నటరాజ రామకృష్ణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నటరాజ రామకృష్ణ
Nataraju ramakrishna.jpg
నటరాజ రామకృష్ణ
జననం1933 మార్చి 31
ఇండోనేషియాలోని బాలి ద్వీపం
మరణం2011 జూన్ 7
హైదరాబాదులోని నిమ్స్ ఆసుపత్రి
సమాధి స్థలంతారామతి బారాదరి, హైదరాబాదు
వృత్తిఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ మాజీ ఛైర్మన్‌
సుపరిచితుడునాట్యాచార్యుడు, రచయిత
తల్లిదండ్రులు
 • రామమోహన రావు (తండ్రి)
 • దమయంతీదేవి (తల్లి)

డాక్టర్ నటరాజ రామకృష్ణ (1933 మార్చి 31 - 2011 జూన్ 7) కూచిపూడి నాట్య కళాకారుడు. ఇండోనేషియా లోని బాలి ద్వీపంలో జన్మించాడు. ఆంధ్రనాట్యము, పేరిణి శివతాండవము, నవజనార్దనం వంటి ప్రాచీన నాట్యరీతుల్ని తిరిగి వెలుగులోకి తెచ్చాడు. ఆయన ఆజన్మ బ్రహ్మచారి.

పదవ శతాబ్దంలో కాకతీయ సామ్రాజ్య కాలంలో ప్రాచుర్యంలో ఉన్న పేరిణి శివతాండవం నాట్యాన్ని పునరుద్ధరించాడు. ప్రబంధ నాట్య సంప్రదాయానికి సంబంధించిన నవజనార్దనంను కూడా పునరుద్ధరించాడు.

నటరాజ రామకృష్ణ 2011, జూన్ 7హైదరాబాదు లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

జీవిత విశేషాలు[మార్చు]

రామకృష్ణ తల్లి దమయంతీ దేవి నల్గొండ జిల్లాకు, తండ్రి రామమోహనరావు తూర్పు గోదావరి జిల్లాకూ చెందినవారు. వీరు ఇండోనేషియా లోని బాలి ద్వీపానికి వలస వెళ్ళారు. రామకృష్ణ అక్కడే 1933 మార్చి 31 న జన్మించాడు.[1] ఆయన చిన్నతనంలోనే తల్లి మరణించింది.

వారి కుటుంబం నాగపూరుకు వలస వచ్చేసింది. నటరాజ రామకృష్ణకు చిన్ననాటి నుంచే నాట్యం పట్ల ఆసక్తి కలిగింది. ఆయన నాట్యం నేర్చుకోవడం తండ్రి ఇష్టపడలేదు. "మా వంశం కళలను పోషించాలే గానీ కళాకారులుగా వాటిని ఆరాధించకూడదని వారి అభిప్రాయం" అని తన ఆత్మకథలో రామకృష్ణ రాసుకున్నాడు. తాను రచించిన దాక్షిణాత్యుల నాట్యకళా చరిత్ర పుస్తకానికి లభించిన కేంద్ర ప్రభుత్వ పురస్కారాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నపుడు కూడా ఆయన సంతోషించలేదని కూడా రాసుకున్నాడు.[2]

నాట్య ప్రస్థానం[మార్చు]

నటరాజ రామకృష్ణ ఎన్నో విపత్కర పరిస్థితులను ఎదుర్కొని కళాసాధన చేశాడు. కుటుంబాన్నీ, సంపదల్నీ వదిలి నాట్యంకోసం జీవితాన్ని అంకితం చేశాడు. ఆయన తనలోని కళాతృష్ణాన్వేషణలో ఎందరో గురువులను కలుసుకొని, వారి నుండి ఎన్నో నాట్యరీతుల్ని నేర్చుకున్నాడు. వారిలో మీనాక్షి సుందరం పిళ్ళై, వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి, నాయుడుపేట రాజమ్మ, పెండెల సత్యభామలు ఉన్నారు. 18 ఏళ్ళ వయసులో నాగపూరులో ఆయనకు "నటరాజ" అనే బిరుదును ఇచ్చారు. అప్పటినుండి అది ఆయన పేరు ముందు శాశ్వతంగా చేరిపోయింది.[1]

