాల్లోనూ జరుగుతుంది. స్పాగెట్టీ వెస్టర్న్ శైలి (కౌబాయ్ సినిమాలు) సినిమాలకు, మరీ ప్రత్యేకించి సెర్గియో కొర్బుచీ తీసిన 1966 నాటి ఇటాలియన్ సినిమా జాంగోకు దీన్ని చాలా స్టైలిష్ నివాళిగా తీశారు.
సెర్గియో కొర్బుచీపై టరంటినో 2007 ఒక పుస్తకం రాస్తూండగా ఈ సినిమా కథాంశాన్ని రాసుకుని అభివృద్ధి చేయడం మొదలుపెట్టాడు.[4] 2011 ఏప్రిల్ నాటికల్లా స్క్రిప్ట్ తుది డ్రాఫ్ట్ రాసి విన్‌స్టన్ కంపెనీకి పంపించాడు. పాత్రలకు నటీనటులను ఎంపికచేయడం 2011 వేసవి నాటికి ప్రారంభించారు. ఫాక్స్‌ను జాంగో పాత్రకు ఎంపిక చేయడానికి ముందు మైకేల్ కె.విలియమ్స్, విల్ స్మిత్‌లను జాంగో పాత్రలకు పరిగణించారు. కాలిఫోర్నియా, వ్యోమింగ్, లూసియానా ప్రాంతాల్లో 2011 నవంబరు నుంచి 2012 మార్చి వరకు సినిమా ప్రధాన చిత్రీకరణ సాగింది[5].
2012 డిసెంబరు 11న జాంగో అన్‌చెయిన్డ్ న్యూయార్క్ నగరంలోని జీగ్‌ఫీల్డ్ థియేటర్‌లో ప్రీమియర్ ప్రదర్శన వేశారు, అమెరికా వ్యాప్తంగా 2012 డిసెంబరు 25న విడుదలైంది. అకాడమీ పురస్కారాల్లో 5 నామినేషన్లు సహా సినిమాను పలు సినీ అవార్డులు వరించాయి[6]. వాల్ట్జ్ తన నటనకు గాను ఉత్తమ సహాయ నటుడిగా గోల్డెన్ గ్లోబ్, బిఎఎఫ్‌టిఎ, ఆస్కార్ పురస్కారం వంటి ప్రతిష్ఠాత్మక అవార్డులు పొందారు. ఈ సినిమా స్క్రీన్‌ప్లే రాసినందుకు అకాడమీ పురస్కారం, గోల్డెన్ గ్లోబ్, బిఎఎఫ్‌టిఎ అవార్డులు టరంటినో అందుకున్నారు.
100 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 425 మిలియన్ డాలర్లకు పైగా సంపాదించి టరంటినో సినిమాల్లో బాక్సాఫీస్ వసూళ్ళపరంగా అత్యంత విజయవంతమైన సినిమాగా నిలిచింది.
కథాంశం
[మార్చు]టెక్సాస్ ప్రాంతంలో 1858లో నల్ల బానిసలను కాలినడకన నడిపిస్తూ గుర్రాలపై వారి యజమానులు స్పెక్ సోదరులుగా పిలిచే ఏస్, డిక్కీ సాగుతున్నారు. కాలికి సంకెళ్ళతో నడుస్తూ ఉన్న ఆ బానిసల్లో తన భార్య బ్రూమ్‌హిల్డా వాన్ షాఫ్ట్ నుంచి విడదీసి అమ్మేయగా ఏస్, డిక్కీల యాజమాన్యంలోకి వచ్చిన బానిస జాంగో కూడా ఉన్నాడు. జర్మన్ జాతీయుడైన డాక్టర్ కింగ్ షుల్జ్ స్పెక్ సోదరులను దారిలో అడ్డుకుని వారి బానిసల్లో ఒకడిని కొంటానని అంటాడు. షుల్జ్ మొదట దంతవైద్యునిగా ప్రారంభమై నేరస్తుల తలలపై ప్రభుత్వం లేక పోలీసు వారు ప్రకటించిన పారితోషికం - బౌంటీ - కోసం వేటాడే బౌంటీ హంటర్‌గా జీవిస్తున్నవాడు. బ్రిటిల్ సోదరులు అనే నేరస్తులను గుర్తుపట్టగలవా అంటూ జాంగోను అతను ప్రశ్నిస్తాడు, అతని వద్ద వారి తలకు జీవించివుండగా కానీ, మృతులుగా కానీ పట్టుకునేందుకు బహుమతితో కూడిన వారెంటు ఉంది. ఏస్ ఈ మొత్తం వ్యవహారంపై అనుమానంతో డాక్టర్ షుల్జ్‌కు తుపాకీ గురిపెట్టి హెచ్చరిస్తూండగా తుపాకీ గురిలోనూ, వాడకంలోనూ అత్యంత నిపుణుడైన షుల్జ్ క్షణాల్లో తుపాకీ తీసి ఏస్‌ని కాల్చి చంపి, డిక్కీ గుర్రాన్ని కాల్చి, డిక్కీని నేలమీదికి పడగొట్టి కాలు నాశనం చేస్తాడు. దారుణమైన స్థితిలో ఉన్న డిక్కీకి జాంగోని అమ్మడానికి తగ్గ డబ్బు ఇచ్చి, అతని అమ్మకం పత్రాలపై సంతకం చేయించుకుని, ఈ వ్యవహారంలో మిగతా బానిసలను స్వతంత్రులను చేసి వారి దయాధర్మంపై డిక్కీని వదిలి జాంగోతో బయలుదేరుతాడు షుల్జ్. బానిసలంతా ఎదురుతిరిగి డిక్కీని చంపేసి ఉత్తర దిశ చూపే నక్షత్రం పట్టుకుని నల్లవారికి స్వేచ్ఛ లభించగల అమెరికా ఉత్తర రాష్ట్రాలకు బయలుదేరి పోతారు. జాంగో బ్రిటిల్ సోదరులను కనిపెట్టగలడు కాబట్టి, వారిని చంపడంలో సహకరిస్తే డాక్టర్ షుల్జ్ అందుకు బదులుగా జాంగోకు స్వేచ్ఛనిస్తానని మాటిస్తాడు.
బ్రిటిల్ సోదరులను టేనస్సీ రాష్ట్రంలోని సంపన్నుడు, తోటల, బానిసల యజమాని "బిగ్ డాడీ"గా పిలిచే బెనెట్ ప్లాంటేషన్ (తోట)లో వెతికి పట్టుకుని చంపేశాకా, స్వేచ్ఛ పొందిన జాంగో డాక్టర్ షుల్జ్‌తో భాగస్వామిగా మారి అతని వద్ద బౌంటీ హంటింగ్‌కి సంబంధించిన అంశాలు నేర్చుకుంటూ పనిచేయడం ఆరంభిస్తాడు. అదే రోజు రాత్రి ఆరుబయట ఉన్న డాక్టర్ షుల్జ్, జాంగోలను బెనెట్, అతని వెంట భారీ సంఖ్యలో శ్వేతాధిక్య వాదులు (కూ క్లక్స్ క్లాన్‌కి ముందు రూపంలోనిదిగా భావించవచ్చు) వేటాడుదామని బయలుదేరగా వారిని మోసగించి షుల్జ్ ఒక భారీ పేలుడుతో గుంపులోని అత్యధిక సంఖ్యాకులను చంపేస్తాడు, జాంగో బెనెట్‌ని మంచి గురితో చంపుతాడు. తాను మొట్టమొదటిసారిగా స్వేచ్ఛ ప్రసాదించిన బానిస జాంగో కావడంతో అతని పట్ల తనకొక బాధ్యత ఉందని డాక్టర్ షుల్జ్ వివరిస్తాడు, అంతేకాక జాంగో భార్య బ్రూమ్‌హిల్డాని తిరిగి కలపడం తన నైతిక బాధ్యత అనీ చెప్తాడు. పూర్తిగా శిక్షణ పొందిన జాంగో నేరస్తులను చంపి మొట్టమొదటి పారితోషికంలో వాటా తీసుకుంటాడు.
