Jump to content

ధర్మపక్షులు

వికీపీడియా నుండి

ధర్మపక్షులు అనగా వింగాక్ష, విబోధ, సుపత్ర, సుముఖి నామకములు అగు నాలుగు పక్షులు. పూర్వము విపులుఁడు అను ఒక ముని ఉండెను. అతనికి సుకృశుఁడు, తుంబురుఁడు అను నిరువురు కొడుకులు ఉండిరి. అందు సుకృశుని ఒకప్పుడు ఇంద్రుఁడు పక్షిరూపియై నరమాంసమువేడఁగా తన నలువురి కొడుకులలో ఎవ్వనైన ఒకని ఇంద్రునకు ఆహారము కమ్ము అనిని వారు సమ్మతింపక పోయిరి. అందుకు వారి తండ్రి అలిగి వారిని పక్షులు కమ్ము అని శపించెను. అంతట కొడుకులు తండ్రి కాళ్ల మీఁద పడి ఈ శాపము తొలఁగ అనుగ్రహింపుము అని ప్రార్థింపఁగా ఆసుకృశుఁడు శాంతివహించి వారికి జైమినిముని సంశయములను నివర్తించి ఆరూపములు వదలి ఉత్తమపదము పడయునట్లు కరుణించెను. ఇవి మార్కండేయ పురాణమును జైమినికి చెప్పిన ధర్మపక్షులు.

భారతయుద్ధము జరుగుచు ఉండఁగా అచ్చట మెలఁగుచు ఉండిన ఒక పక్షియొక్క గర్భము అర్జునుఁడు శత్రులమీఁద ప్రయోగించిన బాణము తగిలి భేదిల్లఁగా అందలి గ్రుడ్లు నాలుగు ఆ యుద్ధరంగములో ఒక ఏనుఁగు మెడనుండు ఘంటక్రింద అడఁగి కొన్నాళ్లకు పిల్లలై కిచకిచలాడుచుండ శమీకుఁడు అను ఋషిచూచి తన ఆశ్రమమునకు కొనిపోయిపెంచెను. అవియ ఈ ధర్మపక్షులు. ఆ పులుఁగులు ఆవల వింధ్య పర్వతము చేరెను.