దూర ధమని వ్యాధి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

హృదయంలో ఎడమ జఠరిక నుండి వెలువడే బృహద్ధమని శరీరంలో వివిధ అవయవాలకు శాఖల ద్వారా రక్తం అందిస్తుంది. చేతులకు, కాళ్ళకు రక్తం కొనిపోయే ధమనులను దూరధమనులుగా ఎంచుతారు.

దూర ధమని వ్యాధి

దూర ధమనులలో రక్తప్రసరణకు అంతరాయం కలుగుతే దానిని దూర ధమని వ్యాధిగా ( పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్) పరిగణిస్తారు. ఈ దూరధమని వ్యాధికి ముఖ్యకారణం ధమనీ కాఠిన్యత (ఎథిరోస్క్లీరోసిస్ ).[1][2][3]

ధమనీ కాఠిన్యత శైశవం నుంచి మొదలిడి మధ్యవయస్సు తర్వాత కనిపించి వృద్ధాప్యంలో తీవ్రతరం అవుతుంది. ఈ ప్రక్రియలో ధమనుల లోపొర క్రింద కొవ్వులు, కొలెష్టరాలు, కాల్సియం, తాపకణాలు పేరుకొని ఫలకలుగా పొడచూపుతాయి.

ఈ పలకలు రక్తనాళాల లోపలి పరిమాణంను తగ్గిస్తాయి. ధమనుల లోపలి పరిమాణం ఎక్కువగా తగ్గితే కణజాలానికి రక్తప్రసరణ తగ్గుతుంది. ధమనుల లోపొర లోని పలకలు చిట్లుతే వాటిపై తాపప్రక్రియ ( ఇన్ఫ్లమేషన్ ) కలిగి, నెత్తురుగడ్డలు ఏర్పడి రక్తప్రసరణకు ఆకస్మిక అవరోధం కలిగించగలవు.

దూరధమనుల వ్యాధి సాధారణంగా కాళ్ళలో చూస్తాము. పాదాలు గుండెకు దూరంగా ఉంటాయి కదా! ఈ వ్యాధివలన రక్తప్రసరణకు ఆటంకం ఏర్పడుతుంది. అమెరికాలో అరవై సంవత్సరాలు దాటిన వారిలో 12 నుంచి 20 శాతపు వారిలోను ఎనభై అయిదు సంవత్సరాలు దాటిన వారిలో 50 శాతపు వారిలోను దూరధమని వ్యాధి పొడచూపుతుంది. ప్రపంచంలో 20 కోట్లమంది యీ వ్యాధిగ్రస్థులు ఉంటారు. [4] భారతదేశంలో 2020 లో దూరధమని వ్యాధి గలవారు 4.1 నుంచి 5.4 కోట్లమంది ఉంటారని అంచనా.

కారణాలు[మార్చు]

కాళ్ళ ధమనులు

వృద్ధాప్యం వలన ధమనీకాఠిన్యత కలిగినా పిన్నవయస్సులోనే యీ వ్యాధిని తీవ్రతరం చేసే కారణాలను వైద్యులు , శాస్త్రజ్ఞులు చాలా సంవత్సరాల పూర్వమే పసిగట్టారు. ఇవి:

ధూమపానం[మార్చు]

దూరధమని వ్యాధిని కలుగజేసే కారణాలలో పొగత్రాగడం ప్రధమస్థానంలో నిలుస్తుంది[5]. దూరధమని వ్యాధి కలిగేవారిలో 80 నుంచి 90 శాతం మంది ప్రస్తుతం, లేక పాతదినాల్లో ధూమపానీయులే.

ఇతరుల నుంచి పొగ పీల్చినవారిలో కూడా యీ వ్యాధి కలిగే అవకాశాలు ఉన్నాయి. వీరిలో రక్తనాళాల లోపొరలో జరిగే మార్పుల వలన ధమనీ కాఠిన్యత వేగం పెరుగుతుంది. దినానికి కాల్చే పొగాకు, ధూమపానం చేసిన సంవత్సరాలతో వ్యాధి అనుపాత నిష్పత్తితో ముడిపడి ఉంటుంది.

