దూరధమని వ్యాధి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

దూర ధమనులలో రక్తప్రసరణకు అంతరాయము కలుగుతే దానిని దూర ధమని వ్యాధిగా ( పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ ) పరిగణిస్తారు. ఈ దూరధమని వ్యాధికి ముఖ్యకారణము ధమనీ కాఠిన్యత

ధమనీ కాఠిన్యత శైశవమునుంచి మొదలిడి మధ్యవయస్సు తర్వాత కనిపించి వృద్ధాప్యములో తీవ్రతరము అవుతుంది. ఈ ప్రక్రియలో ధమనుల లోపొర క్రింద కొవ్వులు, కొలెష్టరాలు, కాల్సియం, తాపకణములు పేరుకొని ఫలకలుగా పొడచూపుతాయి.

ఈ పలకలు రక్తనాళముల లోపలి పరిమాణమును తగ్గిస్తాయి. ధమనుల లోపలి పరిమాణము ఎక్కువగా తగ్గితే కణజాలమునకు రక్తప్రసరణ తగ్గుతుంది. ధమనుల లోపొరలోని పలకలు చిట్లుతే వాటిపై తాపప్రక్రియ కలిగి, రక్తపుగడ్డలు ఏర్పడి రక్తప్రసరణకు ఆకస్మిక అవరోధము కలుగజేయగలవు.

దూరధమనుల వ్యాధి సాధారణముగా కాళ్ళలో చూస్తాము. ఈ వ్యాధివలన రక్తప్రసరణకు ఆటంకము ఏర్పడుతుంది. అమెరికాలో అరవై సంవత్సరాలు దాటిన వారిలో 12 నుంచి 20 శాతపు వారిలోను ఎనభై అయిదు సంవత్సరాలు దాటిన వారిలో 50 శాతపు వారిలోను దూరధమని వ్యాధి పొడచూపుతుంది. ప్రపంచములో 20 కోట్లమంది యీ వ్యాధిగ్రస్థులు ఉంటారు.

కారణాలు[మార్చు]

వృద్ధాప్యము వలన ధమనీకాఠిన్యత కలిగినా పిన్నవయస్సులోనే యీ వ్యాధిని తీవ్రతరము చేసే కారణములను వైద్యులు , శాస్త్రజ్ఞులు చాలా సంవత్సరముల పూర్వమే పసిగట్టారు. ఇవి :

ధూమపానం[మార్చు]

దూరధమని వ్యాధిని కలుగజేసే కారణములలో పొగత్రాగుట ప్రధమస్థానములో నిలుస్తుంది. దూరధమని వ్యాధి కలిగేవారిలో 80 నుంచి 90 శాతము మంది ప్రస్తుతపు, లేక పాత ధూమపానీయులే.

ఇతరుల నుంచి పొగ పీల్చినవారిలో కూడా యీ వ్యాధి కలిగే అవకాశములు ఉన్నాయి. వీరిలో రక్తనాళముల లోపొరలో జరిగే మార్పుల వలన ధమనీ కాఠిన్యత వేగము పెరుగుతుంది. దినమునకు కాల్చే పొగాకు, ధూమపానము చేసిన సంవత్సరములతో వ్యాధి అనుపాత నిష్పత్తితో ముడిపడి ఉంటుంది.

మధుమేహవ్యాధి[మార్చు]

మధుమేహవ్యాధి కాలము, తీవ్రతతో దూరధమని వ్యాధి కలిగే అవకాశములు పెరుగుతాయి. మధుమేహవ్యాధి కలవారిలో దూరధమనివ్యాధి కలిగే అవకాశము రెండింతలు అవుతుంది.

