దత్తయోగీంద్ర శతకము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ దత్తయోగీంద్ర శతకమును వ్రాసిన కవి బండ్లపల్లి కొండయ.ఈతడు 6వ శతాబ్దమునాటి వాడు. ఈ శతకము అంతయు అద్వైతము వేదాంతపరమైనది.ప్రతి పద్యమునందును ఒక్కొక్క వేదాంత విషయము నిరూపించబడినది.ఈ శాతమునందలి విశిష్టత ప్రతి పద్యమునకును శీర్షిక యుండుట.ఈ షణత్రయ నిరూపణము, అనిత్యభ్రాంతి నిరూపణము, అష్టపాశ నిరూపణము, షడూర్మి నిరూపణము, మిధ్యాజ్ఞాన నిరూపణం, అంతర్మదాష్ట నిరూపణం, వేషాభాషా నిరూపణ, విరాట్రూప ప్రకారం, షట్చక్ర విచారం, ముక్తిద్వారకవాట నిరూపణం, అమనస్కయోగ నిరూపణం, నాదబిందుకళా నిరూపణం, నవచక్ర నిరూపణం, జ్ఞానయజ్ఞం మొదలగునవి యిందలి పద్యములకు గల శీర్షికలలో కొన్ని.

ప్రధమముననే బంధనక్రమ నిరూపణము వివరింపబడినది.జీవుడు-ఆతని బంధించు సాంసారిక విషయములు చక్కగా చెప్పబడినవి.

పరికింప భార్యలు బారి సంకెళ్ళను
చర్చింప శిశువులు చిల్లకట్లు
రూసింస మిత్రులు రోజుకాండ్లై యొప్పు
అన్నదమ్ములు వట్టియనువు కాండ్లు
తలపోయ బాంధవుల్ దగులు కావలికాండ్లు
దౌహిత్రులర్ధముల్దోచువారు
తలకింప తల్లిదండ్రులు రుణ బాంధవుల్
పశువులు మత్కుణ మశక చయము
జరుగ నిటువంటి సంసారి ధరణి యెల్ల
కష్టమైనట్టి చెరసాల గాదె తలప
చిరశుభాకర మోక్ష లక్ష్మీవిహార
సాంద్రరుచిధుర్య దత్తయోగీంద్ర వర్య

విషయము వేదాంత పరమైనను ఈశతకమునందలి శైలి మిక్కిలి సరళము. ఇట్టి శతకపఠనము నందు క్లిష్టత కనిపించదు. మానవుడు మతమునకు ప్రాధాన్యమీయక మతాతీతమైనది నిత్యమైనది అయిన బ్రహ్మవిద్యను ఆశ్రయింప వలయుమని ఈకవి ఆశయము. అందువలనే షణ్మత నిరూపణము శీర్షిక క్రింద ...యిట్టి దుష్టమతంబు పట్టుబడక బ్రహ్మ విద్యాంత రంగుడై ప్రబలవలయు... అని తెలిపెను.

భ్రాంతుడైన మానవుడు ఇడాపింగళాదినాడీ స్థానముల నెరుగక నిష్పలముగా మోక్షప్రాప్తి కొరకు కాశీరామేశ్వరాదులైన పుణ్యక్షేత్రములయందు తిరుగాడుట వలన ప్రయోజనములేదని, దేహమే సర్వతీర్ధ సంవాపితమని దానిని గ్రహించి యోగవిద్య నేర్వవలయునని ఈతని ఆశయము. దీనినే

ఘనత భూమధ్యంబు కాశికా స్థలంబయ్యె
యలహృదయంబు ప్రయాగయగును
శీర్షాగ్ర భాగంబు శ్రీశైలమై యొప్పు
లలి నేత్రములు కుశస్థలి బెలంగు
ఫాలంబు కేదారమై లీల జెలువారు
పడి యిడా పింగళుల్ వరుసతోడ
గంగ యుయు నలయ్యెగరమొప్ప తన్మధ్య
నాడి సరస్వతి నామమలరు
యిట్టి తీర్ధంబులను గానకెలమి నరుడు
దిరుగుచుండును భ్రాంతుడై తెలివిలేక ||చిర||

పోతన భాగవతమునందు ప్రహ్లాదుడు చెప్పిన శ్రవణము, దాసత్వము మొదలైన నవవిధ భక్తి భావములను వివరణాత్మకముగా ఈశతకమునందు కొన్ని పద్యములు వివరించినాడు.

శతకమునందలి నూరవ పద్యమువలన కవిని గురుంచి కొన్ని వివరములు తెలియుచున్నవి. ఈకవి శతకకవుల చరిత్రమున ఉదహరింపబడినాడు.ఈ కవి రచించినదే వివేకసింధువు అని అయిదాశ్వాసముల పద్య కావ్యము కలదు. ఇదియు దత్తాత్రేయునికంకితము, వివేక సింధువను సంస్కృత గ్రంధమును ముకుందయోగి అని కవి తెలుగున వచన కావ్యముగా రచింపగా ఈతడు పద్యకావ్యముగా వ్రాసినాడు.

=మూలములు[మార్చు]

  • 1974 భారతి మాసపత్రిక. వ్యాసము:దత్తయోగీంద్ర శతకము, వ్యాసకర్త: శ్రీఆవంచ సత్యనారాయణ.