మధుమేహవ్యాధి[మార్చు]

మధుమేహవ్యాధి ఉన్న కాలం, తీవ్రతతో దూరధమని వ్యాధి కలిగే అవకాశాలు పెరుగుతాయి[6]. మధుమేహవ్యాధి కలవారిలో దూరధమనివ్యాధి కలిగే అవకాశం రెండింతలు అవుతుంది.

కొవ్వులు, కొలెష్టరాలు[మార్చు]

అల్ప సాంద్రపు కొలెష్టరాలు హెచ్చుగా ఉన్నవారిలోను, అధిక సాంద్రపు కొలెష్టరాలు తక్కువగా ( 40 మి.గ్రా/ డె.లీ కంటె తక్కువ ) ఉన్నవారిలోను, ట్రైగ్లిసరైడులు హెచ్చుగా ఉన్న వారిలోను ఈ వ్యాధి ప్రాబల్యం హెచ్చు. రక్తపీడనం అధికమైన వారిలోను, దీర్ఘకాల మూత్రాంగ వ్యాధిగ్రస్థులలోను దూరధమని వ్యాధి ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది.

వ్యాధిలక్షణాలు[మార్చు]

దూరధమని వ్యాధిగ్రస్థులలో ప్రామాణిక లక్షణం సవిరామపు పోటు[6][7]. ఈ పోటు కాలిపిక్కలో కొంతదూరం నడిచిన పిదప క్రమరీతిలో కలిగి, విశ్రాంతి తీసుకొన్న పది నిముషాలలో క్రమరీతిలో ఉపశమిస్తుంది. ఈ పోటు సలుపుగా గాని, నొప్పిగా గాని, పోటుగా గాని, నీరసం వలె గాని పొడచూపవచ్చును. నడిచేటపుడు కాలి కండరాలకు రక్తప్రసరణ అవసరం పెరుగుతుంది. ధమనుల లోపలి పరిమాణం తగ్గడం వలన పెరిగిన అవసరాలకు తగిన రక్తప్రసరణ, ప్రాణవాయువు అందకపోవుటచే కండరాలలో నొప్పి, పోటు, కలుగుతాయి. విరామంతో అవసరాలు తగ్గడం వలన పోటు తగ్గుతుంది. కాని సుమారు పది శాతపు మందిలోనే యీ పోటు ప్రామాణికంగా ఉంటుంది. నలభై శాతం మందిలో నొప్పిగాని, బాధగాని ఉండదు. కొందఱిలో నొప్పి కాలి పిక్కలలో కలుగక పోవచ్చును. కొందఱిలో నొప్పి నడక ఆపివేసేటంత తీవ్రంగా ఉండకపోవచ్చు. కొందఱిలో నొప్పి పది నిముషాల విశ్రాంతితో ఉపశమించక పోవచ్చు.

వ్యాధి తీవ్రత హెచ్చయినవారిలో నొప్పి విశ్రాంత సమయాలలో కూడా కలుగుతుంది. సాధారణంగా యీ విశ్రాంతపు నొప్పి రాత్రుళ్ళు పడుకున్నప్పుడు కలిగి, కాలు క్రింద పల్లంలో పెట్టాక తగ్గుతుంది. అపుడు కాలికి రక్తప్రసరణ కలిగి పాదంలో ఎఱ్ఱదనం పొడచూపుతుంది. రక్తప్రసరణ లోపం వలన కణజాల నష్టం, పాదాలలో ‘ బెజ్జాలు కొట్టినట్లు ‘ కనిపించే మానుదల లేని పుళ్ళు కలుగవచ్చు.