కొవ్వులు, కొలెష్టరాలు[మార్చు]

అల్ప సాంద్రపు కొలెష్టరాలు హెచ్చుగా ఉన్నవారిలోను, అధిక సాంద్రపు కొలెష్టరాలు తక్కువగా ( 40 మి.గ్రా/ డె.లీ కంటె తక్కువ ) ఉన్నవారిలోను, ట్రైగ్లిసరైడులు హెచ్చుగా ఉన్న వారిలోను ఈ వ్యాధి ప్రాబల్యము హెచ్చు. రక్తపీడనము అధికమైన వారిలోను, దీర్ఘకాల మూత్రాంగ వ్యాధిగ్రస్థులలోను దూరధమని వ్యాధి ప్రాబల్యము అధికముగా ఉంటుంది.

వ్యాధిలక్షణములు[మార్చు]

దూరధమని వ్యాధిగ్రస్థులలో ప్రామాణిక లక్షణము సవిరామపు పోటు. ఈ పోటు కాలిపిక్కలో కొంతదూరము నడిచిన పిదప క్రమరీతిలో కలిగి, విశ్రాంతి తీసుకొన్న పది నిమిషములలో క్రమరీతిలో ఉపశమిస్తుంది. ఈ పోటు సలుపుగా గాని, నొప్పిగా గాని, పోటుగా గాని, నీరసము వలె గాని పొడచూపవచ్చును. నడిచేటపుడు కాలి కండరములకు రక్తప్రసరణ అవసరము పెరుగుతుంది. ధమనుల నాళ పరిమాణము తగ్గుటవలన అవసరములకు తగినంత రక్తప్రసరణ, ప్రాణవాయువు సరఫరా లోపించి కండరములలో నొప్పి, పోటు, కలుగుతాయి. కాని సుమారు పది శాతపు మందిలోనే యీ పోటు ప్రామాణికముగా ఉంటుంది. నలభై శాతము మందిలో నొప్పిగాని, బాధగాని ఉండదు. కొందఱిలో నొప్పి కాలి పిక్కలలో కలుగక పోవచ్చును. కొందఱిలో నొప్పి నడక ఆపివేయునంత తీవ్రముగా ఉండకపోవచ్చును. కొందఱిలో నొప్పి పది నిముషముల విశ్రాంతితో ఉపశమించక పోవచ్చును.

వ్యాధి తీవ్రత హెచ్చయినవారిలో నొప్పి విశ్రాంత సమయములలో కూడా కలుగుతుంది. సాధారణముగా యీ విశ్రాంతపు నొప్పి రాత్రుళ్ళు పడుకున్నప్పుడు కలిగి, కాలు క్రింద పల్లములో పెట్టాక తగ్గుతుంది. అపుడు కాలికి రక్తప్రసరణ కలిగి పాదములో ఎఱ్ఱదనము పొడచూపుతుంది. రక్తప్రసరణ లోపము వలన కణజాల నష్టము, పాదములలో ‘ బెజ్జములు కొట్టినట్లు ‘ కనిపించే మానని పుళ్ళు కలుగవచ్చును.

రక్తప్రసరణకు పూర్తిగా ఆటంకము కలిగినపుడు కాలు చల్లబడుతుంది. నొప్పి విపరీతముగా ఉంటుంది. కాలు పాలిపోయి ఉంటుంది. కణజాలములు మరణిస్తే, వేళ్ళలోను, పాదములోను కుళ్ళుదల కలుగుతుంది. దూరధమని వ్యాధి కలవారిలో వ్యాధి ఉన్న కాలి చర్మములో రోమములు తగ్గిపోతాయి. చర్మము దళసరి తగ్గి నున్నబడి మెరుస్తూ ఉంటుంది. కండరములు క్షయము పొందుతాయి. ధాతునాడులు నీరసిస్తాయి. నాడి చేతికి తగలక పోవచ్చును. కాళ్ళు, పాదములు ఉష్ణోగ్రత తగ్గి చల్లబడుతాయి. వ్యాధి తీవ్రముగా ఉంటే కాలు పైకెత్తినపుడు పాలిపోయి క్రిందకు దింపాక ఎఱ్ఱబడుతుంది. బెజ్జములు కొట్టినట్లు మానుదలలేని పుళ్ళు ఉండవచ్చు. కణజాలము రక్తప్రసరణ లేక చనిపోతే, ఆ భాగము నల్లబడి కుళ్ళుదల చూపవచ్చును.

