నెమలికన్నులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నెమలి కన్నులు
దస్త్రం:Nem1.jpg
కృతికర్త: దార్ల వెంకటేశ్వరరావు
ముఖచిత్ర కళాకారుడు: లక్ష్మణ్ ఏలె
దేశం: భారత దేశము
భాష: తెలుగు
ప్రక్రియ: వచన కవిత్వం
ప్రచురణ: మంజుశ్రీ పబ్లికేషన్స్
విడుదల: జనవరి, 2016
పేజీలు: 243
ఐ.ఎస్.బి.ఎన్(ISBN): 978-81-908963-5-7

దార్ల వెంకటేశ్వరరావు రాసిన కవితల సంపుటి. 2016లో ప్రచురించిన ఈ కవితాసంపుటిలో వచన కవితలు, మినీకవితలు ఉన్నాయి.

నెమలికన్నులు[మార్చు]

దార్ల వెంకటేశ్వరరావు ప్రముఖకవిగా, విమర్శకుడుగా ప్రసిద్ధి చెందారు.[1] ఈయన రాసిన సుమారు 44 వచనకవితల సంపుటి పేరు నెమలికన్నులు.ఈ కవితలన్నీ ప్రసిద్ధ దిన, వార ప్రత్రికల్లో ప్రచురితమయ్యాయి. చివరిలో మినీకవితలను ప్రచురించారు. ఈ కవితా సంపుటికి ప్రసిద్ధ చిత్రకారుడు లక్ష్మణ్ ఏలె ముఖచిత్రాన్ని అందించారు. ఈ కవితల్లో కొన్ని కవితలు 2004లో ప్రచురించిన దళితతాత్వికుడు[permanent dead link] కవితాసంపుటిలో ఉన్నాయి. ఈకవిత్వం గురించి 27మంది ప్రసిద్ధ రచయితలు, కవులు, పరిశోధకులు, విశ్వవిద్యాలయ ఆచార్యులు రాసిన విశ్లేషణాత్మక వ్యాసాలను కూడా ఈ పుస్తకంలోనే ప్రచురించారు. ‘లిప్తకాలస్వప్నం’ పేరుతో ‘దళితతాత్వికుడు’ కవితాసంపుటికి కవి రాసుకున్న ముందుమాటతో పాటు, పరిష్కరణ ప్రతిగా ప్రచురించిన ‘నెమలికన్నులు’ కవితాసంపుటికి ‘పునరుత్థానం’ పేరుతో కవితాత్మకంగా కవితనమాటను రాయడం విశేషం. ఈ కవితాసంపుటిని కవి తన తల్లిదండ్రులు శ్రీమతి పెదనాగమ్మ, శ్రీలంకయ్యలకు అంకితమిచ్చారు. దళిత జీవితంలో పాటు, తెలంగాణ ఉద్యమసందర్భంగా కవి తన దృక్పథాన్ని తెలిపేకవితలను కూడా రాశారని ఈ కవితాసంపుటి పరిశీలించినవారికి అర్థమవుతుంది. అలాగే, చివరికి వచ్చేసరికి తాత్వికతతో పాటు, మరణాన్ని స్వచ్ఛందంగా ఆహ్వానిస్తున్న కవిత్వం కనిపిస్తుంది. జీవాత్మ పడుతున్న వేదనను కవిత్వీకరించడం ఈకవితాసంపుటిలో ఒక గుర్తించదగినవిశేషం. ఈ కవితాసంపుటిపై దారిశెట్టి పుష్పిణి అనే పరిశోధకురాలు ‘నెమలికన్నులు కవిత్వం-అభివ్యక్తివైవిధ్యం’ అనే పేరుతో చెన్నైప్రెసిడెన్సికళాశాలలో డా.ఎలిజబెత్ జయ కుమారి గారి పర్యవేక్షణలో ఎం.ఫిల్., పరిశోధన చేస్తున్నారు.

ముఖచిత్రవివరణ[మార్చు]

నెమలికన్నులు ముఖచిత్రం గురించి మల్లెగోడ గంగాప్రసాద్ ఫేస్ బుక్ లో ఇలా ఒక పోస్టు రాశారు.[2]

‘‘ఈ నెమలికన్నులు కవితా సంపుటికి అందమైన ఆలోచనాత్మకమైన చిత్రం గీసారు ప్రముఖ చిత్రకారులు ఏలె లక్ష్మణ్ గారు. వీరి ఇద్దరి కలయిక అరుదైనది, ఆలోచనత్మకమైనది. నెమలికన్నులు కవిత్వం ముఖచిత్రం అంతరార్థం ఇలా అనిపించింది.

