Jump to content

జీర్ణాశయ క్యాన్సర్

వికీపీడియా నుండి
జీర్ణాశయ క్యాన్సర్
ప్రత్యేకతOncology, gastroenterology Edit this on Wikidata

జీర్ణాశయము నకు సంభవించే క్యాన్సరే జీర్ణాశయ క్యాన్సర్ .

లక్షణాలు

[మార్చు]

ఈ కేన్సర్ లక్షణాల్లో ప్రధానంగా ఆకలి లేకపోవడం, బరువు తగ్గిపోవడం, పొత్తి కడుపులో నొప్పి రావడం, కడుపులో ఎప్పుడూ ఏదో అసౌకర్యంగా అనిపించడం వంటివి కనిపిస్తాయి. వీటితో పాటు ఏ కొంచెం అన్నం తిన్నా కడుపు నిండిపోయినట్లు అనిపించడం, ఏదీ రుచిగా అనిపించకపోవడం, ఛాతీలో మంట అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఈ లక్షణాల్ని చాలా మంది కడుపు ఉబ్బరం సమస్య అనుకుంటారు. కానీ, ఒక్కోసారి అది జీర్ణాశయ కేన్సర్ లక్షణం కావచ్చు. కొంతమందికి అజీర్తి సమస్యగా కూడా అనిపిస్తుంది. వికారం, వాంతులు, వాంతిలో కొన్ని సార్లు రక్తం పడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి., కడుపు మీదినుంచి తడిమితే చేతికి గడ్డలా తగలడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చాలా మంది ఈ లక్షణాలన్నిటినీ గ్యాస్ సమస్యగానే తీసుకుని డైజిన్, జెంటాక్ లాంటి మాత్రలు వేసుకుంటూ ఉండిపోతారు. కేన్సర్ కణితి తాలూకు రక్తం కొన్నిసార్లు బయటికి రాకుండా పేగుల్లోకి వెళ్లిపోయి రక్తం కూడా జీర్ణమవుతుంది. అందుకే నల్లటి విరేచనాలు రావచ్చు. అలా రావడాన్ని మెలీనా అంటారు. అప్పటికే కేన్సర్ ముదిరిపోయి ఉంటే పొట్ట ఉబ్బిపోవడం, పొట్టలోకి నీరు రావడం, జాండిస్ రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

వ్యాధినిర్ధారణ

[మార్చు]

కొన్ని లక్షణాలు ఎక్కువ రోజులుగా కనిపిస్తున్నప్పుడు వెంటనే డాక్టర్‌ను కలవడం ఎంతో అవసరం. వ్యాధినిర్ధారణకు ఎండోస్కోపీ ఎంతో ఉపయోగపడుతుంది. నిజంగానే అది కేన్సరా? లేక అల్సరా తెలిసిపోతుంది. ఒకవేళ కేన్సర్ కణితే అయితే అది ఏ భాగంలో ఉంది. ఇంకా ఇతర భాగానికేమైనా పాకిందా తెలిసిపోతుంది. అదే సమయంలో బయాప్సి కూడా తీస్తారు. ఆ త రువాత సిటీ స్కాన్ గానీ, పెట్ సీటీ స్కాన్‌గానీ అవసరమవుతుంది. దీని ద్వారా కణితి జీర్ణాశయంలోనే ఉందా? అందులోంచి బయటికి వచ్చి ఇతర భాగాలకేమైనా పాకిందా అన్న విషయాలు తెలుసుకోవచ్చు. కణితి క్లోమగ్రంధికి అతుక్కుందా? అన్న విషయాలు కూడా తెలిసిపోతాయి. వీటన్నితో పాటు సిఇఎ పరీక్ష కూడా చేస్తారు.

వైద్య చికిత్సలు

[మార్చు]

వైద్య చికిత్సలు ప్రధానంగా సర్జరీ, కీమో థెరపీ, టార్గెటె డ్ థెరపీ, రేడియేషన్ థెరపీ అంటూ నాలుగు రకాలుగా ఉంటాయి. వాటిలో మొదటిది సర్జరీ. వ్యాధినిర్ధారణ కాగానే సర్జరీ ద్వారా వైద్యులు ఆ కణుతులను తొలగిస్తారు. బాగా ముందుగానే కేన్సర్‌ను గుర్తించగలిగితే ఎండోస్కోపీ ద్వారా కూడా సర్జరీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇలా చేయడాన్ని ఎండోస్కోపిక్ మ్యూకోజల్ డిసెక్షన్ అంటారు. రెండవది పార్షియల్ రాడికల్ గ్యాస్ట్రెక్టమీ చేస్తారు. దీన్నే సబ్-టోటల్ గ్యాస్ట్రెక్టమీ అని కూడా అంటారు. ఒకవేళ కేన్సర్ కణుతులు బాగా విస్తరించి ఉంటే జీర్ణాశయాన్ని మొత్తంగానే తీసివేయవలసి ఉంటుంది. దీన్నే టోటల్ గ్యాస్ట్రెక్టమీ అంటారు. మొత్తంగా తీసివేస్తే జీర్ణక్రియ ఎలా అవుతుందని కొందరు ఆందోళనపడుతుంటారు. వాస్తవానికి జీర్ణక్రియ అంతా చిన్న పేగుల్లోనే జరుగుతుంది.

లింఫ్‌నోడ్స్‌లోకి పాకి ఉంటే అప్పుడు ఆర్-1, ఆర్-2, ఆర్-3 అనే విధానాలతో లింఫ్‌నోడ్స్‌ను తొలగించవలసి ఉంటుంది. సర్జరీ తరువాత పరిస్థితి అనుసరించి కీమో థెరపీ గానీ, కీమో-రేడియో థెరపీ గానీ ఇవ్వాల్సి ఉంటుంది. కీమోథెరపీతో పాటు కొందరికి హరెసెప్టీన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీన్నే టార్గెటెడ్ థెరపీ అంటారు. ఇక చివరికి రేడియేషన్ థెరపీ ఇస్తారు. జీర్ణాశయ కేన్సర్ అనగానే వణికిపోవడం ఒకప్పటి మాట. ఆధునిక వైద్య విధానాలు ఆ కేన్సర్‌ను సమూలంగా తొలగించగలుగుతున్నాయి. కాకపోతే వ్యాధిని ఎంత త్వరితంగా గుర్తించగలిగితే అంత ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది.