జిన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జిన్ [1] ఇస్లాం పూర్వ యుగంలో అరేబియాలోనూ, తరువాత ఇస్లామిక్ పురాణాలు, మత తత్వ శాస్త్రాలలోనూ కనిపించే అతీంద్రియ జీవులు. ఈ జిన్ లు అన్నవి విస్తృత అర్థంలో ఆత్మలు అని కానీ, దెయ్యాలు అని కానీ, రాక్షసులు అని కానీ అనుకోవచ్చు, ఏ నేపథ్యంలో ఆ పదాన్ని వాడుతున్నారు అన్నదాన్ని బట్టి అర్థ ఛాయ ఉంటుంది. దీన్ని జీనీ అని ఆంగ్లీకరించి వ్యవహరిస్తున్నారు. జిన్‌లు మనుషుల మాదిరిగానే, వారు కూడా స్వచ్ఛంగా ధార్మికమైన జీవులుగా ఫిత్రాతో సృష్టించబడ్డారు, విశ్వాసులుగానే జన్మిస్తారు. తమ పరిసరాల కారణంగా ఆ విశ్వాసం, ధార్మికత కోల్పోయి మారిపోతారు.[2] జిన్లు సహజంగా చెడ్డవారు కానీ, సహజంగా మంచివారు కానీ కానందున, ఇస్లాం ఇతర మతాల నుండి వచ్చిన ఆత్మలను గుర్తించింది, దాని విస్తరణ సమయంలో ఇతర మతాల నుండి ఆత్మలను స్వీకరించగలిగింది. జిన్ అన్న భావన పూర్తిగా ఇస్లామిక్ భావన కాదు; ఇస్లాంలో విలీనమైన అనేక ఇస్లాం పూర్వపు బహుదేవతారాధకుల విశ్వాసాలను ఇది సూచిస్తోంది.

ఇస్లామిక్ నేపథ్యంలో, జిన్ అనే పదాన్ని ఏ అతీంద్రియ జీవినైనా సూచించడానికీ, ఒక నిర్దిష్ట రకం అతీంద్రియ జీవిని సూచించడానికీ - రెండిటినీ కలిపి ఉపయోగిస్తారు. అందువల్ల, జిన్ అన్న పదాన్ని తరచు డెవిల్స్/రాక్షసులు (షయాన్) పదంతో కలిపి సూచిస్తారు. జానపద కథలలో డెవిల్స్, జిన్ రెండూ కనిపిస్తాయి. ఆ కథలలో ఇవి దురదృష్టానికీ, దయ్యాలు పట్టడానికీ, వ్యాధులకూ కారణమవుతాయి. మొత్తంగా చూస్తే జిన్లు కొన్నిసార్లు సహాయకరంగానూ, దయగలవాటిగానూ ఉంటాయి. ఇస్లామిక్ ప్రపంచంలోని మార్మిక రచనలలో జిన్ల ప్రస్తావన తరచుగా వస్తుంది. ఆ మార్మిక రచనల్లో వీటిని ఒక మాత్రికుడు ఆజ్ఞాపించడమూ, కట్టడి చేయడమూ కనిపిస్తుంది. ఇస్లామిక్ ప్రపంచపు జంతు శాస్త్ర గ్రంథాలలో వీటిని సూక్ష్మ శరీరం కలిగిన జంతువులుగా వర్ణించారు.

ఇస్లాం పూర్వపు అరేబియా[మార్చు]

బకెట్, కోన్ రూపంలోని రెక్కలున్న జీనీ. అర్థ దైవిక స్వరూపం, బహుశా ఇస్లాం పూర్వపు దేవతల్లో అగ్రగామి అయివుండవచ్చు. అతను ఇస్లాంలో జిన్ అయ్యాడు. క్రీ.పూ.713-716 నాటిది