సినిమా నటుడు తిక్కవరపు రమణారెడ్డి ఆహ్వానం మేరకు నెల్లూరు వెళ్ళి, అక్కడ నృత్య నికేతనం అనే నాట్య శిక్షణాలయాన్ని స్థాపించాడు. తనకు నాగపూరులో మత విద్వేషాలు పరిచయమే గానీ కుల విద్వేషాలు మాత్రం కొత్తగా ఉందని నెల్లూరులో ఉండగా అతడు వ్యాఖ్యానించాడు. అక్కడి కుల వైషమ్యాలను తట్టుకోలేక వెనక్కి పోదామని అనుకోగా, రమణారెడ్డి వారించిన మీదట ఆగాడు. రెండు సంవత్సరాలు నెల్లూరులో ఉన్న తరువాత గుంటూరు తరలి వెళ్ళాడు.[3]

రామకృష్ణ రామప్ప దేవాలయం లోని శిల్పాల వలన ఉత్తేజితుడై, పేరిణి శివతాండవ నృత్యాన్ని పునరుద్ధరించాడు. జాయప సేనాని రాసిన నృత్తరత్నావళి గ్రంథాన్ని ఇందుకు మార్గదర్శినిగా ఎంచుకున్నాడు.[4]

ఆయన ఇచ్చిన నాట్య ప్రదర్శనలు- శ్రీ వేంకటేశ్వర కల్యాణం, కుమార సంభవము, మేఘ సందేశం. ఉజ్జయినిలో ప్రదర్శింపబడిన కుమార సంభవానికి స్వర్ణకలశం లభించింది. నటరాజ రామకృష్ణ వ్రాసిన నలభై పైచిలుకు పుస్తకాలలో ఆరింటికి భారత ప్రభుత్వ పురస్కారం లభించింది. వాటిలో దాక్షిణాత్యుల నాట్యకళాచరిత్ర, ఆంధ్రులు - నాట్యకళారీతులు ప్రసిద్ధ గ్రంథాలు.

ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీకి ఛైర్మన్‌గా ఉండిన డాక్టర్ నటరాజ రామకృష్ణ యాభై ఏళ్ళ పాటు నాట్యకళను ముందుకు నడిపించాడు. ఆంధ్రనాట్యానికి ప్రత్యేకమైన సాత్వికాభినయం చేయడంలో డాక్టర్ నటరాజ రామకృష్ణ ఉద్దండుడు.

నటరాజ రామకృష్ణ ఆంధ్రనాట్యం, పేరిణి నృత్యాల పురోగతికై, లక్షా ఏభై వేల రూపాయలతో నటరాజ రామకృష్ణ ఆంధ్రనాట్యం సంస్థను నెలకొల్పాడు. దీని ద్వారా వర్ధమాన కళాకారులకు, వృద్ధ కళాకారులకు ధన సహాయం, పింఛను అందజేస్తారు. నటరాజ రామకృష్ణ లేకపోతే ఆంధ్రనాట్యం, పేరిణీ శివతాండవము ఏనాడో మరుగున పడిపోయేవి.[5] హైదరాబాదులోని తారామతి మందిరము, ప్రేమావతి మందిరాలను ఆయన బాగు చేయించాడు. తారామతి, ప్రేమావతులు గోల్కొండ నవాబు, కుతుబ్ షాహి ఆస్థాన నర్తకీమణులు.

రామకృష్ణ అనేకమంది దేవదాసి నృత్య కళాకారిణులను సంఘటితం చేసి వారి సాంప్రదాయ నృత్యరీతులను అధ్యయనం చేశాడు.

