రామప్ప దేవాలయం

వికీపీడియా నుండి
(రామప్ప దేవాలయము నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
రామప్ప దేవాలయం
చారిత్రక ప్రసిద్ధి గాంచిన రామప్ప దేవాలయం
చారిత్రక ప్రసిద్ధి గాంచిన రామప్ప దేవాలయం
ప్రదేశం
దేశం:భారత దేశం
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:ములుగు
ప్రదేశం:పాలంపేట
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:శివుడు
ఉత్సవ దైవం:రామలింగేశ్వరుడు
నిర్మాణ శైలి, సంస్కృతి
వాస్తు శిల్ప శైలి :కాకతీయుల కాలం నాటిది
ఇతిహాసం
నిర్మాణ తేదీ:1213

రామప్ప దేవాలయం ఓరుగల్లును పరిపాలించిన కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక దేవాలయం. ఇది తెలంగాణ రాష్ట్ర రాజధానియైన హైదరాబాదు నగరానికి 220 కి.మీ.దూరంలో, కాకతీయ వంశీకుల రాజధానియైన వరంగల్లు పట్టణానికి సుమారు 70 కి.మీ.దూరంలో ములుగు జిల్లా, వెంకటాపూర్ మండలంలోని పలంపేట అనే గ్రామం దగ్గర ఉంది. దీనినే రామలింగేశ్వర దేవాలయం అని కూడా వ్యవహరిస్తారు. దేవుడి పేరు మీదుగా కాకుండా ప్రధాన శిల్పి పేరు మీదుగా ఆలయం ఉండటం దీని ప్రత్యేకత. ఇది చాలా ప్రాముఖ్యత గల దేవాలయం. ఈ దేవాలయం విశ్వబ్రాహ్మణ శిల్పుల పనితనానికి మచ్చుతునకగా చెప్పవచ్చు. ఈ దేవాలయం పక్కనే రామప్ప సరస్సు ఉంది. ఆ చెరువు కాకతీయుల కాలం నాటిది. ఇది ఇప్పటికి వేల ఎకరాల పంటకు ఆధారంగా ఉంది. పలంపేట చారిత్రక ప్రాధాన్యత గల గ్రామం. ఇది కాకతీయుల పరిపాలనలో 13-14 శతాబ్ధాల మధ్య వెలుగొందింది.[1] కాకతీయ రాజు గణపతి దేవుడు ఈ దేవాలయంలో వేయించిన శిలాశాసనం ప్రకారం ఈ దేవాలయాన్ని రేచర్ల రుద్రయ్య నిర్మించాడు.[2]

నిర్మాణం

[మార్చు]

ఈ దేవాలయాన్ని క్రీస్తు శకం 1213లో గణపతి దేవుని కాలానికి చెందిన రేచర్ల రుద్రుడు నిర్మించాడు. మధ్యయుగానికి చెందిన ఈ శివాలయం ఆలయంలో ఉన్న దైవంపేరు మీదుగా కాక దీనిని చెక్కిన ప్రధాన శిల్పి రామప్ప పేరు మీదుగా ఉండటం ఇక్కడి విశేషం. ఈ పేరుకు శివుని పేరు కూడా కలిపి రామలింగేశ్వర ఆలయం అని కూడా వ్యవహరిస్తారు. ఈ దేవాలయంలో ప్రధాన దైవము రామలింగేశ్వరుడు. ఇది విష్ణువు దశావతారాలలో ఒకరైన రాముడు కొలిచిన లింగమైన రామలింగేశ్వరుడు ప్రధాన దైవముగా ఉన్న దేవాలయము.