 1. భారతీయ సామాజిక వ్యవస్థ ప్రధానంగా చాతుర్వర్ణమూలాల్ని కలిగి నిర్మితమైంది. దానికి అనుబంధంగా వచ్చిందే పంచమవర్ణం. వీటిని ప్రతీకాత్మకంగా చిత్రకారుడు జంతువుల్ని చిత్రించి ఉండొచ్చు.
 2. చాతుర్వర్ణం నుండే రకరకాల ఉపకులాలు మళ్ళీమళ్ళీ పుట్టుకొచ్చినా, వాటిలో వర్ణం ‘ పంచమవర్ణం’ సమాజానికి దూరంగా నెట్టివేయబడింది. దీన్ని విడిగా దూరంగా ఉన్న జంతువు ప్రాతినిథ్యం వహిస్తుందనుకుంటున్నాను.
 3. భారతదేశంలోని సాంఘికహోదానీ, ఆర్థిక, రాజకీయాధికారాలను అనుభవిస్తూ విలాసవంతంగా జీవించే లక్షణాలున్న వర్ణాలవారిని నాలుగు జంతువుల్లోను చిత్రకారుడు చిత్రించి ఉండొచ్చు. వీటిని వాటి కొమ్ములకున్న రకరకాల రంగుల ద్వారాను, వాటి శరీరఛాయ, వాటి హావభావాల ద్వారా గమనించేలా చేశాడనుకుంటున్నాను.
 4. నాలుగు బలిసిన దున్నపోతులు అలంకరించుకొని సమాజాన్ని ఆక్రమించుకొన్నస్థితి చిత్రంలో కనిపిస్తుంది. ఒకటి మాత్రమే విడిగా ఉంది. దానికి ఎలాంటి అలంకరణా లేదు. దాని కళ్ళల్లో విషాదం తొణికిసలాడుతున్నట్లుంది.
 5. ఒక బాలుడు కర్రపట్టుకొని మార్గానికి అడ్డంగా నిలబడిన ఆ పశువుల్ని విదిలిస్తున్నాడు.
 6. ఆ బాలుడు నీలిరంగు నిక్కరు , ఎరుపురంగు చొక్కాలను ధరించాడు. నీలిరంగు అంబేద్కరిజానికీ, ఎరుపురంగు కమ్యూనిజానికీ ప్రతీకలుగా చూసే అవకాశం ఉంది. ప్రస్తుతం భారతదేశంలో ప్రత్యక్ష పోరాటాలు చేస్తున్నవాళ్ళు కమ్యూనిస్టులైతే, ప్రజాస్వామిక పంథానే ప్రధానం చేసుకొని ఉద్యమాలు చేస్తున్నవాళ్ళు అంబేడ్కరిస్టులు.
 7. అడ్డంగా నిలబడిన పశువుల్ని బాలుడు తన చేతిలో ఉన్న కర్రతో విదిలిస్తున్నాడు.
 8. దూరంగా కనిపిస్తున్న ఊరు, ఇళ్ళు, పక్కన పచ్చనిపొలాలు... వాటివైపు ఈ నాలుగు పశువులు దృష్టిని కేంద్రీకరించాయి. వాటిని కర్రతో కొడుతూ బాలుడున్నాడు. భారతీయ ప్రజాస్వామిక వ్యవస్థలో ఓటు రాజకీయాల ద్వారా ఆ గ్రామాన్నీ, ఆ ఇళ్ళనీ, ఆ పచ్చదనాన్నీ తామెలా స్వాధీనం చేసుకోవాలో ఆలోచిస్తున్న నాలుగు వర్ణాల వారు ఆలోచిస్తున్నట్లుంది. దాన్ని నెరవేరనివ్వనన్నట్లు బాలుడి చేతిలోని కర్ర కనిపిస్తుంది.
 9. తాగడానికి కొన్నినీళ్ళు, కట్టుకోవడానికి బట్ట ఉన్న ఆ బాలుడు తినడానికి భుజాన తువ్వాల్లో ఏదొక ఆహారపదార్థం మూటకట్టుకున్నాడు.
 10. ఆ బాలుడు చదువుకున్న కవి, రోడ్డుకడ్డంగా నిలబడ్డ పశువులు ఊరుని నాశనం చేయాలనుకునే ఆధిపత్యవర్ణాలు, వర్గాలు గా చెప్పుకోవచ్చుననుకుంటున్నాను. నెమలికన్నులు కవిత్వంలో ఉన్న వస్తువు అంతా దీన్ని ప్రతీకాత్మకం చేసేలా చిత్రకారుడు చిత్రించాడనుకుంటున్నాను’’

