Jump to content

లక్ష్మణ్ ఏలె

వికీపీడియా నుండి
లక్ష్మణ్ ఏలె
జననం
లక్ష్మణ్ ఏలె

జూన్ 8 , 1965
సుపరిచితుడు/
సుపరిచితురాలు
చిత్రకారుడు
జీవిత భాగస్వామిలలిత
పిల్లలు2 (ప్రియాంక ఏలె)[1]
తల్లిదండ్రులుచంద్రయ్య, వీరమ్మ

లక్ష్మణ్ ఏలె (జూన్ 8 , 1965) ప్రసిద్ధ భారతీయ చిత్రకారుడు.[2] మనీ మనీ, అనగనగా ఒకరోజు, సత్య, రంగీల, దెయ్యం…మొదలైన వర్మ సినిమాలకు లక్ష్మణ్‌ ఏలె పబ్లిసిటి డిజైనర్‌గా పనిచేశారు.[3] ఈయన మోనోక్రామ్‌లు చేయటానికి ఇష్టపడుతాడు.[4]

ప్రారంభ జీవితం

[మార్చు]

ఈయన యాదాద్రి - భువనగిరి జిల్లా, ఆత్మకూరు మండలం కదిరేనిగూడెంలో 1964, జూన్ 8 న జన్మించాడు. ఈయన తండ్రి మగ్గం నేసేవాడు పద్మశాలి. తల్లి కూలీపని చేసేది. వారి పెద్దనాన్నకు పిల్లలుసవరించు లేకపోవటంతో చిన్నప్పుడే ఆయన్ని పెంచుకున్నారు. లక్ష్మణ్ చిన్నప్పుడు విద్యలో వెనుకబడి ఉండేవారు. యింటి పనులను చూసుకునేవారు.[5]

వారి యింట్లో ఆకర్షణీయంగా ఉన్న వారి నాయనమ్మ ఫోటో ఒకటి ఉండేది. దాన్ని చూసినప్పుడల్లా బొమ్మలు గీయాలనే ఆలోచన ఆయనకు కలిగేది. మొదట్లో కొబ్బరినూనె రాసిన తలకి తెల్లకాగితాన్ని రుద్ది ఆ పారదర్శక కాగితాన్ని బొమ్మలపై ఉంచి చిత్రాలు గీయడం అలవాటు చేసుకున్నారు. చేతిరాత కుదురుగా ఉండటం, బొమ్మలు చక్కగా వేస్తుండటంతో ఆయనకు బాల్యంలో పాఠశాలలో గుర్తింపు వచ్చింది. తోటి విద్యార్థుల పుస్తకాలమీద పేర్లు రాయడం, ఉపాధ్యాయులకు విజ్ఞానశాస్త్ర చిత్రాలు వేసి యివ్వడం చేసేవారు.

పదవ తరగతి చదవడం కోసం భువనగిరికి వచ్చారు. అక్కడే రూమ్‌ తీసుకొని ఉన్నారు. ఆ రూమ్‌కు దగ్గర్లో ఒక ఆర్టిస్ట్‌ బొమ్మలు గీస్తూ ఉండేవాడు. ఆ బొమ్మలను పరిశీలిస్తూ అలాగే గీయడానికి ప్రయత్నించేవారు. కుటుంబం చేనేత వృత్తి కారణంగా ఆర్థిక యిబ్బందులతో తనకు యింటి నుండి డబ్బులు పంపించలేని పరిస్థితి వచ్చింది. చదువు మానెయ్యలేక, అప్పు చేయలేక, చేద్దామన్నా యిచ్చేవారు లేక చిత్రలేఖనం చేసి సంపాదించాలని సంకల్పించారు. ఆత్మ విశ్వాసం పెంచుకుని బ్యానర్లు, సైన్‌బోర్డ్‌లు రాయడం మొదలు బెట్టి తన ఖర్చుల సరిపడా డబ్బు సంపాదించుకోగలిగారు. కళాశాలలో కాలేజీ బోర్డు రాసిపెట్టినందుకు ఇంటర్‌లో ట్యూషన్‌ ఫీజు మాఫ్‌ చేసారు ప్రిన్సిపాల్‌గారు. ఇంటర్ లో ఉన్నప్పుడు ఒక అధ్యాపకుడు ఆయనకు కార్డూన్లు గీయమని దానివల్ల మంచి లైఫ్ ఉందని సలహానిచ్చాడు. ఆయన చెప్పినట్లు కార్టూన్స్‌ ప్రాక్టీస్‌ చేయడం ప్రారంభించారు. గీసిన కార్టూన్లన్నీ ప్రతికలకు పంపేవారు. కాని ఒక్కటి కూడా ప్రచురితమయ్యేది కాదు. దానితో ఆయనకు విసుగొచ్చి ‘ఇదేదో మనకు పనికొచ్చే విషయం కాదు’ అని కార్టూన్స్‌ గీయడం వదిలేశారు. ఇంటర్మీడియేట్‌ తరువాత డిగ్రీ కోసం హైదరాబాద్‌కు వచ్చారు.

