Jump to content

నెమలి సింహాసనం

వికీపీడియా నుండి
షాజహాన్ చక్రవర్తి చిన్నస్థాయి సింహాసనంపై ఆసీనుడైన దృశ్యం. ఈ తక్తు బహుశా నెమలి సింహాసనంతో కొన్ని శైలీలక్షణాలు పంచుకుంటూ ఉండివుండొచ్చు, 1635

నెమలి సింహాసనం (ఆంగ్లం : Peacock Throne), ఇంకనూ తఖ్త్-ఎ-తావూస్ (పర్షియన్ : تخت طاووس ), అర్థం; తఖ్త్ అనగా సింహాసనం, తావూస్ అనగా నెమలి. మొఘల్ చక్రవర్తి అయిన షాజహాన్ దీనిని నిర్మించాడు. దీనిని నాదిర్ షాహ్ అఫ్షారీ ద్వారా, ముహమ్మద్ రెజా షాహ్ పహ్లవీ వద్ద చేరినది.

చరిత్ర

[మార్చు]
ఇరాన్ పాలక వంశానికి చెందిన నసీరుద్దీన్ షాహ్, నెమలి సింహాసనం ఎదుట.

దీనిని ఐదవ మొఘల్ చక్రవర్తి ఐన షాజహాన్ 17వ శతాబ్దంలో చేయించుకున్నాడు. దీనిని దీవాన్ ఎ ఆమ్ లో వుంచాడు. అపురూపమైన విలువకల బంగారు వస్తువులు, వజ్రవైఢూర్యాలతో కూడిన ఆభరణాలు అంటే వెర్రి ప్రేమ కలిగినవానిగా షాజహాన్ చక్రవర్తికి పేరుంది. అప్పటికి ప్రపంచంలోకెల్లా అత్యంత సంపద్వంతమైన సామ్రాజ్యాలలో ఒకటైన భారతదేశంలో చాలాభాగానికి చక్రవర్తులు కావడంతో మొఘల్ చక్రవర్తుల వద్ద అత్యంత విలువైన రత్నాలు ఉండేవి. ఇంతటి విలువైన రత్నాలను స్వంతఖజానాలో కాక అందరికీ కనిపించేలా ఓ అపురూపమైన రత్నరాశులు ప్రదర్శించే గొప్ప పనితనం కలిగిన సింహాసనాన్ని తయారుచేయాలని తాను సింహాసనం అధిష్ఠించిన వెంటనే నిశ్చయించుకున్నారు. దీనికోసం తన స్వంత జవహరీయే కాక రాచనగరులలో, సామ్రాజ్యంలోని ఇతర రాజధానుల్లో ఉన్న వజ్రాలు, కెంపులు, పచ్చలు, ముత్యాలను తన సమక్షంలోకి తెప్పించారు. వాటన్నిటినీ కలిపి సింహాసనాన్ని చేయించేందుకు బెబదల్ ఖాన్ అనే బంగారుపనివాళ్ళపైనుండే అధికారిని నియమించారు.[1]

నాదిర్షా 1739లో భారతదేశంపై దండెత్తి వచ్చి అప్పటికి సైనికంగా, రాజకీయంగా బలహీనులైపోయిన మొఘల్ చక్రవర్తి మహ్మద్ షాను ఓడించారు. ఆపైన జరిగిన దారుణమైన మారణహోమంలో ఒక్కరోజులో 20-30వేలమందిని చంపాడు. నగరాన్ని పూర్తి విధ్వంసం చేస్తుంటే అతన్ని మొఘల్ చక్రవర్తి ప్రాధేయపడి, ఆ నరమేధం ఆపేందుకు ప్రతిగా చక్రవర్తి ఖజానా తాళపుచెవులు తీసుకున్నాడు. ఆపైన జరిగిన దోపిడీలో చరిత్రలో కనీవినీ ఎరుగనంత విలువైన సంపదను ఇరాన్‌కు తీసుకెళ్ళాడు. ఆ విలువైన సంపదతోపాటుగా ప్రపంచ ప్రఖ్యాతి చెందిన అపురూపమైన సంపద నెమలి సింహాసనం కూడా తీసుకునివెళ్ళిపోయాడు. ఇక అంతటితో భారతదేశం దీనిని పూర్తిగా కోల్పోయినట్టయింది.[1] ఆపైన పర్షియా సామ్రాజ్య ఆధిక్యతకు రాజచిహ్నంగా నెమలి సింహాసనం నిలిచిపోయింది.

అనంతర కాలంలో మొఘలులు రాజకీయంగా బలహీనమైపోయినా 1857 వరకూ భారతదేశపు నామమాత్ర చక్రవర్తులుగా మిగిలారు. మహమ్మద్ షా తర్వాతి చక్రవర్తులందరి చిత్రాలూ నెమలి సింహాసనంలో ఉన్నట్టుగానే ఉన్నాయి. దీనిని చరిత్రకారులు బహుశా మరో నమూనా సింహాసనాన్ని మొఘలులు తయారుచేసుకున్నారని అవగాహన చేసుకున్నారు. ఐతే మొఘల్ రాజవంశం అత్యంత క్షీణదశయైన ఆ సమయంలో వారు తయారుచేసున్నది నెమలి సింహాసనమంతటి విలువైనది కాక దాని పేలవమైన అనుకరణగానే ఉంటుందని చెప్పవచ్చు. 1857 సిపాయిల తిరుగుబాటు వరకూ ఆ అనుకరణ సింహాసనం మొఘలుల వద్ద ఉన్నట్టుగా చరిత్రకారులు గుర్తించారు.

వివరణ

[మార్చు]
ఒక గొప్ప సభాంతరాళములో చివరి భాగముననున్న దివ్యసింహాసనముమీద చక్రవర్తి ఆశీనుడైయున్నాడు. అతడు అమూల్యాంబరాలను ధరించియున్నాడు. అతి సన్నముగాను, అందముగాను ఉండి, పట్టుజరీ, బుటేదారీ పనితనము, పువ్వులు గల తెల్లని నాజూకు చీనాంశుకము అంగీని ధరించియున్నాడు. ఆయన తలపాగ ప్రశస్తమైన బంగారు జలతారుతో నేసినది. అడుగున బంగారు కుదురులోఉరువైన అమూల్య రత్నమున్నూ, ఒక గొప్ప పుష్యరాగమున్నూ పొదిగివున్న కలికితురాయి ఆ తలపాగకు చుట్టిన జరీపట్టకు తగలించియున్నది. ఆయన కూర్చున్న సింహాసనానికి ఆరు గట్టి బంగారు కోళ్ళున్నవి. వాటికి నవరత్నాలు తాపటము చేసియున్నవి

—బెర్నియర్

బెర్నియర్ అనే చరిత్రకారుడు తాను స్వయంగా ఔరంగజేబు చక్రవర్తి ఈ అపురూపమైన నెమలి సింహాసనాన్ని అధిష్టించిన సన్నవేశాన్ని 1663లో చూసి పై విధంగా వర్ణించాడు.

ఇది ఆరు అడుగులు పొడవూ, నాలుగు అడుగుల వెడల్పూ గల 'తఖ్తా' (ఫలకం) పై నిర్మించబడింది. నలువైపులా నాలుగు బంగారు స్థంభాల కాళ్ళు గలవు, వీటి ఎత్తు 20 నుండి 25 అంగుళాలు. దీనిలో వజ్రాలు, వైడూర్యాలు, ముత్యాలు, పగడాలు పొదిగివున్నవి. 108 పెద్ద కెంపులు, 116 పచ్చలు పొదిగియున్నవి. ఈ సింహాసనపు పైకప్పుకు ఊతగా పన్నెండు స్తంభాలను పచ్చలతో నిర్మించారు. దీనిపై రెండు పనితనంతో చేసిన బంగారు నెమళ్ళు, దాని మధ్య వజ్రాలు, కెంపులు, పచ్చలు, ముత్యాలతో తాపడ చేసిన బంగారు చెట్టును నిలబెట్టారు. ఈ సింహాసనాన్ని ఎక్కేందుకు వీలుగా మూడు బంగారు మెట్లు కూడా నిర్మించి దానిలోనూ రత్నాలు తాపడం చేశారు. ఇలా నిర్మించాలని ప్రత్యేకించి చేసిన ఒక ఉత్తర్వు కూడా ఉంది.[1]

విలువ

[మార్చు]

దీని విలువ నేటి మార్కెట్ లో పదికోట్ల రూపాయలని, ఇంకో లెక్క ప్రకారం ఒక బిలియన్ అమెరికా డాలర్లు అనీ చెబుతారు. [2]. 2000 సంవత్సరంలో ట్రిబ్యూన్ పత్రిక రిపోర్టు ప్రకారం నెమలి సింహాసనం అంచనా విలువ $810 మిలియన్ అమెరికన్ డాలర్లు (భారతీయ రూపాయల్లో 4.5 బిలియన్లు లేదా 450 కోట్ల రూపాయలు) ఉంటుంది.[3]

నెమలి సింహాసనాన్ని నిర్మించేప్పుడు స్వంత ఖజానా జవహరీ, రాచనగరు, సామ్రాజ్యంలోని ఇతర రాజధానుల ఖజానాల జవహరీల్లోనివీ అయిన వివిధ మణిమాణిక్యాలు రప్పించారు. అప్పుడు నెమలి సింహాసనం తయారీకి (అప్పటి విలువలోనే) ప్రత్యేకించి 86 లక్షల రూపాయల విలువైన గొప్ప రత్నాలన్నిటినీ ఏరి, 14 లక్షల రూపాయల ఖరీదు కలిగిన లక్ష తులాల బంగారపు కడ్డీలతో నిర్మించడం మొదలుపెట్టారు. ఇది నిర్మించేందుకు అప్పట్లోనే మజూరీగా రూ.కోటి ఖర్చయింది. సింహాసనంలో కూర్చున్నప్పుడు లోపల ఆనుకునేందుకు నవరత్నాలు తాపడం చేసిన బంగారు పీటలు నిర్మించిపెట్టారు. ఆ పీటలపై చక్రవర్తి శరీరం ఆనుకుంటుంది కనుక ఒక్కొక్క పీటకూ రూ.పదిలక్షలు ఖర్చుచేశారు.[1]

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 వెంకట శివరావు, దిగవల్లి (1944). కథలు-గాథలు (1 ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. pp. 127–140. Retrieved 1 December 2014.
  2. http://www.infinityfoundation.com/mandala/h_es/h_es_shah_m_gems.html[permanent dead link]
  3. K.R.N. Swamy (January 30, 2000). "As priceless as the Peacock Throne". The Tribune. Retrieved March 15, 2014.

వనరులు, బయటి లింకులు

[మార్చు]