నెమలి కన్నులపై సమీక్షలు[మార్చు]

తను పుట్టి పెరిగిన గ్రామాన్ని తన తల్లిదండ్రులను తన బాల్యంలోని తన చుట్టూ తిరిగాడిన జనాల భాషని, గోషని పట్టుకున్నాడు. దానిని కవిత్వీకరించాడని ఈ కవిత్వం గురించి దుగ్గనపల్లి ఎజ్రాశాస్త్రి ఆంధ్రప్రభలో సమీక్షించారు.[3] ఈ కవితాసంపుటిలోని ‘‘హాస్టల్లో అమ్మ’’ అనే కవితను Mother in the Hostel! పేరుతో నరేశ్ అన్నెం ఆంగ్లంలోకి అనువదించారు. అది 'the-criterion' అనే అంతర్జాతీయ అంతర్జాల ఆంగ్ల పత్రిక, ఆగస్టు, 2016 సంచికలో ప్రచురితమైంది.[4] ‘‘నెమలికన్నులు’’ కవిత్వం గురించి ఆచార్య పులికొండ సుబ్బాచారి ‘‘మాదిగ కవిత్వపు సరి కొత్త కెరటం’’ శీర్షికతో ఇలా రాశారు. ‘‘మాదిగ కవిత్వపు సరి కొత్త కెరటం’’