జిన్లు, వాటి చుట్టూ అల్లుకున్న విశ్వాసాల ఖచ్చితమైన మూలాలు ఏనాటివి, ఏవి అన్న విషయం స్పష్టంగా లేదు.[3] మధ్యప్రాచ్యంపై అధ్యయనం చేసిన కొందరు పండితులు జిన్‌లు ఎడారులు, అపరిశుభ్రమైన ప్రదేశాలలో నివసిస్తూండే దుష్టశక్తుల నుంచి ప్రారంభమైనట్టూ, ఇవి తరచు జంతువుల రూపాలు తీసుకుంటాయని చెప్తారు. ఇతరులు మాత్రం జిన్‌లు అరేబియాలోని బహుదేవతారాధక మతాల్లోని దేవతలని, కాలక్రమేణా ఇతర దేవతలకు ప్రాధాన్యం హెచ్చడంతో వీరి ప్రాముఖ్యత అణగారిపోయిందనీ చెప్తారు. ఏదేమైనా, ఇస్లామిక్ యుగానికి పూర్వం అరబ్బులు చాలామంది జిన్లను ఆరాధించారు. ఐతే, దేవతలకు అమరత్వం ఉందని భావించగా, జిన్లకు లేదని నమ్మేవారు. అమరత్వం లేకపోవడం వల్ల వారిని దేవతల కన్నా తక్కువవారిగా పరిగణించినప్పటికీ, ఇస్లాం పూర్వపు అరబ్బుల రోజువారీ జీవితంలో జిన్ల ఆరాధనే దేవతారాధన కన్నా ఎక్కువ ప్రాముఖ్యత కలిగివుండేదని తెలుస్తోంది. సాధారణ అరేబియన్ నమ్మకం ప్రకారం, భవిష్యత్తును చెప్పేవారు (జోస్యులు), ఇస్లాం పూర్వపు తత్వవేత్తలు, కవులకు జిన్నే ప్రేరణ. తెగల నాయకులు తమ తెగలోని సభ్యులకు రక్షణగా ఉండడం, తమ సభ్యులను చంపిన ఇతర తెగ సభ్యులను చంపి బదులుతీర్చుకోవడం వంటివి సాగే ఇస్లాం పూర్వపు అరేబియన్ సంస్కృతిలో ఈ జిన్ విశ్వాసాలు ఇమిడి ఉండేది. జిన్ మనుషుల కన్నా శక్తివంతుడైనా కూడా మనిషి ద్వంద్వ యుద్ధంలో తలపడి జిన్‌ని చంపడం సాధ్యమేనని నమ్మేవారు. కానీ, జిన్‌లు వివిధ రూపాలు మారతారనీ, అంతకన్నా ముఖ్యంగా అదృశ్యంగా ఉండి కనిపించకుండా మనిషిపై దాడిచేయవచ్చన్న కారణంగా వాటికి భయపడేవారు.[4] వివిధ వ్యాధులకు, మానసిక అనారోగ్యాలకు జిన్‌లు కారణమని నమ్మేవారు. ఆ కారణంగానూ వారంటే భయం ఉండేది. జూలియన్ వెల్హాసెన్ పరిశోధనలో ఇటువంటి ఆత్మలు నిర్జనమైన, మురికి, చీకటి ప్రాంతాల్లో నివసిస్తాయని ఇస్లాం పూర్వ అరబ్బులు భయపడతారని గమనించాడు.[5] దీనివల్ల ప్రతీవారూ వారిని జిన్ల నుంచి కాపాడుకోవాలని భావించేవారు. అంతే తప్ప వీరు నిజమైన మతారాధనలో భాగం కాదు. కొంతమంది పండితుల ప్రకారం దేవదూతలను, దెయ్యాలు/రాక్షసులను అరేబియాకు పరిచయం చేసింది ముహమ్మద్ ప్రవక్తే అని, ఈ రెండు వర్గాలూ అంతకు పూర్వం అరేబియాలోని జిన్లలో లేరని వాదిస్తారు. మరోవైపు అమిరా ఎల్-జీన్ వాదన ప్రకారం బహుదేవతారాధకులైన అరబ్బులకు దేవదూతలన్న భావన తెలుసనీ, కానీ జిన్ అన్న పదాన్ని మాత్రం వివిధ మతాలూ, ఆరాధన పద్ధతుల్లోని అన్ని రకాల అతీంద్రియ శక్తులకూ కలిపికట్టుగా వాడేవారనీ, అందువల్లనే జొరాస్ట్రియన్, క్రిస్టియన్, యూదు దేవదూతలనూ, దెయ్యాలూ/రాక్షసులనూ కూడా జిన్ అన్న పదంతో వ్యవహరించడం చూడవచ్చని పేర్కొన్నది.[6] అల్-జాహిజ్ ప్రకారం ఇస్లాం పూర్వ అరబ్బులు జిన్ల సమాజంలో పలు తెగలు, గ్రూపులు ఉండేవని, తుఫానుల వంటి ప్రకృతి వైపరీత్యాలకు జిన్లు కారణమని విశ్వసించేవారు. వారు దీనితో పాటుగా ఒక జిన్ తలచుకుంటే వ్యక్తులను రక్షించడం, వివాహం చేసుకోవడం, ఎత్తుకుపోవడం, చంపడం చేయగలడని నమ్మేవారు.[7]

ఇస్లామిక్ వేదాంతశాస్త్రం[మార్చు]

ఖురాన్‌లో[మార్చు]

72 వ అధ్యాయము ఖురాన్ పేరుతో అల్ భూతము (ది భూతము), అలాగే శీర్షిక పరిచయ గా బిస్మిల్లా తదుపరి అధ్యాయం పేరుతో అల్- Muzzammil (Enshrouded వన్)

ఖురాన్‌లో జిన్‌ల ప్రస్తావన సుమారు 29 సార్లు వచ్చింది.[8] ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం ముహమ్మద్ మానవులకు, జిన్‌లకు కూడా ప్రవక్తగా వచ్చాడు. అలాగే, ఇతర ప్రవక్తలు, దేవదూతలు రెండు వర్గాలకు కూడా వర్తిస్తారు.[9] [10] సంప్రదాయం ప్రకారం సూరా 72 జిన్‌ల పేరు మీదుగా (అల్-జిన్) వచ్చింది, ఇది జిన్‌లకు సందేశాన్ని, దివ్యవాణిని వినిపించడానికి ఉద్దేశించింది. పలు కథల్లో ముహమ్మద్ అనుచరుల్లో ఒకరు అతను జిన్‌లకు దివ్యవాణి వినిపిస్తున్నప్పుడు అతనితో ఉండి ప్రత్యక్షంగా చూశారని ఉంటుంది.[11] ఖురాన్‌లో వారు విభిన్న వైఖరులతో ఉన్నట్టు కనిపిస్తారు.[12] సాల్మన్ కథలో తల్మాడిక్ షెడిమ్‌లతో పోల్చదగిన ప్రాకృతికమైన ఆత్మల్లా కనిపిస్తారు. సాల్మన్ దేవుడి నుంచి జంతువులతో, ఆత్మలతో మాట్లాడే శక్తిని బహుమతిగా అందుకున్నాడు. తిరుగుబాటు వైఖరితో ఉన్న జిన్‌లు, దెయ్యాలపై పూర్తి అధికారాన్ని ఇచ్చాడు, ఆ అధికారంతో సాల్మన్ వారితో మొదటి ఆలయాన్ని నిర్మింపజేశాడు. మరికొన్ని సందర్భాల్లో ఖురాన్ బహుదేవతారాధకులైన అరబ్బుల గురించి చెప్తూ వారు దేవుని సహాయాన్ని కోరడం మానేసి జిన్‌ల సహాయాన్ని అభ్యర్థించారని ప్రస్తావిస్తుంది. ఖురాన్ జిన్‌ల స్థాయిని చిల్లర దేవుళ్ళ స్థితి నుంచి అప్రధానమైన, చిన్నస్థాయి ఆత్మల స్థితికి, దాదాపు మానవుల స్థాయికి దింపేసింది.[13] ఈ స్థితిలో, జిన్‌ల గురించి చాలాసార్లు మనుషులతో కలిపి ప్రస్తావించడం కనిపిస్తుంది. కఠినమైన ఏకేశ్వరవాదం, అల్లాహ్ ఒక్కడే దేవుడు అని చెప్పే ఇస్లామిక్ భావన తౌహీద్‌ను నొక్కిచెప్పడానికి గాను ఖురాన్ దేవునికి, జిన్‌లకు మధ్య ఉన్న అన్ని పోలికలు, సంబంధాలు తిరస్కరించి మానవులతో సమాంతరంగా నిలబెట్టింది. అంతేకాదు, దేవుని అంతిమ తీర్పు, మరణానంతర జీవితం కూడా జిన్‌లకు ఉంటాయని తేల్చింది. ఇస్లాం సంప్రదాయాలు, ముహమ్మద్ ప్రవక్త బోధనలు తర్వాతికాలంలో క్రోడీకరించిన మతగ్రంథాలైన హదీసులు కూడా వారిని ప్రస్తావించాయి. ఒక హదీసు జిన్‌లను మూడు వర్గాలుగా విభజించింది. మొదటి వర్గం గాలిలో ఎగరగలిగే జిన్‌లు; రెండవది పాములు, కుక్కలు; మూడవ వర్గం ఒక చోటి నుంచి మరొక చోటికి మనుషుల్లా తిరుగుతూండేవి.[14]

ఇస్లాంలోకి కలుపుకోవడం[మార్చు]

