తెన్మల
తెన్మల | |
---|---|
గ్రామం | |
Coordinates: 8°57′0″N 77°4′0″E / 8.95000°N 77.06667°E | |
దేశం | భారతదేశం ( India) |
రాష్ట్రం | కేరళ |
జిల్లా | కొల్లాం జిల్లా |
భాషలు | |
• అధికారిక భాషలు | మలయాళం, ఇంగ్లీష్ |
Time zone | UTC+5:30 (IST) |
Vehicle registration | KL-25 |
దగ్గరి ప్రదేశం | కొల్లాం (63 కి.మీ) |
తెన్మల భారతదేశం, కేరళ రాష్ట్రం, కొల్లాం జిల్లాలో ఉన్న గ్రామం. ఇది భారతదేశంలోని మొట్టమొదటి పర్యావరణ-పర్యాటక కేంద్రానికి (ఎకో-టూరిజం ప్రాజెక్ట్) నిలయం.[1] తెన్మల అనే పదానికి మలయాళ భాషలో "తేనె కొండ" అని అర్థం. ఇది నాణ్యమైన తేనె ఎగుమతికి ప్రసిద్ధి చెందింది. ఈ పట్టణం కొల్లాం నగరానికి 66 కి.మీ దూరంలో, రాష్ట్ర రాజధాని త్రివేండ్రం నుండి 69 కి.మీ దూరంలో ఉంది, తమిళనాడు రాష్ట్ర సరిహద్దు నుండి కేవలం 14 కి.మీ దూరంలో ఉంది.[2] అంతర్ రాష్ట్ర జాతీయ రహదారి-744, కొల్లాంను తమిళనాడులోని మధురైతో కలుపుతుంది, రాష్ట్ర రహదారి-2 కేరళ రాష్ట్రంలోని తెన్మల గుండా పోతుంది. కేరళలోని అతిపెద్ద నీటిపారుదల ప్రాజెక్ట్ అయిన కల్లాడ ప్రాజెక్ట్, చెంత్రుణి (శెంత్రుని) వన్యప్రాణుల అభయారణ్యం ఇక్కడ ఉన్నాయి.
వ్యుత్పత్తి శాస్త్రం
[మార్చు]తెన్మల అనే పదానికి మలయాళ భాషలో "థేన్" అంటే తేనె, "మల" అంటే పర్వతం అని అర్థం. తెన్మలలో పలు మలయాళం, తమిళ సినిమాల చిత్రీకరణ జరిగింది.[3][4]
చరిత్ర
[మార్చు]తెన్మలలో మట్టితో కప్పబడిన రాతియుగం సంస్కృతికి సంబంధించిన అనేక చారిత్రక అవశేషాలు కనుగొనబడ్డాయి. కల్లాడ నీటిపారుదల పథక కుడి కాలువ ప్రాంతం నుండి స్వాధీనం చేసుకున్న పురాతన గృహోపకరణాలు ప్రత్యేక చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ఈ గ్రామంలో పాండ్య రాజుల కాలంలో నిర్మించబడిన మాంబజ్తర ఆలయం ఉంది. ఇది తెన్మలలోని పురాతన ఆలయం.
పర్యాటకం
[మార్చు]తెన్మలలో బోటింగ్, రోప్ బ్రిడ్జ్, పర్వతారోహణ, మ్యూజికల్ ఫౌంటెన్, కులతుపుజ శాస్తా ఆలయం, అంచల్ పినాకిల్ వ్యూ పాయింట్, కుడుక్కతు పారా, పునలూర్ సస్పెన్షన్ బ్రిడ్జి వంటివి ఉన్నాయి.[5] పాలరువి అనే జలపాతం సమీపంలోని ప్రధాన ఆకర్షణ. అంతేకాకుండా జింక పునరావాస కేంద్రం కూడా ఉంది.[6] తెన్మలకు త్రివేండ్రం, పునలూర్ నుండి రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు. దీనికి సమీప రైల్వే స్టేషన్ పునలూర్ రైల్వే స్టేషన్. పాలరువి జలపాతం నుండి 16 కి.మీ దూరంలో ఉంది.
