తొలిమెట్టు కార్యక్రమం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తొలిమెట్టు కార్యక్రమం
ప్రాంతంతెలంగాణ, భారతదేశం
ప్రధాన వ్యక్తులుతెలంగాణలోని పాఠశాల విద్యార్థులు
స్థాపన2022 ఆగస్టు 15
నిర్వాహకులుతెలంగాణ ప్రభుత్వ విద్యాశాఖ

తొలిమెట్టు అనేది తెలంగాణ రాష్ట్రంలో విద్యప్రమాణాల పెంపు, గుణాత్మమైన మార్పు కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం. విద్యార్థులు కనీస సామర్థ్యాలను సాధించే ఉద్ధేశంతో రూపొందించబడిన ఈ కార్యక్రమం 2022 ఆగస్టు 15న రాష్ట్రంలోని 23,179 ప్రాథమిక బడుల్లో ప్రారంభమయింది. ఈ కార్యక్రమం ద్వారా 52,708 మంది ఉపాధ్యాయులకు శిక్షణ అందిస్తుండగా, 11,24,563 విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు. ఒక్కో విద్యార్థి వారిగా ప్రగతిని టీచర్లు పరీక్షించి, వారి స్థాయిలను బట్టి ప్రత్యేకంగా బోధించి, నిర్దిష్ట కనీస సామర్థ్యాలను సాధించేలా ఈ కార్యక్రమాన్ని అమలుచేస్తున్నారు.[1]

రూపకల్పన

[మార్చు]

పాఠశాల విద్యలో ప్రాథమిక దశలోని విద్యార్థులు వారివారి తరగతులకు చెందిన సామర్థ్యాలను సాధించగలిగినప్పుడే నాణ్యమైన విద్య సాకారమవుతుంది. కరోనా తదనంతర పరిస్థితుల్లో చిన్నారుల్లో సామర్థ్యాలు దిగువస్థాయికి పడిపోగా, 75 శాతానికి పైగా చిన్నారులు చదవలేని, రాయలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ‘తొలిమెట్టు’ కార్యక్రమాన్ని రూపొందించింది. ప్రతి విద్యార్థి భాషల్లో చదవడం, రాయడం, గణితంలో కూడికలు, తీసివేతలు, గుణకారం, భాగాహారం లెక్కలు చేసేలా ప్రత్యేకంగా బాలలకు వాటిని ఉపాధ్యాయులు నేర్పిస్తారు. రెగ్యులర్ తరగతులతోపాటు ప్రత్యేకంగా అమలుచేస్తున్న ఈ కార్యక్రమాన్ని మండలస్థాయిలో ఎంఈవోలు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. కాంప్లెక్స్‌ స్థాయిలో ఉపాధ్యాయులవారీగా సమీక్ష, మండల స్థాయిలో నెలకొకసారి హెచ్‌ఎంలతో సమీక్ష, జిల్లా స్థాయిలో మండలాలవారీగా సమీక్ష, రాష్ట్రస్థాయిలో జిల్లాలవారీగా ప్రగతి సమీక్షలు నిర్వహిస్తున్నారు.[2]

శిక్షణలు

[మార్చు]

ఇందులో భాగంగా రాష్ట్రంలోని 52 వేల పైచిలుకు ప్రాథమిక పాఠశాలల్లోని టీచర్లకు మూడు విడతల్లో శిక్షణనిచ్చే కార్యక్రమం 2022 జూలై 26న ప్రారంభమయింది. జులై 26 నుంచి 28వ తేదీ వరకు 3 రోజులపాటు ప్రతి మండలానికి నలుగురి చొప్పున ఎంపిక చేసిన ఉపాధ్యాయులకు, ఎంఈఓలు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు శిక్షణ అందించారు. ప్రతి మండలంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు మండలాల వారీగా రెండు దఫాలుగా శిక్షణ ఏర్పాటు చేశారు. జులై 30 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు, ఆగస్టు 3 నుంచి 16వ తేదీ వరకు శిక్షణ మరో విడతల్లో కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమ అమలుకు ప్రతి పాఠశాలలకు ఒక సెట్ పుస్తకాలను పంపిణీ చేశారు.[3]

140 రోజుల పాటు కార్యక్రమం

[మార్చు]

2022-23 విద్యాసంవత్సరంలో 220 రోజుల పనిదినాలు ఉండగా 140 రోజులు బోధనాభ్యాసన ప్రక్రియ నిర్వహణ ఉంటుంది. వారానికి 5 రోజులు బోధనాభ్యాసం, 1 రోజు మూల్యాంకనం, పునరభ్యాసం చేపిస్తారు. విద్యార్థులంతా భాగస్వాములు అయ్యేలా వార్షిక, పాఠ్య/వారపు, రోజువారి కాలాంశం లేదా పీరియడ్‌ ప్రణాళిక రూపొందించారు.[4]

సామర్థ్యాల సాధన

[మార్చు]
  • 1వ తరగతిలోని విద్యార్థులు నిమిషానికి 20 పదాలను, 2వతరగతిలో 25 పదాలను, 3వతరగతిలో 30 పదాలను, 4వ తరగతిలో 40 పదాలను, 5వ తరగతిలో 50 పదాలను ధారాళంగా చదవాలి.
  • 3, 4, 5 తరగతుల్లోని విద్యార్థులు ఇచ్చిన పేరాను/గేయాన్ని/పద్యాన్ని చదివి అర్థం చేసుకోగలగాలి. దీనిని పరీక్షించడానికి 5ప్రశ్నలిస్తే.. వాటిల్లో 4 చేయగలగాలి.
  • 1వ తరగతి పిల్లలు సరళపదాలు గుణింత పదాలు, 2వ తరగతి వారు ఒత్తులపదాలు, 3 నుంచి 5వ తరగతి పిల్లలు 4 లేదా 5 వాక్యాలతో కూడిన పేరాలను రాయగలగాలి. 5 పదాల్లో కనీసంగా 4 పదాలను తప్పుల్లేకుండా రాయాలి.[5]

బోధన ఉపకరణాల తయారీ

[మార్చు]

ఉపాధ్యాయులు మూస పద్ధతిన కాకుండా పాఠ్య ప్రణాళికలు తయారు చేసి బోధన ఉపకరణాలతో బోధించడం ద్వారా విద్యార్థులు పాఠ్యాంశాలను సులువుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. నాలుగు నెలల్లో ఒక్కో ఉపాధ్యాయుడు సొంతంగా 15-20 వరకు బోధన ఉపకరణాలను తయారు చేసి బోధిస్తుండటం వల్ల ఉపాధ్యాయుల్లో పోటీతత్వం కూడా పెరుగుతుంది.[6]

  • టీచర్లు ప్రతి పీరియడ్‌కు పాఠ్యప్రణాళికలు (లెస్సన్‌ప్లాన్స్‌) తయారు చేసి, దాని ప్రకారమే బోధించడం
  • విద్యార్థులు సాధించాల్సిన లక్ష్యాలను ముందే అంచనా వేసి ఆయా లక్ష్యాలను సాధించేలా చేయడం
  • ఒక్కో పాఠ్యాంశాన్ని రెండు మూడు భాగాలుగా విభజించి విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా బోధించడం
  • తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌ వంటి భాషల బోధనలోనూ టీచర్లు బోధన ఉపకరణాలను విరివిగా ఉపయోగించడం
  • బోధన ఉపకరణాల తయారీని ప్రోత్సహించేందుకు టీచింగ్‌ లెర్నింగ్‌ మెటీరియల్‌ మేళాలు నిర్వహించడం

మూలాలు

[మార్చు]
  1. telugu, NT News (2022-07-24). "బడిబాగుకు త్రిముఖ వ్యూహం". Namasthe Telangana. Archived from the original on 2022-07-24. Retrieved 2022-08-15.
  2. telugu, NT News (2022-08-15). "నేటి నుంచే 'తొలిమెట్టు'". Namasthe Telangana. Archived from the original on 2022-08-15. Retrieved 2022-08-15.
  3. "బడిలో తొలిమెట్టు". EENADU. 2022-08-01. Archived from the original on 2022-08-02. Retrieved 2022-08-15.
  4. "పంద్రాగస్టు నుంచి తొలిమెట్టు కార్యక్రమం". www.andhrajyothy.com (in ఇంగ్లీష్). 2022-07-27. Archived from the original on 2022-08-01. Retrieved 2022-08-15.
  5. telugu, NT News (2022-07-23). "23 వేల బడుల్లో 'తొలిమెట్టు'". Namasthe Telangana. Archived from the original on 2022-07-23. Retrieved 2022-08-15.
  6. telugu, NT News (2023-01-13). "అత్యుత్తమ బోధనకు 'తొలిమెట్టు'". www.ntnews.com. Archived from the original on 2023-01-13. Retrieved 2023-01-14.