Jump to content

దేవదాసి

వికీపీడియా నుండి
(జోగినీ నుండి దారిమార్పు చెందింది)
తమిళనాడులోని 1920లలోని ఇద్దరు దేవదాసీల చిత్రపటం.

దేవదాసి అంటే గుడి లోని దేవుడి ఉత్సవాలలో నాట్య సేవ చేస్తూ జీవితాంతం అవివాహిత గానే ఉండే స్త్రీ. సతి, బాల్యవివాహాలు, గణాచారి, లాంటి సాంఘిక దురాచారం. భారతదేశంలో ప్రధాన సాంఘిక దురాచారంగా ఉన్న ఈ వ్యవస్థ తెలంగాణ సమాజంలో కూడా కనపడుతుంది. దేవదాసి వ్యవస్థ దక్షిణ భారతదేశంలో ఒక్క కేరళలో తప్ప అన్ని రాష్ట్రాలలో విభిన్న రూపాల్లో కొనసాగుతున్నది. నరబలికి బదులుగా దేవాలయాలకు అమ్మాయిలను సమర్పించే దురాచారమే దేవదాసి వ్యవస్థ. గ్రామంలో అన్ని అరిష్టాలు, అనర్థాలకు మూల కారణం గ్రామ దేవతలకు ఆగ్రహం కలగడమే అని నమ్మి గ్రామ దేవతలను శాంతింపచేయడానికి అమ్మాయిలను దేవుళ్లకు అర్పించడం జరిగేది. మతం ముసుగులో ఉన్నత కులస్తులు ఆధీన వర్గంలోని స్త్రీలను దోపిడీ చేసే ప్రక్రియ ఇది. స్వాములు వివాహేతర లైంగికవాంఛలను తీర్చడం కోసం పూజారులకు లైంగిక సంతృప్తి చేకూర్చడం కోసం ఏర్పడ్డ సామాజిక దురాచారమే ఈ దేవదాసి వ్యవస్థ.[1][2][3][4]

చారిత్రక నేపథ్యం

[మార్చు]

మత సంబంధిత వ్యభిచారం భారతదేశంతోపాటు ప్రపంచంలోని అనేక దేశాల్లో కనపడుతుంది. దక్షిణ ఐరోపా, ఏషియా మైనర్, ఈజిప్టు, మెసపటోమియాలో ఈ దురాచారం ఉంది. గ్రీసు చరిత్రకారుడు హెరిడోటస్ బాబిలోనియాలోని మైలిట్టా దేవాలయంలో స్త్రీల శీలాన్ని అర్పించారని తన రచనల్లో తెలిపారు. లూసియన్ అనే రోమన్ రచయిత ఫోనియాలో ఇటువంటి ఆచారం ఉన్నట్లు రాశాడు. పొనీషియా, కానన్, పేఫస్, సైప్రస్ మొదలైన దేశాల్లో మాతృదేవతారాదన ప్రధానంగా అమల్లో ఉంది. ఈ దేవతను ఎస్టార్ట్, అఘారెత్, ఎస్ట్రేట్ వంటి పేర్లతో పిలుచుకొంటారు. అరేబియాలో అలాట్, ఆల్-ఉజ్జా వంటి సామాజిక దురాచారాలు మత సంబంధిత వ్యవహారాలతో ముడిపడి ఉన్నాయని టాని పెంజర్ పేర్కొన్నాడు. పశ్చిమాఫ్రికాలోని అనేక దేశాల్లో మతపరమైన వ్యభిచారం ఉన్నట్లు హెరిడోటస్ తన రచనల్లో పేర్కొన్నాడు.[5][6]

భారతదేశంలో

[మార్చు]

