థామస్ సువార్త

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
థామస్ సువార్త
రెండవ నాగ్ హమ్మదీ రాతప్రతి:
థామస్ సువార్త దీనితో ప్రారంభం
సమాచారం
మతంక్రైస్తవం
రచయితథామస్ కి ఆపాదించబడింది
భాషకాప్టిక్, గ్రీకు
కాలంతొలినాళ్ళ క్రైస్తవం
(possibly అపోక్లిప్టిక్ యుగం)

  

థామస్ సువార్త లేక గాస్పెల్ ఆఫ్ థామస్ అనేది క్రైస్తవ బైబిల్లో చేరని, సంప్రదాయేతర[1] సూక్తుల సువార్త. దీనిని కాప్టిక్ గాస్పెల్ ఆఫ్ థామస్ అని కూడా పిలుస్తారు. 1945 డిసెంబరులో ఈజిప్టులోని నాగ్ హమ్మాది అనే నగరం సమీపంలో నాగ్ హమ్మాది గ్రంథాలయం అని పేరొందిన పుస్తకాల సమూహంలో భాగంగా దొరికింది. నాల్గవ శతాబ్దిలో క్రైస్తవ బైబిల్లో చేరే సువార్తలు ఇవేనని బైబిల్ సూత్రావళిని ఖచ్చితంగా, కఠినంగా నిర్ధారిస్తూ బిషప్ అథనాసియస్ రాసిన లేఖ వల్ల ఈ రచనలను పాతిపెట్టారని పరిశోధకులు ఊహిస్తున్నారు.[2][3] క్రైస్తవ చరిత్ర పరిశోధకులు కొందరు మాథ్యూ సువార్త, ల్యూక్ సువార్త వంటి సువార్తల్లోకి క్రీస్తు సూక్తులు ఒక "క్యూ సోర్స్" (Q సోర్స్) నుంచి వచ్చిందని ప్రతిపాదించారు. సూక్తుల సువార్తగా కూడా పిలిచిన ఆ సువార్తలో క్రీస్తు జననం నుంచి మరణం, పునరుత్థానం వరకూ చేసిన చర్యలు, విశేషాల వివరాలేమీ లేకుండా కేవలం అతని సూక్తులు మాత్రమే ఉండివుండొచ్చని భావించారు. కేవలం సూక్తులే కలిగిన థామస్ సువార్త బయటపడ్డాకా ఆ క్యూ సోర్స్ ఉనికికి పరిశోధకులు దీన్ని సాక్ష్యంగా పరిగణించడం ప్రారంభించారు.[4] [5]

రెండవ నాగ్ హమ్మదీ రాతప్రతుల్లో 32వ పత్రం; థామస్ సువార్త దీనితోనే ప్రారంభం అవుతుంది.

ఆధునిక పరిశోధకులు నాగ్ హమ్మది కోడెక్స్ IIగా దీనికి పేరుపెట్టిన ఏడు గ్రంథాల్లో ఇది రెండవది. ఇది 3-19 శతాబ్దాల్లో ఈజిప్టులో ప్రాచుర్యంలో ఉన్న కాప్టిక్ భాషలోని రచన ఇది. దీనిలో ఏసుక్రీస్తు చెప్పాడని పేర్కొనే 114 సూక్తులు ఉన్నాయి. వీటిలో మూడింట రెండువంతుల వరకూ సూక్తులు సంప్రదాయ క్రైస్తవం అంగీకరించిన సువార్తల్లో కనిపించేవాటిలానే ఉంటాయి.[6] ఆ సువార్తల మూల గ్రంథాలతో పోల్చిచూస్తే 80 శాతం కన్నా ఎక్కువ పోలికలు కనిపించాయి.[7] మిగిలిన సూక్తులు తొలినాళ్ళ క్రైస్తవ శాఖ అయిన నాస్టిక్ సంప్రదాయం నుంచి తీసి చేర్చినవని ఊహిస్తున్నారు.[8] ఈ రచన మూల ప్రాంతం థామస్ సంప్రదాయాలు బలంగా ఉన్న సిరియా అయివుంటుందని పరిశోధకుల భావన.[9] ఇతర పరిశోధకులు అలెగ్జాండ్రియా దీనికి మూలం అయివుండొచ్చని సూచించారు.[10]

