తమ్మిలేరు రిజర్వాయర్ ప్రాజెక్టు
తమ్మిలేరు రిజర్వాయర్ ప్రాజెక్టు అనేది తమ్మిలేరు నదిపై పశ్చిమ గోదావరి జిల్లాలోని ఎర్రంపల్లి గ్రామ సమీపంలో నిర్మించిన ఒక మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు. కృష్ణా (చాట్రాయి మండలం) , పశ్చిమ గోదావరి జిల్లా (చింతలపూడి, లింగపాలెం మండలం) లలోని కొన్ని మెట్ట ప్రాంతాలకు ప్రధానంగా సాగునీటి వసతి కల్పించేందుకు ఈ ప్రాజెక్టు ఉద్దేశించబడింది. 1980 లో నిర్మాణం పూర్తయిన ఈ ప్రాజెక్టులో భాగంగా తమ్మిలేరు నదిపై ఒక రిజర్వాయరు, రెండు ప్రధాన కాలువలను నిర్మించారు. ఈ ప్రాజెక్టు ఆయకట్టు 9,169 ఎకరాలు (3,711 హెక్టార్లు). ముఖ్యంగా చాట్రాయి, చింతలపూడి, లింగపాలెం మండలాల లోని మెట్ట ప్రాంతాల రైతులకు ఖరీఫ్, రబీ కాలాలలో ఈ తమ్మిలేరు రిజర్వాయర్ ప్రధాన సాగునీటి వనరుగా వుంది.
తమ్మిలేరు నది
[మార్చు]తమ్మిలేరు నది ఖమ్మం జిల్లాలోని బేతుపల్లి చెరువు వద్ద పుట్టి ఖమ్మం, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలలో సుమారు 100 కి. మీ. దూరం పైగా ప్రవహించి చివరకు కొల్లేరు సరస్సులో కలుస్తుంది.[1] మిత్రా కమిటీ సిఫారసు అనుసరించి ఈ నదిపై పశ్చిమ గోదావరి జిల్లాలోని చింతలపూడి గ్రామానికి 9 కి.మీ. దూరంలో ఎర్రంపల్లి గ్రామ సమీపంలో 9.82 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్రాజెక్టును నిర్మించారు. 1969 లో ప్రారంభించిన ప్రాజెక్టు నిర్మాణం 1980 లో పూర్తయ్యింది.
ప్రాజెక్టు స్వరూపం
[మార్చు]తమ్మిలేరు రిజర్వాయరు నీటి నిలువ సామర్ధ్యం 3 టి.ఎం.సి. లు. రిజర్వాయరు విస్తీర్ణం సుమారు 2,000 ఎకరాలు పైబడి వుంది. కుడి కాలువ పొడవు 6.5 కి.మీ. ఎడమ కాలువ పొడవు 10.85 కి.మీ. ఈ ప్రాజెక్టు లో భాగంగా ప్రధాన కుడి కాలువ క్రింద 3,830 ఎకరాలు, ప్రధాన ఎడమ కాలువ క్రింద 4,244 ఎకరాలు, మంకొల్లు కాలువ క్రింద 1,095 ఎకరాలు చొప్పున మొత్తం 9,169 ఎకరాలు (3,711 హెక్టార్లు) సాగు అవుతున్నాయి.
ప్రాజెక్టు సమస్యలు
[మార్చు]- రిజర్వాయరు లో ప్రవేశించే జలాల లభ్యత క్రమేణా తగ్గిపోతుండడం అనేది ఈ ప్రాజెక్ట్ కు తీవ్ర సమస్యగా వుంది. ఖమ్మం జిల్లాలో బేతుపల్లి చెరువుకు ఎగువున వున్న అటవీ ప్రాంతాలలో కురిసే భారీ వర్షాలు వరద నీరుగా బేతుపల్లి చెరువులోకి చేరతాయి. ఆ చెరువు నుండి ఈ వరద నీరు తమ్మిలేరు నదిగా ప్రవహించి రిజర్వాయర్ లో చేరుకొని ప్రాజెక్టుకు సాగునీటి లభ్యతను పెంచుతుంది. అయితే ప్రాజెక్టుకు ప్రధానంగా సాగునీరు అందించే ఈ బేతుపల్లి చెరువుకు, త్రాగునీటి ప్రాజెక్టులలో భాగంగా ఆనకట్టలు కట్టేస్తుండడంతో వరద నీరు క్రిందకు ప్రవహించే సామర్ధ్యం తగ్గిపోతున్నది. దానితో రిజర్వాయర్ లోపలికి ప్రవహించే తమ్మిలేరు నదీ జలాల లభ్యత ఏటా క్రమంగా తగ్గిపోతుంది.
- ప్రాజెక్టు అభివృద్ధికి నిధుల కొరత సమస్య ఎదురవుతున్నది. ప్రాజెక్టు నిర్మించి 40 ఏళ్ళు పూర్తి కావస్తున్నా ఇప్పటికీ పూర్తిస్థాయి మరమ్మత్తులకు కూడా ఈ ప్రాజెక్టు నోచుకోలేదు. లాకుల మరమ్మత్తులు, బలహీనమైన రిజర్వాయరు గట్లను దృఢ పరచడానికి, ప్రధాన కాలువల మరమ్మత్తులకు నిధుల కొరత తీవ్రంగా వుంది.
మూలాలు
[మార్చు]- ↑ Hydrology Project (January 2003). Operation Manual – Data Processing and Analysis (SW) (PDF). DHV CONSULTANTS & DELFT HYDRAULICS with HALCROW, TAHAL, CES, ORG & JPS. p. 164. Retrieved 29 June 2019.