తెల్లాకుల వెంకటేశ్వర గుప్త

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెల్లాకుల వెంకటేశ్వర గుప్త హరికథా భాగవతార్, రచయిత. అతను ఉచిత విద్య, ఉచిత భోజనం, ఉచిత ఆశ్రయం కల్పించడమే గాక పేద విద్యార్థులకు ఆయనే బట్టలు కూడా ఉచితంగా ఇచ్చి తన ఇంట్లోనే హరికథను అన్ని మతాల వారికే కాకుండా, అంధులకు కూడా నేర్పించేవాడు. హరికథా భాగవతులుగా ఖండాంతర ఖ్యాతి నార్జించిన వీరగంధం వెంకట సుబ్బారావు ఇతని శిష్యుడు. అతను హరికథా రంగంలో ‘భాగవతారిణి’ సృష్టికర్త. కేవలం పురుషులు మాత్రమే హరికథకులుగా రాణిస్తున్న సంప్రదాయానికి స్వస్తి పలుకుతూ మహిళలను సైతం హరికథా భాగవతారిణిలుగా మలిచాడు[1]. భాషపైన అత్యంత పట్టు సాధించిన పండితుడుగా అతను కన్యకాపరమేశ్వరి చరిత హరికథ, బుర్రకథ, కట్నాల కాపురం, భగవద్గీత బుర్రకథలు, సుభాష్‌చంద్రబోస్‌ హరికథ రచించాడు.[2]

జీవిత విశేషాలు[మార్చు]

అతను ప్రకాశం జిల్లా కనిగిరి తాలూకా చిలంకూరు గ్రామంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో 1912 ఫిబ్రవరి 6న జన్మించాడు. అతనికి బాల్యం నుండి సంగీత సాహిత్యాలందు ఆసక్తి ఉండేది. అతను తెనాలి లో స్థిరపడ్డాడు. అతను తెనాలి లోని సర్వకళాకేంద్రంలో సంగీత క్షీర బిరుదాంకితుడైన అంకయ్య వద్ద సంగీతం నేర్చుకున్నాడు. తరువాత ములుకుట్ల సదాశివ శాస్త్రి వద్ద హరికథాగాన ప్రదర్శన కళను అభ్యసించాడు. తన స్వీయ మెళకువలతో నెమ్మది నెమ్మదిగా ఈ కళలో ఆరితేరాడు. గొప్ప హరికథా భావవతార్ గా గుర్తింపు పొందాడు. తనకు ప్రాప్తించిన హరికథా గాన విద్యను పలువురికి పంచాలనే విశాల లక్ష్యంతో తన గృహాన్నే శిక్షణా కేంద్రంగా మార్చేశాడు. కుల, మత, వర్ణ, లింగ వివక్షకు తావు లేకుండా ఆశ్రయించిన వారందరికీ సమానంగా విద్యనందించి భాగవతార్‌లుగా తీర్చిదిద్దాడు. అతని వద్ద శిక్షణ పొందిన వారిలో పురుషుల కంటే స్త్రీలే అధికంగా వున్నారు. దేశకాల పాత్రల నెరిగి జనరంజకంగా, మంద్ర, మధ్య, తారాస్థాయిలో శ్రోతలకూ, ప్రేక్షకులకూ కథాంశం సులభంగా, స్పష్టంగా ఆకళింపు అయ్యే విధంగా హరికథా గానం చేయడం అతమొ శైలి.

హరికథా బోధనకు జీవితాన్ని అర్పణ గావించిన అతను 1978 డిసెంబర్‌ 21వ తేదీన మరణించాడు. అతనిపై గల గురుభక్తికి సూచనగా వీరగంధం వెంకట సుబ్బారావు అతని స్వస్థలం వినుకొండలో అతని శిలావిగ్రహాన్ని స్థాపించాడు. హరికథను నేర్చుకున్న ఇతర శిష్యులు గురువు పట్ల అభిమానానికి ప్రతీకగా తెనాలి మారీసుపేటలో అతను నడిపిన కేంద్ర ప్రాంగణంలో గుప్తా విగ్రహాన్ని ఆవిష్కరించారు.[2]

పురస్కారాలు[మార్చు]

అతని సేవలకు గానూ తెనాలిలో జరిగిన గొప్ప పౌరసభలో "విద్యాదానకర్ణ" బిరుదునిచ్చి అతనిని ఘనంగా సన్మానించారు. వాగ్గేయకారుడు శ్రీహరి నాగభూషణం అతనిని ‘హరికథా రత్న’ మకుంటంతో నభూతో నభవిష్యతి అన్న రీతిలో సత్కరించాడు. గుంటూరు, రేపల్లె, విజయవాడ, పెనుగొండ, అనకాపల్లి కేంద్రాలలో అతను ఘన సన్మానాలు, సత్కారాలు అందుకున్నాడు.

మూలాలు[మార్చు]

  1. "Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi". www.andhrabhoomi.net. Retrieved 2020-07-11.
  2. 2.0 2.1 m.andhrajyothy.com https://m.andhrajyothy.com/telugunews/abnarchievestorys-1027167. Retrieved 2020-07-11. Missing or empty |title= (help)