ఈ రచన తాలూకు ఉపోద్ఘాతం ఇలా పేర్కొంటుంది: "ఇవి సజీవుడైన యేసు మాట్లాడిన రహస్య పదాలు. డిడిమోస్ జుడాస్ థామస్ వాటిని రాశాడు."[11] డిడిమస్ అన్న పదానికి కోయిన్ గ్రీకులోనూ, థామస్ అన్న పదానికి అరామిక్ భాషలోనూ ఉన్న అర్థం ఒక్కటే - "కవల" అని. చాలా మంది ఆధునిక పండితులు అపొస్తలుడైన థామస్‌ను ఈ పత్రం రచయితగా పరిగణించరు. ఈ పత్రం రచయిత ఎవరో ఇప్పటికీ తెలియదు.[12]

నాగ్ హమ్మాది గ్రంథాలయంలో ఇది దొరకడమూ, అంతుబట్టని దాని భావం వంటి కారణాల వల్ల తొలినాళ్ళ క్రైస్తవుల్లో భాగమైన ప్రోటో-నాస్టిక్ సంప్రదాయానికి చెందిందని భావిస్తారు.[13][14] అయితే, నాగ్ హమ్మాదిలో ఇతర నాస్టిక్ పాఠాలతో పాటు దొరకిందన్న ఒకే అంశాన్ని ఆధారం చేసుకుని దీన్ని పూర్తిగా నాస్టిక్ సంప్రదాయానికి చెందిందని లెక్కవేస్తున్నామేమో పరిశీలించాలని విమర్శకులు పై భావనను ప్రశ్నించారు.[15][16]

బైబిల్ కొత్త నిబంధనలో చేరే సువార్తలతోనూ, ప్రక్షిప్తాలని సంప్రదాయం చెప్పే అపోక్రిఫా సువార్తలతోనూ పోలిస్తే థామస్ సువార్త రచనా ధోరణి, నిర్మాణం చాలా భిన్నంగా ఉంటుంది. కొత్త నిబంధనలో చేరిన సంప్రదాయ సమ్మతమైన (కానానికల్) సువార్తల్లాగా ఇది యేసు జీవితానికి సంబంధించిన కథనం కలిగి ఉండదు; అందుకు బదులుగా, ఇది యేసు పేర్కొన్నాడని ఆపాదించే సూక్తులను (లోజియా) కలిగి ఉంటుంది. ఈ సూక్తులు కొన్ని విడిగా ఉంటాయి, కొన్ని చిన్న చిన్న సంభాషణలు, నీతికథల్లో భాగంగా ఉంటాయి. ఇందులో ఉండే పదహారు నీతికథల్లో పదమూడు సినాప్టిక్ సువార్తల్లో (మత్తయి, మార్కు, లూకా మూడిటిని కలిపి సినాప్టిక్ సువార్తలు అంటారు) కూడా కనిపిస్తాయి. 65వ సూక్తిలో[17] యేసు మరణాన్ని పరోక్షంగా సూచిస్తున్నదేమో అనిపించే పాఠ్యం ఉంది; కానీ యేసును శిలువ వేయడం, అతను పునరుత్థానం చెందడం, తుది తీర్పు వంటివి ఇందులో కనిపించవు, యేసును రక్షకునిగా (మెస్సయ్య) కూడా ఈ సువార్త పేర్కొనడం కానీ, సూచించడం కానీ చెయ్యదు.[18]

మూలాలు[మార్చు]

  1. Foster (2008).
  2. Valantasis (1997).
  3. Porter (2010).
  4. Schnelle (2007).
  5. McLean, Bradley H. (1994). "Chapter 13: On the Gospel of Thomas and Q". In Piper, Ronald A. (ed.). The Gospel behind the Gospels: Current Studies on Q. Brill. pp. 321–345. ISBN 978-90-04-09737-7.
  6. Linssen (2020).
  7. Guillaumont et al. (1959).
  8. Ehrman (2003b).
  9. Dunn & Rogerson (2003).
  10. Brown (2019).
  11. Patterson, Robinson & Bethge (1998).
  12. DeConick (2006).
  13. Layton (1987).
  14. Ehrman (2003a).
  15. Davies (1983a), pp. 23–24.
  16. Ehrman (2003a), p. 59.
  17. DeConick (2006), p. 214.
  18. McGrath (2006), p. 12.