రక్తప్రసరణకు పూర్తిగా ఆటంకం కలిగితే కాలు చల్లబడుతుంది. నొప్పి విపరీతంగా ఉంటుంది. కాలు పాలిపోయి ఉంటుంది. కణజాలాలు మరణిస్తే, వేళ్ళలోను, పాదాలలోను కుళ్ళుదల కలిగి ఆ భాగాలు నల్లబారుతాయి. దూరధమని వ్యాధి కలవారిలో వ్యాధి ఉన్న కాలి చర్మంలో రోమాలు తగ్గిపోతాయి. చర్మం దళసరి తగ్గి నున్నబడి మెరుస్తూ ఉంటుంది. కండరాలు క్షీణిస్తాయి. ధాతునాడులు నీరసిస్తాయి. నాడి చేతికి అందక పోవచ్చు. కాళ్ళు, పాదాలు ఉష్ణోగ్రత తగ్గి చల్లబడుతాయి. వ్యాధి తీవ్రంగా ఉంటే కాలు పైకి ఎత్తేటపుడు పాలిపోయి క్రిందకు దింపాక ఎఱ్ఱబడుతుంది. బెజ్జాలు కొట్టినట్లు మానుదల లేని పుళ్ళు ఉండవచ్చు. రక్తప్రసరణ లేక కణజాలం చనిపోతే, ఆ భాగం కుళ్ళి ( గాంగ్రీన్ ) నల్లబడుతుంది.

పరీక్షలు[మార్చు]

NecrosisDuetoPAD

కాళ్ళలో దూరధమని వ్యాధిని కనుగోడానికి డాప్లర్ శ్రవణాతీతధ్వని సాధనంతో చీలమండ వద్ద ఊర్ధ్వపాద ధమనిలో ముకుళిత రక్తపీడనం బాహుధమనిలో ముకుళిత రక్తపీడనం కొలిచి వాటి నిష్పత్తిని ( చీలమండ రక్తపీడనం / బాహు రక్తపీడనం ) లెక్కకట్టాలి[6]. ఆ నిష్పత్తి 0.9 కంటె తక్కువయితే దూరధమని వ్యాధిని సూచిస్తుంది. ఈ పరీక్ష సున్నితమైనది, నిశితమైనది . తొంభైయైదు శాతపు వ్యాధిగ్రస్థులలో ఈ నిష్పత్తి వ్యాధిని పసికడుతుంది.

అధిక రక్తపీడనం, మధుమేహవ్యాధి, దీర్ఘకాల మూత్రాంగ వ్యాధుల వలన అతిసూక్ష్మ ధమనులు సంకోచించి ప్రసరణలోపం కలుగజేసినపుడు యీ నిష్పత్తి వ్యాధిని పసికట్టక పోవచ్చు.

ధమనీ కాఠిన్యత హెచ్చయి రక్తనాళాల గోడలలో కాల్సియమ్ పేరుకొనడం వలన చీలమండ దగ్గఱ రక్తనాళాలు అణచడానికి వీలుబడకపోతే అంగుళి రక్తపీడనం / బాహు రక్తపీడనంల నిష్పత్తిని వ్యాధి నిర్ణయించడానికి పరిగణించవచ్చు.

వ్యాధి లక్షణాలు ఉండి చీలమండ / బాహు రక్తపీడనాల నిష్పత్తి సాధారణ పరిమితులలో ఉంటే నడక యంత్రంపై ఐదు నిముషాలు వ్యాయామం చేయించిన తర్వాత ఆ యా రక్తపీడనాలు కొలిచి చీలమండ / బాహువుల ముకుళిత రక్తపీడనాల నిష్పత్తి తీసుకొని వ్యాధి నిర్ణయించవచ్చు. వ్యాధిగ్రస్థులలో వ్యాయామం చేసిన పిదప చీలమండ / బాహువుల నిష్పత్తి 20 శాతం తగ్గుతుంది.

ధ్వని చిత్రీకరణంతో ( సోనోగ్రఫీ ) రక్తనాళాల చిత్రాలు గ్రహించి సంకుచించిన భాగాలు గుర్తించవచ్చు. రక్తనాళాలలోనికి సన్నని నాళిక చొప్పించి దాని ద్వారా వ్యత్యాస పదార్థాలు ఎక్కించి ఎక్స్ - రేలతో రక్తనాళాలను చిత్రీకరించవచ్చు. వ్యత్యాస పదార్థాలతో గణనయంత్ర ధమనీ చిత్రీకరణాలు , అయస్కాంత ప్రతిధ్వని ధమనీ చిత్రీకరణాలు చేసి వ్యాధిని ధ్రువీకరించవచ్చు.

