నవనందులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలు జిల్లా, నంద్యాలకు కొన్ని కిలోమీటర్ల దూరంలో మహానంది వద్ద శ్రీ మహానందీశ్వరస్వామి ఆలయం ఉంది. ఈ మహానందికి చుట్టూ 18 కి.మీ. వలయంలో తొమ్మిది నంది ఆలయాలున్నాయి. వీటన్నింటిని కలిపి నవనందులు అంటారు.[1][2]

నవనందుల ప్రాముఖ్యత

[మార్చు]
మహానందిలో నంది విగ్రహం

ఎవరు సదాశివ నామస్మరణ చేస్తారో అలాంటి వారి వెంటే శివుడుంటాడు. అలాంటి తన నిజమైన భక్తుల్నే శివుడు వెన్నంటి కాపాడుతాడు. ఆ స్వామి తన భక్తులకోసం వెలసిన క్షేత్రాలు మన దేశంలో అనేకం ఉన్నాయి. ఆ పరంపరలోని మరో విశిష్ఠ శైవ క్షేత్రమే నంది మండలం. ఇది కర్నూలు జిల్లాలో ఉంది. నంద్యాల చుట్టూ నవ నందులుండడంవల్ల ఈ క్షేత్రానికి ఆ పేరు వచ్చింది. నంద్యాల కర్నూలు జిల్లాలో ఉన్న ఒక విశిష్టమైన పట్టణం. చారిత్రక విశేష గాథలతో ముడిపడి ఉన్న ఈ పట్టణానికి ఆ పేరు రావడానికి కూడా అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. కుందూ నదీ తీరాన ఉన్న ఈ పట్టణాన్ని పూర్వం నందియాల అని పిలిచేవారు. 14వ శతాబ్దంలో నందన మహారాజు ఈ మండలం చుట్టూ నవ నందులను నిర్మించడంవల్ల దీనికి నంది మండలమని పేర్కొచ్చిందని చెబుతారు. ఇదే కాలాంతరంలో నంద్యాలగా రూపాంతరం చెందింది. మంచి వాణిజ్య కేంద్రంగా ఉన్న నంద్యాల ప్రముఖ శైవ క్షేత్రంగా కూడా పేర్గాంచింది. మండలంలో ఉన్న నవ నందులలో మూడు నందులు ఇక్కడే ఉండడం విశేషం.[3]

ప్రథమ నంది

[మార్చు]

నవ నందులలో ప్రథమమైన ప్రథమ నందీశ్వరాలయం ఇక్కడే ఈ పట్టణంలోనే ఉంది. నంద్యాల పట్టణంలో శ్యామ్ కాల్వ గట్టున ఈ ఆలయం అలరారుతోంది. విజయనగర రాజుల కాలంలో ఎంతో అభివృద్ధి చెందిన ప్రథమ నందీశ్వరాలయం అనంతర కాలంలో ఆదరణ లేక జీర్ణావస్థకు చేరుకుంది. అయితే ఇటీవల కాలంలో భక్తులు, వధాన్యుల సహకారంతో ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. ప్రశాంతమైన వాతావరణం, ఆహ్లాదకరమైన పరిసరాలు ఈ ఆలయం సొంతం. విశాలమైన ప్రాంగణంలో అలరారుతున్న ఈ దివ్యాలయానికి చేరుకోగానే అక్కడి ప్రశాంత వాతావరణం మైమరపిస్తుంది. గర్భాలయంలో ప్రథమ నందీశ్వరుడిగా కొలువులందుకుంటున్న కేదారేశ్వర లింగం భక్తులకు దర్శనమిస్తుంది. తేజో విరాజమానమవుతున్న కేదారేశ్వర లింగ దర్శనం, కేదారనాథ్‌లో కేదారేశ్వర లింగ దర్శన ఫలాన్నిస్తుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. ఇక్కడే మరోపక్క కేదారేశ్వరి మాత కొలువుతీరి ఉంది. సర్వాభూషణ శోభితంగా కానవచ్చే ఆ తల్లి దర్శనం సర్వమంగళకరం.

నాగనంది

[మార్చు]

నంద్యాల పట్టణంలో ఆర్టీసీ బస్టాండుకు సమీపంలోఉన్న ఆంజనేయస్వామి ఆలయంలో నాగనందీశ్వరుడు కొలువుదీరాడు. కోదండ రామాలయంగా ఖ్యాతికెక్కిన ఈ ఆలయం కూడా అతి పురాతనమైనదే.ఈ ఆలయం కొన్ని ఆలయాల కూడికగా కానవస్తుంది. ఈ మందిరంలో భారీ ఆకారంలో ఉన్న ఆంజనేయస్వామి మూర్తి చూపరులను విపరీతంగా ఆకర్షిస్తుంది. విశాల శిల్ప మూర్తిగా ఉన్న ఈ ఆంజనేయస్వామి దర్శనం సర్వ మంగళకరం. ఆంజనేయస్వామి గర్భాలయానికి సమీపంలో ఉన్న చిన్న మండపంలో నాగ నందీశ్వరుడు కొలువుదీరాడు. నవ నందులలో నాగ నందీశ్వరుడు రెండవ వాడు.

