ధమనీకాఠిన్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శరీరంలో అవయవాలు పనిచేయడానికి అవసరమయే ప్రాణవాయువును, పోషకపదార్థాలను అందించుటకు, వాటి జీవనప్రక్రియలో వెలువడే బొగ్గుపులుసువాయువు, ఇతర మాలిన్యాలను తొలగించుటకు రక్తప్రసరణ అవసరం. అవయవాలకు ధమనులు గుండె ఎడమ భాగం నుంచి రక్తంను అందిస్తే, సిరలు వాటి నుంచి రక్తమును గ్రహించి హృదయంలో కుడి భాగానికి చేరుస్తాయి. ఊపిరితిత్తులలో రక్తం బొగ్గుపులుసువాయువును విసర్జించి ప్రాణవాయువును గ్రహిస్తుంది.

ధమనీకాఠిన్యం (ఎథిరోస్క్లీరోసిస్)

[మార్చు]

ధమనుల లోపలిపొరలో పూతకణాల క్రింద కొలెష్టరాలు, కొవ్వులు, తాపకకణాలు, కాల్సియమ్ వయస్సుతో క్రమేణా పేరుకొని పలకలుగా ఏర్పడి ధమనులను సంకోచపఱచు వ్యాధి ధమనీకాఠిన్యం [1]( ఎథిరోస్క్లీరోసిస్). ధమనీకాఠిన్యం తీవ్రమయినప్పుడు ఆయా అవయవాల రక్తప్రసరణపై  ప్రభావం చూపించగలదు[2]. ధమనీకాఠిన్యం హృద్ధమనులలోను, మెదడుకు రక్తం కొనిపోవు ధమనులు, వాటి శాఖలలోను, కాళ్ళకు, పాదాలకు రక్తం కొనిపోయే దూరధమనులలోను, మూత్రాంగ ధమనులలోను, ప్రేవులకు రక్తము కొనిపోవు అంత్రిక ధమనులలోను కలిగినపుడు రక్తప్రసరణ లోపించి గుండెపోటులు, మస్తిష్కవిఘాతాలు (ష్ట్రోక్స్), దూరధమని వ్యాధులు, మూత్రాంగ వ్యాధులు, ప్రేవులలో వ్యాధులు కలుగగలవు[3]

కారణాలు

[మార్చు]
Atherosclerosis timeline - endothelial dysfunction

గుండెనొప్పులకు గుండెపోటులకు, మెదడులో రక్తనాళ ప్రమాదాలకు, దూరధమనులలో రక్తప్రసరణ లోపాలకు, మూత్రపిండాల వైఫల్యాలకు  ధమనీకాఠిన్యం[4] (ఎథిరోస్క్లీరోసిస్) కారణమని వైద్యులు, శాస్త్రజ్ఞులు  గ్రహించిన పిదప, ధమనులు బిరుసు ఎక్కడానికి కారణాలు గణాంకాలు, పరిశోధనల ద్వారా కనుగొన్నారు. ఇవి  అధిక రక్తపు పోటు, మధుమేహవ్యాధి, పొగత్రాగడం, అనారోగ్యపు ఆహారపుటలవాట్లు (కొలెష్ట్రాల్, సంతృప్తపు కొవ్వుపదార్థాలు ఎక్కువగా ఉన్నపదార్థాలు తినడం, మద్యం ఎక్కువగా త్రాగడం), వ్యాయామలోపం, వంశానుగత జన్యువులు, వృద్ధాప్యం,[1][5] రుమాటిక్ కీళ్ళనొప్పులు, పొలుసుల చర్మవ్యాధి (సొరియాసిస్) వంటి తాపక వ్యాధులు కలవారిలో ధమనీకాఠిన్యం కలిగే అవకాశాలు ఎక్కువ.[5],

ధమనుల లోపొరలో కొలెష్ట్రాలు, కొవ్వులు చేరడం పిన్న వయస్సులో మొదలైనా ధమనీకాఠిన్యం లక్షణాలు పురుషులలో 45 సంవత్సరాల తరువాత, స్త్రీలలో 55 సంవత్సరాల తరువాత అగుపించుట ఆరంభిస్తుంది. 45-85 సంవత్సరాల వయస్సు వారిలో మృత్యువుకు ప్రధమ కారణం ధమనీకాఠిన్యం.

వ్యాధి విధానం

[మార్చు]
Blausen 0227 Cholesterol

ధమనుల గోడలలో బయటపొర (ఎడ్వంటీషియా) మధ్యపొర (మీడియా) లోపొర (ఇంటిమా) అనే మూడు పొరలు ఉంటాయి. బయటపొరలో సాగుకణజాలం, పీచుకణజాలం ఉంటాయి. మధ్యపొరలో మృదుకండరాలు, సాగుకణజాలం, పీచుకణజాలం, పీచుపదార్థం (కొల్లజెన్) ఉంటాయి. ధమని నాళపు లోపొరలో పూతకణాలు ఒక వరుసలో (ఎండోథీలియం) ఉంటాయి. పూతకణాల క్రింద శర్కరమాంసకృత్తుల మాతృకతో సాగుపదార్థం (ఎలాష్టెన్ ) పీచుపదార్థం మూలాధారాన్ని  అంటిపెట్టుకొని ఉంటాయి.

