పంచముఖి గాయత్రీదేవి
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
పంచముఖి గాయత్రీదేవి: గాయత్రీదేవి సకల వేద స్వరూపిణి, వేదమాత. త్రిమూర్తుల భార్యలగు “సరస్వతీ దేవి, లక్ష్మీదేవి, పార్వతీదేవి” లయొక్క అంశయే గాయత్రీదేవి. పూర్వం బ్రహ్మలోకంలో ప్రతిరోజూ దేవతలందరూ బ్రహ్మదేవుని వద్దకు వచ్చి బ్రహ్మదేవుని భార్యయైన సరస్వతీదేవి వీణను వాయిస్తుంటే బ్రహ్మదేవుడు, మిగిలిన దేవతలు విని తరిస్తూ ఉండెడివారు. ఒకరోజు సరస్వతీ దేవి బ్రహ్మదేవుని సమక్షానికి రావటానికి ఆలస్యం అయింది. దానితో బ్రహ్మదేవునికి ఆగ్రహంవచ్చి విష్ణువును, మహాశివుని ప్రార్థించి తనకు ఒక అందమైన కన్యను ప్రసాదింపుమని కోరగా వారు సరస్వతీదేవి, లక్ష్మీదేవి, పార్వతీదేవి లయొక్క అంశతో ఒక అందమైన కన్యను సృష్టించిరి. ఆమెయే గాయత్రీ దేవి. అపుడు బ్రహ్మదేవుడు ఆమెను వివాహమాడెనని కథనము ఉంది. కాబట్టి బ్రహ్మదేవునికి ఒక భార్య సరస్వతీ దేవికాగా, గాయత్రీదేవి రెండవ భార్య. గాయత్రి పేరులో "గా" అనగా గానమును, సంగీతమును సూచించును. "యత్రి" అనగా రక్షించునది అని సూచించును. కాబట్టి ఆమె సర్వులను రక్షించే "లోకమాత" . గాయత్రీ దేవి ముక్త (ముత్యము) విద్రుమ (వైఢూర్యం) హేమ (బంగారం) నీల (నీలమణి) ధవళ (తెల్లని) వర్ణములుకల పంచ (ఐదు) ముఖములు కలది. ఆమె ముఖములలో ఒకటి గాయత్రీ దేవికాగా, మిగిలిన నాలుగు చతుర్వేదములను ( ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అధర్వణ వేదములను) సూచించును. కాబట్టి గాయత్రీ దేవి "వేదమాత"గా పిలువబడెను. ఆమె ఐదు ముఖములకు సంబంధించి పదిచేతులను కలిగియుండి వాటిలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఆయుధములైన శంఖము, చక్రము, గద, పాశము, అంకుశము, కశము మున్నగు ఆయుధములను ధరించియుండును. గాయత్రీదేవి హంసవాహనముపై కూర్చొనియుండును. అది శాంతిని సూచించి మన మనస్సునకు ప్రశాంతతను కలిగించును. గాయత్రీదేవి ఎఱ్ఱని తామరపువ్వుపై కూర్చొనియుండును. ఇది సౌభాగ్యము, సంపదలను కలిగించుటను సూచించును. గాయత్రీదేవి ఐదుముఖములు పంచభూతములైన భూమి, గాలి, నీరు, అగ్ని, ఆకాశములను సూచించును. త్రినేత్రుడైన శివుని వలె గాయత్రీదేవి కూడా త్రిఅక్షణి (మూడు కన్నులు కలది). మానవులలోకూడా రెండు కన్నులతో పాటుగా మూడవదైన జ్ఞాననేత్రం ఉంటుంది. అది మహర్షులకు మాత్రమే పనిచేస్తుంది. సూర్యుని, సూర్య కాంతి తేజస్సును ఆరాధించే "గాయత్రీ మంత్రము" బ్రహ్మర్షి విశ్వామిత్రునిచే చెప్పబడింది. బ్రహ్మ దేవుని ముఖమునుండి బ్రహ్మతేజస్సుతో ఆవిర్భవించిన బ్రాహ్మణులకు మాత్రమే గాయత్రీ మంత్రము జపించుటకు అర్హత ఈయబడింది. గాయత్రీ మంత్రాన్ని ఎక్కడా వ్రాయకూడదు అందరికీ వినిపించునట్లు గట్టిగా చదవకూడదు. మనసునందు మాత్రమే ధ్యానించవలెను. అందుకే ఉపనయన సమయములో వటువుకు బ్రహ్మగారు గాయత్రీ మంత్రాన్ని ఉపదేశించేటప్పుడు ఒక వస్త్రమును ఇరువురిపైన కప్పుకొని చెవిలో మంత్రోపదేశము చేస్తారు. మంత్రం అనేపదానికి అర్ధం రహస్యం.
