నూజిళ్ళ లక్ష్మీనరసింహం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నూజిళ్ళ లక్ష్మీనరసింహం, వేదమూర్తులు, సంస్కృతాంధ్ర భాషా ప్రవీణులు, ఉపన్యాస కేసరి.

జననం[మార్చు]

నూజిళ్ళ లక్ష్మీ నరసింహం 23 ఫిబ్రవరి 1931 న తూర్పు గోదావరి జిల్లా, రాజోలు మండలంలోని పొదలాడ గ్రామంలో సద్భ్రాహణ వంశంలో సుబ్రహ్మణ్యం, సత్యవతి దంపతులకు పెద్ద కుమారునిగా జన్మించారు.

సాహిత్య ప్రస్థానం[మార్చు]

చిన్నాతనం నుండి 'బాలకవి'గా వాసికెక్కి యజుర్వేదాధ్యయనంతో పాటు తెలుగు, సంస్కృత భాషలలో మంచి ప్రావీణ్యం సంపాదించారు. జగ్గంపేట గ్రామంలో తెలుగు భాషా పండితునిగా మొదటగా ఉద్యోగ బాధ్యతను చేపట్టి, ఆ తరువాత ఏలేశ్వరం, కాట్రావులపల్లి గ్రామాలలో పనిచేసి, ఉద్యోగ బాధ్యతు నిర్వర్తించారు. జటావల్లభుల పురుషోత్తం, ప్రభాకర ఉమామహేశ్వర పండితుల ఆశీస్సులతో హిందూ ధర్మ పరిరక్షణార్థం నడుంబిగించారు. 1964 లో విశ్వ హిందూ పరిషత్ ఆవిర్భావంతో నూజిళ్ళ లక్ష్మీనరసింహం ఆశయానికి గట్టి పునాది ఏర్పడినట్లయింది. పల్లెపల్లెలో, వాడవాడలా ప్రజల్ని జాగృతం చేసి తమ గానామృతంతో, దివ్యవాణీతో హిందూ ధర్మ వైశిష్ట్యాన్ని, వైదిక సారాంశాన్ని తమ పురాణ ప్రవచనం ద్వారా వినిపిస్తూ వినువీధిని ఆధ్యాత్మిక కేతనాన్ని ఎగురవేసారు. "ఒక్కటే దేశం మనది - ఒక్కటే జాతి మనది వర్ణములెన్నున్నా మరి కులములు ఏవైనా వనంలోని చెట్లు మనం - వసుధైవ కుటుంబం" అంటూ అన్ని వర్గాల ప్రజల్ని సంఘటిత పరచి, వారిలో దేశభక్తిని, దైవభక్తిని పాదుకొల్పి, నిద్రపోతున్న హిందూ సింహాల మత్తును పోగొట్టి ఏకాత్మతా రథయాత్ర,రామశిలాపూజ, సత్య రథయాత్ర వంటి కార్యక్రమాల ద్వారా ప్రపంచంలో హిందూ ధర్మాన్ని మించిన ధర్మం వేరొకటి లేదు అని తమ వాక్ప్రవాహంతో అపర వేద వ్యాసునిలా, అపర వివేకానందునిలా ఉపన్యాసాలిచ్చి వేనోళ్ళ పొగడబడిన ఆధ్యాత్మిక మూర్తి నూజిళ్ళ వారు. గిరిజన బాలబాలికలలో విద్యాస్ఫూర్తిని కల్పించటానికై స్థాపించబడిన వెదురు నగరం ఆశ్రమ పాఠశాల స్థాపనకు బీజం వేసిన వ్యక్తి. తదనంతరం పాఠశాలను సంస్కారయుతమైన విద్యనందించే పాఠశాలగా కూడా వినుతికెక్కడంలో ఉత్తమ సలహాలనిచ్చిన ఉపాధ్యాయ బంధువు. వారి దివ్యాలోచనల నుండి జాలువారిన ఎన్నో పద్య గద్య నాటకాలు, ఆధ్యాత్మిక, దేశభక్తి గీతాలు, ప్రబోధ గీతాలు భావితరాలకు కూడా ఆదర్శంగా పెట్టుకుని ఎన్నో వేల కార్యక్రమాలకు తమ సుమధురమైన ఉపన్యాసాల ద్వారా వెలుగును పంచిన ధన్యజీవి నూజిళ్ళ వారు. వారి స్ఫూర్తితో విశ్వహిందూ పరిషత్ లో అనేకమంది చేరి, కార్యకర్తలుగా ఎదిగి నేడు దశదిశలా హిందూ ధర్మ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.

మూలాలు[మార్చు]