దుర్గా చరణ్ నాగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దుర్గా చరణ్ నాగ్ (నాగ మహాశయ)
দুর্গাচরণ নাগ (Bengali)
19 వ శతాబ్దంలో తూర్పు బెంగాల్ కు చెందిన హిందూ ఆధ్యాత్మిక వేత్త
జననందుర్గా చరణ్ నాగ్
1846
దియోభోగ్, నారాయణగంజ్ జిల్లా, బెంగాల్ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా
నిర్యాణము1899
దియోభోగ్ గ్రామం, బంగ్లాదేశ్
గురువురామకృష్ణ పరమహంస
తత్వంఅద్వైతం

దుర్గా చరణ్ నాగ్ లేదా నాగమహాశయుడు (1846 - 1899) బెంగాల్ కు చెందిన ఆధ్యాత్మిక వేత్త. ఈయన ప్రస్తుతం బంగ్లాదేశ్ లో ఉన్న దియోభోగ్ అనే ఊర్లో జన్మించాడు. ఈయన రామకృష్ణ పరమహంస గృహస్థాశ్రమ శిష్యుల్లో ఒకడు. రామకృష్ణులు, స్వామి వివేకానంద ఈయనను పరిత్యాగానికి, భగవంతునిపై గల అపారమైన ప్రేమకు అసలైన ఉదాహరణగా అభివర్ణించారు.[1] ఈయన భౌతిక సంపదలకు దూరంగా ఉంటూ భూమి మీద నివసించే ప్రతి ఒక్కరూ భగవంతుని స్వరూపాలని పరిపూర్ణంగా విశ్వసించాడు. బంగ్లాదేశ్ లోని ఆయన స్వస్థలంలో ఆయన పేరుమీదుగా ఒక సేవాసంస్థను కూడా నిర్వహిస్తున్నారు.[2]

స్వామి వివేకానందకు ప్రత్యక్ష శిష్యుడైన శరత్ చంద్ర చక్రవర్తి ఈయన జీవిత చరిత్రను రాశాడు. అది కాకుండా రామకృష్ణులు, స్వామి వివేకానంద రచనలలో ఈయన గురించిన వివరాలు పొందుపరచబడి ఉన్నాయి.

జీవితం[మార్చు]

దుర్గా చరణ్ నాగ్ 1846 లో అప్పటి తూర్పు బెంగాల్ లోని దియోభాగ్ అనే ఊర్లో దీనదయాళ్ నాగ్, త్రిపురసుందరి దేవి దంపతులకు జన్మించాడు. చిన్నతనంలోనే తల్లి మరణించడంతో దుర్గా చరణ్ అత్త భగవతి (తండ్రి అక్క) దగ్గర పెరిగాడు. ఈయన బాల్య విశేషాల గురించి పెద్దగా తెలియదు కానీ సత్ప్రవర్తనతో మెలుగుతూ, సౌమ్యుడిగా పేరు పొందాడు. అత్త అతనికి రామాయణ, మహాభారత పురాణాల్లో కథలు చెప్పేది. ఇవి ఆయన తర్వాతి జీవితాన్ని బాగా ప్రభావితం చేశాయి. ఎల్లప్పుడూ నిజాయితీగా, ధర్మనిష్టతో మెలిగేవాడు.[3]

ఈయనకు చదువంటే పంచప్రాణాలు, కానీ ఆయన ఊర్లో బడి లేదు. నారాయణ్ గంజ్ జిల్లాలో మాతృభాషలోనే మూడో తరగతి దాకా చదివాడు. ఆపై అక్కడ ఇంక చదువు లేదు. తండ్రి అతన్ని చదువు కోసం కలకత్తా పంపాలనుకున్నాడు కానీ ఆయన ఆర్థిక స్థోమత అందుకు సహకరించలేదు. ఢాకాలో ఒక పాఠశాల ఉందని తెలుసుకుని పది మైళ్ళ పాటు కాలినడకనే అక్కడికి బయలు దేరాడు. అక్కడ 15 నెలల పాటు చదివాడు. తర్వాత కలకత్తాలో వైద్యశాస్త్రం చదివేందుకు వెళ్ళాడు.

వైవాహిక జీవితం, వైద్యవృత్తి[మార్చు]

దుర్గా చరణ్ నాగ్ బెంగాల్లో అప్పటి ఆచారాల ప్రకారం 11 ఏళ్ళ వయసున్న ప్రసన్న కుమారిని వివాహం చేసుకున్నాడు. పెళ్ళయిన ఐదు నెలల తర్వాత కలకత్తాలోని కాంప్‌బెల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ లో చదవడానికి వెళ్ళాడు. కానీ అక్కడ ఆయన చదువు ఎక్కువ కాలం సాగలేదు. తర్వాత ఆయన డాక్టర్ బేహారీ లాల్ బాదురీ దగ్గర హోమియోపతీ నేర్చుకున్నాడు. ఇంతలోనే ఆయన మొదటి భార్య అతిసార వ్యాధితో మరణించింది. ఆయన ఆమెతో కలిసిఉన్నది పెద్దగా లేదు. ఆయన పేదవాళ్ళకు ఉచితంగా వైద్యం చేసేవాడు. అత్యంత క్లిష్టమైన కేసులకు కూడా వైద్యం చేసి విజయం సాధించాడు.

బ్రహ్మ సమాజానికి చెందిన సురేష్ దత్తా పరిచయంతో ఈయన జీవితం ముఖ్యమైన మలుపు తిరిగింది. ఇద్దరి నమ్మకాలు వేరైనా మంచి స్నేహితులుగా మెలిగేవారు.

మూలాలు[మార్చు]

  1. Diary of a disciple by Sarat Chandra Chakravarti, p 24
  2. Nag Mahashaya foundation Archived 2017-09-12 at the Wayback Machine/
  3. "Life of Nag Mahashaya" by Sarat Chandra Chakrabarti, Chapter 1