 1. తెలుగు కవిత్వంలో మున్నెన్నడూ లేని వైవిధ్యం గడచిన రెండు మూడు దశాబ్దాలలో వచ్చింది. అంతకు ముందున్న అభ్యుదయ కవిత్వం లేదా విప్లవ కవిత్వం, అభిముఖంగా సంప్రదాయ కవిత్వం ఈ మూడింటిని దాటి విస్తృతంగా చర్చించే మరొక వింగడింపు విషయ పరంగా చెప్పడానికి లేదు. దిగంబర కవిత్వం మరొక భిన్నమైన పాయగా నిలించింది. కాని వస్తుపరంగా అది అభ్యుదయ, విప్లవకవిత్వాలకు భిన్నమైనది కాదు. కాగా వచన కవిత వంటి ప్రక్రియా పరమైన వర్గీకరణలను గురించిన చర్చకు సంబంధించినది కాదు ఇక్కడి చర్చ.
 2. గడచిన మూడు దశాబ్దాలలో సామాజికపరంగా తెలుగు కవిత్వంలో గుణాత్మకమైన మార్పు (qualitative change) వచ్చింది. అదేమంటే తెలుగు కవిత్వాన్ని అస్తిత్వ వాదం అనేది ఆక్రమించింది అని చెప్పవచ్చు. ఎనబైయవ దశకం నుండే స్త్రీవాద కవిత్వం, దళిత కవిత్వం తెలుగు స్పష్టమైన రూపు దిద్దుకున్నాయి. ఆ తర్వాత మైనారిటీ కవిత, బి.సి వాద కవిత అనేవి స్పష్టంగా తమకు వేరే గొంతులు ఉన్నాయి అని చెప్పుకుని ఉనికిని ప్రతిష్ఠించుకున్నాయి. ఈనాడు అవి స్పష్టమైన కవిత్వపు వర్గీకరణలలో చోటుచేసుకున్నాయి.
 3. దక్షిణ భారత దేశంలో ఇటీవలి కాలంలో వచ్చిన సామాజిక ఉద్యామాలలో చెప్పుకోవలసింది మాదిగ దండోరా. దళిత ఉద్యమం దళిత కవిత్వం తనదైన ఆవరణను ఏర్పరచుకున్నతర్వాత, వచ్చిన మాదిగ రిజర్వేషన్ కు సంబంధించిన సామాజిక ఉద్యమం తెలుగువారైన దళితులను రెండు భిన్నమైన స్కంధావారాల లోనికి వేరు చేసింది. ఇక్కడ నేను దళిత సంబంధమైన రాజకీయ సంబంధమైన చర్చ చేసే వేదిక కాదు దీన్ని గురించి ఇప్పటికే విడిగా రాసి ఉన్నాను.
 4. దళితులలో అంతర్గతంగా తిరిగి ఒక అస్తిత్వ సమస్య తలెత్తింది. మాదిగ, మాల ఉద్యమాలు బహిరంగంగా వారి వారి సామాజిక ప్రయోజనాలకోసం చేసిన ఉద్యమాల ప్రభావం ఆ కులాలలోని మేధావులు కళాకారులు తదితరుల పైన కూడా బాగా పడింది. దళిత కవులు పరస్పరం మంచి అవగాహనతో సిద్ధాంత భూమికతో ఉన్నప్పటికీ దళిత స్పృహను అందరూ చెప్పినప్పటికీ రెండు కులాలో ఉన్న వృత్తి పరమైన భేదం ఇంకా చాలా విషయాలలో సంస్కృతి పరమైన భేదాన్ని వారి కులానికి సంబంధించిన అస్తిత్వంగా భావించారు. దళిత కవులు విశేషించి మాదిగ వర్గానికి చెందిన కవులు తాము ప్రత్యేకమైన అస్తిత్వాన్ని కలిగి ఉన్నామని నిరూపించుకునే ప్రయత్నం చేశారు. వారికి వారు తమను మాదిగ కవులుగా తమది దళిత కవిత్వమే అయినా ప్రత్యేకంగా మాదిగ కవిత్వం అని ప్రత్యేక అస్తిత్వాన్ని వారికి వారే సంపాదించుకున్నారు. మాదిగ కవిత్వాన్ని సాహిత్య విమర్శకులు ప్రత్యేకించి గుర్తించి పేరు పెట్టడం జరగలేదు. ముందే ప్రత్యేక అస్తిత్వాన్ని సంతరించుకున్న ఒక ప్రత్యేక వింగడింపును మాత్రమే నేను కాని నావంటి ఇతర సాహిత్య విమర్శకులు కాని చూస్తున్నారు. విశ్లేషిస్తున్నారు.
 5. మాదిగ కవులకు సంబంధించిన ప్రత్యేక కవిత సంకలనాలు వచ్చాయి. ముఖ్యంగా కైతునకల దండెం అనేది మాదిగ సాహిత్యం కవిత్వం ఒక ప్రత్యేకమైన స్రోతస్సుకు చెందుతుందని నిరూపించింది. మాదిగలకున్న చర్మకార వృత్తి దేవతారాధనలు, వారి కళారూపాలు ముఖ్యంగా మాదిగల ఉపకులాలైన వారి చిందుభాగవతం, డక్కలి పటంకథ, బైండ్లకథ, ఇంకా ఇతరమైన వారి కళారూపాలు, విశేషించి మాదిగ వారి డప్పు మాదిగల కులానికి చెందిన సాంస్కృతిక చిహ్నాలైనాయి. వీటిని కవులు వారి కవితల్లో ప్రతిబింబించారు. కాగా దళితులలో మాలలకు వారి ఉపకులాలకు ఉన్న వృత్తి నేపథ్యాలతో వీరు తమ నేపథ్యం భిన్నమైనది అని తమ కవితల్లో చెప్పుకోగలిగారు.