పరీక్షలు[మార్చు]

కాళ్ళలో దూరధమని వ్యాధిని కనుగొనుటకు డాప్లర్ శ్రవణాతీతధ్వని సాధనముతో చీలమండ వద్ద ఊర్ధ్వపాద ధమనిలో ముకుళిత రక్తపీడనమును బాహుధమనిలో ముకుళిత రక్తపీడనమును కొలిచి వాని నిష్పత్తిని ( చీలమండ రక్తపీడనము / బాహు రక్తపీడనము ) లెక్కకట్టాలి. ఆ నిష్పత్తి 0.9 కంటె తక్కువయితే దూరధమని వ్యాధిని సూచిస్తుంది. ఈ పరీక్ష సున్నితమైనది , నిశితమైనది . తొంభైయైదు శాతపు వ్యాధిగ్రస్థులలో ఈ నిష్పత్తి వ్యాధిని పసిగట్టుతుంది.

అధిక రక్తపీడనము , మధుమేహవ్యాధి , దీర్ఘకాల మూత్రాంగ వ్యాధుల వలన అతిసూక్ష్మ ధమనులు సంకోచించి ప్రసరణలోపము కలుగజేసినపుడు యీ నిష్పత్తి వ్యాధిని పసిగట్టక పోవచ్చును.

ధమనీ కాఠిన్యత హెచ్చయి రక్తనాళముల గోడలలో కాల్సియమ్ పేరుకొనుట వలన చీలమండ దగ్గఱ రక్తనాళములు అణచుటకు వీలుబడకపోతే అంగుళి రక్తపీడనము / బాహు రక్తపీడనముల నిష్పత్తిని వ్యాధి నిర్ణయమునకు పరిగణించవచ్చును.

వ్యాధి లక్షణములు ఉండి చీలమండ / బాహు రక్తపీడనముల నిష్పత్తి సాధారణ పరిమితులలో ఉంటే నడక యంత్రముపై ఐదు నిమిషముల వ్యాయామము చేయించిన తర్వాత ఆ యా రక్తపీడనములు కొలిచి చీలమండ / బాహువుల ముకుళిత రక్తపీడనముల నిష్పత్తిని తీసుకొని వ్యాధి నిర్ణయము చేయవచ్చును. వ్యాధిగ్రస్థులలో వ్యాయామము పిదప చీలమండ / బాహువుల నిష్పత్తి 20 శాతము తగ్గుతుంది.

శ్రవణాతీతధ్వని చిత్రీకరణముతో రక్తనాళముల చిత్రములను గ్రహించి సంకుచితములు పొందిన భాగములను గుర్తించవచ్చును. రక్తనాళముల లోనికి సన్నని నాళికను చొప్పించి దాని ద్వారా వ్యత్యాస పదార్థములను ఎక్కించి ఎక్స్ -రేలతో రక్తనాళములను చిత్రీకరించ వచ్చును. వ్యత్యాస పదార్థములు యిచ్చి గణనయంత్ర ధమనీ చిత్రీకరణములను , అయస్కాంత ప్రతిధ్వని ధమనీ చిత్రీకరణములను చేసి వ్యాధిని ధ్రువీకరించ వచ్చును.

ఇతర సమస్యలు[మార్చు]

   దూరధమని వ్యాధిగ్రస్థులు ధమనీ కాఠిన్యత ప్రభావమువలన హృద్ధమని వ్యాధులకు, మస్తిష్క రక్తనాళ విఘాతములకు అధిక సంఖ్యలో పాలవుతారు. ఉదర బృహద్ధమనిలో బుడగలు కూడా వీరిలో కలుగవచ్చును. అందువలన ఆ వ్యాధులను కనుగొను పరీక్షలు, వాటికి చికిత్సలు కూడా అవసరమే.

