Jump to content

దేవదాసీ నృత్యాలు

వికీపీడియా నుండి

పల్లె ప్రజల నలరించిన దేవదాసీ నృత్యాలు

[మార్చు]
రాజమండ్రి నగరం కోటిపల్లి బస్టాండు వద్ద ఆలయ నృత్యక్షేత్రంలో ఆలయ నృత్యస్తూపం

ఆంధ్ర దేశంలో దేవ దాసీలు, భాగవతులూ నృత్య కళను పోషించి అభివృద్ధి లోకి తీసుకు వచ్చారు. దేవదాసీల నృత్య కళ, భాగవతుల నృత్య కళ అని అది వేరు వేరుగా అభివృద్ధి పొందింది. భాగవతులు యక్షగానాలూ, వీధి భాగవతాలు, భామాకలాపాల ద్వారా నృత్య కళను ప్రచారం చేశారు. దేవదాసీలు దేవాలయాల నృత్య మండపాలలో, దేవుని సన్నిధానంలో శైవ, వైష్ణవ సంప్రదాయాల ననుసరించి అరాధన నృత్యాలూ, అష్టదిక్పాలక నృత్యాలు, కేశికా ప్రదర్శనాలూ, కలాపాలూ మొదలైన నృత్యాలను ప్రదర్శించేవారు.

రెండు పోకడలు

[మార్చు]

పై వివరాల్ని బట్టి ఆంధ్ర దేశంలో శాస్త్రీయమైన కళ రెండు విధాలుగా అభివృద్ధి జెందింది. ఒకటి నట్టువ మేళ సాంప్రదాయం; రెండవది నాట్యమేళ, భాగవత మేళ సంప్రదాయం. ఈ రెండూ శాస్త్రీయ మైన పద్ధతికి సంబంధించినవైనప్పటికీ ప్రయోగ ప్రదర్శన విధానాలలో భేదం ఉంది. ఆలయాల్లో దేవతా సన్నిధిని దేవదాసీలు చేసే నృత్యం, ఆలయ ఆవరణలో కళ్యాణ మండపం వద్దనూ, స్వామి కొలువులోనూ వినోద ప్రదర్శనంగా ప్రదర్శింపబడే కేళికా, రాజ ధర్బారు ల్లోనూ, ఇతర సభల్లోనూ కళావంతులు ప్రదర్శనాలు మొదలైనవీ నట్టువ మేళానికి సంబంధించినవి. ఈ నట్టువ మేళాల్లో పురుషుల హంగుతో స్త్రీలు మాత్రమే నాట్యం చేస్తారు. పురాణాలకు సంబంధించిన ఇతి వృత్తాలను నృత్య నాటకాలుగా ప్రదర్శించే సంప్రదాయం నాట్య మేళ, లేక భాగవత మేళ సాంప్రదాయంగా వర్థిల్లింది. ఈ సంప్రదాయంలో స్త్రీలు పాల్గొనరు: స్త్రీ పాత్రల్ని కూడా పురుషులే ధరిస్తారు.

ఎందుకు వచ్చినట్లు ఈ పేరు ?

[మార్చు]

భగవంతునికి సంబంధించిన గాథలను ప్రచారం చేయడం వలన వీరిని భాగవతు లన్నారు. ఆలయాలలో దీపారాధన తరువాతనూ, ప్రత్యేక వుత్సవ సమయాల్లోనూ నృత్యాలు జరుగుతూ వుంటాయి. ఆలయాల్లో ప్రదర్శించే ఆరాధన నృత్యాలు దాదాపు 40 వరకూ వున్నవట.

కచ్చేరీ నృత్యకళ

ఒకే నర్తకి ఏకథాటిగా నృత్యం చేయడం కచ్చేరీ నృత్తకళ యొక్క ప్రత్యేకత. రాజాస్థానలలో అభివృద్ధి చెందిన ఈ కళ దేవ దాసీలచే ఆరాదింప బడి ఆంధ్ర దేశంలో కచ్చేరీ కళగా రూపొందింది. ఆంధ్ర దేశంలో అభివృద్ధి పొందిన కూచిపూడి నాటానికి, దీనికీ ఏ విధమైన సంబంధమూ లేదు. ఈ కళను బొబ్బిలి, విజయనగరం, కార్వేటి నగరం, వెంకటగిరి, కాళహస్తి మొదలైన సంస్థానాధి పతులు పోషించారు. ఆనాటి నాట్య శాస్త్రకారులు నృత్యాన్ని, నృత్తాన్ని, అభినయాలను మేళవించి ఒక నృత్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఒక నృత్య కళగా కచ్చేరీ నృత్య కళను ప్రచారం లోకి తీసుకవచ్చారు. దేవదాసీలు క్షేత్రయ్య పద సాహిత్యానికి నృత్యాభి నయాలను రూపకల్పన చేసి ఈ కచ్చేరీ నృత్య కళను ప్రదర్శించేవారు. ఆస్థానాల పోషణ తగ్గిన అనంతరం, దేవదాసీలు కేవలం ఉదర పోషణార్థం దీనిని ఉపయోగించారు. సాత్విక ప్రధాన మైన ఈ నృత్య కళ ఈ నాడు ఆంధ్ర దేశంలో అక్కడక్కడ వృద్ధ దేవదాసీల సొత్తుగా వుందని నటరాజ రామకృష్ణగారు తెలియ జేస్తున్నారు.

