నాగానందము

వికీపీడియా నుండి
(నాగానందం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

నాగానందం (Nagananda = Joy of the Serpents) హర్షుడు 7వ శతాబ్దంలో రచించిన సంస్కృత నాటకము.

ఈ నాటకం ఐదు అంకాలుగా రచించబడింది. దీనిలో జీమూతవాహనుడు నాగులను రక్షించడానికి ప్రాణ త్యాగానికి సిద్ధపడడము, గరుత్మంతుడు స్వర్గం నుండి అమృతాన్ని తెచ్చి వారిని రక్షించడం ప్రధానమైన ఇతివృత్తం. .

పాత్రలు[మార్చు]

కథాసంగ్రహం[మార్చు]

జీమూతకేతువు అనే రాజు చాలాకాలం రాజ్యం చేసి మంచివాడని, న్యాయమూర్తి అని కీర్తిగడించాడు. ఇతనికి జీమూతవాహనుడు అనే కుమారుడు కలిగాడు. ఇతడు జీవం ఉన్న అన్ని ప్రాణులను సమానంగా ప్రేమించేవాడు, తల్లిదండ్రుల మీద అమితమైన భక్తి కలిగి తండ్రి రాజ్యాన్ని పాలించమన్నా అతడు అంగీకరించలేదు. తన రాజ్యాన్ని మంత్రులకు అప్పగించి కోరినవన్నింటినీ చేకూర్చే కల్పవృక్షన్ని పేదలకు ఇచ్చివేశాడు.

ఒకనాడు పర్ణశాల కోసం మలయ పర్వతం అనే కొండమీదకి వెళ్ళాడు. అక్కడ గౌరీదేవిని కమ్మని వీణాగానంతో ప్రార్థిస్తున్న మలయవతిని చూచి, ప్రేమించి, వివాహం చేసుకున్నాడు. అలా పర్వతం మీద విహరిస్తుందగా అతనికి ఒక తెల్లని కొండలాగా కనిపిస్తున్న పాముల ఎముకలగుట్ట కనిపించి ఆశ్చర్యాన్ని కలిగించింది. అన్ని పాములకు తానేమీ సహాయం చేయనందుకు బాధపడ్డాడు. అక్కడే విలపిస్తున్న ఒక తల్లిని చూశాడు. విషయం తెలుసుకోవడానికి వివరాలు అడుగగా ఈ రోజు గరుత్మంతునికి తన కొడుకు శంఖచూడుడు ఆహారంగా వెళుతున్నట్లు చెప్పింది. గరుత్మంతుడికి పాములంటే విరోధం ఉండేది. అతడు నాగలోకం మీదపడి పాముల్ని కనికరం లేకుండా తినేవాడు. అప్పుడు నాగరాజైన వాసుకి గరుత్మంతునికి ప్రతిరోజు ఒక పామును ఆహారంగా పంపుతానని ప్రార్థించి ఒప్పించాడు. ఈ రోజు నా కొడుకు వంతు అని వివరించింది.

అప్పుడు శంఖచూడునికి బదులుగా నేను గరుత్మంతునికి ఆహారంగా వెళతాను అని అవ్వకి మాటిచ్చి బలిపీఠమైన పెద్దబండ మీద జీమూతవాహనుడు పడుకొన్నాడు. గరుత్మంతుడు బండమీది జీమూతవాహనున్ని తినడం మొదలుపెట్టాడు. కొంతసేపటి తర్వాత ఏదో పొరపాటు జరిగినట్లుగా సందేహం కలిగి తినడం ఆపి తాను తింటున్నది జీమూతవాహనుని అని తెలిసి జరిగిన పొరపాటుకు తన్నుతాను తిట్టుకున్నాడు. శంఖచూడుడు చిన్నపిల్లవాడిలా ఏడుస్తూ అక్కడే కూర్చున్నాడు. జీమూతవాహనుని భార్య, తల్లిదండ్రులూ చేరి ఏడుస్తున్నారు. ఎలాగైనా వారి దు॰ఖాన్ని పోగొట్టాలని అప్పుడే తనకు మనశ్శాంతి కలుగుతుందని దేవలోకం వెళ్ళి అమృతం తీసుకొని వచ్చి జీమూతవాహనున్ని బ్రతికించాడు. అందరూ సంతోషించారు. అప్పుడు జీమూతవాహనుడు గరుత్మంతుని శక్తిసామర్ధ్యాలను పొగిడి, తనను బ్రతికించినట్లే చనిపోయిన పాములన్నింటినీ బ్రతికించి పుణ్యం కట్టుకోమని ప్రార్థించాడు. అందుకు గరుత్మంతుడు అంగీకరించి తాను తెచ్చిన అమృతంతో పాములన్నింటిని బ్రతికించాడు.

అనువాదం[మార్చు]

దీనిని వేదం వేంకటరాయ శాస్త్రి గారు 1891 సంవత్సరంలో తెలుగులోకి అనువదించారు.

మూలాలు[మార్చు]

  • దయావీరులు, రచన: చల్లా రాధాకృష్ణ శర్మ, తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి, 1983.

బయటి లింకులు[మార్చు]