నరకం మరెక్కడో లేదు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నరకం మరెక్కడో లేదు
రచయితసుఖమంచి కోటేశ్వరరావు
ఒరిజినల్ భాషతెలుగు
విషయంసాంఘిక నాటిక

నరకం మరెక్కడో లేదు సుఖమంచి కోటేశ్వరరావు (విజయవాడ) రచించిన సాంఘిక నాటిక. నరకం అనేది ఎక్కడో లేదని, ప్రభుత్వ వైద్యశాలే నరకం వంటిదని, ప్రభుత్వ వైద్యశాలల్లోని అవినీతి, లంచగొండితనం, నిర్లక్ష్యం మూలంగా సాధారణ ప్రజలు అనుభవిస్తున్న బాధలను ఈ నాటిక హృద్యంగా వివరించింది.[1] 1980లో రచించిన నాటికను రాజమహేంద్రవరంకు చెందిన ప్రజా దర్శకుడు టి.జె రామనాధం అద్భుత దృశ్యకావ్యంగా రూపుదిద్దాడు. రంగస్థలంను ఆరు భాగాలుగా విభజించి ఓ వైద్యశాల సెట్ వేశాడు. ప్రధాన ద్వారం, రోగులు నిరీక్షణ గది, పెద్ద డాక్టరు గది, ఇంజెక్షన్ గది, సర్జరీ రూమ్‌, మార్చురీ, జనరల్‌ వార్డులతో ఆసుపత్రి ప్రేక్షకుల ముందు ప్రత్యక్ష మవుతుంది.[2]

ఇతివృత్తం[మార్చు]

పేదల పట్ల వైద్యుల, నర్సుల నిర్లక్ష్యపు ధోరణి... మంత్రుల బిడ్డలకు చేసే మర్యాదలు... బతికున్న మనిషిని నిర్లక్ష్యం చేసి మార్చురీలో పడెయ్యడం... శవాన్ని చూడాలనుకున్న రక్త సంబంధీకుల దగ్గర లంచాలడిగే కర్కశత్వం... యాక్సిడెంట్‌ అయ్యి ప్రాణాపాయంలో ఉన్న పేషెంట్‌ని సంపూర్ణంగా నిర్లక్ష్యం చేసి, తమ ప్రాణం మీద కొచ్చినపుడు అతన్ని బతికించడానికి పడే తపన... పసిబిడ్డలను మార్చేయ్యడం... వద్దనుకున్న బిడ్డను అధికారానికి భయపడి ప్రమోషన్‌ కోసం స్వార్థంతో చంపెయ్యడం... ఏ స్ధాయి మహిళ ఉద్యోగినైనా లైంగిక దృష్టితో చూడటం... అది డాక్టరయినా, క్లాస్‌ ఫోర్‌ ఎంప్లాయైనా మగ దృష్టితోనే వ్యవహరించడం... మహిళలు సైతం మనుగడ కోసం తమ స్త్రీత్వాన్ని ప్రదర్శించడం వంటివి ఈ నాటిక ఇతివృత్తం.

హాస్పిటల్‌లో జరిగే అవినీతితో ఆరంభమై, డబ్బుల వాటాల్లో కొట్టుకు చచ్చే పెద్దా, చిన్న డాక్టర్లల స్వభావాలను, డాక్టర్లు నర్సుల సరససల్లాపాలు, రోగుల పట్ల నిర్లక్ష్యం ఈ నాటిక కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది.

ఇతర వివరాలు[మార్చు]

మొత్తం 11 పాత్రలుగల ఈ నాటిక కొన్ని వందల ప్రదర్శనలు పూర్తిచేసుకొని, వేదికెక్కిన ప్రతిచోటా బహుమతులు అందుకుంది.

మూలాలు[మార్చు]

  1. తెలుగు నాటకరంగం నూతన ధోరణులు - ప్రయోగాలు, (పుట. 521), రచన. డా. కందిమళ్ల సాంబశివరావు
  2. ప్రజాశక్తి. "ఆసుపతి నరకంపై రంగస్థల దృశ్యం". Retrieved 9 August 2017.