1859లో, జాంగో, డాక్టర్ షుల్జ్ మిసిసిపీ ప్రాంతానికి ప్రయాణించి, బ్రూమ్‌హిల్డాని కెల్విన్ జె. కేండీ అన్న యజమాని కొనుగోలు చేసి తన బానిసల్లో ఉంచాడని తెలుసుకుంటారు. కెల్విన్ జె. కేండీ ఆకర్షణీయమైన వ్యక్తి, కేండీలాండ్ తోటల అధిపతి, అయితే అత్యంత క్రూరుడైన బానిస యజమాని. అతను బానిసలతో పోటీదారుల్లో ఎవరో ఒకరు చనిపోయేవరకూ కుస్తీ పట్టే ప్రాణాంతకమైన మాండింగో అనే యుద్ధ క్రీడ నిర్వహిస్తూంటాడు. డాక్టర్ షుల్జ్, జాంగోలు కెల్విన్‌ని గ్రీన్‌విల్లేలోని అతని జెంటిల్‌మేన్స్ క్లబ్‌లో కలిసి కెల్విన్ వద్ద ఉన్న మల్లయోధుల్లో అత్యుత్తమమైన వారిలో ఒకరిని కొంటాననే ప్రతిపాదన తీసుకువస్తారు, ఐతే ఇది కెల్విన్‌ని మోసపుచ్చేందుకు వారు వేసిన ఎత్తుగడ. నిజానికి వారి అసలు ఉద్దేశం బ్రూమ్‌హిల్డాను కొనుక్కుని రావడమే. వారి వలలో పడ్డ కెల్విన్ వారిని కేండీలాండ్‌లోని తన గుర్రాలు పెంచే రెంచ్ వద్దకు ఆహ్వానిస్తాడు.
కేండీలాండ్‌కి వెళ్ళేదారిలో డి ఆర్టగ్నాన్ అనే మాండిగో మల్ల యోధుడు, మాండిగో యుద్ధక్రీడలో పాల్గొనలేక పారిపోయిన కెల్విన్ బానిసను తప్పించుకున్న బానిసలను వేటాడి తెచ్చేవారు చుట్టుముట్టడం చూస్తారు. ఆర్టగ్నాన్ కేవలం మూడు మ్యాచ్‌లే ఆడాడనీ, 500 డాలర్లు పోసి కొనుక్కున్న అతను కనీసం ఐదు ఆటలు ఆడాలని అనగా, ముందు ఆ 500 డాలర్లు తాము చెల్లిస్తామన్న జాంగో, డాక్టర్ షుల్జ్ మనసు మార్చుకోగా కెల్విన్ తన బానిస వేటగాడిని ఆదేశించి బానిసను బ్రతికుండగానే కుక్కలతో చీల్చి చంపిస్తాడు.
బ్రూమ్‌హిల్డాను కనిపెట్టి ఆమెకు తమ ప్రణాళిక వివరిస్తారు. డా. షుల్జ్ తనకు జర్మన్ వచ్చిన బ్రూమ్‌హిల్డా బాగా నచ్చిందనీ ఆమెను కూడా కొనుక్కుంటానని ఆఫర్ చేస్తాడు. రాత్రి భోజనాల వేళ కెల్విన్ నమ్మకస్తుడైన ఇంటిపనుల బానిస స్టీఫెన్‌కు అనుమానం వస్తుంది. జాంగో, బ్రూమ్‌హిల్డా ఒకరికొరు తెలుసన్న విషయాన్ని, బహుశా మాండిగో పోరాట యోధుడిని కొంటానని చెప్పడమూ ఎత్తుగడే అయివుంటుందనీ స్టీఫెన్ పరిస్థితులను బట్టి అంచనా వేసి కెల్విన్‌ని ముందుగా హెచ్చరిస్తాడు. మోసం అర్థం చేసుకున్న కెల్విన్ ఆగ్రహోదగ్రుడై మాండిగో ఫైటర్‌కి ఇస్తానన్న భారీ మొత్తాన్ని ఇవ్వకుంటే బ్రూమ్‌హిల్డాను చంపేస్తానంటాడు. డాక్టర్ షుల్జ్ ఆ భారీమొత్తం చెల్లిస్తాడు, ఆమె స్వేచ్ఛ పత్రాలపై సంతకాలు కూడా అయిపోతాయి. కెల్విన్ చేయి కలిపితేనే ఈ ఒప్పందం అమలులోకి వస్తుందని, అంతవరకూ ఆమెకు డబ్బిచ్చినా స్వేచ్ఛ లభించదని అహంకారంతో ఒక నిబంధన పెడతాడు, దీన్ని డాక్టర్ షుల్జ్ తిరస్కరిస్తాడు. తన బాడీగార్డుతో బ్రూమ్‌హిల్డాను చంపిస్తానని కెల్విన్ బెదిరించడంతో చేయి కలిపినట్టే కలిపి అంతకుమునుపు తన కళ్ళ ఎదురుగానే ఒక బానిసను కుక్కలతో కరిపించి చంపడం గుర్తుకువచ్చి కెల్విన్ క్రూరత్వంపై ద్వేషంతో తన చిన్ని తుపాకీతో హఠాత్తుగా కెల్విన్ గుండెపై కాల్చి చంపేస్తాడు. స్టీఫెన్ కెల్విన్ మరణానికి హతాశుడై ఉండగా, అతని బాడీగార్డ్ డాక్టర్ షుల్జ్‌ని కాల్చి చంపుతాడు, వెనువెంటనే అతని రివాల్వర్‌తోనే కెల్విన్ బాడీగార్డుని జాంగో చంపేస్తాడు. తుపాకీ కాల్పులు మొదలౌతాయి, జాంగో కెల్విన్ అనుచరులను కాల్పుల్లో భారీ సంఖ్యలో చంపుతాడు. చివరకు బ్రూమ్‌హిల్డా వారి చేతికి చిక్కడంతో లొంగిపోతాడు.