భారతదేశ చరిత్రలో జోగిని, దేవదాసి వ్యవస్థల నేపథ్యం విభిన్న కోణాల్లో, దశల్లో కనపడుతుంది. జోగిని, దేవదాసి వ్యవస్థలు వైష్ణవ సంప్రదాయంలో కనపడతాయి. కాళిదాసు కీర్తనలో మాతంగి అంటే దళిత స్త్రీ అని అర్థం. మాతంగి రూపాన్ని మహాదివ్య సరస్వతిగా అభివర్ణించారు. సా.శ. 3వ శతాబ్దానికి చెందిన జోగి మరణశాసనం జోగిని వ్యవస్థ గురించి వివరిస్తుంది. వాత్సాయనుడి కామసూత్రాల్లో వీరు వివిధ కళల్లో నైపుణ్యంగలవారని, గణిక, విలాసవతి పేర్లతో ఈ సంప్రదాయాన్ని కొనసాగించేవారని పేర్కొన్నారు. దేవదాసి అనే పదాన్ని ఆర్యులు వినియోగించిన వైదిక ధర్మాచరణ నుంచి తీసుకొన్నారు.నాడు అనార్యులను, అవర్ణులను దస్యులు అని పిలిచేవారు.దేవాలయాల్లో పరిచారికలుగా ఉండే వీరిని దేవదాసి అని పిలిచేవారు.దేవదాసి వ్యవస్థ భారతదేశమంతటా ఉందని హ్యుయాన్‌త్సాంగ్ పేర్కొన్నారు. చరిత్రను నిశితంగా పరిశీలిస్తే స్త్రీలను దేవతలు, యోగిని, శక్తిమాత, డాకిణి, షాకిని, జోగినిగా పిలిచేవారని తెలుస్తున్నది. యోగం, యాగం, యజ్ఞం కలిగిన స్త్రీలను యోగినులుగా ఆరాధించేవారు. భారతీయ సంప్రదాయంలోని 64 కళల్లో నాట్యం విలక్షణ సాంస్కృతిక జీవన విధానంగా గుర్తింపు పొందింది. రాజులు తమ రాజమందిరాల్లో మద్యం తాగుతూ నాట్యగత్తెల నాట్యాన్ని ఆస్వాదిస్తూ విందులు, వినోదాలు జరుపుకొనేవారు.దేవాలయాల్లో పండుగలు, ఉత్సవాలు జరిగేటప్పుడు నాట్యాలకు అధిక ప్రాధాన్యమిచ్చేవారు. కాళిదాసు తన మేఘదూత కావ్యంలో ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో బాలికలను చిన్న వయసులోనే దేవతలు, దేవుళ్లకు సమర్పించే సంప్రదాయం ఉందని పేర్కొన్నారు. సా.శ. 10వ శతాబ్దంలో ట్రావెన్‌కోర్, తంజావూరు సంస్థానాల్లో 400 మందికిపైగా దేవదాసీలు ఉండేవారని, దేవాలయాల్లో పూజారుల తర్వాత స్థానం దేవదాసి లేదా జోగినులదే అని అనేక అధ్యయనాల్లో వెల్లడయ్యింది.

తెలంగాణలో

[మార్చు]

సామాజిక దురాచారాలైన జోగిని, దేవదాసి వ్యవస్థలు తెలంగాణ సమాజంలో నేటికీ కనపడటం బాధాకరమైన విషయం. తెలంగాణను చారిత్రకంగా పరిశీలిస్తే భౌగోళికంగా తూర్పున బంగాళాఖాతం నుంచి పశ్చిమాన అరేబియా మహాసముద్రం వరకు విస్తరించి ఉండేది. దీంతో ఈ దురాచారాలు ఆ కాలంలో చోళ రాజ్యంలో సర్వసాధారణంగా కనపడేవి. జోగిని, దేవదాసీలను దేవర్ అడిగళర్ అని పిలిచేవారు. ఈ పేరుకు అర్థం దేవతలకు బానిస. జగన్నాథ దేవాలయంలో వీరిని మహారి అని పిలిచేవారు. దీనికి అర్థం మోహన నారి. అంటే సమ్మోహనానికి మన్మథ క్రీడలకు ఇష్టపడిన, ప్రేరేపించే స్త్రీ దేవదాసిగా మారుతుంది. ఫ్రెంచ్ మత గురువు అబుదుబేయ్ (1792-1823) రచించిన హిందూ మానర్స్, కస్టమ్స్ అండ్ సెర్మనీస్ గ్రంథంలో శైవమతాన్ని ఆచరించిన కాకతీయ, రెడ్డి రాజులు, వెలమరాజుల కాలంలో జోగిని వ్యవస్థ ఉన్నట్లుగా పేర్కొన్నాడు.