ఈమధ్యకాలంలో సీడీలలో గాయత్రీ మంత్రాన్ని రికార్డు చేసి బహిరంగ ప్రదేశాలలో గట్టిగా అందరికీ వినిపించేటట్లు పెడుతున్నారు. ఇలా చేయడం వల్ల మంత్ర ప్రభావం ఏమీ మనకు కనిపించదు. బ్రాహ్మణులకు గాయత్రీ మంత్రము పఠించుటకు, లోకానికంతటికీ వెలుగును ప్రసాదించే సూర్యదేవుని ఆరాధించుటకు "సంధ్యావందనము" సమకూర్చబడింది. ఈ సంధ్యావందనమును మూడుపూటలా అంటే ఉదయము, మద్యాహ్నము,, సాయంత్రము నిష్ఠతో చేయవలెను. త్రికాల సంధ్యావందనము చేయువాని ముఖము దివ్య తేజస్సుతో వెలుగుచుండును. మూడుపూటలా కుదరనివారు కనీసము ఉదయము, సాయంత్రము రెండుపూటలా చేయవలెనని నియమము ఉంది. ఈమధ్యకాలంలో చాలా మంది బ్రాహ్మణులు తమకు అసలు ఖాళీ ఉండదని చెప్తూ సంధ్యావందనం చేసే వారు చాలా తక్కువగా ఉంటున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఆఫీసుకు వెళ్ళేవారు తెల్లవారుఝామున నిద్రలేచి 5.30 – 6.00 గంటల మధ్యకాలంలో సంధ్యా వందనాన్ని చేసికొనవచ్చును. అలా కుదరనివారు ఆఫీసుకు బస్సులోకాని, బండిమీదకాని వెళ్ళేటప్పుడు సంధ్యావందనాన్ని "సూర్యార్ఘ్యం" వరకూ చదువుకొనిన శ్రేయస్కరం. అప్పుడు గాయత్రీమంత్రాన్ని చదువరాదు. మానవుని అరచేతియందు లక్ష్మీదేవి, సరస్వతీదేవి నివసింతురు. చేతి బొటనవేలు బ్రహ్మస్వరూపమును, చూపుడు వేలు (తర్జని) విష్ణుస్వరూపమును, మధ్యవేలు శివస్వరూపమును, ఉంగరంవేలు (అనామిక) సత్యమును, చిటికెనవేలు జ్ఞానమును సూచించును. అందువలన ఉదయము నిద్రలేవగానే మన అరచేతిని చూసినచో సమస్త దేవతలను దర్శించిన పుణ్యము కలుగును. అదేవిధముగ హృదయము బ్రహ్మస్వరూపమును, శిరస్సు విష్ణుస్వరూపమును, శిఖ శివస్వరూపమును, భుజములు సత్యమును, నేత్ర త్రయములు జ్ఞానమును సూచించును.
ఏది ఏమైనను పంచముఖ ఆంజనేయుని పూజించినను, పంచముఖ వినాయకుని పూజించినను, పంచముఖి గాయత్రీదేవిని పూజించినను "సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్ఛతి" . (ముఖ్య గమనిక: పంచముఖి గాయత్రీదేవి గురించి ఈ వివరాలను నేను 2015 సంవత్సరంలో పరిశోధనచేసి నా ఫేస్ బుక్ అకౌంట్ లో అందించడం జరిగింది. దీనిని చాలామంది తరువాత వారి సైట్లలో వారే వ్రాసినట్లుగా కాపీ చేయడం జరిగింది. అటువంటివారు నా పేరును సూచించవలసినదిగా తెలియజేయుచున్నాను.) పంచముఖి గాయత్రీదేవికి మాకుటుంబ సభ్యులందరి తరపున శతసహస్ర వందనములు. సమస్త జనులకు పంచముఖి గాయత్రీదేవి అనుగ్రహ ప్రాప్తిరస్తు........ సర్వేజనాః సుఖినోభవంతు.......... సమస్త సన్మంగళాని సంతు........ స్వస్తి... Written by Nemani.V.V.S.N.Murty, Lecturer in Physics, Nedunuru, Inavilli Mandal, Konaseema District, Andhra Pradesh, Mobile: 9440249930.