దామెర్ల రామారావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భారతదేశం గర్వించదగ్గ చిత్రకారులలో దామెర్ల రామారావు ( Damerla Ramarao)ఒకరు. ఆయన అంత గొప్ప చిత్రకారుడని, పైగా తెలుగువ్యక్తి అనీ చాలామంది తెలుగువారికి తెలియదు.

దామెర్ల రామారావు
Damerla Rama Rao Biography.jpg
జననం1897 మార్చి 8
రాజమండ్రి
మరణం1925 జూన్ 6[1]
ప్రసిద్ధిచిత్రకారుడు
మతంహిందూ
భార్య / భర్తసత్యవాణి
తండ్రివెంకట రమణారావు
తల్లిలక్ష్మీదేవి

బాల్యం- తొలి జీవితం[మార్చు]

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి లో 1897 మార్చి 8వ తేదీన ప్రముఖ వైద్యుడు దామెర్ల వెంకట రమణారావు, లక్ష్మీదేవిలకు రెండవ కుమారుడుగా ఈయన జన్మించాడు. చిన్నతనం నుంచీ ఈయనకు చిత్రకళ పట్ల అమితమైన అభిరుచి ఉండేది. రామారావు మేనమామ పాఠశాలలో డ్రాయింగు టీచరుగా పనిచేశేవాడు. అన్నివేళలా ఆయనతో ఉండటం వలన కాబోలు రామారావుకి కూడా చిత్రలేఖనం మీద మనసు మళ్ళింది. ఆరేళ్ళ వయసునుండి గోడమీద బొగ్గుతో బొమ్మలు, ఆపైన తెల్ల కాగితాల మీద వేయటం ప్రారంభించాడు. మేనమామ ప్రోత్సాహంతో పదేళ్ళవయసుకి చక్కని ప్రకృతి రమణీయ దృశ్యాలు గీయటం, అవి అందరి అభినందనలు అందుకోవటం మొదలయింది. కొబ్బరితోటల్లో కూర్చుని, గోదావరిగట్టు మీద కూర్చుని, లాంచీలో తిరుగుతూ ఒకటేమిటి? అనేక ప్రకృతి దృశ్యాలను చిత్రించాడు.

చిత్రకళ[మార్చు]

ఆ రోజులలో రాజమండ్రిలోని ఆర్ట్స్ కాలేజిలో ఆస్వాల్డ్ కూల్డ్రే అనే ఆంగ్లేయుడు ప్రిన్సిపాలుగా ఉండేవాడు. ఆయన గొప్పకవీ, చిత్రకారుడూకూడ. పదేళ్ళుకూడా నిండని రామారావులోని ప్రజ్ఞను కూల్డ్రే గుర్తించి, అతనికి చిత్రకళలోని మెళుకువలు ఎన్నో నేర్పి ఎంతగానో ప్రోత్సహించాడు.

కూల్డ్రే గీసిన దామెర్ల రామారావు చిత్తరువు

కూల్డ్రే దొర సొంతఖర్చుమీద రామారావును బొంబాయిలోని జె.జె.స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌కి పంపాడు. 1916 లో రాజమండ్రి నుండి బొంబాయి వెళ్ళిన రామారావు, జె.జె. స్కూల్లో ఎందరో జాతీయ, అంతర్జాతీయ చిత్రకారుల పెయింటింగ్స్‌లోని లోని మెళకువలు నేర్చుకున్నాడు. ఆ కళాశాల సంచాలకుడైన సిసిల్ బర్న్స్ రామారావు రేఖాచిత్రాలు చూసి ఆశ్చర్యపోయి ఆ కళాశాలలో నేరుగా మూడవ సంవత్సరములో చేర్చుకొన్నాడు. మొదట్లో ఆ కాలేజిలో ఆతన్ని మద్రాసీ అని చిన్న చూపు చూసినా, అతను వేసిన చిత్రాలు చూసి ముక్కునవేలేసుక్న్నారు. నమ్మలేకపోయారు. అమాయకంగా నలుగురిలో కలవక ఉండే ఈ వ్యక్తిలో ఇంతటి సృజనాత్మకత ఉందా? అని అందరూ ఆశ్వర్యపోయారు. ఆనాటి నుండి తిరుగులేని చిత్రకారుడు అయ్యాడు. చివరి సంవత్సరంలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడై మేయో బంగారు పతకాన్ని రామారావు పొందాడు. వెంటనే చిత్రకళశాలలో వైస్ ప్రిన్సిపాల్ ఉద్యోగానికి ఆయనకు ఆహ్వానం వచ్చింది. కాని స్వరాష్ట్రంలోనే కళాసేవ చేయాలన్న ఆకాంక్షతో రాజమండ్రికి తిరిగివచ్చాడు. 1922 లో కలకత్తా చిత్రకళా ప్రదర్శనలో ఆయన ప్రదర్శించిన 'ఋష్యశృంగ బంధనం' చిత్రానికి ప్రథమ బహుమతిగా 'వైస్రాయి ఆఫ్ ఇండియా' పతకం వచ్చింది. అంతేకాకుండా అప్పటి వైస్రాయి లార్డ్ రీడింగ్ రామారావును స్వయంగా పరిచయం చేసుకొని ఆయన వేసిన చిత్రాల్లో ఒకదాన్ని కొన్నాడు. రామారావు చిత్రించిన గొల్లపడుచు, గోదావరి లోయ, పుష్పాలంకారం, ద్రోణుడు, 'సిద్ధార్థుని రాగోదయం', 'బావి దగ్గర', భరతవంశపు రాకుమారులు, కైకేయీ దురాలోచన, నంది పూజ, పేరంటము, గొల్లపడుచులు, కార్తీక పౌర్ణమి వంటి రామారావు చిత్రాలు దేశ, విదేశాలలో ఎన్నో ప్రశంసలు పొందాయి.