రాత్రంతా జాంగోని, బ్రూమ్‌హిల్డాని కట్టేసి దారుణంగా హింసిస్తారు. కెల్విన్ చెల్లెలు లారా లీ కేండీ జాంగోని చనిపోయేంతవరకూ దారుణమైన చాకిరీ చేసే గనిలో అమ్మేస్తుందని స్టీఫెన్ తర్వాతిరోజు ఉదయం చెప్తాడు. గనికి వెళ్ళే దారిలో వీరిని తీసుకుపోయేవారికి తనవద్ద ఉన్న వారెంటులు చూపి తాను పారితోషికం కోసం వేటాడేవాణ్ణని, తనతో సహకరిస్తే ఒక నేరస్తుడిని చంపి అతని తలపై ఉన్న వెల వారికి వాటా పెడతానని మాట ఇస్తాడు. తీసుకుపోవాల్సిన గార్డులు విడిచిపెట్టి, రివాల్వర్ ఇస్తారు. వెనువెంటనే దానితోనే వారిద్దరినీ చంపేసి వారి గుర్రాన్ని దొంగిలించి డైనమైట్ల మూట పట్టుకుని కేండీలాండ్ బయలుదేరతాడు. కేండీలాండ్‌లోకి జాంగో కెల్విన్ బానిస వేటగాళ్ళని చంపుకుంటూ వెళ్తాడు. బ్రూమ్‌హిల్డా స్వేచ్ఛా పత్రాలను చనిపోయిన డాక్టర్ షుల్జ్ జేబులోంచి తీసుకుని, దగ్గరలోని కేబిన్‌లో ఉన్న తన భార్యని విడిపించుకుంటాడు. కెల్విన్ అంత్యక్రియలు పూర్తిచేసుకుని తిరిగివస్తున్న లారాను, మిగిలిన అనుచరులను చంపేస్తాడు. ఇద్దరు బానిసలను విడుదల చేసి, స్టీఫెన్ మోకాలిపై కాల్చి ఇంట్లోనే ఉంచి ఇంటిని డైనమైట్లతో కాల్చేస్తాడు. దూరం నుంచి జాంగో, బ్రూమ్‌హిల్డా ఇల్లు తగులబడిపోవడం, స్టీఫెన్ చనిపోవడం చూసి గుర్రాలను దౌడెత్తిస్తారు.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 "Django Unchained". AFI Catalog of Feature Films. Archived from the original on 2017-06-12. Retrieved July 23, 2017.
- ↑ "DJANGO UNCHAINED (18)". British Board of Film Classification. December 17, 2012. Archived from the original on December 31, 2012. Retrieved December 17, 2012.
- ↑ 3.0 3.1 "Django Unchained (2012)". Box Office Mojo. Internet Movie Database. Archived from the original on August 25, 2013. Retrieved January 25, 2013.
- ↑ Hiscock, John (April 27, 2007). "Quentin Tarantino: I'm proud of my flop". The Daily Telegraph. London. Archived from the original on March 25, 2012. Retrieved April 16, 2012.
- ↑ Child, Ben (May 5, 2011). "Tarantino's Django Unchained script: The word is out". The Guardian. London. Archived from the original on September 30, 2013. Retrieved September 16, 2012.
- ↑ Lyttleton, Oliver (October 22, 2012). "RZA Would Have Played His Character From 'The Man with the Iron Fists' In 'Django Unchained'". IndieWIRE. Archived from the original on 2012-10-26. Retrieved 2020-01-10.