తెలుగు అక్షరాలు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
తెలుగు వర్ణమాల
అచ్చులు
ఉభయాక్షరమలు
హల్లులు
క్ష
చిహ్నములు
తెలుగు భాషకు అక్షరములు యాభై ఆరు. వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షరములుగా విభజిస్తారు. ఇరవై ఒకటవ శతాబ్దంలో బాగా వాడుకలో ఉన్నాయి.16 అచ్చులు, 38 హల్లులు, నకార పొల్లు, నిండు సున్న, వెరసి 56 అక్షరములు. అరసున్న, విసర్గ వాడకం చాలవరకూ తగ్గిపోయింది. తెలుగు వర్ణ సముదాయమును మూడు విధాలుగా విభజించవచ్చును.

అచ్చులు[మార్చు]

అచ్చులు 16 అక్షరాలు. స్వతంత్రమైన ఉచ్చారణ కలిగియుండుట వలన వీటిని ప్రాణములనీ, స్వరములనీ కూడా అంటారు. అచ్చులు మూడు రకములు. అవి:

 • హ్రస్వములు - కేవలము ఒక మాత్ర అనగా రెప్పపాటు కాలములో ఉచ్ఛరింపబడు అచ్చులను హ్రస్వములు అంటారు. ఇవి ఏడు అక్షరములు: అ, ఇ, ఉ, ఋ, ఌ, ఎ, ఒ.
 • దీర్ఘములు - రెండు మాత్రల కాలములో ఉచ్ఛరింపబడు అచ్చులను దీర్ఘములు అంటారు. ఇవి ఏడు అక్షరములు: ఆ, ఈ, ఊ, ౠ, ౡ, ఏ, ఓ.
 • ప్లుతములు - ఇవి ఉచ్ఛరించడానికి మూడు మాత్రల కాలం పట్టును. ఇవి రెండు అక్షరములు: ఐ, ఔ.

హల్లులు[మార్చు]

హల్లులు 38 అక్షరములు. క నుండి హ వరకు గల అక్షరములను హల్లులు అంటారు. ఈ హల్లులు అచ్చుల సహాయము లేనిదే పలుకబడవు. ఉదాహరణ: క అనాలంటే క్ + అ కలిస్తేనే క అవుతుంది. వీటిని ప్రాణులనీ, వ్యంజనములనీ పేర్లు ఉన్నాయి.

 • సరళములు - హల్లులలో సులభముగా ఉచ్చరించబడేవి 5 అక్షరములు. ఇవి - .గ, జ, డ, ద, బ.
 • పరుషములు - హల్లులలో కఠినముగా ఉచ్చరించబడేవి 5 అక్షరములు. ఇవి - క, చ, ట, త, ప
 • స్థిరములు - పరుషములు, సరళములు కాక మిగిలిన హల్లులన్నియు స్థిరములు. ఇవి - ఖ, ఘ, ఙ, ఛ, ఝ, ఞ, ఠ, ఢ, ణ, థ, ధ, న, ఫ, భ, మ, య, ర, ఱ, ల, ళ, వ, శ, ష, స, హ, క్ష.
 • స్పర్శములు - ఇవి క నుండి మ వరకు గల అక్షరములు. ఇవి ఐదు వర్గములుగా విభజింపబడినవి.
  • క వర్గము - క, ఖ, గ, ఘ, ఙ
  • చ వర్గము - చ, ఛ, జ, ఝ, ఞ
  • ట వర్గము - ట, ఠ, డ, ఢ, ణ
  • త వర్గము - త, థ, ద, ధ, న
  • ప వర్గము - ప, ఫ, బ, భ, మ

ఉభయాక్షరములు[మార్చు]

ఉభయాక్షరములు 3 అక్షరములు. సున్న, అరసున్న, విసర్గలు.

 • సున్న - దీనిని పూర్ణబిందువు, నిండు సున్న, పూర్ణానుస్వారము అని పేర్లు ఉన్నాయి. అనుస్వారము అనగా మరియొక అక్షరముతో చేరి ఉచ్చరించబడుట. పంక్తికి మొదట, పదానికి చివర సున్నను వ్రాయుట తప్పు. అదే విధంగా సున్న తరువాత అనునాసికమును గాని, ద్విత్వాక్షరమును గాని వ్రాయరాదు. ఇవి రెండు రకములు.
  • సిద్ధానుస్వారము - శబ్దముతో సహజముగా ఉన్న అనుస్వారము. ఉదాహరణ: అంగము, రంగు.
  • సాధ్యానుస్వారము - వ్యాకరణ నియమముచే సాధించబడిన అనుస్వారము. ఉదాహరణ: పూచెను+కలువలు = పూచెంగలువలు.
 • అరసున్న - దీనిని అర్ధబిందువు, అర్ధానుస్వారము, ఖండబిందువు అని పేర్లు ఉన్నాయి. ప్రస్తుతము ఇది తెలుగు వ్యావహారిక భాషలో వాడుకలో లేదు. కానీ ఛందోబద్ధమైన కవిత్వంలో కవులు దీనిని వాడుతారు.
 • విసర్గ - ఇది సంస్కృత పదములలో వినియోగింపబడుతూ ఉంటుంది. ఉదాహరణ: అంతఃపురము, దుఃఖము.