సోమనంది

[మార్చు]

నంద్యాల పట్టణంలోనే ఆత్మకూరు బస్టాండుకు సమీపంలో ఉన్న మరో ఆలయం శ్రీ సోమ నందీశ్వరాలయం. చంద్రుడు ఇక్కడ మహేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించడంవల్ల ఈ లింగానికి సోమ నందీశ్వర లింగమనే పేరొచ్చింది. ఈ ఆలయం ప్రాంగణం చిన్నదే అయినప్పటికీ ప్రాశస్త్యం రీత్యా ఇక్కడ స్వామివారి మహిమ గొప్పది. గర్భాలయంలో సోమ నందీశ్వరుడు దర్శనమిస్తాడు.

శివనంది

[మార్చు]

నంద్యాలకు సుమారు 15 కిలోమీటర్లు దూరంలో ఉన్న మహిమాన్విత క్షేత్రమే శివనందీశ్వరాలయం. శివనందిగా పేర్గాంచిన ఈ క్షేత్రం నవ నందులలో విశేషమైన నందిగా ఖ్యాతి గాంచింది. ఈ ఆలయం బండి ఆత్మకూరు మండలం కడమల కాల్వ గ్రామంలో ఉంది. అతి పురాతన ఈ క్షేత్రాన్ని చేరుకోవడానికి నంద్యాల వరకు బస్సు లేదా రైలులో చేరుకోవాలి. అనంతరం అక్కడనుంచి ఏదైనా వాహనంలో గాని, బస్సులో గాని ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. ప్రశాంతమైన వాతావరణం, పచ్చని ప్రకృతి దృశ్యాలు ఆభరణాలుగా అలరారుతున్న ఈ ఆలయ శోభ అనన్య సామాన్యం.విశాలమైన ప్రాంగణంలో ఉన్న ఈ ఆలయ ప్రాంగణంలోనో కట్టడాలన్నీ చాళుక్యుల కాలం నాటివిగా ఇక్కడి ఆధారాల ద్వారా అవగతమవుతోంది. 14వ శతాబ్దంలో నందన మహారాజు ఇక్కడ శివనందిని ప్రతిష్టించినట్లు ఇక్కడి ఆధారాల ద్వారా తెలుస్తోంది. అనంతరం విజయనగర రాజుల కాలంలో ఎంతో అభివృద్ధి చెందిన ఈ ఆలయం అనంతర కాలంలో ఆదరణ లేక జీర్ణావస్థకు చేరుకుంది. అయితే ఇటీవల కాలంలో భక్తులు, వధాన్యుల సహకారంతో ఈ ఆలయాన్ని పనర్నిర్మించారు. గర్భాలయంలో శివనందీశ్వరుడిగా కొలువులందుకుంటున్న మహాదేవ లింగం భక్తులకు దర్శనమిస్తుంది. తేజో విరాజమానమవుతున్న పరమేశ్వర లింగ దర్శనం, అమోఘమైన పుణ్యఫలాన్నిస్తుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. ముఖ మండపంలో మరోపక్క పార్వతి మాత కొలువుదీరి ఉంది. సర్వాభూషణ శోభితంగా కానవచ్చే ఆ తల్లి దర్శనం సర్వ మంగళకరం. ఇదే ఆలయ ప్రాంగణంలో మరో వైపు భాగంలో వీరభద్రస్వామి కూడా కొలువుదీరాడు.

విష్ణునంది లేక కృష్ణ నంది

[మార్చు]

