Jump to content

జాఫర్‌గఢ్ కోట

వికీపీడియా నుండి
జాఫర్‌గఢ్ కోట
జాఫర్‌గఢ్, జాఫర్‌గఢ్‌ మండలం, జనగామ జిల్లా, తెలంగాణ
రకముకోట
స్థల సమాచారం
హక్కుదారుతెలంగాణ పర్యాటక శాఖ
సాధారణ ప్రజలకు ప్రవేశానుమతిఅవును
స్థల చరిత్ర
కట్టిన సంవత్సరం1853
కట్టించిందిజాఫరుద్దీన్‌దౌలా
వాడుకలో ఉందాసైనిక స్థావరం
వాడిన వస్తువులురాతి

జాఫర్‌గఢ్‌ కోట, తెలంగాణ రాష్ట్రం, జనగామ జిల్లా, జాఫర్‌గఢ్‌ మండలంలోని జాఫర్‌గఢ్‌ గ్రామంలో ఉన్న కోట.[1] గ్రామానికి సమీపంలోని 3000 అడుగుల ఎత్తులో ఉన్న వేల్పుకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి గుట్టపై 1853వ సంవత్సరంలో ఈ కోట నిర్మించబడింది. జనగామ జిల్లా కేంద్రానికి 45 కిలోమీటర్ల దూరంలో చారిత్రక జాఫర్‌గఢ్‌ కోట ఉంది.

చరిత్ర

[మార్చు]

జాగీర్దారుల నుంచి కప్పం వసూలు చేసేందుకు వచ్చిన గోల్కొండ నవాబుల సుబేదార్ సర్దారు జాఫరుద్దీన్‌దౌలా ఈ ప్రాంతాన్ని పాలించేవాడు. ఈ ప్రాంతాన్ని స్వతంత్రంగా పాలించాలనే లక్ష్యంతో తూర్పు, పడమటి కొండల మధ్య పచ్చగా కళకళలాడుతున్న ఈ ప్రాంతంలో శత్రు దుర్భేద్యమైన కోటను నిర్మించాడు. ఈ కారణంగానే ఆనాటి వేల్పుగొండ గ్రామం పేరు జఫర్‌గఢ్‌గా మారింది. అయితే, ఇతని ప్రయత్నాల గురించి తెలుసుకున్న గోల్కొండ నవాబులు అతన్ని చంపారు.[2]

ఓరుగల్లు కోటకీ, నిడికొండ గిరి కోటకీ మధ్యన ఈ జాఫర్‌గఢ్ కోట ఉంటుంది. శత్రువుల కదలికలను, అత్యవసర సందేశాలను తెలపడం కోసం దివిటీలను ఊపేవారు. కదలికలను బట్టి, ఊపే సంకేతాలను బట్టి ఎదుటివారు వీటిని అర్థం చేసుకొనేవారు. రోజూ రాత్రి కోటలోని అనేక స్థలాలలో దివిటీలు వెలిగించేవారు. ఈ దివిటీలను తయారుచేయడానికి, వాటిని కోటపైకి తీసుకువెళ్ళడానికి, ఆముదం నూనె తీయడానికి ఒక ఊరుని ప్రత్యేకంగా నిలిపి, అందులో నివసించే ప్రజలతో ఈ పనులు చేయించేవారు. అలాంటి ఊరికి దివిటిపల్లె అని పేరు వచ్చింది.[3]

నిర్మాణాలు

[మార్చు]

