దర్శని (కావ్యం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

దర్శని ప్రముఖ రచయిత ఛాయరాజ్ వ్రాసిన కావ్యం.[1] ఈ పుస్తకానికి 2000 సవత్సరంలో ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారం లభించింది. ఇది ప్రపంచ జీవశాస్త్రవేత్తల పరిశోధనలను అక్షరాలుగా ఆవిష్కరించిన కావ్యం.[2] ఛాయారాజ్ గతి తార్కిక విశేషణాలతో ప్రకృతి, మానవ సమాజ పరిణామక్రమాన్ని శాస్త్ర విజ్ఞానంతో మేళవించి రాసారు.[3]

సమీక్ష[మార్చు]

విశ్వంలో సౌరకుటుంబం ఆవిర్భావం, భూమి పుట్టుక, జీవోత్పత్తి, జీవ పరిణామం, అందులో సామాజిక పరిణతి, శ్రమ నిర్వహించిన పాత్ర మొదలైన విషయాల గురించి ఈ కావ్యంలో సుదీర్ఘంగా చర్చించబడింది. దాని వల్ల ఈ కావ్యం ఒక పట్టాన సామాన్య పాఠకుడికి కొరుకుడు పడదు. అసలే కవిత్వం, ఆపై శాస్త్రవిజ్ఞానం. అయితే కవి ఊహల వెంబడి, అతని స్వాప్నిక ప్రపంచంలోకి తన చేయి పట్టుకుంటూ వెళ్లిపోగలిగితే అంతరిక్షపు ఆవలి తీరం వరకు మనను తీసుకుపోతారు ఛాయరాజ్. నాలుగు కాళ్ల జంతువు పరిణామ క్రమంలో ముందరి కాళ్లను నడకకు ఉపయోగించే అలవాటు ఎందుచేతనో వదులుకుని వానరుడు నరుడయ్యాడు. బాతులాగా వేళ్లమధ్య చర్మం లేకుండా, కుక్కలాగా అయిదు వేళ్లూ ఒకవైపు చూడకుండా, మనిషి బొటనవేలు మాత్రమే మిగిలిన వేళ్లవైపు చూడడం మొత్తం పరిణామ క్రమంలో ఒక మైలురాయి. ఏదైనా ఒక వస్తువు పట్టుకోవదానికి గ్రిప్ దొరకగానే మానవుడు ప్రకృతిని తన వశం చేసుకోనారంభించాడు. ఇక ఇప్పుడు మనం చూస్తున్న నాగరకత గురించి చెప్పేదేముంది? అయితే నిజంగా మనిషి ప్రగతి సాధిస్తున్నాడా? సాంఘికంగా, సమూహంగా, ఒంటరిగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ప్రగతి సాధిస్తున్న పురోగతి ఎటువైపు పోతోంది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం వెతుక్కుంటూ కవి సాగించిన చింతన ఫలితమే ఈ “దర్శని” దీర్ఘ కావ్యం.[4]

గొప్ప వికాసానికి ముందు ఎంతో సంఘర్షణ
పెద్ద విస్తరణకు ముందు గొప్ప యుద్ధం
దు:ఖించి ఆనందించడం
కష్టించి సుఖించడం వల్ల
అగాధంలో పడవలసిన అడుగును
అందలానికి వేయగలగడం
అంతో ఇంతో అలవాటే

వెన్నెముక లేని జీవుల నుంచి వెన్నెముక వున్న జీవులకు పరిణామం సాగే సందర్భంలో కవి వాడిన మాటలివి. అర్థం చేసుకోవడానికి ఎక్కడా ఇబ్బంది పడనక్కరలేని పదజాలం. మానవజాతి పరిణామంలో శ్రమ నిర్వహించిన పాత్ర, నాగరకత వెల్లువెత్తడంతోనే వర్గ సమాజం రావడం, స్త్రీ పురుష సంబంధాలతోపాటుగా వర్గరహిత సమాజాన్ని ఆకాంక్షించడం ఛాయరాజ్ బాధ్యతగల కవితా రుజువు చేస్తాయి.

ముందుమాట[మార్చు]

ఈ కావ్యానికి ముందుమాట రాస్తూ డాక్టర్ బి. సూర్యసాగర్ మనిషి ప్రకృతి నియమాలను గుర్తించి వాటితో చెలిమి చేసి సుఖపడినాడని అంటారు. నిజంగా మనిషి సుఖపడుతున్నాడా? సుఖమనే భ్రమ పడుతున్నాడా? తుపానులు, వరదలు, భూకంపాలు, సునామీలు, కత్రినాలు, రాజకీయాలు, సాహిత్యాలు… ఇదంతా నిజంగా సుఖ జీవనమేనా? ఇదే ముందుమాటలో మరికొంత ముందుకెళ్లినాక ‘మానవ ప్రగతి నేటి వర్గ సమాజ సంకెళ్లను తెంచుకునే ప్రయత్నమే‘నంటారు. దీనిని అంగీకరించగలమా? గ్లోబలైజేషన్ దారి సంగతేమిటి? మన జీవితంలో అన్ని కోణాలను ప్రభావితం చేస్తున్న గ్లోబలైజేషన్ ప్రక్రియను ఎదిరిస్తున్న వాళ్లు, ఆపాలని ప్రయత్నం చేస్తున్న వాళ్లు దీనిని అంగీకరించగలరా? ఈ పరిచయ వాక్యాలు ముగించేముందర సూర్యసాగర్ అక్షరలక్షలు చేసే మాటలు చెప్తారు.

ముగింపు[మార్చు]

“దర్శని” కావ్యాన్ని ముగిస్తూ ఛాయరాజ్ పుడమి తల్లిని ప్రార్థిస్తారు.

[5]

స్త్రీ పురుష వివక్షను రూపుమాపడానికి ఏకంగా కవి ఏం కోరుకుంటున్నారో చూశారా? ఉభయలింగ జీవిగానో, లింగరహిత జీవిగానో మనిషిని మార్చేయమని కవి కోరడం స్పష్టమైన విప్లవ రాజకీయ దృక్పథంగా కనిపిస్తుంది. ప్రకృతిని, సమాజాన్ని కవి మార్క్సిస్టు భావజలపు నేపథ్యంలో తాత్వికంగా చిత్రించిన కావ్యం “దర్శిని”.

మూలాలు[మార్చు]

  1. ఆధ్యాత్మిక కళా స్రవంతి Sakshi | Updated: December 31, 2013
  2. ప్రజా సాంస్కృతికోద్యమంలో చెరగని 'ఛాయ'
  3. బంధాలు అనుబంధాలు (కథానిక) -ఎ.సీతారామారావు, 13/10/2013[permanent dead link]
  4. స్వేచ్ఛావలోకనమే కవి(త)త్వం – ఛాయరాజ్ ‘దర్శన’మ్
  5. ఏ దుఖంలో ఏ ప్రేమతో ఈ మనిషినీ సర్వోన్నత సృష్టియైన మనస్సునీ నిర్మూలిస్తావో ఆ ప్రేమతోనే మరెక్కడో వాటిని సృష్టించి తీరుతావు అప్పుడు, అమ్మా! నీ కడుపున పునర్ నిర్మాణమవుతాను ఆడమగ తేడాలేని అద్భుత రూపాన్నివ్వు ఆ రూపం స్పర్శకందనిదైనా సరే

ఇతర లింకులు[మార్చు]