ఇతర సమస్యలు[మార్చు]

 దూరధమని వ్యాధిగ్రస్థులు ధమనీ కాఠిన్యత ప్రభావంవలన హృద్ధమని వ్యాధులకు, మస్తిష్క రక్తనాళ విఘాతాలకు (సెరిబ్రల్ వాస్కులార్ ఏక్సిడెంట్స్) అధిక సంఖ్యలో పాలవుతారు[6]. వీరిలో గుండెపోటులు, పక్షవాతాలు కలిగే అవకాశాలు హెచ్చు. ఉదర బృహద్ధమనిలో బుడగలు (ఎన్యురిజ్మ్స్) కూడా వీరిలో కలుగవచ్చు. వీరి మూత్రాంగ ధమనులలో కూడా ధమనీకాఠిన్యం పొడచూపవచ్చు. అందువలన ఆ వ్యాధులు కనుగొనే పరీక్షలు, వాటికి చికిత్సలు కూడా అవసరమే.

చికిత్స[మార్చు]

జీవనశైలిలో మార్పులు[మార్చు]

ధూమపాన విరమణ[మార్చు]

దూరధమని వ్యాధిగ్రస్థులు ధూమపానం తప్పక విరమించాలి. రక్తప్రసరణ లోపం వలన కాళ్ళు కోల్పోయిన వారిలోచాలా మంది ధూమపానీయులే.

వ్యాయామం[మార్చు]

దూరధమని వ్యాధిగ్రస్థులకు శిక్షణపూర్వక వ్యాయామం అవసరము. నడక యంత్రాలపై గాని, నేలపైన గాని కాళ్ళలో నొప్పులు పుట్టే సమయానికి కొంచెం సమయం తగ్గించి నడుస్తూ, విరామం తీసుకుంటూ దినానికి 30 నుంచి 60 నిమిషాల వ్యాయమం చేస్తే సత్ఫలితాలు కలుగుతాయి. కాళ్ళ వ్యాయామం వలన చిన్న ధమనుల పరిమాణం పెరిగి కణజాలానికి ప్రత్యామ్నాయ ప్రసరణను పెంపొందిస్తాయి. వ్యాయామం వలన హృద్ధమని సంఘటనలు, మస్తిష్క విఘాత సంఘటనలు కూడా తగ్గుతాయి. వీరు నొప్పి లేకుండా నడవగలిగే దూరం, సమయం కూడా పెరుగుతాయి.

మధుమేహవ్యాధిని, ఆహారనియమంతోను, వ్యాయామంతోను, తగిన ఔషధాలతోను అదుపులో పెట్టుకోవాలి.

రక్తపుపోటు ఎక్కువయితే దానిని ఆహారనియమం, వ్యాయామం, ఔషధాలతో అదుపులో పెట్టుకోవాలి.

అల్పసాంద్రపు కొలెష్టరాలుని ఆహారనియమం, స్టాటిన్ మందులతో తగ్గించుకోవాలి. అధికసాంద్రపు కొలెష్టరాలుని పెంచుకోవాలి.

ట్రైగ్లిసరైడులను ఆహారనియమం, మందులతో తగ్గించుకోవాలి.

ఏస్పిరిన్[మార్చు]

దూరధమనివ్యాధి లక్షణాలు కలవారిలో ఏస్పిరిన్ వాడుక వలన ధమనులలో రక్తపుగడ్డలు ఏర్పడడం తగ్గుతుంది. హృద్ధమని సంఘటనలు, మస్తిష్క విఘాత సంఘటనలు తగ్గుతాయి. ఏస్పిరిన్ రక్తఫలకలు గుమికూడుటను నివారిస్తుంది. కణజాలపు విధ్వంసం తగ్గిస్తుంది.

క్లొపిడోగ్రెల్[మార్చు]

ఏస్పిరిన్ వాడలేనివారిలో రక్తఫలకాలు గుమికూడుటను నివారించి రక్తపు గడ్డలను అరికట్టుటకు క్లొపిడోగ్రెల్ ను ఉపయోగిస్తారు. ఏస్పిరిన్ కంటె క్లొపిడోగ్రెల్ వాడడం వలన అదనపు ప్రయోజనము ఉండవచ్చు. ఏస్పిరిన్, క్లొపిడోగ్రెల్ రెండూ కలిపి వాడుట వలన పరిశోధనలలో అదనపు ప్రయోజనం కనబడలేదు. రెండిటి వాడకం వలన రక్తస్రావ ప్రమాదాలు ఎక్కువయే అవకాశాలు ఉన్నాయి.