 6. సోషల్ ఎక్స్ క్లూజన్ అనేది బయటినుండి జరిగే సామాజిక క్రమంగా ఇది ఒక ఉన్నత వర్గం చేసే సామాజిక పరమైన దురన్యాయంగా చూచే పరిణామంగా ఉంది. ఇక్కడి సామాజిక పరిణామం దానికి భిన్నంగా కూడా ఉంటుందని తెలియవచ్చింది. ఒక సామాజిక వర్గం కూడా సోషల్ ఎక్స్ క్లూజన్ కు కారణమై ప్రత్యేకమైన అస్తిత్వాన్ని పొందడానికి సోషల్ ఎక్స్ క్లూజన్ అనేది నకారాత్మక సామాజిక పరిణామం కాక సకారాత్మక సామాజిక పరిణామం అవుతుందని దీనివల్ల ఒక కొత్త సామాజిక పరిణామం బయటికి వచ్చింది. మాదిగ అస్తిత్వ ఉద్యమం మాదిగ కవిత్వపు సరికొత్త వింగడింపు ఈ సామాజిక కారణాల వల్ల ప్రత్యేకమైన రూపాన్ని పొందాయి.
 7. ఇటీవలి కాలంలో ఈ కారణంగా ఉద్భవించిన దళితకవులలో ప్రత్యేక మైన స్రోతస్సుకు చెందిన మాదిగ కవులలో దార్ల వెంకటేశ్వరరావును ఒక సరికొత్త కెరటంగా చెప్పుకోవాలి. ఒక కవి కవిత్వాన్ని అంచనా వేసేటప్పుడు ఆ కవి తాను వచ్చిన ఏ నేపథ్యంలో రాశాడనే ఈ సామాజిక స్పృహ లేకుండా అతని కవిత్వాన్ని అంచనావేయలేము. దార్ల వెంకటేశ్వరరావు తాను గడిచిన పది పదిహేను సంవత్సరాలుగా రాసిన కవిత్వాన్ని ఒక సంకలనంగా తీసుకు వచ్చాడు. దార్ల కలం పట్టేనాటికే దళిత కవిత్వం స్పష్టమైన రూపం పొంది దానిదైన సామాజిక ప్రభావాన్ని చూపుతూ ఉంది. దళిత నేపథ్యంలో దారిద్ర్యాన్ని అనుభవించడం మాత్రమే కాకుండా సామాజిక వివక్షకు గురై కఠినమైన జీవితాన్ని అనుభవించిన వాడు కావడం వల్ల ఆ నేపథ్యాన్ని రంగరించే ప్రతి కవితను రాశాడు. అదంతా అతని కవితల్లో ప్రతిబింబించింది. ఇలా రాయక పోతేనే ఆశ్చర్య పడవలసి వస్తుంది. తనకున్న దళిత వేదనను తన కుటుంబ వేదనను చక్కగా ప్రతి కవితలోను ప్రతిబింబించాడు దార్ల వేంకటేశ్వరరావు.
 8. దార్ల కవిత్వంలో వస్తువును పరిశీలించినప్పుడు రాసేది దళిత విషయం హృదయ దళనానికి సంబంధించినదే అయినా కూడా అందులో చక్కటి సృజనను వైవిధ్యాన్ని కూడా చూపాడు. తనదైన ముద్ర చాలా కవితల్లో ఉంది.
 9. మొదటి కవితలోనే తన స్వంత పరిచయం లాగా తన దళిత కుటుంబ నేపథ్యాన్ని చక్కగా వచనాత్మకంగా వివరించాడు. ఈ కులంలో పుట్టక పోతే నేను మనుషుల్ని ప్రేమించే వాడిని కాదేమో అని కొత్తగా భావిస్తాడు ఈ కవితలో ఒక వాక్యంలో. మిగతా దళిత కవులు రాసిన చాలా సామజికాంశాలను దార్ల కూడా రాసాడు వాటిని గురించి ప్రత్యేకించి చెప్పవలసిన పనిలేదు. కాని మిగతా వారు తట్టని కొన్ని కోణాలను దార్ల కొన్నింటిని చూపాడు. వాటిని గురించి చెప్పాలి. గ్రంథాలయాలను డిజిటైజ్ చేసి వాటిని కంప్యూటర్లలోనికి ఎక్కించి పుస్తకాలను తొలగించడం అనే పని వల్ల దళిత నేపథ్యం అనేది ఎలా నష్టపోతుంది అని భావిస్తూ ఒక కవిత రాసాడు దీనిపేరు కూలుతున్న గ్రంథాలయాలు. పలకా బలపాలకే దూరమైన వారు ఇప్పుడిప్పుడే పుస్తకాలు పడుతున్న దళితులకు డిజిటల్ లైబ్రరీలు అనేవి ఇంటర్ నెట్ అనేవి మరింత అందని మానిపండ్లు అవుతాయని సామాజికంగా మరింత వీరిని విజ్ఞానానికి దూరం చేస్తాయని ఇతని భావన. దీన్ని మంచి సృజనాత్మకంగా చెప్పగలిగాడు. ప్రతిదీ అంతర్జాలంలోనే చూసుకోవాలట- ఇక అరచేతిలోనే స్వర్గం – ఇంటర్నెట్ ఒక మోహినా నృత్య తాండవం – ఇక అమృతానికి ఆవల ఉండవలసిందేనేమో. అనే పంక్తులున్నాయి. ఇవి మామూలుగా వచన ప్రాయంగానే ఉన్నాయి. కాని ఇందులో మంచి పౌరాణిక ధ్వని ఉంది. క్షీరసాగర మథనంలో అసురులు సురులు కలిసి మధించారు. విష్ణువు మోహిని అవతారంలో వచ్చి అమృతాన్ని దేవతలకిచ్చి తమకు న్యాయంగా రావలసిన అమృతాన్ని విష్ణువు తమకు రాకుండా మోసంచేసాడనే విషయాన్ని ఇక్కడ బాగా అర్థవంతంగా ధ్వనిగర్భితంగా రాశాడు. అంతే కాదు, క్షీరసాగర మథనంలో మరొక కోణాన్ని ఇక్కడ గమనించవచ్చు. అసురులు చేసినది కష్టమైన పని, దేవతలు చేసింది అంత కష్టంలేని పని అదెలాగంటే