దేవదాసి - కఠిన జీవనం

[మార్చు]

మంజులవాగ్విలాసం మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతంగకన్యాం మనసా స్మరామి అని కాళిదాసు కీర్తించిన మాతంగి మహావిద్య సరస్వతీ అవతారం. అటువంటి దేవదాసీల ఉన్నత స్థానం క్రమక్రమంగా దిగజారింది. ఈ సంప్రదాయం ప్రకారం ఒక వంశంలోని స్త్రీలలో తరానికొక్కరి చొప్పున గుడిలోని దేవుడికి "పెళ్ళి" చేసేవారు. ఆ స్త్రీ జీవితాంతం అవివాహితగా ఉండి, దేవాలయం నిర్వహణ చూస్తూ, భరతనాట్యం ప్రదర్శిస్తూ గడపాలి. జోగినులు ప్రతి శుక్రవారం, మంగళవారం స్నానం చేసి ఎల్లమ్మ దేవత గుడి కడగాలి. పూజలు చేయాలి. ఆ రెండు రోజులు ఒక్కపూటే భోజనం చేయాలి. మాంసం ముట్టుకోరాదు. వారంలో ఆరెండు రోజులే ఊర్లో యాచించి, వారమంతా గడపాలి. బస్వినులు సోమవారం, శనివారం పూజ చేయాలి.వికలాంగులు, అత్యాచారానికి గురైన వారిని జోగినులుగా మారుస్తున్నారు. ఒక కుటుంబంలో జోగిని చనిపోతే శవానికి మరో జోగినితో పెళ్ళి చేస్తారు. అప్పుడు ఒకరు పూనకం నిండి, ఆ కుటుంబ వారసత్వాన్ని నిలబెట్టేందుకు ఎవరు జోగినిగా కొనసాగాలో పేరు చెబుతారు. మరణించిన జోగినీ తల్లి అయితే ఆమె పెద్దకోడలు లేదా చిన్న కోడలు నగ్నంగా శరీరమంతా వేపాకు కట్టుకుని, ఎల్లమ్మ ఆలయం చుట్టూ తిరగాలి. అక్కడే కొత్త తెల్లచీర కట్టుకుని జోగినిగా కొనసాగాలి.జోగినుల పిల్లలు తండ్రి పేరు విషయంలో సమస్యను ఎదుర్కొంటున్నారు. ఏ దేవుడి పేరునో తండ్రి పేరుగా చెబుతున్నారు. తండ్రి పేరు లేదని పాఠశాలలో చేర్చుకోకపోవడంతో చదువు మానేసిన పిల్లలున్నారు.[7]

దేవదాసికి ఉండాల్సిన లక్షణాలు

[మార్చు]
  • దేవదాసికి ఉండాల్సిన లక్షణాలు పూజారులు నిర్ణయించేవారు.
  • దేవదాసిగా మారిన తర్వాత వివాహం చేసుకోరాదు.
  • మంగళ, శుక్ర వారాల్లో ఉపవాసం చేయాలి.
  • ఈ రెండు రోజుల్లో 5 ఇళ్లల్లో యాచించాలి.
  • ఎవరేమన్నా ఎదురు చెప్పకూడదు.
  • దేవతను పూజించిన తర్వాతనే భోజనం చేయాలి.
  • అబద్ధం ఆడరాదు.
  • నీడ లేని వారికి నీడ కల్పించాలి.
  • ఆవులు మొదలైన జంతువులను కరుణతో చూడాలి.