శివనందీశ్వరస్వామి ఆలయానికి మూడు కిలోమీటర్లు దూరంలో తెలుగు గంగ కాల్వకు సమీపంలో విష్ణు నందీశ్వరుడు కొలువుదీరాడు. దట్టమైన నల్లమల అడవుల మధ్యలో ఉన్న ఈ ఆలయ శోభ వర్ణనాతీతం.. ఈ ఆలయానికి చేరుకున్న భక్తులు ఇక్కడి ప్రకృతి అందాలకు మైమరచిపోతారు. చుట్టూ పరచుకున్న నల్లమల అడవీ ప్రాంతం, ఇంకో పక్క కొండలు, గుట్టలు ఈ క్షేత్రానికి వచ్చిన భక్తుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. విష్ణునంది లేక కృష్ణనందిగా పేర్గాంచిన ఈ క్షేత్రంలో సాక్షాత్తు విష్ణుమూర్తి ఇక్కడ భవ్య లింగాన్ని ప్రతిష్టించినట్లు ఇక్కడి స్థల పురాణాల ద్వారా చెబుతున్నాయ. ఆ కారణంగానే ఈ నందికి విష్ణునంది అనే పేరొచ్చింది. గర్భాలయంలో విష్ణునందీశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. లింగ రూపంలో ఉన్న విష్ణు నీదంశ్వరుడి దర్శనం పూర్వజన్మల పుణ్య ఫలంగా భక్తులు భావిస్తారు. ఓ ప్రత్యేకమైన లోకాలకు తోడ్కొనిపోయే ఈ దివ్యాలయం చుట్టూ పురాతన కాలంనాటి కోనేరు, నవగ్రహాలు, వినాయక, విష్ణు, లక్ష్మి మందిరాలున్నాయి. ఆలయానికి సమీపంలో సెలయేరు నిత్యం పారుతూ ఉంటుంది. ఈ ఆలయానికి వచ్చిన భక్తులు ఈ సెలయేటిలోనే భక్తితో స్నానాలు చేసి విష్ణునందీశ్వరుడ్ని దర్శించుకుంటారు.

సూర్యనంది

[మార్చు]

నంద్యాలకు సుమారు 8 కిలోమీటర్లు దూరంలో ఉన్న మహిమాన్విత క్షేత్రమే సూర్య నందీశ్వరాలయం. సూర్యనందిగా పేర్గాంచిన ఈ క్షేత్రం నవనందులలో విశేషమైన నందిగా ఖ్యాతిగాంచింది. సూర్యుడు ఇక్కడ శివుడి గురించి తపస్సు చేసి ఆ స్వామి లింగాన్ని ప్రతిష్టించాడు. ఆ కారణంగా ఇది సూర్యనంది అయ్యింది. పూర్వకాలం నాటి ఆనవాళ్ళతో అలరారుతున్న ఈ ఆలయాన్ని అనంతరం భక్తులు, వధాన్యుల సహకారంతో నిర్మించారు. ఈ ఆలయం యు.బొల్లవరం గ్రామానికి సమీపంలో తమ్మడపల్లె గ్రామంలో ఉంది. అతి పురాతన ఈ క్షేత్రాన్ని చేరుకోవడానికి నంద్యాల వరకు బస్సు లేదా రైలులో చేరుకోవాలి. అనంతరం నంద్యాలనుంచి మహానంది మార్గంలో ఏడు కిలోమీటర్లు ప్రయాణించి యు. బొల్లవరం గ్రామానికి చేరుకోవాలి. అక్కడనుంచి కుడి చేతివైపుగా కిలోమీటరు దూరం ప్రయాణిస్తే ఈ ఆలయానికి చేరుకోవచ్చు. తమ్మడపల్లె ఓ చిన్ని గ్రామం. ఇక్కడ ఉన్న సూర్య నందీశ్వరాలయంవల్ల ఈ గ్రామ ఖ్యాతి దశ దిశలా వ్యాపించింది. 14వ శతాబ్దంలో నందన మహారాజు ఇక్కడ సూర్యనంది ఆలయాన్ని కట్టించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. గర్భాలయంలో సూర్య నందీశ్వరుడిగా కొలువులందుకుంటున్న ఆలయంలో మరో పక్క పార్వతి మాత కొలువుదీరి ఉంది.

గరుడ నంది

[మార్చు]

సూర్య నందీశ్వరస్వామి ఆలయానికి సుమారు పది కిలోమీటర్లు దూరంలో మహానంది దివ్య క్షేత్ర నడిబొడ్డున గరుడ నందీశ్వరుడు కొలువుదీరాడు. మహానంది క్షేతానికి ప్రారంభంలో ఉన్న ఈ గరుడ నందీశ్వరాలయం అతి పురాతనమైనది. ఆ కారణంగా ఈ ఆలయం శిథిలావస్థకు చేరుకోవడంతో దీనిని తిరిగి పునరుద్ధరిస్తున్నారు. గరుడ నందిగా పేర్గాంచిన ఈ క్షేత్రంలో సాక్షాత్తు గరుత్మంతుడు ఇక్కడ మహాదేవుని గురించి తపస్సు చేసి ఇక్కడో భవ్య లింగాన్ని ప్రతిష్టించినట్లు ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. ఆ కారణంగానే ఈ నందికి గరుడ నంది అనే పేరొచ్చింది. గర్భాలయంలో గరుడ నందీశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు.