చికిత్స[మార్చు]

జీవనశైలిలో మార్పులు[మార్చు]

ధూమపాన విరమణ[మార్చు]

దూరధమని వ్యాధిగ్రస్థులు ధూమపానమును తప్పక విరమించాలి. రక్తప్రసరణ లోపము వలన కాళ్ళు కోల్పోయిన వారిలోచాలా మంది ధూమపానీయులు.

వ్యాయామము[మార్చు]

దూరధమని వ్యాధిగ్రస్థుల శిక్షణపూర్వక వ్యాయామము అవసరము. నడక యంత్రములపై గాని, నేలపైన గాని కాళ్ళలో నొప్పులు పుట్టే సమయమునకు కొంచెము సమయము తగ్గించి నడుస్తూ, విరామము తీసుకుంటూ దినమునకు 30 నుంచి 60 నిమిషముల వ్యాయమము చేస్తే సత్ఫలితములు కలుగుతాయి. కాళ్ళ వ్యాయామము వలన చిన్న ధమనుల పరిమాణము పెరిగి కణజాలమునకు ప్రత్యామ్నాయ ప్రసరణను పెంపొందిస్తాయి. వ్యాయామము వలన హృద్ధమని సంఘటనలు, మస్తిష్క విఘాత సంఘటనలు కూడా తగ్గుతాయి. వీరు నొప్పి కలుగకుండా నడవగలిగే దూరము, సమయము కూడా పెరుగుతాయి.

మధుమేహవ్యాధిని, ఆహారనియమముతోను, వ్యాయామముతోను, తగిన ఔషధములతోను అదుపులో పెట్టుకోవాలి.

రక్తపుపోటు ఎక్కువయితే దానిని ఆహారనియమము, వ్యాయామము, ఔషధములతో అదుపులో పెట్టుకోవాలి.

అల్పసాంద్రపు కొలెష్టరాలుని ఆహారనియమము, స్టాటిన్ మందులతో తగ్గించుకోవాలి. అధికసాంద్రపు కొలెష్టరాలుని పెంచుకోవాలి.

ట్రైగ్లిసరైడులను ఆహారనియమము, మందులతో తగ్గించుకోవాలి.

ఏస్పిరిన్[మార్చు]

దూరధమనివ్యాధి లక్షణములు కలవారిలో ఏస్పిరిన్ వాడుక వలన ధమనులలో రక్తపుగడ్డలు ఏర్పడుట తగ్గుతుంది. హృద్ధమని సంఘటనలు, మస్తిష్క విఘాత సంఘటనలు తగ్గుతాయి. ఏస్పిరిన్ రక్తఫలకలు గుమికూడుటను నివారిస్తుంది. కణజాల విధ్వంసము తగ్గిస్తుంది.

క్లొపిడోగ్రెల్[మార్చు]

ఏస్పిరిన్ వాడలేనివారిలో రక్తఫలకములు గుమికూడుటను నివారించి రక్తపు గడ్డలను అరికట్టుటకు క్లొపిడోగ్రెల్ ను ఉపయోగిస్తారు. ఏస్పిరిన్  క్లొపిడోగ్రెల్ రెండూ కలిపి వాడుట వలన పరిశోధనలలో అదనపు ప్రయోజనము కనబడలేదు. రెండిటి వాడకము వలన రక్తస్రావ ప్రమాదములు ఎక్కువయే అవకాశములు ఉన్నాయి.

ఇదివరలో గుండెపోటు కలిగినవారిలో టికగ్రిలార్ ప్రమాదకర హృదయ సంఘటనలను తగ్గించుటకు ఏస్పిరిన్ తో పాటు ఉపయోగిస్తారు.

సిలొష్టజోల్[మార్చు]

సిలొష్టజోల్ వాడుక వలన దూరధమని వ్యాధిగ్రస్థులు నడవగలిగే దూరము పెరుగవచ్చును. కాని పరిశోధనలలో దీర్ఘకాలిక ప్రయోజనములు కనిపించలేదు. హృద్ధమని సంఘటనలు, మర్త్యత్వములలో తేడా కనిపించలేదు. సిలోష్టజోల్ వలన కాళ్ళలో పొంగులు కలుగవచ్చును.