మారంపల్లి గొల్ల కలాపం

[మార్చు]

గొల్లకలాప ప్రదర్శనం ఆంధ్ర దేశంలో నూరు సంవత్సరాల క్రితమే ప్రదర్శింప బడింది. ప్రథమంలో కూచి పూడు భాగవతులు గొల్ల కలాపాన్నే ప్రదర్శించారు. వీరు ప్రదర్శించిన తరువాతే మారంపల్లి చిత్త జల్లువారు కాని, ఆంధ్రదేశం లోని ఇతర కళాకారులు గాని ప్రదర్శించారు. గొల్ల కలాపం తరువాత భామా కలాపం ప్రచారంలోకి వచ్చింది. భామా కలాపాన్ని కూచిపూడి వారు ఆనాటి నుంచీ ఈ నాటి వరకూ ప్రదర్శిస్తూనే ఉన్నారు. గొల్లకలాపం మాత్రం పశ్చిమ గోదావరి జిల్లాలో మూడు తరాలుగా సజీవంగా నిలిచి ఉంది. గొల్లకలాపాన్ని పెంచి పెద్ద చేసి పోషించిన వారు నిడుదవోలుకు సమీపాన గల మారంపల్లి వాస్తవ్యులు. కళా వంతుల కులానికి చెందిన కీ.శే: చిత్తజల్లు లంక్ష్మీకాంతం, రావూరి స్వామి సన్నిధిలో బలిపీఠం పైన నృత్యం చేయడానికి అధికార ముద్రల్ని పొందిన వారే ఈ అర్హతను కలిగి ఉన్నారు. అంటు వంటి వారే నిజమైన దేవదాసీలు. తమె జీవిత సర్వస్వాన్నీ దేవుని సేవకే అంకితం చేసి ఆ ఐక్యమునకై తహతహ లాడే వారే దేవ దాసీలు.

పెంచి పోషించిన పెద్దలు

[మార్చు]

ఆంధ్ర దేశానికి సంబంధించి నంత వరకూ భాగవత మేళాల ద్వారా నృత్య కళను పోషించిన వారు పోతక మూరి భాగవతులూ, కూచి పూడి, కోట కొండ, మేలటూరు భాగవతులూ.

పూర్వం దేవాలయ నర్తకీ మణుల్లో ఒకరిని మించిన వారు మరొక రుండే వారు. వారు నృత్య కళను పట్టుదలగా అరాధించేవారు. పోటీ పడి ఆ విద్య నభ్యసించేవారు. రాజాస్థానాల్లో మాత్రం అనేక మంది బృంద నాట్యాల్లో పాల్గొనే నాట్య గత్తెలు ఉన్నప్పటికీ, రాజ నర్తకిగా మాత్రం ఒక్కతే నిర్వహించేది. ఆ విధంగా రాయల ఆస్థానంలో రంజకం కుప్పాయి, రఘునాథ రాయల ఆస్థానంలో ముద్దు చంద్రరేఖ... రూపవతి ....... శసిరేఖ ........ లోకనాయిక, ప్రతాపరుద్రుని ఆస్థానంలో మాచల్దేవి. కుమార గిరి రెడ్డి ఆస్థానంలో లకుమా దేవి మొదలైన వారు రాజ నర్తకి సంప్రదాయానికి చెందిన వారు.

నట్టువ మేళాలు

[మార్చు]

కచ్చేరీ నృత్యకళనుంచి వుద్భవించినవే నట్టువ మేళలు. కచ్చేరీ నృత్య కళ కేవలం రాజ్యాశ్రమ మైనది. ఈ నట్టువ మేళలు అఖిలాంధ్ర ప్రజానీకానికి పరిచయమైనవి. ఇది వీధి కళారూపమని చెప్పవచ్చు. వివాహాది వూరేగింపుల్లోను, మేజువాణీలలోనూ, గొప్ప గొప్ప తిరునాళ్ళలోను, దేవుని కళ్యాణ వుత్సవాలలోనూ ఇవి ప్రదర్శింప బడేవి. పండితులనే కాక పామరుల్ని కూడా రంజింప జేయగల కళారూ-పమిది. మొరటు హాస్వపు పాటలతో కూడా ప్రక్షకులను రంజింప చేయడం కద్దు. కచ్చేరీ నృత్య కళకూ, నట్టువ మేళాలకూ అవినాభావన సంబంధంముంది. ఈ రెండు కళలనూ ఆరాధించిన వారు ఎక్కువ మంది దేవదాసీలే. కచ్చేరీ ఆట దేవాలయాల్లో జరిగే టప్పుడు వీరు మేళ ప్రాప్తితో ప్రారంభించి, పుష్పాంజలి, పేరణి, గీతం, శబ్దం, లసాం, జతి, వర్ణం, పదం, జావళి, తిల్లాన లేక దరువుతో ముగిస్తారు. శబ్దం, సలాం, జతుల్లో ఆంతరింగిక ప్రధానమైన ముద్రలు వేశేషంగా ప్రదర్శించే నృత్యాన్ని ప్రదర్శిస్తారు. ఆ తరువాత వర్ణంలో నృత్త నృత్యాలు సమంగా పోషించి సాత్వికాభినయ ప్రాముఖ్యంతో, జావళీలలో ప్రదర్శించి తిల్లాన నృత్యంతో ప్రదర్శనం ముగిస్తారని నటరాజ రామకృష్ణగారు వివరించారు.

కళాకారులులకు శిక్షణ

[మార్చు]

నట్తువ మేళాలతో నాట్య శాస్త్ర ప్రావీణ్యం తగ్గి పోతూందను కున్న కళాకారు లందరూ కట్టు దిట్టమైన శిక్షణ పొందాల్సి వచ్చింది. భాగవత మేళాల్లో వుండే కళకారు లందరికి సంస్కృతం, తెలుగు వచ్చి వుండాలి. నాట్య శాస్త్రం, నంది కేశ్వరుని అభినయ దర్పణం, భరత రస వ్రకరణం, అలంకార శాస్త్రం క్షుణ్ణంగా అభ్యసించి, నృత్త, నాట్య, అభినయాలలో పూర్తి కళావికాసాన్ని పొందేవారు. ఇలాంటి లక్షణతో నటు లందరూ తయారయ్యేవారు. ఎవరిని కదిలించినా, అందరూ పండితుల మాదిరే వల్లించేవారు. అందు వల్లనే ఆనాటి ప్రదర్శనాలు అంత కట్టుదిట్టంగానూ, కళా ప్రాశస్త్యంతోను ప్రదర్శించ బడ్డాయి. మామయ్య, కామయ్యగారి సోదరులు సూరయ్య, వెంకయ్య, సత్యం మొదలైన వారంతా మారంపల్లి లోనే వుండి గొల్లకలాప ప్రదర్శనాన్ని గోదావరి మండలం లోనూ, సర్కారు జిల్లాల లోను ప్రదర్శించి పేరు ప్రతిష్ఠలు సంపాదించారు. ఆంధ్ర దేశంలో కర్ణాటక చక్కేరీ నాట్యాన్ని భాగవత కళను రెంటినీ ఆరాధించిన దేవదాసీ కుటుంబాల్లో చిత్త జల్లు వారు బహు ప్రసిద్ధులు.