ఈ ఆలయం కాకతీయుల ప్రత్యేక శైలి యైన ఎత్తైన పీఠంపై నక్షత్ర ఆకారాన్ని పోలి ఉంటుంది. ఈ ఆలయము తూర్పు దిశాభిముఖముగా ఎత్తైన వేదికపై గర్భాలయం, అంతర్భాగమున మూడు వైపుల ప్రవేశ ద్వారము గల మహామండపం కలిగి ఉంది. గర్భాలయంలో ఎత్తైన పీఠముపై నల్లని నునుపు రాతితో చెక్కబడిన పెద్ద శివలింగము ఉంది. గర్భగుడికి ఎదురుగా ఉన్న మహామండపము మధ్య భాగమున కల కుడ్య స్తంభములు, వాటిపై గల రాతి దూలములు రామాయణ, పురాణ, ఇతిహాస గాథలతో కూడిన నిండైన అతి రమణీయమైన శిల్పములు కలిగి ఉన్నాయి. మండపం పైకప్పు మీద శిల్ప కళాసౌందర్యము చూడతగినది. ఈ మహా మండపము వెలుపలి అంచున పై కప్పు క్రింది భాగమున నల్లని నునుపు రాతి పలకములపై వివిధ భంగిమలతో సర్వాంగ సుందరముగా చెక్కబడిన మదనిక, నాగిని శిల్పములు కాకతీయుల శిల్పకళాభిరుచులకు చక్కటి తార్కాణాలు. ఈ దేవాలయ ప్రాంగణలో ఇతర కట్టడములలో నంది మండపము, కామేశ్వర, కాటేశ్వర మొదలగు ఆలయములు చూడదగినవి. దేవాలయము శిల్ప సంపద కాకతీయ రాజుల నాటి శిల్ప శైలి తెలుపుతున్నది. దేవాలయం అత్యంత తేలికైన ఇటుకలతో నిర్మితమైనది. ఈ ఇటుకలు నీటి మీద తేలే అంత తేలికైనవి. ఇక్కడ ఆలయానికి ఎదురుగా ఉన్న నందికి ఒక ప్రత్యేకత ఉంది. ఒక కాలు కొంచెం పైకి ఎత్తి పట్టుకొని, చెవులు రిక్కించి యజమాని ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడా అన్నట్లుంటుంది. ముందు నుంచి ఏ దిశనుంచి చూసినా నంది మన వైపే చూస్తున్నట్లుంటుంది. లోపల రెండు శివుని సన్నిధులు ఉన్నాయి. శివుడి వైపు చూస్తున్న నంది చెక్కబడి ఇప్పటికి చెక్కుచెదరకుండా ఉంది.

రామప్ప దేవాలయం ముఖ ద్వారము
ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉన్న మండపంలోని నంది

ప్రపంచ వారసత్వ హోదా

[మార్చు]

కేంద్ర ప్రభుత్వం 2020 సంవత్సరానికి భారతదేశం నుండి రామప్ప దేవాలయాన్ని వారసత్వ కట్టడంగా గుర్తించడం కోసం ప్రతిపాదనలు పంపింది. ఎనిమిది శతాబ్దాల నాటి ప్రాచీన కట్టడమైన రామప్పకు వారసత్వ హోదా గుర్తింపునకు ముఖ్యంగా మూడు అంశాలను ఆధారంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం యునెస్కోకు నామినేట్ చేసింది. అవి ఇసుకపై ఆలయాన్ని నిర్మించడం, నీటిపై తేలియాడే ఇటుకలతో గోపుర నిర్మాణం, నిర్మాణంలో వాడిన రాళ్ళు నేటికీ రంగును కోల్పోకపోవడం. ప్రపంచవ్యాప్తంగా 255 కట్టడాలు యునెస్కో వారసత్వ హోదా గుర్తింపు కోసం పోటీ పడ్డాయి. జులై 25, 2021 న రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదా దక్కింది. చైనాలోని పూజౌలో నిర్వహించిన యునెస్కో హెరిటేజ్ కమిటీ సమావేశాలలో ప్రపంచ వ్యాప్తంగా 21 దేశాల ప్రతినిధులు ఓటింగ్ ప్రక్రియలో పాలుపంచుకొన్నారు. 17 దేశాల వారు రామప్ప దేవాలయానికి అనుకూలంగా వేసి వారసత్వ హోదా ఇచ్చే విషయంపై నిర్ణయం తీసుకున్నారు.[3][4] ప్రతిష్టాత్మక గుర్తింపునిచ్చిన యునెస్కో సంస్థ ఆలయ పరిరక్షణకు అధిక ప్రధాన్య మిస్తూ మనదేశ ప్రభుత్వానికి ఎనిమిది అంశాలపై కొన్ని సూచనలు చేసింది.