ఎం. డాల్స్ జిన్ అనేది ఇస్లామిక్ భావన కాకపోగా ముహమ్మద్ శత్రువు మక్కాలో జాహిలియా యుగంలో పాటించి విగ్రహాధకుల విశ్వాసాలకు సంబంధించిన లెక్కలేనన్ని అంశాలు అందులో ఇమిడివున్నాయని గుర్తించాడు. ఎఫ్‌. మీయిర్ ప్రకారం అనేక విగ్రహారాధకుల దేవతలను ఆత్మల స్థాయికి దించి వాటిని ఇస్లాంలో కలుపుకున్నారు.[15]

  1. ఇస్లాంలో అటు దేవదూతలూ కాని, ఇటు దెయ్యాలూ కానక్కరలేని ఆత్మల ఉనికి గుర్తించబడింది.
  2. అందువల్ల బైబిల్‌లోనూ, ఖురాన్‌లోనూ లేని పౌరాణిక దృశ్యాలను, అంశాలను ఇస్లాం చేర్చుకోగలిగింది. తద్వారా సాధ్యమైనవి ఇవి:
    1. పలు ఇస్లాం పూర్వపు దేవతలను ఆత్మల స్థాయికి దించివేసి ఇస్లాం ఆధ్యాత్మిక ప్రపంచంలోనికి తీసుకోవడం,
    2. ఇస్లాం పవిత్ర సంప్రదాయాల్లో ప్రస్తావన లేని, మూలాలు తెలియని దెయ్యాలను స్వీకరించడం,
    3. ఆత్మల ఉనికిని సహించడమూ, వాటిని నియంత్రించమని సలహా ఇవ్వడమూ

మూలాలు[మార్చు]

  1. "jinn – Definition of jinn in English by Oxford Dictionaries". Oxford Dictionaries – English. Archived from the original on 2019-04-03. Retrieved 2020-10-11.
  2. Abu l-Lait as-Samarqandi's Comentary on Abu Hanifa al-Fiqh al-absat Introduction, Text and Commentary by Hans Daiber Islamic concept of Belief in the 4th/10th Century Institute for the Study of Languages and Cultures of Asia and Africa p. 243
  3. Lebling, Robert (2010). Legends of the Fire Spirits: Jinn and Genies from Arabia to Zanzibar. New York City, New York and London, England: I. B. Tauris. pp. 1–10. ISBN 978-0-85773-063-3.
  4. Umar F. Abd-Allah, “The Perceptible and the Unseen: The Qur’anic Conception of Man’s Relationship to God and Realities Beyond Human Perception,” in Mormons and Muslims: Spiritual Foundations and Modern Manifestations, ed. Spencer J. Palmer (Provo, UT: Religious Studies Center, Brigham Young University 2002), 209–64.
  5. Irving M. Zeitlin (19 March 2007). The Historical Muhammad. Polity. pp. 59–60. ISBN 978-0-7456-3999-4.
  6. Amira El-Zein Islam, Arabs, and Intelligent World of the Jinn Syracuse University Press 2009 ISBN 9780815650706 page 34
  7. https://islamansiklopedisi.org.tr/cin
  8. Robert Lebling (30 July 2010). Legends of the Fire Spirits: Jinn and Genies from Arabia to Zanzibar. I.B.Tauris. p. 21 ISBN 978-0-85773-063-3
  9. Muḥammad ibn Ayyūb al-Ṭabarī, Tuḥfat al-gharā’ib, I, p. 68; Abū al-Futūḥ Rāzī, Tafsīr-e rawḥ al-jenān va rūḥ al-janān, pp. 193, 341
  10. మూస:Quran-usc
  11. Amira El-Zein Islam, Arabs, and Intelligent World of the Jinn Syracuse University Press 2009 ISBN 9780815650706 page 64
  12. Paul Arno Eichler: Die Dschinn, Teufel und Engel in Koran. 1928 P. 16-32 (German)
  13. Christopher R. Fee, Jeffrey B. Webb American Myths, Legends, and Tall Tales: An Encyclopedia of American Folklore [3 volumes]: An Encyclopedia of American Folklore (3 Volumes) ABC-CLIO 2016 ISBN 978-1-610-69568-8 page 527
  14. Hughes, Thomas Patrick (1885). "Genii". Dictionary of Islam: Being a Cyclopædia of the Doctrines, Rites, Ceremonies . London, UK: W.H.Allen. pp. 134–6. Retrieved 4 October 2019.
  15. Tobias Nünlist Dämonenglaube im Islam Walter de Gruyter GmbH & Co KG, 2015 ISBN 978-3-110-33168-4 p. 2 (German)

గ్రంథ పట్టిక[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=జిన్&oldid=3974865" నుండి వెలికితీశారు