చిత్తాలను జల్లుమనిపించిన చిత్తజల్లు లక్ష్మీ కాంతం

[మార్చు]

లక్ష్మీకాంతం మృదు మథురంగా సంగీతం పాడకలిగేది: చక్కగా నృత్యం చేయగలిగేది. సంస్కృత భాషాజ్ఞానం సంపాదించిన కళాకారిణి. లక్ష్మీ కాంతం ప్రథమంలో కూచిపూడి భామా కలాపాలనే ప్రదర్శిస్తూ వుండేది. తరువాత కామయ్య గారి సహాయంతోనూ, వారి తమ్ముల అండ తోనూ కొల్ల కలాపం నేర్చుకుని బహుళ ప్రచారం గావించి, ఆంధ్రదేశంలో గొల్ల కలాపాన్ని వ్వాప్తిలోకి తీసుకు వచ్చి కొంత కాలానికి స్వర్గస్థు రాలైంది. ఆమె అనంతరం గొల్ల కలాప ప్రదర్శనాన్ని విడవకుండా ఆమె కుమార్తెలు కృష్ణ హరి, చిన వెంకటరత్నం కొనసాగించారు.

వరుస త్గప్పని వారసత్వం

[మార్చు]

లక్ష్మీకాంతం చెల్లెలు వైదేహి. ఈమె పెద వెంకటర్నం అనే కుమార్తెను కని చిన్న తనంలోనే మరణించింది. లక్ష్మీ కాంతం కుమార్తె అయిన కృష్ణహరి వైదేహి, ఇందు వదన అనే ఇరువురు కుమార్తెలను కని, ఆమే కూడా దివంగతు రాలైంది. అందువల్ల లక్ష్మీకాంతం తన కుమార్తె చిన వెంకటరత్నానికి, చెల్లెలి కుమార్తె పెద వెంకట రత్నానికి కామయ్య గారి సోదర బృందం ద్వారా విద్యాబుద్ధులు చెప్పించి గొల్ల కలాప ప్రదర్శనానికి సరియైన తీరికలు తీర్చి దిద్దారు.

సంగీత సాహిత్య నిధి రావూరి కామయ్య

[మార్చు]

సంగీత, సాహిత్య, నాట్య కళానిధి రావూరి కామయ్య గారు. వీరి స్వగ్రామం వెలదుఱ్ఱు. వీరు బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వారు. వీరు మారం పల్లి వారి గొల్ల కలాప ఖండ నిర్మాణానికి మూల పురుషులు. వీరి మరణానంతరం శ్రీ వెంకయ్య, సూరయ్య, సత్యం గార్లు మారం పల్లెలో స్థిర పడి పోయి చిత్త జల్లు కళాకారిణులతో చాలకాలం గొల్ల కలాప ప్రదర్శనాలను ఇచ్చారు. కామయ్యాగారు హాస్యం చెప్పడంలో నిధి. ఎటువంటి అర్థం కాని విషయాన్నైనా తన హాస్య కళా నిపుణత్వంతో తేటతెల్లం చేసేవారు. భామా కలాపం, గొల్ల కలాపం రెండింటిలోనూ హాస్యానికి పెట్టింది పేరు. ఈయన అటు విశాఖ జిల్లా నుండి ఇటు గుంటూరు వరకూ పేరు ప్రతిష్ఠలను సంపాదించారు.

వీరి సోదరులు వెంకయ్యగారు సంగీతంలో ఆరితేరిన మేధావి. సత్యంగారు సంస్కృతాంధ్ర భాషల్లో మంచి పండితుడు. వీరిరువురూ తమకు కావలసిన అనేక కీర్తనలకు స్వరాలనూ, మట్లనూ, గమకాలనూ తామే తయారు చేసుకునే వారు. ఇక సూరయ్య గారు తమ సంచారంలో తటస్థించిన అనుభవాలన్నిటినీ క్రోడీకరించి సమయాను కూలంగా ప్రేక్షకుల ననుసరించి, సమయా సమయాలు ఆలోచించి, గొల్ల కలాప ప్రదర్శనంలో చేర్చి ప్రజా రంజకంగా ప్రదర్శించేవారు.

ఈ రీతిగా గొల్ల కలాపాలను ఎక్కువ కాలం (దాదాపు నలబై సంవత్సరాలు) వెంకటరత్నం సోదరీ మణులు ఆంధ్ర దేశమంతటా ప్రదర్శించి కళా సేవ చేశారు.

వైదేహి, ఇందువదన

[మార్చు]

వైదేహి ఇందువదన లిరువూ మరణించే వరకూ గొల్ల కలాప ప్రదర్శనాన్ని చెదురు మదురుగా ప్రదర్శిస్తూ వచ్చారు. వైదేహి గొల్ల కలాప ప్రదర్శనంలో సిద్ధ హస్తురాలు. ఆమె సోదరి ఇందువదన ప్రయోక్తగా వుండి అక్కగారి చేత నాట్యమాడించేది. ఈ విధంగా వీరుద్దరూ అయిదు దశాబ్దాలు నాట్య క్ళారాధన చేశారు. వైదేహి పంచ కావ్వాలూ., అమరమూ, వేదమూ పురాణ పండ వెంకట శాస్త్రి గారి వద్ద పకడ్బందీగా చదువుకుంది. అభినయం, సంగీతం, వేదం, స్మృతులు, పురాణాలు, భరత శాస్త్రం, అలంకార శాస్త్రం, రసశాస్త్రమూ పండితుల వద్ద ప్రత్యేకంగా అభ్యసించింది. ఇందువదన చదలవాడ కుమార స్వామి వద్ద సంగీతాన్ని, లయజ్ఞానాన్ని నేర్చుకుంది. వీరి నాట్యశిక్షణ తెల్లవారు ఝామున ప్రారంభిస్తే రాత్రి పది గంటల వరకూ కొద్ది వి రామాలతో అలా అ లా నడుస్తూనే వుండేదట. ఈ విధంగా ఈ శిక్షణ పది సంవత్స్సరాలు జరిగిన తరువాతనే వీరు రంగస్థలం పై కాలికి గజ్జెకట్టి బహిరంగంగా ప్రదర్శనాలు ఇవ్వగలిగారట. వీరు భామాకలాపం, గొల్ల కలాపాలనే గాక, భోగం మేళాలుగా వివాహ సమయాల్లోనూ, దేవాలయ కళ్యాణ మహోత్సవాల లోనూ తమ కార్యక్రమాలు ప్రదర్శించేవారు. ఇందువదన హరికాథా కాలక్షేపం కూడా చేసేదట.