అసురులు పాము తలవైపున పట్టుకున్నారు. అంటే ప్రమాదం జరగడానికి అవకాశం ఉన్నవైపు పనిచేశారు. కాని దేవతలు ప్రమాదరహితమైన పక్షాన ఉండి పనిచేశారు. నిజానికి వచ్చిన ఫలితంలో ఎక్కువ భాగం వారికి చెందాలి కాని దాన్ని దేవతలకు చెందేలా చేశాడు విష్ణువు. ఈ విషయాన్ని నేటి దళిత సమస్యకు అన్వయించి చెప్పడం. దళితులను అసురులతో ఐడెంటిఫై చేయడం చాలా మంచి వ్యూహం. నేటి దళితులు రావణుడిని, నరకాసురుడిని, బలి చక్రవర్తిని సకారాత్మక అంటే మంచి కోణంలో చూస్తున్నారు. వారు వంచనకు గురైనవారుగా సామాజిక దళనానికి గురైనవారుగా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో దార్ల కవిత మంచి దళిత స్వరాన్ని వినిపించింది అని చెప్పాలి.
 10. యథాతథంగా పుస్తక సమీక్ష చేయడం నా ఉద్దేశం కాదు. దార్ల రాసే కవిత్వానికి సామాజిక నేపథ్యాన్ని చెప్పడమే ఇక్కడి నాలక్ష్యం. అయినా ఇక్కడ కొన్ని మాటలు చెప్పాలి. దార్ల ఇప్పుడిప్పుడే కంఠం సవరించుకుంటున్న నూతన కవి అనే నేను చెప్పదలచుకున్నాను. అపరిపక్వమైనవి కేవల వచన ప్రాయమైన కవితలు ఇందులో ఉన్నాయి. అక్కడక్కడ మంచి సృజనాత్మకతను చూపిన భావనలూ ఉన్నాయి. పెట్రోలు సంతకం అనే కవిత, సునీతపైన రాసిన కవిత దళిత కవిత్వంలో దార్ల ముద్రని చూపెడతాయి విశేషించి కూలుతున్న గ్రంథాలయం అనే కవిత ఈ సిద్ధాంతానికి మంచి ఊపునిస్తుంది.
 11. కొన్ని కవితల్ని చూస్తే దార్ల శ్రద్ధ తీసుకోలేదని పిస్తుంది. ధ్వనిని సమకూర్చేటప్పుడు ఒక విషయాన్ని పూర్తిగా చెప్పలేకపోవడం అసంపూర్ణంగా ఉండడం కనిపిస్తుంది. భాష విషయంలో కూడా ఇతను శ్రద్ధ తీసుకోవాలి. ఇందులో దొర్లిన భాషా దోషాలు ప్రయోగం అని బుకాయించడానికి కూడా కుదరదు. వీటితోపాటు వైరి సమాసాలు వేశాడు. సంధ్య మసకలు, ఆలింగన మరకలు అని కొత్త సమాసాలు వేశాడు. నేను వైరి సమాసాలు వేయవద్దు అని చెప్పను కాని ఇక్కడ చేసిన వైరిసమాసాలు అందంగా లేవు వీటిలోని ధ్వని వినసొంపుగా లేదు. ఇలాంటి వాటిని చేసి ప్రయోజనం లేదు. బోరుబావి అనేది వైరి సమాసమే పైగా ఇంగ్లీషు పదంతో కూడా, కాని వినడానికి ఇది ఇబ్బందిగా లేదు. బాగుంది.
 12. నెమలి కన్ను అనే మాటను ఒక కవితలో పురాతన స్మృతికి సంకేతంగా వాడాడు. ఒక కవితలో దాన్నే దీనికి అంటే కవిత సంకలనానికి పేరుగా ఉంచాడు. కాని దీనికి వేరే అర్థం చెప్పుకోవచ్చు. నెమలి కంటికి నీరు కారితే వేటగాడిగి ముద్దా అనే అర్థంలో ఈ కవితాసంకలనానికి ఉన్న పేరును గ్రహిస్తే ఇక్కడ వర్ణించిన దళిత వస్తువు వేటగాడి బారికి గురైన నెమలి వంటిది అవుతుంది అలాగే సామాజిక ద్రోహానికి గురి చేసిన మిగతా సామాజిక వర్గాలు వేటగాడికి సంకేతం అవుతాయి. ఈ దృష్ట్యా ఈ కవితాసంకలనానికి ఈ పేరు కూడా బాగా సరిపోతుంది.
 13. దార్ల, వచన కవితాకళని అభ్యసించే స్థితిలోనే ఉన్నాడు. అక్కడక్కడా మంచి భావుకతని కూడా ప్రదర్శించాడు. తన గ్రామానికి వెళ్ళి ఒక నాస్తాల్జియాని వర్ణించే క్రమంలో స్మృతి కెరటాలేవో తవ్వుకొచ్చే వీధివీధుల్నీ ప్రొటెక్టెడ్ ఏరియాలుగా ప్రకటించాలి ఆర్కియాలజీ శాఖ అని అనడం చాలా కొత్తగా బాగుంది. మామూలు వచనాన్నే మామూలు వాక్యాన్నే మంచి కవిత్వంగా మార్చే అల్కెమీని గురించి దార్ల ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నాడు. దీనిలో అతను మరింత కృషి చేయవలసి ఉంది.
 14. ఈ నిజాయితీ ఇతని కవితల్లో కనిపిస్తుంది. అలాగే అతని సామాజిక సంవేదన దళిత సిద్ధాంత నేపథ్యంకూడా మరింత బలీయం అయ్యే అవకాశం ఉంది. సామాజిక వాదంతో పాటు కవిత్వాన్ని వచనంలా తేలిపోయేలా చేయకుండా దీన్ని ఒక కళగా కూడా అతను ఇంకా బాగా అభ్యసించాలని నేను ఆశిస్తాను.’’[5]