జోగినుల వ్యవస్థ నిర్మూలన

[మార్చు]

జోగినుల వ్యవస్థ నిర్మూలనకు 'ఆశ్రయ్ ' సంస్థ, ఆంధ్రప్రదేశ్‌ జోగినీ వ్యవస్థ వ్యతిరేక సంఘటన (ఎపిజెవివిఎస్‌) కృషి చేస్తున్నాయి.వాటి ఆశయాలు:

  1. జోగినిలు చదువుబాట పట్టాలి.
  2. అమ్మాయిలకు ఎవరో కట్టిన తాళిని తీసేయించాలి.జోగినులకు అందరిలా పెళ్ళి చేయాలి.వారికంటూ ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేయాలి.
  3. జోగినిల సంక్షేమం కోసం వారి అనారోగ్య సమస్యలు పరిష్కరించాలి.వారికి పింఛను ఇవ్వాలి
  4. తండ్రి పేరు తెలియని చిన్నారులకు గుర్తింపు దక్కేలా చూడాలి.
  5. వూరి పెద్దలను బాధ్యులుగా చేస్తూ చట్టానికి సవరణలు తీసుకురావాలి.

దేవదాసి వ్యవస్థ నిర్మూలన

[మార్చు]
  • దేవదాసి వ్యవస్థ నిర్మూలనకు సంబంధించి బ్రిటిష్ వలస కాలం నుంచి అనేక చట్టాలు రూపొందాయి.
  • ముఖ్యమైన చట్టాలు/ప్రభుత్వ చర్యలు
  1. బొంబాయి దేవదాసి చట్టం - 1934
  2. మద్రాస్ దేవదాసి చట్టం - 1940
  3. మైసూర్ దేవదాసి చట్టం - 1940
  4. దేవదాసి నిషేధ చట్టం - 1947
  5. సుబ్బరామన్ కృష్ణయ్య యామిని పూర్ణతిలకం, నాగరత్నమ్మ వంటి సంఘసంస్కర్తల సహకారంతో ముత్తు లక్ష్మీరెడ్డి దేవదాసి వ్యవస్థకు వ్యతిరేకంగా దశాబ్దాల పోరాటం ఫలితంగా 1947లో నాటి మద్రాస్ రాష్ట్రంలో దేవదాసి నిషేధ చట్టం రూపొందించింది.
  6. 1988లో ఈ చట్టాన్ని నాటి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి వర్తించే విధంగా సవరణలు చేశారు.
  7. ఈ చట్టం ప్రకారం దేవదాసి వ్యవస్థ పూర్తిగా నిషేధం. ఎవరైన ఈ వ్యవస్థను ప్రొత్సహిస్తే వారికి 3 ఏండ్ల జైలు, రూ. 3 వేల జరిమానా విధిస్తారు.

ఏకసభ్య కమిషన్

[మార్చు]
  • రాష్ట్రంలో జోగినీ, మాతంగి, దేవదాసి, బసవి మహిళలకు జన్మించిన పిల్లల సమస్యలపై అధ్యయనం చేసి తగిన సిఫార్సులు చేయడానికి రాష్ట్రప్రభుత్వం జస్టిస్ వి.రఘునాథరావుతో ఏకసభ్య కమిషన్ నియమించింది. కమిషన్ కార్యాలయ చిరునామా: 'దామోదరం సంజీవయ్య సంక్షేమ భవనం, ఐదో అంతస్తు, రూమ్‌నెం-529, 530, 532, మసాబ్‌ట్యాంక్, హైదరాబాద్.సాంఘిక సంక్షేమశాఖ కమిషనర్ బి.ఉదయలక్ష్మి.
  • నారాయణస్వామి అనే సంఘ సంస్కర్త సామాజిక దురాచారాల నిర్మూలన విషయంలో ప్రభుత్వం పాత్రకు సంబంధించి సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసినందున ఈ కమిషన్‌ను ఏర్పాటుచేశారు.
  • హిందూ వారసత్వ చట్టం 1956 జోగిని, దేవదాసిలకు తండ్రి ఆస్తిపై సమాన హక్కు కల్పించింది.