గొల్ల కలాపాల ప్రదర్శన పద్ధతి

[మార్చు]

గొల్ల కలాప ఇతి వృత్తాన్ని గురుంచి కూచిపూడి భాగవతాలూ' అన్న శీర్షికలో చర్చించాం. గొల్లకలాప ఇతివృత్తంలో అనేక రకాలైన కీర్తనలు, మట్లు, గమకాలు వుంటాయి. మంచి సాహిత్యం, సాహిత్యానికి తగిన సంగీతం, సంగీతానికి తగిన ఫణతులు, వీటన్నిటికీ తగిన నాట్యంతో గొల్ల కలాప ప్రదర్శనం ఒక కమ్మని కళాఖండంగా ప్రదర్శింప బడుతుంది. గొల్ల కలాప ప్రదర్శనంలో ఆనాడు ఏవిధమైన తెరలూ వుపయోగించ లేదు. ప్రదర్శనం ప్రారంబించి, సాంతమయ్యే వరకూ నటీ నట బృందమంతా రంగస్థలం మీదే వుంటారు. ప్రధాన నాయకకు సహాయంగా, మరో సహాయ నాయిక వుంటుంది. వీరుద్దరూ కాక కథా గమానాన్ని అత్యంత చమత్కారాలాతో ప్రేక్షకులకు కథలా కళ్ళకు కట్టినట్లు ప్రతిభావంతంగా చిత్రించే విదూషక పాత్ర ధారి వేరే ఒకడు వుంటాడు. ఇతనిని హాస్యగాడు అనిపిలిచేవారు. వీరు ముగ్గురే గొల్లకలాప ప్రదర్శనానికి నటీ నట వర్గమని చెప్పవచ్చు. వీరు గాక వీరికి హంగు దార్లుగా ప్రక్క వాయిద్యాలు, మృదంగం, ఫిడేలు, హర్మోనియం, తాళగాండ్రు వుంటారు. హాస్య పాత్రధారి, కథానాయిక కూడా తాళం వేస్తూ వుంటారు. ఇతర కళా రూపాల్లో వలెనే ఇష్టదేవతా ప్రార్థన, విఘ్నేశ్వర స్తుతి, సరస్వతీ పూజ మొదలైన సంప్రదాయాలను కూడా అక్షరాలా పాటించేవారు.

సంశయాలూ, సందేహాలు తీర్చే భాష్యకారుడు హాస్యగాడు

[మార్చు]

కథా గమనంలో, అందరికీ అర్థమయ్యే శైలిలో, మధ్య మధ్య అనేక పిట్ట కథల ద్వారా, ప్రేక్షకులకు వచ్చే సందేహాలను తానే కథా నాయికని ప్రశ్నించి ఇతగాడు కథలో వచ్చే చిక్కులన్నీ సుబోధకం అయ్యేలా చేస్తాడు. గంభీర మైన అనేక విషయాలను కరబదరీ సమానంగా వివరించి, ప్రేక్షకులకు విసుగు జనించ కుండా తన అద్భుత చమత్కృతితో పండితుల నుండి పామరుల వరకూ అందర్నీ రంజింప జేసే వైజ్ఞానికి పాత్ర ధారి మన హాస్యగాడు. ఈ ప్రదర్శనాని కంతా ప్రధాన కథానాయిక ఎంత అవుసరమో, హాస్య పాత్ర ధారి కూడా అంత ముఖ్యం. గొల్ల కలాపంలో మన నాటకంలో మాదిరి, భాగవతంలో మాదిరి వచ్చీ పోయే పాత్రలేమి వుండవు. ఒకసారి రంగస్థలం పైకి ప్రత్యక్ష మైతే ఆ ముగ్గురూ ఆసాంతం వుంటూనే వుంటారు.

హాస్యకాని బరువు బాధ్యాలు

[మార్చు]

గొల్లకలాపంలో చెప్పబడే అనేక మైన ఉదాత్త విషయాలను పై మూడు పాత్రలే వుదాహరించాలి. ఇలా వివరించడం లోనూ ప్రేక్షకులకు ఏవిధమైన విసుగూ లేకుండా ప్రదర్శించాలి. ఇది చాల కష్టమైన విషయం. కాని మన హాస్యకాడు వినోదం తోనూ, పిట్టకథల తోనూ, ప్రజా జీవితంలో నిత్యం వాడబడే అనేక చాటువుల తోనూ ప్రేక్షకుల ల్నందరినీ సమాళించి చమత్కారంగా తన వశంలో వుంచు కుంటాడు.

మూడు రోజుల నుంచె ఒకే రోజుకు ప్రదర్శన కాలం కుదింపు

[మార్చు]

గొల్ల కలాపాన్ని ప్రదర్శించాలంటే ప్రతి రాత్రీ ఏడు గంటల చొప్పున ప్రదర్శిస్తే కనీసం మూడు రోజులకు గాని పూర్తి గాదు. చిత్తజల్లువారూ ప్రథమంలో ఈ కార్యక్రమాన్నంతా వరుసగా మూడు రోజులూ ప్రదర్శించేవారు. కాని, రాను రాను ప్రజలలో చూచే వుత్సాహం, వినే ఓపికా తగ్గటం, చాలమంది పండితులూ రసికు లైన ప్రేక్షకులూ కూడా తగ్గటం వల్ల ప్రదర్శన కాలపరిమాణం విధిగా తగ్గిపోయి, ప్రజలకు కచ్చితంగా కావలసిన ఖరారు ఘట్టాలనే ప్రదర్శిస్తూ కిందా మీదా బడి ఎలగో ఓలాగు కుదించి ఒకే రోజున ప్రదర్శనాన్ని ముగిస్తూ వచ్చారు;

