దిద్దుబాటు (కథానిక)
తెలుగు సాహిత్యంలో తొలి కథానికగా ప్రసిద్ధి చెందిన 'దిద్దుబాటు' సమాజంలో వేశ్య వృత్తికి అలవాటుపడ్డ వ్యక్తుల ప్రవర్తనను దిద్దుబాటు చేస్తుంది. ఈ కథానిక కేవలం నాలుగు పేజీలలో అత్యంత అద్భుతంగా సమాజానికి దిశా నిర్దేశం చేస్తూ సాహిత్య చరిత్రలో నిలిచిపోయింది. నాటి కాలంలో వేశ్యల పట్ల ధనవంతులు, విద్యావంతులు సైతం వ్యామోహం చూపే వారు. అటువంటి వేశ్యా వ్యామోహంలో పడ్డ భర్తను భార్య ఏ విధంగా సరిదిద్దిందనేదే ఈ కథానిక సారాంశం. అందుకే దీనికి "దిద్దుబాటు" అనే పేరు పెట్టారు. ఇది తొలిసారి 1910లో ఆంధ్ర భారతి పత్రికలో ప్రచురించబడింది. ఇందులోని పాత్రల మధ్య సంభాషణ వాడుక భాషలోనూ, కథా కథనం సులభ గ్రాంథికంలో కనిపిస్తుంది.[1]
పాత్రలు
[మార్చు]కమలిని, గోపాలరావు భార్యా భర్తలు. రావుడు వీరి ఇంటి పాలేరు. గోపాలరావు వేశ్యల పట్ల ఆకర్షితుడై ప్రతిరోజూ ఇంటికి ఆలస్యంగా వస్తుంటాడు. దీనిని గమనించిన కమలిని పాలేరు అయిన రావుడి సహాయంతో ఒక మంచి ఉపాయం ఆలోచించి గోపాలరావుపై ప్రయోగించి, అతడికి బుద్ధి వచ్చేట్టు చేస్తుంది.
సంక్షిప్త కథ
[మార్చు]రాత్రి ఒకటి గంటలకు ఇంటికి వచ్చిన గోపాల రావుకు భార్య కమలిని కనిపించదు. ఇల్లు, పడకగది అంతా వెతుకుతాడు. దీపం వెలిగించి మరీ వెతుకుతాడు. కానీ భార్య కనిపించదు. బుద్ది తక్కువ పనిచేశానని బాధపడతాడు. భార్య ఏమైందోనని పరిపరి విధాలా ఆలోచిస్తాడు. భార్య కనపడలేదన్న కోపంతో పాలేరు రావుడుపై చేయిచేసుకుంటాడు. వెంటనే తప్పుతెలుసుకుంటాడు.
బల్లపై భార్యరాసిన ఉత్తరం కనిపిస్తుంది. ఆ ఉత్తరంలో-
'..... నా వల్లే కదా మీరు అసత్యాలు పలుకవలసి వచ్చింది. మీ త్రోవకు నేను అడ్డుగా ఉండను. ఈ రేయి కన్న వారింటికి వెళ్తున్నాను.' అని రాసి ఉంటుంది.
దాంతో గోపాలరావు ఆశ్చర్య పోయి, విద్యావతి, గుణవతి అయిన భార్య తనకు తగిన శాస్తి చేసింది అని వ్యాకులత చెందుతాడు. నౌకరికి పది రూపాయలిచ్చి కమిలినిని బతిమిలాడి తీసుక రమ్మంటాడు. 'తప్పు తెలుసుకున్నాను, ఇక ఎప్పటికీ వేశ్యల ఇంటికి వెళ్లను, రాత్రులు పూట ఇల్లు కదలను, తను లేకుండా నేను ఉండలేను' అని భార్యకు చెప్పమంటాడు.
మూలాలు
[మార్చు]- ↑ వాసివాడని సాహిత్యం గురజాడ కథామంజరి, ఎమెస్కో.