ఆర్ట్స్‌ కాలేజిలో బి.కాంలో చేరారు. డిగ్రీలో చేరడానికి ముందు హైదరాబాద్‌లోని ఒక కెమికల్‌ ఫ్యాక్టరీలో రోజు కూలీగా పనిచేశారు. ఒకవైపు డిగ్రీ చదువుతూనే మరోవైపు ఒక షాపులో సైన్‌బోర్డులు రాసే పనికి కుదిరారు. రోజు అయిదారు రూపాయలు ఇచ్చేవాళ్లు. ఆయన డిగ్రీ సెకండ్‌ ఇయర్‌లో ఉండగా ‘లే అవుట్‌ ఆర్టిస్ట్‌లు కావలెను’ అని ఈనాడులో ఒక ప్రకటన చూసి దానికి అప్లై చేసి ఇంటర్వ్యూలో ‘డిగ్రీ చదువుతున్నాను. బొమ్మలు గీయడం వచ్చు. అక్షరాలు బాగా రాయగలను’ అని చెప్పారు. గీసి చూపించమంటే చూపించారు. ‘బొమ్మలు బానే ఉన్నాయిగానీ నువ్వు చదువుకుంటున్నావు కదా. నీకు ఉద్యోగం ఎందుకు? వెళ్లి బుద్దిగా చదువుకో’ అన్నారు ఇంటర్వ్యూ చేసిన చలసాని ప్రసాదరావుగారు. ‘చదువుకోవడానికి డబ్బులు లేవు సార్‌. ఎలాగైనా సరే ఉద్యోగం ఇప్పించండి సార్‌’ అన్నారు లక్ష్మణ్. చలసాని ప్రసాదరావుగారు ఆయన మొర ఆలకించి ఉద్యోగం ఇప్పించారు. చదువు, ఉద్యోగం రెండూ చేయటం కష్టమైనా తన ఆర్థిక ఇబ్బందులు తెలుసు కాబట్టి కాలేజికి రెగ్యులర్‌గా వెళ్లకపోయినా లెక్చరర్లు చూసీ చూడనట్లు వదిలేసేవారు.


చిత్రకారుడుగా

[మార్చు]

అప్పటివరకు ఏది పడితే అది గీయడమే కాని ఆర్ట్‌ గురించి ఆయనకు ఏమీ తెలియదు. చలసాని పరిచయంతో ఆర్ట్‌ గురించి రకరకాల విషయాలు తెలుసుకున్నాను. చిత్రకళ మీద ఆయన రాసిన పుస్తకాలు చదివేవారు. ఆర్ట్ గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకున్నారు. ఆర్ట్‌ మీద వచ్చిన ఏ వ్యాసాన్ని, పుస్తకాన్ని వదిలేవారు కారు. చివరికి మిర్చీలు కట్టిన పేపర్‌ను కూడా వదిలేవారు కాదు. అందులో ఏదైనా బొమ్మ ఉంటే ‘ఒక పట్టు పట్టి చూద్దాం’ అని ప్రాక్టీస్‌ చేసేవారు.

