జీవనయానం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జీవనయానం ప్రముఖ రచయిత, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు డా.దాశరథి రంగాచార్యుల ఆత్మకథ. తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొని, పలు రాజకీయ, సాంఘిక పరిణామాలకు సాక్షీభూతినిగా నిలిచిన రంగాచార్యుల జీవితకథలో ఆయా పరిణామాలన్నీ చిత్రీకరించారు.

రచన నేపథ్యం[మార్చు]

డా.దాశరథి రంగాచార్యులు మహాభారత రచన చేస్తున్న 1994లో ఆ సందర్భంగా ఖమ్మంలో సాహితీహారతి సంస్థ ఆధ్వర్యంలో రంగాచార్య దంపతులకు ఘనసత్కారం జరిగింది. ఆ వేదికపై పత్రికా సంపాదకులు, సాహితీవేత్త ఎ.బి.కె.ప్రసాద్ మాట్లాడుతూ "ఆంధ్రదేశపు రాజకీయ, సాంఘిక, సామాజిక చరిత్ర వ్రాయడానికి ఉపకరించే తెలుగు నవలలు పది ఉన్నాయంటే వానిలో అయిదు దాశరథి రంగాచార్యులవి అవుతాయి. దాశరథి ఆత్మకథ రాయకపోవడం ఆంధ్రదేశానికి ద్రోహం చేయడం అవుతుంది. వారు ఈ సభకు ఆత్మకథ వ్రాస్తానని వాగ్దానం చేయాలి." అని ఈ రచనకు బీజం వేశారు. ఆపై దాశరథి రంగాచార్యులు జీవనయానం 4-3-1994న ప్రారంభించి 12-1-1995న పూర్తిచేశారు. 21-7-1996న జీవనయానం వార్త ఆదివారం సంచికల్లో ధారావాహికగా ప్రారంభమై 2-8-1998న ముగిసింది. 103 వారాల పాటు జీవనయానం ధారావాహిక కొనసాగింది. అనంతరం పుస్తకంగా వెలువడింది.[1]

విషయాలు[మార్చు]

ఖమ్మం జిల్లా చిట్టిగూడూరులో నిజాం పరిపాలన కాలంలో సంప్రదాయ వైష్ణవ కుటుంబంలో జన్మించిన రంగాచార్యుల జీవితంలో పలు వైవిధ్యాలు, వైరుధ్యాలు ఉన్నాయి. ఆ విశేషాలన్నీ జీవనయానంలో అక్షరీకరించారు. చిన్నతనంలో నిజాం రాజ్య స్థితిగతులు, అనంతరం తండ్రితో విభేదాలు, ఆయనకు దూరంగా అన్న కృష్ణమాచార్యులు, తల్లితో వేరు కాపురం, అన్నగారు జైలు పాలవడంతో చిన్నవయసులోనే ఉద్యోగం చేసి బాధ్యతలు స్వీకరించడం వంటి అంశాలతో ఈ పుస్తకం ప్రారంభమవుతుంది.
ఆపై ఉద్యోగం చేస్తూనే నైజాం రాజకీయ, సాంఘిక వ్యవస్థలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరచడం, అందుకు నాటి నిజాం ప్రభుత్వం నుంచి సమస్యలు ఎదుర్కోవడం, పల్లె మొత్తం రంగాచార్యను పోషించిన అపురూప ఘటన, ఆపై పూర్తిస్థాయి ఉద్యమంలో భాగంగా కాంగ్రెస్ దళంలో చేరడం, సాయుధంగా పోరాడుతూ మృత్యువు నుంచి తప్పించుకుని పోలీసుచర్య ద్వారా భారతదేశంలో విలీనం కావడం మరొక దశ.
భారతదేశంలో భాగమయ్యాకా ఆయనకు సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉద్యోగం రావడం, ఆళ్వారుస్వామి వదిలివెళ్లిన తెలంగాణ పోరాట క్రమాన్ని చిత్రించే నవలల రచన ప్రణాళిక స్వీకరించడం, కుటుంబంలో సమస్యలు, అవి సర్దుకోవడం, అనారోగ్యం, చివరిదశలో అపురూపమైన సత్కారాలు వంటివి చివరి దశలో చిత్రీకరించారు.[2]

ప్రాధాన్యత[మార్చు]

జీవనయానం దాశరథి రంగాచార్యుల జీవితాన్ని మాత్రమే ప్రతిబింబించదు ఆ రచన తెలంగాణ సాయుధ పోరాట క్రమానికీ అద్దంపట్టిన విశిష్టరచనగా పేరొందింది.

మూలాలు[మార్చు]

  1. డా.దాశరథి రంగాచార్యులు రచించిన "వేదం-జీవన నాదం" ముందుమాట "నాదామృతం" : పేజీ.1
  2. దాశరథి రంగాచార్యుల ఆత్మకథ "జీవనయానం"

ఇవి కూడా చూడండి[మార్చు]

దాశరథి రంగాచార్యులు, ఆత్మకథలు

"https://te.wikipedia.org/w/index.php?title=జీవనయానం&oldid=2985487" నుండి వెలికితీశారు