Jump to content

తృణకంకణము

వికీపీడియా నుండి

తృణకంకణము రాయప్రోలు సుబ్బారావు రచించిన సుప్రసిద్ధమైన ఖండకావ్యం. 20వ శతాబ్దపు తెలుగు కవిత్వంపై గొప్ప ప్రభావాన్ని ప్రసరించిన భావకవిత్వ యుగంలో మొదటి రచనగా చారిత్రిక ప్రాధాన్యత కలిగివుంది. 1913లో విడుదలైన ఈ రచన ప్రబంధ బంధురమైన తెలుగు సాహిత్యాన్ని ఇతివృత్తం, శైలి, శిల్పం పరంగా గొప్ప మార్పు సూచిస్తూ నూతన యుగానికి నాంది పలికింది.

రచన నేపథ్యం

[మార్చు]

రాయప్రోలు సుబ్బారావు రచించిన తృణకంకణము అనే ఖండకావ్యం 1913లో తొలిముద్రణ పొందింది.

ఇతివృత్తం

[మార్చు]

ఈయన అమలిన శృంగార తత్వాన్ని ఆవిష్కరించాడు. ప్రేమ పెళ్లికి దారితీయని యువతీయువకులు స్నేహితులుగా మిగిలిపోవడానికి నిర్ణయించుకున్న ఇతివృత్తముతో దీనిని రచించారు. ఇటువంటి కథాంశం, ఆ కథాంశం క్లుప్తత వంటివి ఒక వినూత్నమైన, ఆనాటి ప్రబంధ యుగంలో కొత్తది.

ప్రభావం

[మార్చు]

తృణకంకణము అనే ఈ రచనతో తెలుగు సాహిత్యం భావ కవిత్వయుగానికి ప్రవేశించనట్టైంది. అప్పటివరకూ తెలుగు కవిత్వంలో ప్రాచుర్యంలో ఉన్న ప్రబంధాలకు భిన్నంగా, వుండీ లేదనిపించేంత చిన్న ఇతివృత్తంతో, సందేశాత్మకమైన ఖండకావ్యాల రచనకు ఆయన దీనితో ఒరవడిపెట్టారు. ప్రబంధాలలో ఉండే నాయికల అంగాంగవర్ణన, చంద్రోపాలంభం, మదనోపాలంభం, రతివర్ణన మొదలైన సంప్రదాయాలను మార్చి, అమలిన శృంగార భావనకు తెలుగు కవిత్వంలో ప్రాధాన్యత కల్పించి భావకవిత్వమనే పేరుతో దానికి ప్రచారం పొందిన పద్ధతికి మార్గదర్శకుడైనది కూడా రాయప్రోలు సుబ్బారావే.

ఇతరుల మాటలు

[మార్చు]
  • It is a short lyric, modelled on English lines. Its sentiments are chaste and poetry of a high order though not perhaps as flowing as that of Mr. Subbarao's other poems. This little poem purports to mark the beginning of a new school of Telugu poetry, which should be welcomed by all lovers of Telugu. (ఇది (తృణకంకణము) ఆంగ్ల రచనల శైలిలో రచించిన ఒక చిన్న కావ్యం. దీని భావాలు పవిత్రమూ, అత్యున్నతమైన కవిత్వంతో అయితే బహుశా సుబ్బారావు గారి ఇతర పద్యాలంత ప్రవహించే గుణాన్ని కలిగిలేవు. ఈ చిరు పద్యం తెలుగు కవిత్వంలో తెలుగు భాషా ప్రేమికులందరూ ఆహ్వానించాల్సిన ఒక కొత్త మార్గం యొక్క ఆరంభానికి సూచికగా నిలుస్తుంది. --జయంతి రామయ్య పంతులు, 3-10-1913.[1]
  • ఆధునిక కవిత్వమునకు తృణకంకణము ఆది గ్రంథమని అస్మదాదుల ఆశయము. --తల్లావఝుల శివశంకరస్వామి (తృణకంకణము రజతోత్సవం సందర్భంగా).[2]
  • అడుగులు బొబ్బలెత్త, వదనాంచలమందున చింకు చెమ్మటల్ మడుగులు గట్ట… అని ఇరవై ఏళ్ళ ఒక యువకవి ఒక ఖండ కావ్యం ప్రారంభించాడు. అది అభినవాంధ్ర కవిత్వానికి ఆద్య పద్యమైంది. అది 1912-13 నాటి మాట. ఆ ఖండకావ్యం పేరు “తృణకంకణము”. అది రచించిన ఆనాటి ఆ యువకుని పేరు: నవ్యాంధ్ర కవితా పితామహుడుగా ప్రసిద్ధుడైన రాయప్రోలు సుబ్బారావు. --నండూరి రామమోహనరావు.[2]

మూలాలు

[మార్చు]
  1. రామయ్య పంతులు, జయంతి. "తృణకంకణము". andhrabharati.com/. Retrieved 25 October 2014.
  2. 2.0 2.1 రామమోహనరావు, నండూరి. "నవ్యకవితా పితామహుడు". andhrabharati.com/. Retrieved 25 October 2014.