మూలాలు[మార్చు]

 1. [1][permanent dead link] sahitya-akademi.gov.in
 2. నెమలి కన్నులు ముఖచిత్ర వివరణ {https://vrdarla.blogspot.in/search?q=నెమలికన్నులు}[permanent dead link]
 3. [ఆంధ్రప్రభ సాహితీ గవాక్షం, సాహిత్యానుబంధం, 4 ఏప్రిల్ 2016] భాషా సౌందర్యానికి పట్టం కట్టిన కవిత్వం‘నెమలికన్నులు’
 4. http://www.the-criterion.com/V7/n4/August2016Contents.pdf TheCriterion an InternationalJournal in English,August, 2016, vol.7, issue iv, ISSN 0976-8165 '
 5. పులికొండ, సుబ్బాచారి. మాదిగ కవిత్వపు సరి కొత్త కెరటం, నెమలికన్నులు. హైదరాబాదు: మంజుశ్రీప్రచురణలు. ISBN 978-81-908963-3-7.[permanent dead link]

దార్ల వెంకటేశ్వరరావు రాసిన ఆత్మకథ పేరు కూడా నెమలికన్నులు.[1]

 1. దార్ల, వెంకటేశ్వరరావు. నెమలికన్నులు. హైదరాబాదు: మంజుశ్రీప్రచురణలు. ISBN 978-81-908963-3-7.[permanent dead link]