పర్యవసానాలు

[మార్చు]
  • జోగిని, దేవదాసి వ్యవస్థ మతం ముసుగులో కొనసాగుతున్న వేశ్యావృత్తులు అయినందున ఆధునిక ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్న, సమాజ ఉనికినే ప్రశ్నిస్తున్న ఎయిడ్స్ వంటి వ్యాధులను వేగంగా వ్యాపింపచేస్తున్నాయి.
  • ఈ స్త్రీలను ఎక్కువమంది పురుషులు లైంగికంగా హింసించడం, గర్భ విచ్ఛిత్తులతో శరీరం క్షీణించి అనేక వ్యాధుల బారిన పడుతున్నారు.
  • వీరి సంతానానికి సామాజిక గుర్తింపు లేదు.
  • సమాజంలో ఈ స్త్రీలకు స్థానం లేదు.
  • ఇతర వ్యసనాలకు అలవాటు పడుతున్నారు.
  • ఆకాశంలో నివాసాన్ని ఏర్పాటుచేసుకొనే సాంకేతిక పరిజ్ఞానమున్న నేటి ఆధునిక సమాజంలో జోగిని, దేవదాసి వ్యవస్థల రూపంలో స్త్రీని నీతి బాహ్యమైన, అతి దీనమైన జుగుప్సాకర వేశ్యావృత్తిలో కొనసాగించడం సమాజానికి అవమానకరం. కాబట్టి ఈ వ్యవస్థలను పూర్తిగా నిషేధించాల్సిన తక్షణ అవసరం ఎంతైనా ఉంది.

జోగిని వ్యవస్థ జోగిని వ్యవస్థ భూస్వామ్య విధాన అవశేషంగా, మతం, ఆచారం పేరుతో నిమ్న వర్గాలకు చెందిన స్త్రీలను సామాజిక వ్యభిచారం పేరుతో దింపేవారని సామాజిక శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 75 శాతం జోగినులు షెడ్యూల్డ్ కులాలకు చెందినవారే ఉండేవారు. పేదరికం, నిరక్షరాస్యత, అమాయకత్వం వారిని భూస్వామికి దాసీలుగా చేస్తుంది. ఇదే వ్యవస్థ వారిని జోగినులుగా మారుస్తుంది. సంప్రదాయం, మతం పేరుతో సామాజిక అనుమతితో జోగినులను వ్యభిచార వృత్తిలోకి దింపేవారు. ఒకసారి దేవతకు అర్పితమైన జోగినులు జీవితాంతం దుర్భర జీవితాన్ని గడపాల్సిందే. జోగినుల సంప్రదాయం మూఢనమ్మకాల విష వలయంలో చిక్కుకున్నది. మొక్కుబడి పేరుతో దళిత స్త్రీలను దేవతలకు సమర్పించడం అనంతరం జీవితాంతం సమాజం సొత్తుగా, అందరికి ఆనందాన్ని పంచుతూ తాను విషాదంలో జీవితాన్ని గడపటం జోగిని వ్యవస్థలో విషాద అంశం. జోగినిగా మార్చడానికి కుటుంబంకానీ, గ్రామంలోకానీ ఏర్పడ్డ అరిష్టమే ప్రధాన కారణం. గ్రామంలో అంటువ్యాధులు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు భవిష్యత్తులో ఏదో ప్రమాదం పొంచి ఉందని భావించి దీన్ని ఎదుర్కోడానికి గ్రామంలో నిమ్న కులానికి చెందిన కన్యకు దేవుళ్లతో వివాహం జరిపేవారు. వీరినే జోగినులుగా పిలిచేవారు.