గంధర్వ కన్యల వనవిహారం

[మార్చు]

గొల్ల కలాప ప్రదర్శన్నానే కాక వీరు వనవిహార మనే మరో ప్రదర్శనాన్ని కూడా ప్రదర్శించే వారు. ఈ ప్రదర్శనం గురించి ప్రత్యేకించి చెప్ప దగ్గవి కథా విధానం. ఇద్దరు గందర్వ కన్యల మధ్య జరిగే సంభాషణా విధానం. ఈ సంభాషణంతా చాలవరకు సంస్కృత భాషలోనే నడుస్తూ వచ్చినా అక్కడక్కడ తెలుగు కీర్తనలు పాడుతూనూ, దీనిని ప్రదర్శిస్తారు. ఇరువురు గందర్వ కన్యలు వన విహారాని కొచ్చి పూల తోటలో పూల బంతులాటలు ప్రారంభించి ఋతువుల్ గురించి పూవులను గురించీ, చెట్లను గురించీ, రక రకాల వర్ణనలు సాగించడం రూపంగా ఇది నడుస్తుంది. ఈ ప్రదర్శనం ప్రేక్షకులకు గుమ్మెక్కించే టట్లు ప్రదర్శిచాలంటే ఆ కన్యలిద్దరూ మిసమిస లాడే యౌవన వతులై వుండాలి. అప్పుడే ఆయొక్క ప్రదర్శనానికి నిండుదనం వచ్చేది; ప్రదర్శనం రక్తి కట్టేది;

గొల్లకలాపం కానీ, వనవిహారం కాని ప్రదర్శిం చాలంటే ముఖ్యంగా సంస్కృతాంధ్ర భాషలు క్షుణ్ణంగా వచ్చితీరాలి. సరియైన విద్యా, విద్యకు తగిన విజ్ఞానమూ, దానికి గతిన సంస్కారమూ, కట్టు తప్పని పట్టుకలా కావాలి. శ్రుతి తప్పని సంగీతమూ, తొట్రుపడని, మట్టు మీరని సరియైన ఉచ్ఛారణా కావాలి.

మారం పల్లి వారిని మనవారు మరువరు... మరువలేరు

[మార్చు]

ఈ విద్యను చెక్కు చెదరకుండా మూడు తరాలుగా చిత్తజల్లు వారి కుటుంబం కాపాడుకుంటూ వచ్చింది. ఆనాడు ఏభై ఏళ్ల పండు వృద్దురాలు చిత్తజల్లు పెద వెంకట రత్నమ్మ తప్ప ఆ కుంటుంబంలోని వారందరూ మరణించారు. గొల్ల కలాప కళాఖండం వారితో పాటే అంతరించింది. ఏమైనా నూరు సంవత్సరాల నుంచీ గొల్ల కలాప ప్రదర్శనాన్ని పెంచి పోషించి, ఆంధ్రదేశ మంతటా ప్రదర్శించి ప్రఖ్యాతి వహించిన మారం పల్లి వాస్తవ్యులు చిత్తజల్లు సోదరీ మణులూ, రావూరి కామయ్య సోదరులూ స్మరణీయులు. వర్తమానంతో పాటు భవిష్యత్ సహా ఆంధ్ర దేశం వారిని, వారి కళా సేవను మరువ జాలరు.

చాటపర్తి సుందరి శకం

[మార్చు]

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వాసవ్యు రాలైన చాటపర్తి సుందరిది ఒక శకం. ఆమె దేవదాసి. ఒక మేళానికి నాయకు రాలుగా వ్వవహరిస్తూ వుండేది. ఆమె కచేరీ నాట్యంలోనూ, దేవదాసీ నృత్యంలోను కూడా ఘటికురాలు. విద్యలో ఆమెను మించిన వారు లేరనేటంతటి గర్విత. ఒక సారి నర్సాపురంలో ఒక వైశ్యుల ఇంట ఒక వివాహ సందర్భంలో ఈ సుందరి తన బృందంతో గజ్జె కట్టింది. మెడనిండా మెడల్స్ ధరించి ఠీవిగా రంగస్థలంలో ప్రవేశించింది. ఈ వివాహానికి శ్రీ చెళ్ళస్పిళ్ళ వేంకట శాస్త్రిగారూ, వేదాంతం లక్ష్మినారాయణ శాస్త్రిగారూ (ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, ముఖ్యంగా ఆమె విద్యలు పరీక్షించడానికి) వచ్చారు. సుందరి పుష్పబాణ విలాసంలోని ఈ సంస్కృత శ్లోకాన్ని అభినయంతో ప్రారంబించింది.

కాంతో యాసతి దూరదేశ మితి చింతా పరం జాయతే,
లోకానంద కరోపి చంద్రవదనే, వైరాయాతే చంద్రమాః

అంటూ శ్లోకాన్ని పదవిభాగం చేసి అభినయానికి ఉపక్రమించింది. ఆ సందర్భంలో పంచ బాణాలను అభి నయారూపంలో ప్రదర్శించె పద్ధతి చూపెట్టడానికి శ్లోకాన్ని ఇలా ప్రారంబించింది.

ఆరవింద మశోకంచ చూతంచ నవమల్లికా,
నీలోత్పలంచ పంచైతే పంచ బాణస్యసాయకాః

అరవిందము...... అశోకము ....... చూతము ........ నవమల్లిక ........ నీలోత్పలమూ మొదలైనవి మన్మథుని పంచ బాణాలు. ఈ అభినయంలో సుందరి పంచ బాణాలనూ ప్రయోగించింది. అసలు రంగం మీద చతుర్బాణాలే అభినయ రూపంలో ప్రదర్శించాలి. పంచమ బాణం ఉపయోగించి నట్లతెతే నాయిక మృతి పొందుతుంది. ఆ తరువాత అభినయించేందుకు నాయిక వుండది. కాని ఈ సుందరి ఆనాటి అభినయంలో పంచ బాణాలనూ ఉపయోగించింది.