ఇదివరలో గుండెపోటు కలిగినవారిలో టికగ్రిలార్ ప్రమాదకర హృదయ సంఘటనలను తగ్గించడానికి ఏస్పిరిన్ తో పాటు ఉపయోగిస్తారు.

సిలొష్టజోల్[మార్చు]

సిలొష్టజోల్ వాడుక వలన దూరధమని వ్యాధిగ్రస్థులు నడవగలిగే దూరం పెరుగవచ్చును. కాని పరిశోధనలలో దీర్ఘకాలిక ప్రయోజనాలు కనిపించలేదు. హృద్ధమని సంఘటనలు, మరణాలలో తేడా కనిపించలేదు. సిలోష్టజోల్ వలన కాళ్ళలో పొంగులు కలుగవచ్చు.

హృదయవైఫల్యం లక్షణాలు ఎక్కువ కావచ్చు. దీనివలన కళ్ళుతిరుగడం, కడుపు పీకు, వంటి విలక్షణాలు కలుగవచ్చు.

పెంటాక్సిఫిలిన్ చాలా సంవత్సరములు వాడుకలో ఉన్నా దీనివలన ప్రయోజనం అనుమానాస్పదమే.

విటమిన్ బి -12, ఫోలిక్ ఏసిడ్ ల వలన ప్రయోజనం కలుగదు.

ధమనీ పునరుద్ధరణ చికిత్సలు[మార్చు]

దూర ధమనులలో వ్యాధి తీవ్రత హెచ్చయినప్పుడు, విరామ సమయాలలో నొప్పి కలుగునపుడు ధమనీ పునరుద్ధరణ అవసరం.

కృత్రిమ నాళికపు బుడగతో ధమనిలో సంకుచించిన భాగాన్ని వ్యాకోచింపజేయవచ్చును. శ్రోణిధమని, ఊరుధమనులలో వ్యాధి ఉంటే యీ ప్రక్రియ వలన ప్రయోజనం కలుగవచ్చు. క్రింద ధమనుల వ్యాధిగ్రస్థులలో ఫలితాలు తక్కువ.

ధమనిని వ్యాకోచింపజేసిన పిమ్మట వ్యాకోచ నాళికలు పొందుపఱచడం వలన ఫలితాలు మెరుగుగా లేవు. ధమనీ కాఠిన్య ఫలకల తొలగింపు వలన, ధమనిని వ్యాకోచింపజేయుటకంటె దీర్ఘకాలిక ఫలితాలు మెరుగుగా లేవు.

అధిగమన శస్త్రచికిత్సలు[మార్చు]

ధమనులలో సంకుచిత భాగాన్ని దాటుకొని రక్తప్రసరణను పునరుద్ధరించడానికి అధిగమన శస్త్రచికిత్సలు అందుబాటులో ఉన్నాయి. రోగి గరిష్ట దృశ్యసిర ( సెఫినస్ వీన్ ) కాని , కృత్రిమ నాళాన్ని కాని, ధమనిలో సంకుచిత భాగానికి ముందు ఒకకొనను, వెనుక రెండవ కొనను కలిపి కణజాలానికి రక్తప్రసరణ పునరుద్ధింప జేస్తారు.

నెత్తురుగడ్డల తొలగింపు; నెత్తురుగడ్డల విచ్ఛేదన[మార్చు]

ధమనులలో నెత్తురు గడ్డలు ఏర్పడినా , ప్రవాహంలో వచ్చి పేరుకొనినా వాటిని శస్త్రచికిత్సతో కృత్రిమ నాళికపు బుడగలను ఉపయోగించి తొలగిస్తారు. అలా తొలగించ లేనపుడు రక్తపు గడ్డల విచ్ఛేదకాలను (టిష్యూ ప్లాస్మినోజెన్ ఏక్టివేటర్ ) వాడి వాటిని కరిగింపజేస్తారు.

అంగవిచ్ఛేదనం[మార్చు]

రక్తప్రసరణ కోల్పోయి కణజాలం మరణించినపుడు, పుళ్ళుపడి సూక్ష్మజీవుల ఆక్రమణ అధ్వాన్నమయినపుడు, రక్తప్రసరణ పునరుద్ధరణ సాధ్యం కానప్పుడు బాధ ఉపశమించడానికి, ప్రాణరక్షణకు అంగవిచ్ఛేదన అవసరం. రక్తప్రసరణకు అవరోధం ఎచట ఉన్నదో దానిని బట్టి ఎచ్చట విచ్ఛేదనం చెయ్యాలో వైద్యులు నిర్ణయిస్తారు.

దూరధమని వ్యాధిగ్రస్థులలో హృద్ధమని వ్యాధులు, గుండెపోటులు, మస్తిష్క విఘాతాలు వలన మృత్యువు కలిగే అవకాశాలు, అంగనష్టము కలిగే అవకాశం కంటె హెచ్చు.

నివారణ[మార్చు]

దూరధమని వ్యాధి ధమనీకాఠిన్యం ( ఎథిరోస్క్లీరోసిస్ ) వలన కలుగుతుంది . అందువలన ధమనీకాఠిన్యంను అదుపుచేయు చర్యలు తీసుకోవాలి. పొగ త్రాగరాదు[4][5]. రక్తపుపోటుని అదుపులో ఉంచుకోవాలి. మధుమేహవ్యాధిని అదుపులో ఉంచుకోవాలి. కొలెష్టరాలు ఎక్కువగా ఉంటే దానిని తగ్గించుకోవాలి. ఊబకాయంను తగ్గించుకోవాలి. తగినంత వ్యాయామం చేస్తుండాలి. ఈ చర్యలు ధమనీకాఠిన్యత ప్రక్రియను మందగించుతాయి. ఆహారంలో ఆకుకూరలు , కూరగాయలు , పళ్ళు , అపరాలు, ఆలివ్ నూనె వాడుట మంచిది. మాంసాహారం తినేవారు చేపల వాడుక పెంచి మిగిలిన మాంసం మితపరచుకోవడం మేలు. సారాయి వాడుకను మితపరచుకోవాలి.

కర్ణికా ప్రకంపన ( ఏట్రియల్ ఫిబ్రిలేషన్ ) ఉన్నవారు, కృత్రిమ హృదయకవాటాలు ఉన్నవారు నెత్తురుగడ్డలను నివారించే మందులు ( ఏంటికొయాగ్యులెంట్స్ ) వాడుకోవాలి.

మూలాలు[మార్చు]

  1. "What Is Peripheral Vascular Disease?" (PDF). American Heart Association (heart.org). 2012. Archived (PDF) from the original on ఏప్రిల్ 12, 2015. Retrieved ఫిబ్రవరి 26, 2015. Peripheral artery disease (PAD) is the narrowing of the arteries to the legs, stomach, arms and head.
  2. "Overview of Peripheral Arterial Disease – Heart and Blood Vessel Disorders". Merck Manuals Consumer Version. Retrieved 30 April 2019. Disorders of arteries that supply the brain with blood are considered separately as cerebrovascular disease.
  3. Creager MA, Loscalzo J (2018). "Arterial Diseases of the Extremities Chapter 275". Harrison's Principles of Internal Medicine. McGraw Hill. 20. Retrieved 10 April 2023 – via Access Medicine.
  4. 4.0 4.1 Health, Narayana (2020-09-18). "What is Peripheral Arterial Disease (PAD)?". Narayana Health Care. Retrieved 2023-05-18.
  5. 5.0 5.1 "Peripheral Artery Disease - Causes and Risk Factors | NHLBI, NIH". www.nhlbi.nih.gov. 2022-03-24. Retrieved 2023-05-19.
  6. 6.0 6.1 6.2 6.3 The Washington Manual Of Medical Therapeutics. Washington University in St. Louis. 2023. p. 866. ISBN 978-1-975190-62-0.
  7. "Occlusive Peripheral Arterial Disease - Heart and Blood Vessel Disorders". Merck Manuals Consumer Version. Retrieved 2023-05-19.