జోగుపట్టం గ్రామానికి అరిష్టం వచ్చినప్పుడు గ్రామదేవతకు మొక్కుబడి చెల్లించడానికి వివాహం కానీ ఆడపిల్లను గ్రామానికి దత్తత ఇవ్వడం అనే సంప్రదాయం నుంచి జోగిని వ్యవస్థ ప్రారంభమైంది. సాధారణంగా ఒకే కుటుంబానికి చెందిన స్త్రీలను జోగినులుగా మారుస్తారు. అమ్మాయిని జోగినిగా మార్చే కార్యక్రమాన్ని జోగుపట్టం అంటారు. అమ్మాయిని ఎల్లమ్మ, పోచమ్మ దేవాలయానికి తీసుకెళ్తారు. బ్రాహ్మణేతర పూజారైన పోతరాజు (గ్రామదేవతల తమ్ముడిగా భావిస్తారు) మంగళ సూత్రధారణే కాకుండా గావుపట్టు అనే కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తాడు. ఈ సమయంలో పోతరాజు మేక, గొర్రె, కోడిని కానీ పంటితో కొరికి మొండెం నుంచి తలను వేరు చేస్తాడు. ఈ తంతు ముగిసినప్పటి నుంచి జోగిని నిత్యసుమంగళిగా మారుతుంది. వీరికి వైధవ్యం ఉండదు. జోగిని ఆ గ్రామంలోని అందరి యువకుల సొత్తుగా (ఉంపుడుగత్తె) మారిపోతుంది. జోగుపట్టంలో అమ్మాయిని పసుపు నీళ్లలో ముంచి, పసుపు చీర కట్టి, తలనిండా పూలు, ఎర్రటి బొట్టుపెట్టి నూతన వధువుగా అలంకరిస్తారు. గ్రామపెద్ద, భూస్వాములుగాని మొదటగా ఆమెతో సంసార ప్రక్రియలో పాల్గొంటారు. దీనినే కన్నెరికం అని వ్యవహరిస్తారు. దీనికిగాను ఆమెకు కానుకలు లభిస్తాయి. ఇది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. (కరీంనగర్ జిల్లా వేములవాడ రాజరాజేశ్వరి దేవాలయంలో జోగినులను శివసత్తులు అంటారు)

జోగిని వ్యవస్థ - విషాద జీవితం

  • సభ్య సమాజం తలదించుకొనేలా కొనసాగుతున్న జోగిని వ్యవస్థ సామాజిక దోపిడీకి సామాజిక వికృత క్రీడకు ప్రతిబింబం. ఇందులో నిమ్న కులాలకు చెందిన స్త్రీ జీవితం దుర్భర స్థితిలో సమాజానికి అంకితం చేయడం విషాదం.

జోగిని జీవితం విషాదం కావడానికి ఆధారాలు

  • జీవితాన్ని గ్రామానికి, గ్రామదేవతలకు అర్పించడం
  • గ్రామంలోని భూస్వాములు, గ్రామపెద్దతో సహా యువకులందరికీ ఉంపుడగత్తెగా మారడం
  • భూస్వాములు మరణించినప్పుడు శవయాత్ర ముందు నృత్యాలు చేయడం
  • వారంలో రెండు రోజులు యాచక వృత్తి చేపట్టడం
  • రెండు రోజులకోసారి ఆహారం తీసుకోవడం
  • మాంసాహారం నిషేధం
  • జీవితాంతం ఎవరినీ ప్రేమించరాదు, వివాహం చేసుకోరాదు. మంగళ, శుక్రవారం గ్రామదేవతల గుడిని కడిగి పూజలు చేయాలి.
  • జోగిని మరణిస్తే ఆమె మృతదేహంతో మరో జోగినికి వివాహం జరిపిస్తారు.
  • మరణించింది తల్లి అయితే వారి కూతుళ్లు, కోడళ్లు జోగినులుగా మారాలి. ఇలా మారే క్రమంలో బట్టలు లేకుండా శరీరమంతా వేపాకులు కట్టుకొని పసుపు రాసుకొని దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. తర్వాత జీవితాంతం తెల్లచీర మాత్రమే ధరించాలి.
  • మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట ప్రాంతంలో జరిగే లింగంపల్లి జాతరలో ఎల్లమ్మ దేవత భక్తురాలైన జోగిని