వెంటనే పండితు లిద్దరూ ఈ సభకు మైల వచ్చిందని కేకలు వేయటం ప్రారభించారు. సభంతా గందరగోళ మైంది. నాయిక బిత్తర పడి పోయింది. ఆ సభలో పండితు లిద్దరు వచ్చి కూర్చున్నారన్న సంగతి అంత వరకూ ఈ సుందరికి తెలియదు. ఈ విషయం తెలుసుకున్న సుందరి వెంటనే సర్రున వెళ్ళి పండితుల పాదాల మీద వాలింది. అప్పుడు శాస్త్రిగారు అభినయంలో కలిగిన లోపాలను చూపించారు. చతుర్బాణాలనే అభినయంలో ఉపయోగించాలి కానీ, నీవు పంచ బాణాలు ఉపయోగించావు. అందువల్ల స్థలం మైల పడింది. అందు చేత కళామ తల్లికి కలిగిన ఈ కళంకాన్ని భరించలేక ఈ రూపంలో నీకు తెలియ జేయవలసి వచ్చింది. అని అనడంతో సాష్టాంగ దండ ప్రణాలు ఆచరించి, తన బసకు తీసుకు పోయి, పండితులిద్దరినీ సత్కరించి, కానుక లిచ్చి గౌరవించి శాస్త్రిగారి శిష్యురాలిగా చేరిపోయింది.

పాటకత్తెగానూ, ఆటకత్తె గానూ ప్రశస్తి గాంచిన 'కళావర్ రింగ్.'

[మార్చు]

కచేరీ నృతానికీ కర్ణాటక నృత్యానికీ కొత్త మెరుగులు దిద్ది, విజయనగరం రాజనర్తకిగా, నాటకరంగ నటిగా, అమర గాయనిగా, చలన చిత్ర నటీమణిగా రసిక హృదయాలని రంజింపజేసిన కళాకారిణి కళావర్ రింగ్ అనే పేరుతో చెలామణి అయిన అయిన సరిదె లక్ష్మీనర్సయ్యమ్మ. ఈవిడ విజయనగరానికి 8 మైళ్ళ దూరంలో వున్నకోరుకొండ గ్రామంలో 1908 లో జన్మించింది. 8 వ ఏటనే నర్తకిగా పేరు తెచ్చుకుంది. 5 వ తరగతి వరకూ ప్రాథమిక విదాభ్యాసం చేసి శ్రీ మద్ది లచ్చన్నగారి వద్ద సరిగమలు ప్రారంబించి, శ్రీ ద్వారం వెంకతస్వామి నాయుడు శిష్యు లైన శ్రీ మద్దిల సత్య మూర్తి, శ్రీ చాగంటి రంగ బాబు, శ్రీ కోటి పల్లి గున్నయ్య మొదలైన వారి వద్ద సమగ్ర సంగీత జ్ఞానం సంపాదించింది. నృత్య విద్యలో శ్రీమతి మద్దిల అప్పుడు, శ్రీమతి మద్దిల రాముడు వద్ద శిక్షణ పొందింది. మద్దిల హేమావతి, నరహరమ్మల వద్ద హిందూస్థానీ జావళీలు, క్షేత్రయ్య పదాభినయనం నేర్చుకుంది. 12 సంవత్సరాల వయస్సులోనే భోగం మేళం ;నాయకురాలుగా వ్వవహరిందింది. ఆమే నృత్యానికి అచ్చెరువందిన ప్రేక్షకులు ఆమెను కళావర్ రింగ్. అని పిలిచేవారు.

ఆంధ్ర దేశంలోనూ, రాష్ట్రేతర ప్రాంతాల్లోనూ నానారాజ సందర్శనం చేసి సంగీత నృత్య విద్యలో మహా పండితుల్నీ మెప్పించి, నాట్య తరంగిణి, నవవసంత కోకిల, గాన కళా కోవిద అనే బీరుదులతో సువర్ణ హస్త కంకణాల బహుమానాలతో సన్మానాలు అందు కున్నది. జయపూర్, ధారాకోట. కళ్ళికోట, చీకటి కోట, కలహండి, కరియల్, మధుపూర్, టికిరియా సంస్థానాలో ఆమెను ఘనంగా సన్మానించారు. ఆమె తెలుగు చనల చిత్ర రంగంలోను ప్రవేశించి రాణీప్రమీల చిత్రంలో ప్రధాన పాత్ర ధరించి చక్కగా పాడి నటించింది. 1947 లో మద్రాసు రేడియో ప్రసారం చేసిన సీతారామ కళ్యాణం, సుందరకాండ, సక్కుబాయి, శ్రీరామ జననం, భక్త రామదాసు నాటకాల్లో పాల్గొని అత్యుత్తమంగా నటించింది.

1934 లో ఆమె అనేక గ్రామఫోన్ రికార్డుల నిచ్చింది. కోకిల కోయి అని కూయగా, వ్యాకుల మానసమాయేగా, చిటపట చినుకులు దుప్పటి తడిసెను, పచ్చ బొట్టు ప్రాణనాథా...... ......సై పగజాల, రాత్రి నాటకం, ఏరా నాప్రియ మొదలైన పాటల రికార్డుల వెలువడ్డాయి. చింతా మణి గ్రామ ఫోను రికార్డుల నాటకంలో చింతామణీ పాత్ర ధరించింది. 1964 మార్చి 17 వ తేదీన ఆమెను ఆంధ్ర ప్రదే సంగీత నాటక అకాడమీ హైదరాబాదు రవీంద్ర భారతిలో సన్మానించింది. నృత్య ప్రదర్శనం ద్వారా కళావర్ రింగ్ అపారంగా ధనం ఆర్జించింది. అనేక మంది బీద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేసింది. అంతే కాదు, అవసరాల్లో వున్న వాళ్ళను ఆదుకుని అనాథులకు ఆశ్రయం ఇవ్వటం ఆమె సుగుణాలు. ఆమె అంతమ దశలో, అకాడమీ వారి వేతనంతో, హరికథా గానంతో జీవితం గడిపి 1964 లో స్వర్గస్తురాలైంది.

