తమ్మిలేరు(వాగు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఏలూరు వద్ద తమ్మిలేరు

ఖమ్మం జిల్లా బేతుపల్లి చెరువు ఈ తమ్మిలేరు పుట్టుక స్థలం. ఈ చెరువు అలుగు నుంచి అదనంగా బయటకు వచ్చిన నీరు ప్రవహించేదే తమ్మిలేరు. అక్కడి నుంచి 50 కిలోమీటర్లు దూరం పయనించాక మండలంలోని శివపురం వద్ద పశ్చిమగోదావరి జిల్లాను తాకుతుంది. ఇక్కడి నుంచి 30 కిలోమీటర్లు దూరం తమ్మిలేరు జలాశయంలోకి వచ్చి ఇక్కడ నుంచి ఏలూరు వరకు 50 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఏలూరు వద్ద రెండుగా చీలి ఒక భాగం 20 కిలోమీటర్లు, మరో భాగం 25 కిలోమీటర్లు వెళ్లి కొల్లేరులో కలిసిపోతుంది. ఖమ్మం జిల్లాకు తమ్మిలేరు నీటి వినియోగపు వనరులు పెరగటం మూలంగా కొన్ని సంవత్సరాలు నుంచి నీరు రావటం తగ్గిపోయింది. ఎన్టీఆర్‌ కాలువ, సిద్ధారం కాలువల పేరుతో అటు వైపు సాగు పెంచారు. దమ్మపేట, సత్తుపల్లి మండలాలకు బేతుపల్లి చెరువు నీటిని మళ్లించుకుంటున్నారు. నీరు అదనంగా ఉన్నప్పుడు దానంతట అదే కిందకు వెళ్లేలా చెరువు అలుగుపై షట్టరును అమర్చాలని కోర్టు ఉత్తర్వు. చింతలపూడి మండలానికి సాగు నీరందించేది ఆంధ్రాకాలువ. 2003లో ఈ తమ్మిలేరు నీటికోసం రెండు నెలల పాటు రెండు జిల్లాల రైతుల మధ్య ఘర్షణ జరిగింది. ఖమ్మం జిల్లా రైతులు నీరు కిందకు రాకుండా చెరువు అలుగుపై ఇసుక బస్తాలు వేశారు. 2006 వచ్చిన వరదల సమయంలో తప్ప తదుపరి పైనుంచి నీరు రాలేదు. ఇప్పటికి తమ్మిలేరు కింద రెండు జిల్లాల్లోనూ 33 వేల ఎకరాలు సాగులో ఉంది. తుమ్మూరు ఆనకట్ట, తమ్మిలేరు జలాశయం, విజయరాయి ఆనకట్ట వంటి శాశ్వత కట్టడాలు ఉన్నాయి. దీంతో పాటు రెండు జిల్లాల్లో ఈ ఏరు పరీవాహక ప్రాంతంలో ఇరువైపులా 10 నుంచి 15 కిలోమీటర్లు పరిధిలో భూగర్భ జలాలు స్థిరంగా ఉంటున్నాయి.