సెంట్రల్‌ లైబ్రరీకి వెళ్లి పాత పుస్తకాలను తీసి అందులో ఉన్న బాపు బొమ్మలను ప్రాక్టీస్‌ చేసేవారు. ప్రతి ఆదివారం బస్‌స్టాండ్‌, రైల్వేస్టేషన్‌కు వెళ్లి ఆయన స్కెచ్‌బుక్‌ నిండా బొమ్మలు గీసేవారు.

ఆయన మనసులో ఒక తపన… ఆర్ట్‌లో బాగా పేరు తెచ్చుకోవాలి అని. అందుకే ఆయన సర్వస్వం ఆర్టే అయింది. చాలాకాలం వరకు ఆయన పెళ్లయిన బ్రహ్మచారి. ఆయనకు డిగ్రీ మొదటి సంవత్సరంలోనే పెళ్లయింది. తనకు వచ్చే జీతంతో బతకడమే కష్టం. ఇంకా భార్యను ఎక్కడ తెచ్చుకుంటాం అనుకునేవారు. అందుకే ఆమె ఊర్లోనే ఉండేది. ఆయన జీతం వెయ్యిరూపాయలు అయిన తరువాత ‘హమ్మయ్య ఇప్పుడు బతికేయొచ్చు’ అని ఆమెను తన వెంట తెచ్చుకున్నాను.

ఆర్ట్‌ గురించి ఇంకా… ఇంకా తెలుసుకోవాలనే తపనలో భాగంగా ఫైన్‌ ఆర్ట్స్‌ చదవాలనే కోరిక కలిగి మొదటిసారి పరీక్ష రాసినప్పుడు సీటు రాలేదు. రెండోసారి మాత్రం స్కల్‌ప్చర్‌, పెయింటింగ్‌, కమర్షియల్‌ ఆర్ట్‌లో సీటు వచ్చింది. పెయింటింగ్‌ను ఎంచుకున్నారు.

ఆయన ఆఫీసు డ్యూటీ పది నుంచి ఐదు వరకు. కాలేజి పది నుంచి మూడు వరకు. సెకండ్‌ షిప్ట్‌ ఇవ్వమని ఆఫీసులో అడిగితే కుదరదని చెప్పారు. ఉద్యోగమో, చదువో రెండిట్లో ఏదో ఒకటి తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ పైన్ ఆర్ట్స్ పై మక్కువతో ఫైన్‌ ఆర్ట్స్‌ చేయాలనే పట్టుదల మరింత పెరిగింది. ఏదైతే అదవుతుంది అనుకొని ఉద్యోగం మానేసారు. ఫైన్‌ ఆర్ట్స్‌లో చేరిపోయారు. కొద్దిరోజులకు అదృష్టవశాత్తు కిరణ్‌ యాడ్స్‌లో పార్ట్‌టైం ఉద్యోగం దొరికింది. కాలేజి పూర్తయిన వెంటనే ఆఫీసుకు వెళ్లి వర్క్‌ చేసేవారు. కొంత కాలం తరువాత తనే సొంతంగా ‘ఏలె డిజైన్‌ గ్రూప్‌’ మొదలు పెట్టారు.


సినిమా రంగంలో

[మార్చు]

సినీ నటుడు ఉత్తేజ్ ఆయనకు బంధువు. అతని ద్వారా రాం గోపాల్‌ వర్మ పరిచయమయ్యాడు. ఆయన తీసిన చాలా సినిమాలకు పబ్లిసిటి డిజైనర్‌గా పనిచేశారు. వేరే సినిమాలకు కూడా బోలెడన్ని అవకాశాలు వచ్చాయి. హ్యాపీగా ఆ పనిచేసి డబ్బు సంపాదించుకోవచ్చు. కాని ‘ఆయన చేయాల్సిన పని ఇది కాదేమో’ అనుకోవడంతో అవకాశాలు వచ్చినా వాటికి దూరంగానే జరిగారు. పెయింటర్‌గా రాణించాలనేది అయన లక్ష్యం. దాని కోసమే పనిచేయాలనుకున్నారు.

తాను ఎప్పుడూ కవులు, రచయితలతో టచ్‌లో ఉండేవారు. అలా పోస్ట్‌మోడర్నిజం ధోరణుల గురించి తెలుసుకునే అవకాశం వచ్చింది. స్త్రీ, దళిత వాదాలు అవగాహనకు వస్తున్న కాలంలో ఆయనలో ఒక అంతర్మథనం.