(శాయమ్మ) నోటికి తాళం వేస్తారు. ఇదే ప్రాంతంలో జరిగే జనుంపల్లి జాతరలో జోగిని శరీరమంతా పసుపు రాసి, వేపాకులు కట్టి ఆమెను ఒక స్తంభానికి కట్టివేస్తారు. (దీనిని సిడి అంటారు)

జోగిని వ్యవస్థ నిర్మూలన దిశగా చర్యలు:

  • 1929లో బ్రిటిష్ ప్రభుత్వం నాయిక బాలికల రక్షణ చట్టాన్ని రూపొందించింది.
  • 1946లో నాటి ట్రైనీ కలెక్టర్ ఆనంద్‌కుమార్ తెలంగాణలో జోగినులపై పరిశోధన చేసి ప్రభుత్వం దృష్టికి తెచ్చాడు.
  • 1882లో దేశంలో మొదటిసారిగా బాలికలను దేవునికి సమర్పించే విధానానికి వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభమైంది.
  • 1922లో హైదరాబాద్‌లో జరిగిన అఖిల భారత ఆది హిందూ సాంఘిక సదస్సులో జగన్‌మిత్ర మండలి (భాగ్యరెడ్డి వర్మ) దళిత బాలికలను దేవతలకు సమర్పించే జోగిని వ్యవస్థ నిషేధానికి తీర్మానం చేసింది.
  • 1956లో ఐక్యరాజ్య సమితి సాధారణ మండలి అధికరణం 1 (d) ప్రకారం బానిసత్వం ఏ రూపంలోనైనా (లైంగిక, సేవ, వెట్టి) నేరం.
  • విజయవాడ కేంద్రంగా 1974లో స్థాపించిన సంస్కార్ అనే స్వచ్ఛంద సంస్థను జోగిని వ్యవస్థపై పోరాడాలని నాటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కుముద్‌బెన్ జోషి కోరారు. ఈ సంస్థ అధ్యక్షులు లవణం, కార్యదర్శి హేమలతా లవణం.
  • నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ యాక్షన్ (NISA) పేరుతో కుముద్‌బెన్ జోషి జోగిని వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు.
  • NISA ఆధ్వర్యంలో 1987లో న్యూఢిల్లీలో జోగిని సంక్షేమంపై జాతీయ సదస్సు జరిగింది.
  • 1984లో నిజమాబాద్ జిల్లా కలెక్టర్ ఆశామూర్తి జిల్లాలో జోగిని వ్యవస్థను రూపుమాపడానికి, జోగినులను సంస్కరించడానికి వారి పునరావాసం కోసం బినోల ఆశాపురం కాలనీ, ఎడవల్లి వద్ద ఆశానగర్‌లను ఏర్పాటుచేశారు.
  • 1987లో నిజామాబాద్ జిల్లా వర్ని గ్రామంలో జోగిని వ్యవస్థ నిర్మూలనకు నాస్తిక మిత్రమండలి సభ్యుడైన మాలిని రామకృష్ణారావు సహకారంతో చెల్లి నిలయం స్థాపించారు. అప్పటివరకు జోగినులను జోగిదానా, ఒసేయ్ అని అసభ్య పదజాలంతో పిలిచేవారు. ఈ సంస్థ ఏర్పాటుతో జోగినులను చెల్లి (సోదరి) అని పిలవడం మొదలైంది.
  • చెల్లి నిలయంలో At home with Family అనే కార్యక్రమం ద్వారా జోగినులతో కలిసి సహపంక్తి భోజనాలు చేసేవారు.
  • ఆర్.కె.మూర్తి చెల్లి నిలయానికి భూమిని విరాళంగా ఇచ్చాడు. చెల్లి నిలయం జోగినులకు చేతివృత్తులు, వ్యవసాయ పనుల్లో శిక్షణ అందించడంతో పాటు స్టేట్ ఎట్ హోమ్ పేరుతో అక్షరాస్యతా కార్యక్రమాలు నిర్వహించి వారిలోని నైపుణ్యాలను, ప్రతిభను వెలికి తీయడానికి ప్రయత్నించింది.