కోనసీమ కెల్ల మిన్నగా ఎన్నికైన అన్నాబత్తుల బుల్లి వెంకటరంత్నం

[మార్చు]

ఈమెను అన్నబత్తుల చిట్టి అనే చాలమంది పిలుస్తూ వుంటారు. ఈమె తరతరాలుగా అభినయ విద్యను ప్రదర్శించే విద్వత్కుటుంబంలో జన్మించింది. బుల్లి వెంకటరత్నం ఆరు సంవత్సరాల ప్రాయంలోనే అమ్మమ్మ వద్ద భరత నాట్యాన్ని నేర్చుకుంది. కుటుంబంలో కడసారి బిడ్డ అవడం వలన కుటుంబంలోని వారందరూ ఆమెను ప్రేమతో పెంచి పెద్ద చేసారు. ఆమె అభినయం, సంగీతం, అధ్యాత్మ అష్టపదులు, తరంగాలు, అభినయమూ, సరస భూపాలీయము, నాయికా నాయక ప్రకరణము సాంప్రదాయికంగా నేర్చుకుంది. ఆమె అభినయ విద్యను కోటిపల్లి వాస్తవ్యులు కడియాల రామమూర్తి గారి వద్దనూ, సంగీతాన్ని మహోద్రాడ పద్మనాభం గారి వద్దనూ, గొల్లకలాపాన్ని, భామా కలాపాన్ని అత్కూరి సుబ్బారాయుడిగారి వద్దనూ, కలాపంలో వేదాంత విద్యను జయంతి స్వామి నాయన గారి వద్దనూ నేర్చుకుంది.

కోనసీమలో గొప్ప పేరు

[మార్చు]

అన్నాబత్తుల బుల్లి వెంకట రత్నం.... భామాకలాపం, గొల్లకలాపం, కచేరీనాట్యం మొదలైన విద్యలలో కోనసీమలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించినల నట్టువరాలు. రాజమండ్రి భారత సంస్కృతి సభ, కాకినాడ సాహిత్య పరిషత్తు, మద్రాసు సంగీత నాటకాకాడమి మొదలైన అనేక సంస్థలు ఆమెను సన్మానించాయి.

ఉభయ విద్యా ప్రవీణ శ్రీమతి మద్దెల రాముడు

విజయనగరం వాస్తవ్యులు మద్దెల రాముడు సంప్రదాయ కచేరీ నృత్యవిద్యలోనూ, కర్ణాటక విద్యలోనూ ఆరితేర్రిన విద్వాంసురాలు. ఆమె తన విద్యతో ఒక్క విశాఖ మండలమే కాక ఆంధ్ర దేశంలో పలు తావుల్లో ప్రదర్శన లిచ్చి మెప్పు పొందింది. ఈమె నాయకురాలుగా ఎన్నో సంవత్సరాలు ఆ బాధ్యతను నిర్వహించింది. ఎంతోమందికి విద్యాదానంచేసి అనేక మంది కళాకారుల్ని తయారు చేసింది. సంగీత నాటక అకాడమివారి ఉపకార వేతనంతో జీవితం వెళ్ళ బుచ్చింది.

పందిరి వెంకటరత్నం

పందిరి వెంకట రత్నం జన్మస్థలం తూర్పు గోదావరి జిల్లా మండపేట. భాగవత సంప్రదాయాన్ని భాగవతుల రూపేణ ప్రచారం చేయడంలో కృష్ణాజిల్లాలోకూచిపూడి ఎంతటి ప్రఖ్యాతి వహించిందో గోదావరి మండలంలో మండపేట కచేరీ నాట్యంలోనూ, కర్ణాటక, భామా గొల్ల కలాపంలోనూ అంతటి సరస్వతీ పీఠంగానూ వర్థిల్లింది. శ్రీమతి పందిరి వెంకటరత్నం, వానపల్లి వీర్రాజు మొదలైన వారు భామాకలాప, గొల్లకలాప విద్యలను అనేక సంవత్సరాలుగా ఆంధ్ర దేశంలో ప్రదర్శిస్తూ వచ్చారు. 1949 సంవత్సస్రంలో విజయవాడలో జరిగిన చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి గారి సన్మాన సందర్భంలో వెంకటరత్నం సమయాను కూలంగా సన్మానించ బడింది. ఈవిడ రేడియోద్వారా ఎన్నో భామాకలాప ప్రదర్శనాలను ప్రసారం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ సంగీత నాటక అకాడమీ ఈమెను ఘనంగా సన్మానించింది.

దుగ్గిరాల మాణిక్యం

మండపేట మాణిక్యం అని కూడా పిలువబడే దుగ్గిరాల మాణిక్యం సన్మస్థలం మండ పేట. సంస్కృతాంధ్ర భాషలనూ, సఆంగీత నాట్యాలనూ అమోఘంగా ఆకళింపు చేసుకున్న విదుషీమణి ఈమె. భాగవత సంప్రదాయాలను ప్రచారం చేయడంలోనూ కచేరీ నృత్యంలోనూ ఆంధ్ర దేశానికి పేరు తెచ్చిన కళాకారిణి. ఈమె నిజంగా నాట్య సరస్వతి. భారత భాగవాత విద్యల్లో భావ మెరిగి అభినయించే నాట్య విశారద శ్రీమతి పందిరి వెంకటరత్నం. ఈమె శిష్యురాలు. వెంకట రత్నం స్వర్గీయ చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రుల గారిచే సన్మానింప బడిన విద్యాంసురాలు.

భామా కలాపానికి ధీమా తెచ్చిన దూడల శంకరయ్య

భామా కలాపం ప్రత్యేకమైన ఆంధ్రుల కళ దానికి సిరి తెచ్చింది. శ్రీకాకుళం జిల్లా. అనాది నుండి ఆ జిల్లాలో సుమారు 40 కుటుంబాల వారు ఈ కళనే వృత్తిగా చేసుకుని జీవించే వారు. ఈనాడు అన్ని కుటుంబాలు లేవు. చెప్పుకో తగిన పండితులు కూడా అంత మంది లేరు. కాని సిగడాంవాస్తవ్యులైన దూడల శంకరయ్యగారు ఈ భామకలాప విద్యలో సిద్ధ హస్తులు. వీరి తరువాత ఈ భామా కలాపకళ అంతరించి పోయే అవకాశముంది. దీనిని సంస్కరించి ప్రదర్శిస్తే ఆంధ్ర నృత్య కళలో ఒక మహోత్కృష్ట కళగా రూపొంద గలదు.