ఉత్పత్తి స్థానములు[మార్చు]

ఉత్పత్తి స్థానములు

 • కంఠ్యములు : కంఠము నుండి పుట్టినవి - అ, ఆ, క, ఖ, గ, ఘ, జ్ఞ, హ.
 • తాలవ్యములు : దవడల నుండి పుట్టినవి - ఇ, ఈ, చ, ఛ, జ, ఝ, య, శ.
 • మూర్థన్యములు : అంగిలి పైభాగము నుండి పుట్టినవి - ఋ, ౠ, ట, ఠ, డ, ఢ, ణ, ష, ఱ, ర.
 • దంత్యములు : దంతముల నుండి పుట్టినవి - త, థ, ద, ధ, న, చ, జ, ర, ల, స.
 • ఓష్ఠ్యములు : పెదవుల|పెదవి నుండి పుట్టినవి - ఉ, ఊ, ప, ఫ, బ, భ, మ.
 • నాసిక్యములు (అనునాసికములు) : నాసిక నుండి పుట్టినవి - ఙ, ఞ, ణ, న, మ.
 • కంఠతాలవ్యములు : కంఠము, తాలువుల నుండి పుట్టినవి - ఎ, ఏ, ఐ.
 • కంఠోష్ఠ్యములు : కంఠము, పెదవుల నుండి పుట్టినవి - ఒ, ఓ, ఔ.
 • దంత్యోష్ఠ్యములు : దంతము, పెదవుల నుండి పుట్టినవి - వ.

ఆధునిక భాషలో వాడుకలో ఉన్న వర్ణమాల[మార్చు]

 • అచ్చులు (12) : అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఎ, ఏ, ఐ, ఒ, ఓ, ఔ,
 • పూర్ణ బిందువు (1) : అం (ఒక ఉదాహరణ)
 • నకారపొల్లు (1) : క్ (ఒక ఉదాహరణ)
 • హల్లులు (34) :
  • క వర్గము - క, ఖ, గ, ఘ
  • చ వర్గము - చ, ఛ, జ, ఝ
  • ట వర్గము - ట, ఠ, డ, ఢ, ణ
  • త వర్గము - త, థ, ద, ధ, న
  • ప వర్గము - ప, ఫ, బ, భ, మ
  • య, ర, ల, వ, శ, ష, స, హ, ళ, క్ష, ఱ

గుణింతాలు[మార్చు]

తెలుగులో, ఒక్కొక్క అక్షరానికి గుణింతాలు ఉన్నాయి. "క" అక్షరానికి గుణింతాలు: క, కా, కి, కీ, కు, కూ, కె, కే, కై, కొ, కో, కౌ, కం, కః

ఒత్తులు[మార్చు]

ఒక హల్లుకి ఇంకొక హల్లు చేరినప్పుడు తరువాతి హల్లు చాలా సార్లు తలకట్టులేని రూపమును లేక వేరొక రూపములో కనబడుతుంది. ఉదాహరణకు హల్లుకు అదే హల్లు చేరినప్పుడు కనబడే విధం చూడండి

 • క్క, ఖ్ఖ, గ్గ, ఘ్ఘ, ఙ్ఙ
 • చ్చ, ఛ్ఛ, జ్జ, ఝ్ఝ, ఞ్ఞ
 • ట్ట, ఠ్ఠ, డ్డ, ఢ్ఢ, ణ్ణ
 • త్త, థ్థ, ద్ద, ధ్ధ, న్న
 • ప్ప, ఫ్ఫ, బ్బ, భ్భ, మ్మ
 • య, ర్ర, ల్ల, వ్వ, శ్శ, ష్ష, స్స, హ్హ, ళ్ళ, ఱ్ఱ.

అఖండము[మార్చు]

కు వత్తు చేర్చినప్పుడు మామూలు ష వత్తు బదులు వేరే రూపం (క్ష) వస్తుంది.

దస్త్రం:ఒత్తులు
link=%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:%E0%B0%92%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4%E0%B1%81%E0%B0%B2%E0%B1%81

మూలాలు[మార్చు]

 • తెలుగు వ్యాకరణము: వర్రే సాంబశివరావు, దేవీ పబ్లికేషన్స్, విజయవాడ, 1999.
 • పరవస్తు చిన్నయసూరి, బాల వ్యాకరణము
 • చిలుకూరి పాపయ్యశాస్త్రి, ఆంధ్ర లక్షణ సారము, చిలుకూరి బ్రదర్స్, సూర్యారావు పేట, కాకినాడ, తారీఖు వెయ్యలేదు
 • రాయప్రోలు రథాంగపాణి, వ్యాకరణ పారిజాతము, జనప్రియ పబ్లికేషన్స్, గంగానమ్మ పేట, తెనాలి - 522 201
 • భద్రిరాజు కృష్ణమూర్తి, తేలిక తెలుగు వాచకం,
 • బుడ్డిగ సుబ్బరాయన్‌, సురభి పెద్ద బాలశిక్ష, ఎడ్యుకేషనల్‌ ప్రోడక్ట్స్ అఫ్ ఇండియా, 3-4-495 బర్కత్‌పురా, హైదరాబాదు - 500 027