పురస్కారాలు[మార్చు]

నటరాజ రామకృష్ణ తన నాట్య ప్రతిభకు గాను అనేక పురస్కారాలు పొందాడు. అవి:

 1. నటరాజ : తన 18 వ ఏట, రాజా గణపతి రావు పాండ్య నాగపూరులో ప్రదానం చేసాడు.
 2. భారత కళాప్రపూర్ణ : 1968 లో ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ వారిచే.
 3. భారతకళా సవ్యసాచి : 1979 లో పశ్చిమ గోదావరి జిల్లా కళాకారుల సంఘం చే.
 4. కళాప్రపూర్ణ : 1981 లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి.
 5. కళాసరస్వతి : 1982 లో హైదరాబాదు లోని కళావేదిక ద్వారా.
 6. దక్షిణ భారతపు ఉత్తమ నాట్యాచార్యుడు : 1984 లో కేంద్ర సంగీత నాటక అకాడమీ ద్వారా.
 7. ఉత్తమ పరిశోధకుడు : 1986 లో ఎల్.వి.ఆర్. ట్రస్ట్, మద్రాసు నుండి - పేరిణీ శివతాండవంపై పరిశోధనకు.
 8. ఆస్థాన నాట్యాచార్యుడు : 1980 శ్రీశైలం దేవస్థానం, ఆంధ్రప్రదేశ్.
 9. ఆస్థాన నాట్యాచార్యుడు : 1980 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.
 10. అరుదైన పురస్కారం : 1985 లో ఆంధ్రప్రదేశ్ కళాప్రేమికులు ఆయనకు స్వర్ణకిరీటాన్ని బహూకరించారు.
 11. శ్రీ రాజా లక్ష్మీ పురస్కారం : 1991 లో.
 12. రాజీవ్‌గాంధీ ఫౌండేషన్ అవార్డ్ : 1995 లో
 13. పద్మశ్రీ : భారత ప్రభుత్వం చే.
 14. 1998లో తెలుగు విశ్వవిద్యాలయం నుండి నృత్యంలో విశిష్ట పురస్కారం
 15. కళాసాగర్ అవార్డు : 1999 లో.

రచనలు[మార్చు]

నటరాజ రామకృష్ణ రచించిన పుస్తకాలు

 1. ఆంధ్ర నాట్యం, జానపద కళానృత్యం, 1987 లో ప్రచురితం
 2. అర్ధ శతాబ్ది-ఆంధ్రనాట్యం - ఆత్మకథ
 3. ఆంధ్రనాట్యం పరిశోధనా గ్రంథం
 4. దాక్షిణాత్యుల నాట్యకళా చరిత్ర
 5. ఆంధ్రులు - నాట్యకళారీతులు

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 "కూచిపూడి లెజెండ్ నటరాజ రామకృష్ణ పాసెస్ ఎవే". ది హిందూ. 7 June 2007. Archived from the original on 7 Mar 2011. CS1 maint: discouraged parameter (link)
 2. నటరాజ, రామకృష్ణ (1995). అర్ధ శతాబ్ది-ఆంధ్రనాట్యం. హైదరాబాదు. p. 36.
 3. నటరాజ, రామకృష్ణ (1995). అర్ధ శతాబ్ది-ఆంధ్రనాట్యం. ప్రథమార్ధం. హైదరాబాదు. pp. 31, 51.
 4. శరవణన్, వి. హరి (2014). గాడ్స్, హీరోస్ అండ్ దెయిర్ స్టోరీ టెల్లర్స్:ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ సౌత్ ఇండియా. చెన్నై: నోషన్ ప్రెస్. ISBN 978-93-84391-49-2.
 5. మిక్కిలినేని, రాధాకృష్ణ మూర్తి (1992). "Wikisource link to పేరెన్నికగన్న పేరిణి తాండవ నృత్యం". Wikisource link to తెలుగువారి జానపద కళారూపాలు. తెలుగు విశ్వవిద్యాలయం. వికీసోర్స్.