రెండు కొండల్ని కలుపుతూ విస్తరించిన గ్రామాన్ని శత్రు దుర్భేద్యంగా మలిచి శత్రువుల దాడులను అడ్డుకునేందుకు మూడు దర్వాజాలు (ఖమ్మం దర్వాజ, పట్నం దర్వాజ, హన్మకొండ దర్వాజ) నిర్మించబడ్డాయి. ఈ దర్వాజాల తలుపులు 10 అడుగుల వెడల్పు, 20 అడుగుల ఎత్తు ఉన్నాయి. బురుజులు, ద్వారాలు భారీ ఇనుప ఫిరంగులతో అమర్చబడి ఉన్నాయి. ప్రాచీన ఆలయాలు (లక్ష్మీనరసింహస్వామి దేవాలయం), మసీదులు, అబ్బురపరిచే శిల్పాలు, యుద్ధాల్లో ఉపయోగించిన రాతి ఫిరంగులు, కొండచుట్టూ నిర్మించిన భారీ ప్రహరీ, గ్రామం చుట్టూ లోతైన కందకాలు, సరస్సులు, బావులు, విశాలమైన రాతిగోడలు, వాటిపైన ఇటుక డంగుసున్నపు నిర్మాణాలు, ఎత్తయిన రాతి దర్వాజాలు, గోడల్ని మలిచి రూపొందించిన గవాక్షాలు వంటివి ఈ కోటలో ఉన్నాయి.

వైష్ణవ, శైవ దేవాలయాలు, కొండ సింగమయ్య గుడి నిర్మించాడు. పూజాదికాలకు, రాచస్త్రీల స్నానాల కోసం కోట పరిసరాల్లో తులశంబావి, భోగంబావి అనే రెండు బావులు ఏర్పాటు చేశాడు.

గుర్తింపు

[మార్చు]

రాష్ట్ర పురావస్తు చట్టం, 1960లోని సెక్షన్ 30(1) ప్రకారం రాష్ట్ర పురావస్తు శాఖ ఈ జాఫర్‌గఢ్ కోటను పురాతన స్మారక చిహ్నంగా ప్రకటించింది.[4]

పంద్రాగస్టు వేడుకలు

[మార్చు]

70వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని చారిత్రక నేపథ్యమున్న జాఫర్‌గఢ్‌ కోటను ముస్తాబు చేసి, ఖమ్మం దర్వాజపై 2016 ఆగస్టు 15న ఎమ్మెల్యే డాక్టర్‌ టి.రాజయ్య జాతీయ జెండా ఎగురవేశాడు.[5]

పునరుద్ధరణ

[మార్చు]

కోట అభివృద్ధి, పునరుద్ధరణ పనులకు ప్రభుత్వం పర్యాటక శాఖకు 55 కోట్ల నిధులు మంజూరు చేసింది. మొదటి దశలో 44 లక్షల రూపాలయతో ఖమ్మం దర్వాజా పునరుద్ధరణ, 1.40 కోట్ల రూపాలయతో హన్మకొండ దర్వాజా పునరుద్ధరణ, 6 కోట్ల రూపాలయతో కొండలపైకి రోడ్లు, మెట్లు నిర్మాణం, రోప్‌వే నిర్మాణం పనులు జరుగనున్నాయి.[4]

మూలాలు

[మార్చు]
  1. "Zaffergadh Fort (Fortification bastions & Gateways)". www.heritage.telangana.gov.in. Archived from the original on 2022-08-15. Retrieved 2023-04-22.
  2. telugu, NT News (2023-04-02). "Zaffergadh | నవాబుల కాలంలో నిర్మించిన జఫర్‌గఢ్‌ ఖిల్లా స్పెషాలిటీ ఏంటంటే." www.ntnews.com. Archived from the original on 2023-04-02. Retrieved 2023-04-22.
  3. "వెలగని వీధిదీపాల బొమ్మలు". www.andhrabhoomi.net. 2017-01-22. Archived from the original on 2018-08-09. Retrieved 2023-04-22.
  4. 4.0 4.1 "Develop Zaffargadh Fort into a tourist destination: Villagers". The New Indian Express. 2021-08-23. Archived from the original on 2023-04-22. Retrieved 2023-04-22.
  5. "పంద్రాగస్టు వేడుకలకు సిద్ధమైన జఫర్‌గఢ్‌ కోట". Sakshi. 2016-08-15. Archived from the original on 2023-04-22. Retrieved 2023-04-22.