దేవాలయం చుట్టూ 500 మీటర్ల విస్తీర్ణాన్ని బఫర్‌జోన్‌గా గుర్తించి, ఆ ప్రాంతంలో భవనాల నిర్మాణాలపై కఠినమైన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఉన్నత స్థాయి అనుమతులు లేకుండా ఎటువంటి నిర్మాణాలు చేయకూడదు. 100 మీటర్ల వరకు ఇప్పుడున్న నిర్మాణాలు తప్ప కొత్తవాటిని నిర్మించకూడదు. 300 మీటర్ల వరకు కేంద్ర పురావస్తు శాఖ ఎన్‌వోసీ తీసుకోవాలి. 500 మీటర్ల వరకు జిల్లా కలెక్టర్‌ అనుమతి తప్పనిసరి చేశారు. భూమట్టం నుంచి 10 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తుకు నిర్మాణాలు చేయకూడదు.

ఆలయ ప్రత్యేకతలు

[మార్చు]

ఈ దేవాలయం ఎన్నో యుద్ధాలకు, దాడులకు, ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకొని నిలబడింది. దేవాలయ ప్రాంగణంలో చిన్న కట్టడాలను నిర్లక్ష్యంగా వదలి వేయడం వలన అవి కొన్ని ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నాయి. కొంత మంది ఇక్కడున్న నీళ్ళపై తేలే ఇటుకలను తీసుకొని వెళ్ళిపోవడం ప్రారంభించారు.[5] అప్పటినుంచి భారతీయ పురాతత్వ పర్యవేక్షక శాఖ దీన్ని ఇపుడు తమ ఆధీనంలోకి తీసుకొని పరిరక్షిస్తుంది. ప్రధాన ద్వారం దగ్గర ప్రాకారం కూడా శిథిలమై ఉంది. కాబట్టి ఇప్పుడు పడమర వైపు ఉన్న చిన్న ద్వారం ద్వారానే ప్రవేశం ఉంది.[6] మహాశివరాత్రి ఉత్సవాలు మూడు రోజులపాటు జరుపుతారు.


పునర్నిర్మాణం

[మార్చు]
కామేశ్వర ఆలయం

రామప్ప ఆలయ పరిసరాల్లో శిథిలావస్థలో ఉన్న కామేశ్వరాలయాన్ని పురావస్తు శాఖ అధికారులు పదేళ్లక్రితం తొలగించి రాతిశిల్పాలను పక్కకు పెట్టారు. కాకతీయులు వాడిన సాండ్‌బాక్స్‌ టెక్నాలజీని ఉపయోగించి పునర్నిర్మాణం చేపడుతున్నారు. 25 కిలోమీటర్ల పరిధిలో రోడ్ల అభివృద్ధి, పురాతన కట్టడాల పునరుద్ధరణ, సౌకర్యాలను మెరగుపర్చడం తదితర చర్యలు చేపడుతున్నారు. ప్రాకార పనులను కూడా చేపట్టారు. గతంలో భారీ వర్షాలకు తూర్పు ముఖద్వారం కూలిపోగా ఇప్పటికే శిథిలావస్థకు చేరిన మొత్తం గోడను తొలగించి పటిష్టంగా నిర్మించే పనులను మొదలు పెట్టారు.[7]

చిత్ర మాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "పాలంపేటలో ఉన్న శివాలయాలు". Archived from the original on 2006-10-18. Retrieved 2007-08-22.
  2. Namasthe Telangana (25 July 2021). "ఇసుక పునాదిపై వెలిసిన అద్భుతం రామప్ప దేవాలయం". Archived from the original on 23 July 2021. Retrieved 26 July 2021.
  3. Namasthe Telangana (25 July 2021). "రామప్ప ఇక ప్రపంచ సంపద". Archived from the original on 26 July 2021. Retrieved 26 July 2021.
  4. Sakshi (25 July 2021). "రామప్పకు విశ్వఖ్యాతి". Archived from the original on 26 July 2021. Retrieved 26 July 2021.
  5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-05-22. Retrieved 2007-08-22.
  6. "Warangal Temples, Andra Pradesh". Archived from the original on 2006-08-18. Retrieved 2006-09-11.
  7. ABN (2022-11-30). "వారసత్వ సంపదకు మహర్దశ". Andhrajyothy Telugu News. Archived from the original on 2022-11-30. Retrieved 2022-11-30.

బయటి లింకులు

[మార్చు]