వ్యవసాయం
[మార్చు]ప్రధానంగా ఎర్రమట్టి, బంకమట్టి నేలలు తెన్మలలో సమృద్ధిగా ఉన్నాయి. తెన్మలలో టాపియోకా, వరి, చెరకు, చిక్కుడు, జీడి, కొబ్బరి, మిరియాలు, కముక్, అరటి, రబ్బరు సాగు చేస్తారు. ఈ గ్రామంలో అటవీశాఖ ఆధ్వర్యంలో టేకు, యూకలిప్టస్ తోటలు కూడా ఉన్నాయి. ఇక్కడ వ్యవసాయం తర్వాత పశువుల పెంపకం, వ్యాపారం స్థానికులకు జీవనాధారం. తెన్మలలో రిండర్‌పెస్ట్ చెక్ పోస్ట్, అనేక పాల ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి.
విద్య
[మార్చు]తెన్మల విద్య, పరిశ్రమల పరంగా వెనుకబడిన ప్రాంతం. ప్రస్తుతం ఇక్కడ రెండు ఉన్నత పాఠశాలలతో సహా 11 పాఠశాలలు ఉన్నాయి.
వన్యప్రాణుల అభయారణ్యం
[మార్చు]తెన్మల వన్యప్రాణుల డివిజన్ పరిధిలోని కులతుపుజా రిజర్వ్ ఫారెస్ట్ 25 ఆగస్టు 1984న చెంత్రుణి వన్యప్రాణుల అభయారణ్యంగా ప్రకటించబడింది. 100 చ.కి.మీ. విశాలమైన వన్యప్రాణుల అభయారణ్య ప్రధాన కార్యాలయం తెన్మలలో ఉంది.
ఈ వన్యప్రాణుల అభయారణ్యంలో ఉష్ణమండల సతతహరిత, పాక్షిక-సతతహరిత, ఆకురాల్చే, పర్వత ప్రాంతాలలో అడవులు ఉన్నాయి. ఈ అడవుల్లో సహజసిద్ధంగా టేకు పెరగకపోవడం విశేషం. ఎర్ర మల్బరీ ఈ ప్రాంతంలో మాత్రమే కనిపిస్తుంది. ఇక్కడ కనిపించే చెంకురుంజి చెట్టు ఆధారంగా వన్యప్రాణుల సంరక్షణ కేంద్రానికి చెంత్రుణి అని పేరు పెట్టారు.[7] ఈ అభయారణ్యంలో పర్వత హార్న్‌బిల్, అడవి కోతి, సింహం తోక గల కోతి, నల్ల కోతి, ఉడుత, పర్వత ఉడుత, అడవి దున్న, జింక, అడవి పంది, ఏనుగులు[8] వంటి జంతువులు అనేక పక్షి జాతులు కూడా ఇక్కడ ఉన్నాయి.
మూలాలు
[మార్చు]- ↑ "Thenmala, India's First Planned Eco-Tourism Destination Is Full of Scenic Surprises". The Better India. 23 July 2016. Retrieved 13 March 2020.
- ↑ "Thenmala: A green getaway at foothills of Western Ghats". On Manorama. 12 October 2019. Retrieved 13 March 2020.
- ↑ "Touring in Thenmala".
- ↑ "Photos of Thenmala".
- ↑ "5 BEST Places to Visit in Thenmala - UPDATED 2023 (with Photos & Reviews)". Tripadvisor. Retrieved 2023-07-18.
- ↑ "Thenmala Ecotourism - Home". www.thenmalaecotourism.com. Retrieved 2023-07-18.
- ↑ Abdul (2022-07-05). "Chenkurinji Tree: Saving Chenkurinji from climate change". ForumIAS Blog. Retrieved 2023-07-18.
- ↑ "Shendurney wildlife sanctuary - Kerala Travels". www.keralatravels.com. Retrieved 2023-07-18.