భామాకలాప విద్యలో సిద్ధ హస్తులైన దూడల శంకరయ్య గారు లయ బ్రహ్మ. వారిది లయ బద్ధమైన అద్భుత కళ. అది ఆంధ్రుల పురాతన కళా ఖండం. శంకరయ్య గారి భామ కలాపంలోనీ బాణీలు, పదాలు, పాతలు ఆయన కుమారుడు వాయించే మృదంగ దసరువులు అద్భుతమైనవి.ఆంధ్ర దేశంలో కూచి పూడి వారూ, దేవదాసీలు ప్రదర్శించే భామకలాపానికి, శంకరయ్య గారి భామా కలాపానికీ ఎంతో వ్యత్యాసముంది. అందువల్ల ఈ కళను ప్రత్యేకంగా పోషించ వలసిన అవసర ముంది.

బొంతల కోటి జగన్నాథం

శ్రీకాకుళం జిల్లాకు చెందిన బొంతల కోటి జగన్నాథం గారు కూడా భామాకలాపం ప్రదర్శించడంలో సిద్ధ హస్తులు. వీరి సాంప్రదాయమూ, దూడల శంకరయ్య గారి సంప్రదాయమూ ఒకటే. ఇది కూచిపూడి భామకలాపానికి భిన్నమైనది. ప్రాచీన యక్షగాన దరువుల శైలీ, అభినయ విన్యాసమూ వీరి బాణీలో తొణికిస లాడుతూ వుంటాయి. సంగీత ప్రధానమైన భాగవత సంప్రదాయం వీరిది. భామాకలాప విద్యలో బొంతల కోటి జగన్నాధం గారు, శ్రీకాకుళం జిల్లాలో చాల ప్రసిద్ధులు.

పైన వివరించిన వారేగాక వెండ్యాల సత్యభామ, చింతా భద్రం, ఎండమూరు చిట్టి, పేరూరి పుష్పావతి, దుగ్గిరాల శ్రీ విరాజితం, గుద్దిరా జగదాంబ, అంబుల వెంకటరత్నం, మొదలైన దేవ దాసీలు, భామాకలాపం లోనూ, గొల్ల కలాపంలోను, దేవదాసీ విద్యలోనూ బహు ప్రసిద్ధులు.

బొబ్బిలి బెబ్బులి జీవరత్నమ్మ

కీ.శే. శ్రీమతి జీవరత్నమ్మ బొబ్బిలి సంప్రదాయ భరతనాట్య కళా విదురాలు తారతరాలుగా జీవరత్నమ్మ కుటుంబం వారు ఈ కళను పోషిస్తూ బొబ్బిలి సంస్థాన కళాకారులుగా వర్థిల్లారు. జీవరత్నమ్మ ఒక్క భరత నాట్య సంప్రదాయంలోనే కాక, కర్ణాటక సంగీతంలోను, వీణావాద్యం లోను విశేష పాండిత్యం గల విదుషీమణి, పద వర్ణాలకు, స్వస్ర జతులకు, శబ్ధాలకు, క్షేత్రయ్య పదాలకు, జావళీలకు నృత్త నృత్యాలు కల్పించి అభినయం చేసేది. ఆమె నర్తన రీతి మంచి పాండితీ ప్రతిభ గలిగినట్టిది. అంతే కాక సంస్కృత శ్లోకాలకు, ఒరియాలో పదావళికి, ఉర్దూ, హిందీ భాషల్లోని టుమ్రీ-గజల్ గీతాలకు కూడా అబ్ హినయాన్ని కల్పించి ప్రదర్శించేది. 60 సంవత్సరాల వృద్దాప్యంలో కూడా నృత్యాభ్యాసం చేసేది.

ఆమె సంపాదించిన ధనమంతా దాన ధర్మాలకు ఖర్చు చేసింది. అంతిమ దశలో సంగీత నాటక అకాడమీ వారి వృద్ధాప్య పింఛనుతో జీవించింది. కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాదులో నటరాజ రామకృష్ణ గారి నృత్యనికేతనంలో బాలికలకు నృత్య శిక్షణ నిచ్చింది. 'నే నీ కళారాధను అంకితమయ్యాను. నాజీవితం కళారాధనలోనే గడిపి తరిస్తా ' నని నృత్య నికేతనం చేరినట్లు నట రాజ రామకృష్ణగారు 68 అక్టోబరు నాట్య కళ సంచికలో వివరించారు. శ్రీమతి జీవరత్నమ్మ 68 ఆగస్టు 22 తారీఖున కీర్తి శేషురాలైంది.

భామా వేషంలో ధీమా చూపిన మరి కొందరు

పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు తాలూకా కుమార దేవ గ్రామంలో మంచి రాజు వెంకట్రామ రాజు గారనే నియోగి బ్రాహ్మణుడు భామ వేషం ధరించడంలో బహు ప్రశిద్ధుడు. వారి శిష్యులైన పల్లంపట్ల రామయ్య గారు పశ్చిమ గోదావరి జిల్లా, కొవ్వూరు తాలూకా బందపురం లోని పిచ్చుకుంట్ల వారికి భామా కలాపాన్ని, గొల్ల కలాపాన్నీ నేర్పారు. బయ్యా పెద గంగాధరుడు, బండి చిట్టి లింగము, దేశి లక్ష్మి నారాయణ మొదలైన వారు భామ వేష ధారణలో సిద్ధ హస్తులు. 16 సంవత్సరాల వయస్సులోనే లక్ష్మీనారాయణ భామ వేషం అద్భుతంగా వుండేదట. భదపురంలో పిచ్చు కుంట్ల వారికి ఈ విద్యను నేర్పించటంలో విసేష కృషి సల్పినవారు పి.ఎస్.ఆర్ అప్పారావు గారు పితృపాదులైన పోణంగి రామమూర్తి గారు.

మూలం:

[మార్చు]

తెలుగువారి జానపద కళారూపాలు..... రచయిత డా. మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి