నోబెల్ కవిత్వం (పుస్తకం)
నోబెల్ కవిత్వం | |
కృతికర్త: | ముకుంద రామారావు |
---|---|
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
ప్రచురణ: | నిషిత పబ్లికేషన్స్ |
విడుదల: | 2013 |
నోబెల్ కవిత్వం పుస్తకాన్ని కవి, అనువాదకుడు ముకుంద రామారావు రచించారు. ప్రతిష్ఠాత్మక నోబెల్ బహుమతిని పొందిన కవుల జీవితవిశేషాల్ని, కవిత్వశైలిని రాసి, వారి ముఖ్యమైన కవితలను అనువాదం చేసి ఈ సంకలనాన్ని రూపొందించారు.
రచన నేపథ్యం
[మార్చు]ముకుంద రామారావు నోబెల్ కవుల గురించి వ్యాసాలు, కవిత్వానువాదాలు వ్యాసాలుగా ఫిబ్రవరి 2010 (తొలి సంచిక) నుంచి పాలపిట్ట మాసపత్రిక ధారావాహికగా ప్రచురించారు. ఆ వ్యాసాలను సంకలనంగా మార్చి 2013లో నిషిత పబ్లికేషన్స్ ద్వారా ప్రచురించారు. గ్రంథానికి గుడిపాటి గౌరవ సంపాదకునిగా వ్యవహరించగా, ఎ.కె.ప్రభాకర్, కె.పి.అశోక్ కుమార్ సంపాదకత్వ బాధ్యతలు వహించారు. ముఖపత్రం డిజైన్ రమణజీవి తయారుచేయగా, విమర్శకులు, అనువాదకుడు డా.వెల్చేరు నారాయణరావు ముందుమాట రాశారు. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్, మానసగంగోత్రి, మైసూరు వారు పుస్తక ప్రచురణకు ఆర్థిక సహాయాన్ని అందించారు.[1]
విషయాలు
[మార్చు]1901 సంవత్సరం నుంచి కవిత్వరచన ద్వారా నోబెల్ బహుమతి పొందిన కవులందరి జీవిత విశేషాలు, కవిత్వ విశేషాలు దీనిలో పొందుపరిచారు. ముందుమాటలో వెల్చేరు నారాయణరావు ఈ పుస్తకంలోని విషయాల గురించి 1901 నుంచి 2011 వరకూ నోబెల్ బహుమానం అందుకున్న కవుల జీవితకథలు సంగ్రహంగా చెప్పి, వాళ్ళ కవిత్వంలో మచ్చుతునకలు కొన్ని అనువాదం చేసి బహుమానంగా ఇచ్చారు
శైలి
[మార్చు]నోబెల్ కవిత్వంలో ప్రతి కవినీ పరిచయం చేయడంలో సమతుల్యత పాటించారు. కవుల జీవిత వివరాలు సంగ్రహంగా చెప్పడంలో ముకుంద రామారావు గారు మంచి నేర్పు చూపించారు. అనవసరమైన విషయాలు చెప్పకుండా ఉండడంలోనూ, అవసరమైన సమాచారం తప్పకుండా ఇవ్వడంలోనూ జాగ్రత్త పడ్డారు. ఏ కవినీ ఆకాశానికెత్తేసే ప్రయత్నం చేయలేదు. ప్రతి కవి జీవితంలోనూ మంచీ చెడ్డా రెండూ చూపించి ఇంత గొప్ప కీర్తి పొందిన కవులు కూడా మనలాంటి మామూలు మనుషులే సుమా అనే జ్ఞాపకం మనకి కలిగేలా చేశారు. నోబెల్ బహుమానాలు ఇవ్వడంలో వున్న రాజకీయాలనీ, ఏమరుపాట్లనీ వదిలిపెట్టకుండా, సున్నితంగా చూపించారు. అంటారు వెల్చేరు నారాయణరావు.[2]