త్రిశంకు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

త్రిశంకుడు సూర్యారణ్యుని కొడుకు. హరిశ్చంద్రుని తండ్రి. ఇతని మొదటిపేరు సత్యవ్రతుఁడు. ఇతఁడు బొందితో స్వర్గమునకు పోవలెనని వసిష్ఠుని కోరగా, అతఁడు ఇది లోకవిరుద్ధమని వారించెను. అంత నతడు వశిష్టుని కుమారుల చెంతకు పోయి వారిని నిర్బంధించెను. వారు తమ తండ్రి చెప్పినదాని ఇతఁడు ఉల్లంఘించినందున ఛండాలత్వము పొందునట్లు శపియించిరి. ఆ తర్వాత తన కోరికను నెరవేర్చుకొనుటకు ఇతడు విశ్వామిత్రుని ఆశ్రయించి తనను బొందితో స్వర్గమునకు పంపమని వేడుకొనెను. అంత విశ్వామిత్రుడు తన తపోబలముచేత ఇతనిని శరీరముతోనే దేవలోకమునకు పంపగా, దేవతలచే అచ్చటనుండి తలక్రిందుగ భూమికి పడద్రోయఁబడెను. అపుడు విశ్వామిత్రుఁడు వీనిని క్రిందపడకుండ నిలిపి త్రిశంకుస్వర్గము అని మఱియొక స్వర్గమును తన తపోమాహాత్మ్యముచే సృజియింప యత్నించి దేవతల ప్రార్థనచే మానుకొనెను. త్రిశంకుఁడు అక్కడే మద్యలో అట్లే నిలిచెను. ఇతనికి గురునాజ్ఞ యుల్లంఘన, చండాలత్వము, నిషిద్ధవస్తు భోజనము అను మూఁడు శంకువులు (శంకువు = మేకు, దోషము) సంభవించినందున త్రిశంకుఁడు అను నామము కలిగెను.

"https://te.wikipedia.org/w/index.php?title=త్రిశంకు&oldid=2985968" నుండి వెలికితీశారు