తన గ్రామంలో కళాత్మకత

[మార్చు]

ఆయన తన స్వగ్రామమైన కదిరేణి గూడెం వెళ్లాడు. ఆయనకు తన గ్రామం కొత్తగా కనబడింది. అడుగడుగునా కళాత్మకత కనబడింది. ముత్తాదుకు(గీతకార్మికులు నడుముకు కట్టుకునే పట్టి) లోట్లు పెట్టుకొని గౌడు పొలం వెంట నడుస్తుంటాడు… గొల్లోల్ల బుచ్చయ్య తనదైన ఆహార్యంలో అందంగా కనిపిస్తాడు. ముసలవ్వ తన్మయంగా సుట్ట తాగుతూ కనిపిస్తుంది. ఇసుర్రాయి సంగీతం వినిపిస్తుంది. ఇలా తన ఊళ్లో ఎవరిని చూసినా, ఎక్కడ చూసినా కళే కనిపించింది. ఇక అది మొదలు తన కుంచె తన వేళ్లను తడమడం మొదలుపెట్టింది. ఎన్నో కళాత్మక చిత్రాలను గీశాడు.

1999 జూన్ లో రవీంద్రభారతిలో ఇమేజెస్‌ ఆఫ్‌ కదిరేణి గూడెం అని ఒక చిత్ర ప్రదర్శనకు పెట్టారు. ఈ ప్రదర్శన పెట్టడానికి ముందు తాను గీసిన పెయింటింగ్స్‌ను చూపించడానికి ఒక ఆర్ట్‌ కలెక్టర్‌ దగ్గరికి వెళ్లారు. ఆమె పెయింటింగ్స్‌ను చూసి ‘బ్యూటిఫుల్‌’ అన్నారు. అంతలోనే ఒక పెద్ద ఆర్టిస్ట్‌కు ఫోన్‌ చేసి తన గురించి ఏదో అడిగారు. అప్పటివరకు ‘బ్యూటిఫుల్‌’ అన్న వ్యక్తి మాట మార్చింది. తరువాత చూద్దాంలే అంది. తరువాత తనకు తెలిసిన విషయం ఏమిటంటే ఆయన చిత్రాల గురించి అభిప్రాయం అడిగినప్పుడు ఆ పెద్ద ఆర్టిస్ట్‌ ‘బేకార్‌ హై జీ…అవి కూడా బొమ్మలేనా?’ అన్నాడు అని. రెండు మూడు రోజుల వరకు కోలుకోలేదాయన. ఇంకా కొందరైతే ‘లక్ష్మణ్‌ పెయింటర్‌ కాదు. కార్టూనిస్ట్‌, ఇలస్ట్రేషన్లు వేసేవాడు’ అని చెవులు కొరికారు. ఒకసారి ఆయన వర్క్సును చూపెట్టడానికి ఒక ఆర్ట్‌గ్యాలరీకి వెళితే ‘యూ హ్యావ్‌ అపాయింట్‌మెంట్‌?’ అని ముఖం మీదనే తలుపులేసారు. ‘కాలమే ఆయన చిత్రాల గురించి చెబుతుందిలే’ అని చాలా ఓపికగా భరించారు. ఆయన నిరీక్షణ ఫలించింది. ఇప్పుడు ఆర్ట్‌లో అంతర్జాతీయస్థాయిలో ఆయనకు గుర్తింపు ఉంది. ఆయన బొమ్మల్లో సత్తా లేకపోతే, జీవం లేకపోతే ఆ బొమ్మలు చూసి ఇష్టపడిన ఒకతను ఎక్కడో స్విట్జర్లాండు నుంచి ఆయనను వెదుక్కుంటూ హైదరాబాద్‌ రాడు కదా! అనేక దేశాల్లో ఆయన చిత్రాలు అమ్ముడుపోవు కదా!!