హృదయవైఫల్యపు లక్షణములు అధికము కావచ్చును. దీనివలన కళ్ళుతిరుగుట, కడుపు పీకు, వంటి విలక్షణములు కలుగవచ్చును

పెంటాక్సిఫిలిన్ చాలా సంవత్సరములు వాడుకలో ఉన్నా దీనివలన ప్రయోజనము అనుమానాస్పదమే.

విటమిన్ బి -12, ఫోలిక్ ఏసిడ్ ల వలన ప్రయోజనము కలుగదు.

ధమనీ పునరుద్ధరణ చికిత్సలు[మార్చు]

దూర ధమనులలో వ్యాధి తీవ్రత హెచ్చయినప్పుడు, విరామ సమయములలో నొప్పి కలుగునపుడు ధమనీ పునరుద్ధరణ అవసరము.

కృత్రిమ నాళికపు బుడగతో ధమనిలో సంకుచించిన భాగమును వ్యాకోచింపజేయవచ్చును. శ్రోణిధమని, ఊరుధమనులలో వ్యాధి ఉంటే యీ ప్రక్రియ వలన ప్రయోజనము కలుగవచ్చును. క్రింద ధమనుల వ్యాధిగ్రస్థులలో ఫలితములు తక్కువ.

ధమనిని వ్యాకోచింపజేసిన పిమ్మట వ్యాకోచ నాళికలు పొందుపఱచుట వలన ఫలితములు మెరుగుగా లేవు. ధమనీ కాఠిన్య ఫలకల తొలగింపు వలన, ధమనిని వ్యాకోచింపజేయుటకంటె దీర్ఘకాలిక ఫలితములు మెరుగుగా లేవు.

అధిగమన శస్త్రచికిత్సలు[మార్చు]

ధమనులలో సంకుచిత భాగమును దాటుకొని రక్తప్రసరణను పునరుద్ధరించుటకు అధిగమన శస్త్రచికిత్సలు అందుబాటులో ఉన్నాయి. రోగి సెఫినస్ సిరను కాని , కృత్రిమ నాళమును కాని, ధమనిలో సంకుచిత భాగమునకు ముందు ఒకకొనను, వెనుకను రెండవ కొనను కలిపి కణజాలమునకు రక్తప్రసరణను పునరుద్ధింప జేస్తారు.

రక్తపుగడ్డల తొలగింపు ; రక్తపుగడ్డల విచ్ఛేదన[మార్చు]

ధమనులలో రక్తపు గడ్డలు ఏర్పడినా , ప్రవాహములో వచ్చి పేరుకొనినా వాటిని శస్త్రచికిత్సతో కృత్రిమ నాళికపు బుడగలను ఉపయోగించి తొలగిస్తారు. అలా తొలగించ లేనపుడు రక్తపు గడ్డల విచ్ఛేదకములను (టిష్యూ ప్లాస్మినోజెన్ ఏక్టివేటర్ ) వాడి వాటిని కరిగింపజేస్తారు.

అంగవిచ్ఛేదనము[మార్చు]

రక్తప్రసరణ కోల్పోయి కణజాలము మరణించినపుడు, పుళ్ళుపడి సూక్ష్మజీవుల ఆక్రమణ అధ్వాన్నమయినపుడు, రక్తప్రసరణ పునరుద్ధరణ సాధ్యము కానప్పుడు బాధ ఉపశమునకు, ప్రాణరక్షణకు అంగవిచ్ఛేదన అవసరము. రక్తప్రసరణకు అవరోధము ఎచట ఉన్నదో దానిని బట్టి ఎచ్చట విచ్ఛేదనము చెయ్యాలో వైద్యులు నిర్ణయిస్తారు.

దూరధమని వ్యాధిగ్రస్థులలో హృద్ధమని వ్యాధులు, గుండెపోటులు, మస్తిష్క విఘాతములు వలన మృత్యువు కలిగే అవకాశములు, అంగనష్టము కలిగే అవకాశము కంటె హెచ్చు.

మూలాలు[మార్చు]