వయస్సుతో బాటు పైన పేర్కొన్న కారణాల వలన ధమనుల లోపొరలో పూతకణాల క్రింద కొలెష్ట్రాలు, కొవ్వులు  క్రమేణ పేరుకొంటాయి. రక్తంలో ఉన్న కొవ్వులను భక్షక కణాలు మింగి ధమనుల లోపొర క్రింద చేరుకుంటాయి. కొవ్వులు, కొలెష్ట్రాలను మింగిన భక్షణ కణాలు ఫేనకణాలుగా (ఫోమ్ సెల్స్ ) మారుతాయి. ఈ కణాలు విచ్ఛిన్నమయినపుడు ఆ కొవ్వులు బయటకు రావడం వాటిని మరల కబళించడానికి మరికొన్ని తెల్లకణాలు, భక్షక కణాలు చేరడం, ఆ ప్రాంతములో తాప ప్రక్రియ (ఇన్ఫ్లమేషన్) కలగడం జరుగుతాయి. కొలెష్ట్రాలు, కొవ్వులు లోపొరలో చేరినచోట మధ్యపొరలో కాల్షియం కూడా పేరుకొని క్రమేణ పలకలు ఏర్పడుతాయి. మధ్యపొరలో ఉన్న మృదుకండర కణాలు లోపొర లోనికి వలసపోయి వృద్ధిపొందుతాయి.ఇవి ధ్వంసమయితే వీటి స్థానంలో పీచుపదార్థం ఏర్పడుతుంది. కొన్ని జీవోత్ప్రేరకముల (ఎంజైమ్స్) వలన ధమని గోడలలో సాగుదల కలిగి ఆరంభ దశలలో ఫలకలు ఏర్పడినా నాళాల లోపలి పరిమాణం తగ్గదు[6]. వ్యాధి ముదిరినప్పుడు నాళపు లోపల పరిమాణం కుచించుకుపోతుంది. ధమనులు కుచించుకుపోయినపుడు అవయవాలకు రక్తప్రసరణ తగ్గి ప్రాణవాయువు అందింపు కూడా తగ్గిపోతుంది. ధమనులలో కొవ్వు పలకలు పగుళ్ళు పెట్టి అచ్చట నెత్తురు గడ్డకడితే రక్తప్రసరణకు ఆకస్మికంగా అంతరాయం కలుగుతుంది. రక్తప్రసరణకు భంగం తీవ్రమయితే నెత్తురు అందని కణజాలం మృతిచెందుతుంది. హృదయ ధమనులలో ఈ ప్రక్రియ కలిగితే గుండెపోటులు[4], మెదడు రక్తనాళాలలో యీ ప్రమాదం జరిగితే మెదడు దెబ్బతిని పక్షవాతాలు (మస్తిష్క విఘాతాలు; స్ట్రోక్స్) కలుగవచ్చు. కాళ్ళకు పాదాలకు వెళ్ళే దూరధమనులలో ధమనీకాఠిన్యం వలన దూరధమని వ్యాధిని చూస్తాము. ప్రేవుల ధమనులలో ధమనీ కాఠిన్యం వలన ప్రేవులకు రక్తప్రసరణ లోపం (మిసెంటెరిక్ ఇస్ఖీమియా) కలుగుతుంది. పురుషులలో నపుంసకత్వానికి ధమనీకాఠిన్యం ఒక ముఖ్యకారణం.

ధమనీకాఠిన్యంలో ధమని గోడలలో ఉండే మృదుకండర కణాలు ధ్వంసం చెంది కొల్లజెన్ తంతుజాలం ఏర్పడినప్పుడు రక్తనాళాల గోడలు బలహీనమయి పొంగితే ధమనుల బుడగలు (ఎన్యురిజెమ్స్) ఏర్పడగలవు.

వ్యాధి నిర్ణయం

[మార్చు]