వినాయక నంది

[మార్చు]

మహానందిలో ఉన్న మరో విశిష్ట నంది వినాయక నంది. మహానందీశ్వరస్వామి వారి ఆలయానికి ఈశాన్య దిశలో ఉన్న ఈ దివ్యాలయం లో పరమేశ్వర లింగాన్ని సాక్షాత్తు వినాయకుడు ప్రతిష్టించడానికి ఇక్కడి స్థల పురాణాలు చెబుతున్నాయి. నిత్యం వందలాది మంది భక్తులతో రద్దీగా ఉండే ఈ దివ్యాలయంలో వినాయక నందీశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. నాగ ఫణాఫణి ఛత్రంగా ఇక్కడ స్వామివారు అలరారుతున్నారు. వినాయక నందీశ్వరస్వామి వారి దర్శనం పూర్వజన్మల పుణ్యఫలం.

మహానంది

[మార్చు]
విరూపాక్షదేవాలయం లోని నంది విగ్రహం, మహానంది

నవ నందులలో విశేషమైన ప్రాధాన్యాన్ని సంతరించుకున్న క్షేత్రం మహానంది. ఇది కర్నూలు జిల్లాలో నంద్యాలకు 14 కి.మీ. దూరంలో ఉంది. ఇది ఆహ్లాదకరమైన యాత్రా స్థలం. గుడి చుట్టు ప్రవహించే నీటి బుగ్గల చల్లదనం, చుట్టు అల్లుకున్న నల్లమల అరణ్యపు ప్రకృతి సౌందర్యం, అన్ని కాలాల్లోను భక్తులను ఆకర్షిస్తూనే ఉంటుంది. పూర్వం శాలంకాయనుడు రాళ్ళను తింటూ అతి విచిత్రమైన తపస్సు చేసి శంకరుని మెప్పించి శిలాదునిగా పిలువబడుతూ, శివభక్తుడై, జీవించసాగాడు. అతడొక రోజున పొలాన్ని దున్నుకుంటుంటే, ఓ బాలుడు దొరికాడు. వృషభ రూపంలోనున్న ధర్ముడే ఇలా పుట్టాడని, అతనికి ‘‘నంది’’ అని పేరు పెట్టి పెంచాడు. అతడు పరమశివుని దర్శనం కోరి ఘోర తపస్సు చేశాడు. ప్రత్యక్షమైన శంకరుడు నందిని వరం కోరుకొమ్మన్నాడు. సదాశివ ధ్యానమే తనకు కలుగునట్లు వరం కోరుకున్నాడు నంది. శివుడు అనుగ్రహించి అతనిని పుత్రుడుగా స్వీకరించాడు. ఎన్నో సిద్ధులను ప్రసాదించి తనంతటి వాణ్ణి చేసి, వాహనంగా తన చెంతనే ఉండమన్నాడు. ‘‘సుయశ’’ అనే కాంతనిచ్చి వివాహం చేశాడు. తన ద్వారపాలకునిగా నియమించుకున్నాడు. ఈ విధంగా నందిని శంకరుడు అనుగ్రహించిన ప్రదేశమే మహానంది క్షేత్రం. ఇక్కడ ఉన్న ఈశ్వరుని నంది ప్రతిష్టించాడని, అందువల్లనే ఇది నందీశ్వరాలయమైందని స్థల పురాణం. ఈ క్షేత్రంలో వెలసిన మహానందీశ్వర స్వామి లింగం స్వయంభూలింగంగా ఖ్యాతికెక్కింది. గర్భాలయంలో ఉన్న శివలింగంపై భాగాన ఆవు పాదం ముద్రలు కనిపిస్తాయి. శ్రీ మహానందీశ్వర స్వామి రజత కవచాలంకృతుడై నయన మనోహరంగా దర్శనమిస్తారు. పార్వతీదేవి కామేశ్వరిగా కొలువులందుకుంటోంది. కార్తీక మాసంలో సోమవారం రోజున నంద్యాల చుట్టు కొలువై ఉన్న నవ నందుల దర్శనంవల్ల జన్మ జన్మల నుండి వెంటాడుతున్న పాప గ్రహ దోషాలన్ని పటాపంచలవుతాయని పెద్దల నానుడి. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపల ఈ క్షేత్రాలన్నింటినీ దర్శిస్తే అన్ని దోషాలు తొలగి కుటుంబంలో ఆయురారోగ్యాలతో కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల ప్రధాన విశ్వాసం. నవ నందుల దర్శనం పూర్వజన్మల పుణ్యఫలం.[4]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "నవనందులకి ఉన్న విశేషం ఏంటి? ఆ నవనందులు ఎక్కడ ఉన్నాయో తెలుసా - Wirally". 2018-09-07. Retrieved 2023-01-20.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2023-01-06. Retrieved 2023-01-20.
  3. Kalpana (2021-10-20). "నవ నందుల విశేషం ఏమిటో.. అవి ఎక్కడ ఉన్నాయో తెలుసా?". TeluguStop.com. Retrieved 2023-01-20.
  4. "మహానంది క్షేత్రం | Mahaa Nandi". TELUGU BHAARATH. Retrieved 2023-01-20.

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=నవనందులు&oldid=4024555" నుండి వెలికితీశారు