  • హేమలతా లవణం కృషి ఫలితంగా 1988లో నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జోగిని వ్యవస్థ నిర్మూలన చట్టాన్ని ప్రవేశపెట్టింది.
  • ఆంధ్రప్రదేశ్ జోగిని వ్యవస్థ వ్యతిరేక సంఘటన్, ఆశ్రయ్ సంస్థలు జోగినుల ఉద్దరణకు చేపట్టిన కార్యక్రమాలు.
  1. జోగినులకు విద్య నేర్పడం
  2. జోగినులకు మిగతా స్త్రీల మాదిరిగా వివాహం జరిపించడం.
  3. జోగినులకు పింఛన్లు ఇవ్వడం.
  4. జోగినులకు పుట్టిన సంతానానికి సామాజిక గుర్తింపువ్వడం.
  5. జోగిని దురాచారానికి గ్రామపెద్దలను బాధ్యుల్ని చేస్తూ చట్టాలను సవరించడం.
  • గ్రేస్ నిర్మల అధ్యక్షతన మహబూబ్‌నగర్‌లో ఆంధ్రప్రదేశ్ జోగిని వ్యవస్థ వ్యతిరేక సంఘటన్ ఏర్పాటు చేయడం.
  • ఈ సంస్థ జోగిని సమర్పణను, సిడిని వ్యతిరేకిండం.
  • రంగారెడ్డి జిల్లా దోమ జాతరలో సిడిని మాన్పించినందుకుగాను ఈ సంస్థకు స్వశక్తి పురస్కారం లభించింది.
  • ఈ సంస్థ జోగినులకు వివాహాలు జరిపించింది.
  • జోగినుల హక్కుల కోసం చైతన్య కార్యక్రమాలు నిర్వహించింది.
  • ఈ సంస్థ నారాయణపేట మండల కన్వీనర్ హాజమ్మ దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో జరిగిన అంతర్జాతీయ సదస్సుకు హాజరై తెలంగాణలోని జోగినుల దుర్భర జీవితాల గురించి ప్రపంచానికి తెలిపింది.
  • హాజమ్మకు ఉత్తమ క్రియాశీల అవార్డు లభించింది.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Hyaeweol Choi, Margaret Jolly (2014). Divine Domesticities: Christian Paradoxes in Asia and the Pacific. ANU Press. p. 15. ISBN 9781925021950.
  2. "Devadasi controversy: Celebrated to condemned: Tracing the devadasi story | Chennai News - Times of India". The Times of India.
  3. Crooke, W., Encyclopaedia of Religion and Ethics, Vol. X, Eds., James Hastings and Clark Edinburg, Second Impression, 1930.
  4. Iyer, L.A.K, Devadasis in South India: Their Traditional Origin And Development, Man in India, Vol.7, No. 47, 1927.
  5. V. Jayaram. "Hinduism and prostitution". Hinduwebsite.com. Retrieved 28 April 2013.
  6. "Donors, Devotees, and Daughters of God: Temple Women in Medieval Tamilnadu - Reviews in History". History.ac.uk. Archived from the original on 27 September 2007. Retrieved 20 November 2018. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  7. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-09-02. Retrieved 2010-09-23.
"https://te.wikipedia.org/w/index.php?title=దేవదాసి&oldid=4218691" నుండి వెలికితీశారు