ధమనీకాఠిన్యం రక్తప్రసరణకు అంతరాయం కలిగిస్తుంది. కాబట్టి దాని లక్షణాలు ప్రసరణ తగ్గిన అవయవాల లక్షణాలుగా కనిపిస్తాయి. హృద్ధమనులలో ధమనీకాఠిన్యం ఛాతినొప్పి, గుండెపోటులుగా[7] కనిపిస్తుంది. మెదడుకు రక్తం కొనిపోయే గళధమని, వెన్నుధమనులు, వాటి శాఖలలో రక్తప్రసరణకు భంగం కలుగుతే పక్షవాతం కాని తాత్కాలిక పక్షవాతం కాని కలిగి కండరాలలో శక్తి పోవడం, మాటపోవడం, స్పర్శజ్ఞానం లోపించడం, శరీరం నిలకడ తప్పడం, అపస్మారకత వంటి లక్షణాలు కలుగుతాయి. దూరధమని వ్యాధి ఉన్నవారిలో నడకతో కాళ్ళ కండరాలలో సలుపు, పాదాలు చల్లబడడం, కణజాలం మృతిచెంది కుళ్ళిపోవడం వంటి లక్షణాలు కలుగుతాయి. ప్రేవులలో ధమనీకాఠిన్యం వలన కడుపు నొప్పులు కలుగుతాయి. ప్రేవులలో కొంతభాగం ప్రసరణరహిత మరణం చెంది కుళ్ళే (గాంగ్రీన్) అవకాశం కూడా ఉంది. మూత్రపిండాల ధమనులలో ధమనీకాఠిన్యం వలన అధిక రక్తపుపోటు, మూత్రాంగ వైఫల్యాలు కలుగగలవు. లక్షణాల బట్టి ఆయా అవయవ వ్యాధులకు పరీక్షలు చేసి చికిత్సలు చెయ్యాలి.

చికిత్స, నివారణ

[మార్చు]
  • రక్తపుపోటు పరిమితులకు (130/80 మి.మీ పాదరసం) మించి ఉంటే ఆహారంలో ఉప్పు తగ్గించుకొనుట, వ్యాయామము చేయుట, ఎక్కువ బరువున్నవారు బరువు తగ్గడం వంటి జీవనరీతులలో మార్పుల వలనను, ఔషధాలతోను రక్తపుపోటును అదుపులో ఉంచుకోవాలి.
  • ధూమపానం చేయకూడదు. మద్యం వాడేవారు దాని వినియోగం అదుపులో పెట్టుకోవాలి[8].
  • మధుమేహవ్యాధి ఉంటే దానిని అదుపులో పెట్టుకోవాలి.
  • అల్పసాంద్ర కొలెష్ర్టాల్, ట్రైగ్లిసరైడులు రక్తంలో ఎక్కువ ఉంటే తగిన ఆహారంతోను, స్టాటిన్స్[9] వంటి మందులతోను  తగ్గించుకోవాలి. సంతృప్తపు కొవ్వుల వాడుక తగ్గించుకోవాలి[8][10]. ఊబకాయం, ఎక్కువ బరువున్నవారు బరువు తగ్గాలి..
  • వ్యాయామం తగినంత చెయ్యాలి.రోజులో 7-8 గంటలు నిద్రపోవాలి. మానసిక వత్తిడులను తగ్గించుకోవాలి.
  • ధమనీ కాఠిన్యానికి గురి ఆయిన అవయవాల వ్యాధులకు తగిన చికిత్సలు కూడా అవసరం.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Arteriosclerosis / atherosclerosis - Symptoms and causes". Mayo Clinic. Retrieved 2023-07-16.
  2. "Atherosclerosis - Symptoms | NHLBI, NIH". www.nhlbi.nih.gov. 2022-03-24. Retrieved 2023-07-16.
  3. "Atherosclerosis - Symptoms | NHLBI, NIH". www.nhlbi.nih.gov. 2022-03-24. Retrieved 2023-07-16.
  4. 4.0 4.1 Achanta 5, Siri 5 (2023). The Washington Manual Of Medical Therapeutics. Wolters Kluwer. pp. 98, 113, 126, 973. ISBN 978-1-975190-62-0.{{cite book}}: CS1 maint: numeric names: authors list (link)
  5. 5.0 5.1 "Atherosclerosis - Causes and Risk Factors | NHLBI, NIH". www.nhlbi.nih.gov. 2022-03-24. Retrieved 2023-07-16.
  6. Glagov, Seymour; Weisenberg, Elliot; Zarins, Christopher K.; Stankunavicius, Regina; Kolettis, George J. (1987-05-28). "Compensatory Enlargement of Human Atherosclerotic Coronary Arteries". New England Journal of Medicine. 316 (22): 1371–1375. doi:10.1056/NEJM198705283162204. ISSN 0028-4793.
  7. "What Are the Signs and Symptoms of Coronary Heart Disease? - NHLBI, NIH". web.archive.org. 2015-02-24. Archived from the original on 2015-02-24. Retrieved 2023-07-16.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  8. 8.0 8.1 "Atherosclerosis - Prevention | NHLBI, NIH". www.nhlbi.nih.gov. 2022-03-24. Retrieved 2023-07-16.
  9. Taylor, Fiona; Huffman, Mark D; Macedo, Ana Filipa; Moore, Theresa HM; Burke, Margaret; Davey Smith, George; Ward, Kirsten; Ebrahim, Shah; Gay, Hawkins C (2013-01-31). "Statins for the primary prevention of cardiovascular disease". The Cochrane Database of Systematic Reviews. 2013 (1): CD004816. doi:10.1002/14651858.CD004816.pub5. ISSN 1469-493X. PMC 6481400. PMID 23440795.
  10. "Your Guide to Lowering Cholesterol With Therapeutic Lifestyle Changes (TLC) | NHLBI, NIH". www.nhlbi.nih.gov. 2005-12-01. Retrieved 2023-07-16.