చిత్రకళా ప్రతిభ[మార్చు]

సీమంతం - 1923 వ సంవత్సరంలో దామెర్ల రామారావు చిత్రించిన అసాధారణ అత్యద్భుత చిత్రమే ఈ ' పుష్పాలంకరణ" ( పువ్వుల ముడుపు) . ఇది ఆంధ్రప్రదేశములో తమ ఇంటి ఆడపడుచులకు తొలికానుపు ముందు చేయు సంబరం. ముతైదువుల సమక్షమున జరుపు ముచ్చటైన వేడుకను ఆయన బార్యకు జరిగిన సీమంతమును చూసి పరవశించి ఆ సంఘటనకు శాశ్వత స్వరూపమును తన రచనా పాటవముతో చిత్రించాడు. రూపు రేఖా విలాసాలను, ఆనాటి స్త్రీలకు తగిన వస్త్రధారణా విధానమును, పేరంటాలకు జరుగు పన్నీటి జల్లులు , అమ్మలక్కల కాలక్షేపపు ముచ్చట్లు , కూర్చునే వివిధ పద్ధతులు ఇటువంటి ఎన్నో విశేషాలు ఈ చిత్రము ద్వారా మనకు గోచరిస్తాయి.ఇదే ఆయన చిత్రీకరణలోని ప్రత్యేకత.

బావివద్ద - ఆంధ్ర గ్రామీణ వాతావరణ చిత్రీకరణ ఈ చిత్రములో కలదు. గ్రామాలలో గల ఊరుమ్మిడి మంచి నీటి గిలక బావుల వద్ద ఓ ఉదయపు దృశ్యాన్ని ఆయన కుంచెద్వారా మనకు అద్దము పట్టినట్లు చూపించాడు. బావులవద్ద ఆనాటి స్త్రీలు చేదతో నీటిని తోడే వయ్యారాలు, నీటి బిందెలు ఎత్తుకొని నడచి వెళ్ళెడి స్త్రీల సౌందర్యం, చేదకోసం వేచి నిలబడియున్న స్త్రీల లావణ్యం, బిందెలను నెత్తిన ఎత్తుకొని వెళ్ళెడి స్త్రీల నడవడిక , నిలుచునే విధానము, బిందెలు భూజాన పెట్టుకున్న స్త్రీల సహజత్వం, వివిధ వ్యక్తుల వివిధ బంగిమల కూర్పు, ఆనాటి స్త్రీల వస్త్రధారణా విధానమున చూపిన సహజత్వం, ఆ నూతి వెనుక (బావి) ప్రకృతి యొక్క దివ్యత్వం చూసిన కన్నులకు రసానందము కల్గించు అద్వితీయ కళా సృష్టి ఈ చిత్రము. విశ్వవిఖ్యాత చిత్రకారులతో సరితూగగల ప్రతిభ , నైపుణ్యం దామెర్ల దని నిరూపించెడి చిత్రమిది.

ఆయన గీసిన చిత్రాలు బరోడా మహారాజు వంటి రాజులు, సంస్థానాధీశులను అబ్బురపరిచాయి. వారు ఆతన్ని తమ ఆస్థానానికి పిలిచి ఘనంగా సత్కరించారు. కలకత్తా , బొంబాయి వంటి మహానగరాల్లో జరిగిన బ్రిటీషు ఎంపైర్ ప్రదర్శనశాలలో దామెర్ల చిత్రాలను చూసి విదేశీయులు విస్తుపోయారు. ఆ బొమ్మలను ఒక సంవత్సరం పాటు అక్కడి గ్యాలరీలో ఆయన బొమ్మలుంచారంటే అతని చిత్రకళా ప్రతిభకు తార్కాణం.

1923 లో రామారావు రాజమండ్రిలో ఒక చిత్రకళా పాఠశాలను స్థాపించి అనేక మంది యువకులకు శిక్షణను ఈయన ఇచ్చాడు. 1925 లో 28 ఏళ్ళకే ఆయన అకాల మరణం చెందాడు. ఈయన చిత్రాలను రాజమండ్రిలోని దామెర్ల రామారావు ఆర్ట్స్ గ్యాలరీ లో భద్రపరచారు. ఆ కీర్తిశేషుని పేర ఒక చిత్రకళామందిరం వెలసింది. అందులో ఆయన వేసిన చిత్రాలు ఉన్నాయి.

చిత్రమాలిక[మార్చు]

మూలాలు[మార్చు]