తెలంగాణ చిహ్నం

[మార్చు]

తెలంగాణ అధికారిక చిహ్నంను ఈయన రూపొందించారు. దీనిని భారతదేశం లోని 29 వ రాష్ట్రంగా ఏర్పడిన రాష్ట్రమైన తెలంగాణకు అధికారికంగా ప్రకటించారు. తెలంగాణ సర్కారు కోసం రూపొందించిన లోగోలో దేశభక్తి, సంస్కతి, సంప్రదాయాలు, చరిత్రతో పాటు మానవ మనుగడ వంటి అనేక అంశాలు మిళితమయ్యాయి. అందరూ కోరుకునే బంగారు తెలంగాణను గుర్తుచేసేందుకు బంగారు వర్ణంతో వలయం.. నాలుగు సింహాల చిహ్నం, అశోకుడి విజయచక్రంతో పాటు అందమైన ఔటర్ లైన్లు కనిపిస్తాయి.

తెలుగు, ఉర్దూ, ఇంగ్లిషు భాషల్లో తెలంగాణ ప్రభుత్వము, తెలంగాణ సర్కార్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పదాలు స్పష్టంగా దర్శనమిస్తాయి. దిగువన సత్యమేవ జయతే అని హిందీలో కూడా పొందుపరిచారు. కాకతీయుల కళావైభవాన్ని స్ఫురించే తోరణం, ప్లేగు వ్యాధి సోకి వందలాది మంది ప్రాణాలు కోల్పోతే బతుకుకు చిహ్నంగా నిర్మించిన చార్మినార్ గుర్తులు లోగోలో నిండిపోయాయి. లోగో ఏ సైజులో ఉన్నా వీక్షించేందుకు స్పష్టత సంతరించుకుంది. ఇంక్‌తో ముద్రవేస్తే అచ్చుగుద్దినట్లే ఉండేందుకు అనువుగా దీని రూపు సంతరించుకుంది.

తెలంగాణ రాష్ట్ర చిహ్నం రూపొందించిన ఈయన తన లోగో రూఫొందించడానికి గల కారణాలను వివరించారు. బంగారు తెలంగాణ సాధించినందుకు గుర్తుగా బంగారు వలయాన్ని వేశారు. కాకతీయుల వైభవానికి చిహ్నంగా తోరణాన్ని వేసి పాడిపంటలు పండాలని అభిలషించారు. అలాగే హైదరాబాద్‌లో ప్లేగు వ్యాధి సోకి వందలాది మంది చనిపోయినప్పుడు జీవితాలను గుర్తుచేస్తూ నిర్మించిన చార్మినార్‌ను జోడించారు. ప్రతి మనిషి సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో జీవించాలన్నదే తన అభిమతంగా వివరించారు. లోగోలో పచ్చని రంగు డామినేట్ చేస్తుంది. అది శాంతికి గుర్తుగా భావిస్తాం. తెలంగాణ కూడా ఎల్లప్పుడూ శాంతితో వర్ధిల్లాలి. రెండు రంగులతోనే రాజముద్రను పూర్తి చేశారాయన.[6]

పురస్కారాలు

[మార్చు]
  1. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారాలు - 2015 అవార్డు - హైదరాబాద్, తెలంగాణ ప్రభుత్వం, 2015 జూన్ 2

మూలాలు

[మార్చు]
  1. Namasthe Telangana (29 September 2022). "పూలమ్మ పులకింత!". Archived from the original on 1 October 2022. Retrieved 1 October 2022.
  2. "ఆయన గూర్చి". Archived from the original on 2007-10-12. Retrieved 2013-07-03.
  3. Nipuna (2022-07-06). "తెలంగాణ చిత్రకళాకారులు – ఘనతలు". Archived from the original on 2022-07-07. Retrieved 2022-07-07.
  4. "తెలంగాణ ఆత్మ లక్ష్మణ్ ఏలె". 27 July 2019. Archived from the original on 1 అక్టోబరు 2022. Retrieved 1 October 2022.
  5. "ఆయన జీవిత విశేషాలు". Archived from the original on 2014-11-02. Retrieved 2013-07-03.
  6. "నమస్తే తెలంగాణ పత్రికలో ఆయన వ్యాఖ్య". Archived from the original on 2014-05-30. Retrieved 2014-05-30.

యితర లింకులు

[మార్చు]