పంచముఖ ఆంజనేయుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పంచముఖ ఆంజనేయుడు: అంజనాదేవికి వాయుదేవుని వరప్రసాదం వల్ల శివాంశ సంభూతుడైన ఆంజనేయుడు జన్మించెను. కాబట్టి ఆంజనేయుని “పవనతనయుడు”, “వాయుపుత్రుడు” అని పిలుస్తారు. చిన్నతనంలో ఆంజనేయుడు సూర్యుని ఒక పండుగా భావించి తినుటకు సూర్యుని వద్దకు ఎగిరివెళ్ళగా ఈవిషయం తెలిసిన ఇంద్రుడు తనవజ్రాయుధంతో ఆంజనేయుని ఎడమదవడపై బలంగా కొట్టడం వల్ల “హనుమ” అనేపేరుతో పిలువబడి “హనుమంతుడు”గా మారెను. హనుమంతుడు ఒక మహిమాన్వితమైన వానరుడు. కాబట్టి ఈయనను “మారుతి” అని పిలుస్తారు. రామరావణ యుద్ధ సమయంలో రావణుడు తన సోదరతుల్యుడైన, పాతాళలోక రాక్షస ప్రభువగు మహిరావణుని సహాయమును అర్ధించెను. ఈవార్త తెలిసి, రాముని పక్షమున చేరిన రావణుని సోదరుడు, సజ్జనుడు, రాముని భక్తుడైన విభీషణుడు రామలక్ష్మణులను దాచమని ఆంజనేయునికి చెప్పెను. అపుడు ఆంజనేయుడు తనతోకను శతసహస్ర యోజనములు పెంచి దానితో వృత్తాకారంగా ఒకకోటను నిర్మించి రామలక్ష్మణులను అందులో దాచి ద్వారముకడ తాను కాపలా ఉండెను. మాయావియైన మహిరావణుడు విభీషణుని రూపమును ధరించి హనుమంతుని మోసగించి రామలక్ష్మణులను చిన్నలక్కపిడతలవంటి బొమ్మలుగామార్చి పాతాళలోకమునకు తీసికొనిపోయి బంధించి ఉంచెను. తరువాత అసలైన విభీషణుడు రావటంతో విషయంగ్రహించిన హనుమంతుడు పాతాళలోకమునకు వెళ్ళుటకు బయలుదేరుచుండగా విభీషణుడు హనుమంతునితో "మహిరావణుడు ఎవ్వరిచేతను తనకు మరణము లేకుండా వరమును పొందెనని" తెలిపెను. అతడు మరణించవలెనన్న ఐదు అగ్ని జ్వాలలను వివిధ దిశలలో ఒకేసారిగా ప్రయోగించి చంపవలెనని ఆంజనేయునికి చెప్పిపంపెను. ఆంజనేయుడు ఆవిధముగా ఎట్లుచేయవలెనని ఆలోచించుచు పాతాళలోకమునకు వెళ్ళెను. అపుడు ఆంజనేయుడు పంచభూతములను (అనగా గాలి, నీరు, అగ్ని, ఆకాశము, భూమి) తనయందు నిక్షిప్తము చేసికొనుచు ఐదు ముఖములతో పంచముఖ ఆంజనేయునిగా అవతారమెత్తెను. వాటిలో తూర్పుముఖముగా ఆంజనేయుడు(వానర ముఖం) , దక్షిణ ముఖముగా ఉగ్ర నరసింహ అవతారం(సింహం ముఖం) , పశ్చిమ ముఖముగా గరుత్మంతుని ( గరుడుని ముఖం ) అవతారం, ఉత్తర దిశగా వరాహావతారం(పంది ముఖం) , ఊర్ధ్వ దిశగా ( పైకి) హయగ్రీవ ( గుఱ్ఱం ముఖంతో తుంబురుని) అవతారం. పంచముఖ ఆంజనేయుడు ఈ ఐదుముఖముల నోటినుండి అగ్ని జ్వాలలను అన్నిదిశలలోను ఏకకాలంలో ప్రయోగించి మహిరావణుని సంహరించి రామలక్ష్మణులను రక్షించెనని కధనము కలదు. పంచముఖ ఆంజనేయునికి ఐదు ముఖములకు సంబంధించి పదిచేతులను కలిగియుండి వాటిలో పది ఆయుధములను ధరించియుండును. తమిళనాట కంబ రామాయణంలో పంచముఖ శబ్దంలో ఐదు సంఖ్యయొక్క ప్రాముఖ్యతను దివ్యంగా వర్ణించడం జరిగింది. మొదటిది పంచభూతాలలో అతడు వాయు పుత్రుడు (గాలి), రెండవది సముద్రమును దాటెను (నీరు), మూడవది ఆకాశములో ఎగిరివెళ్ళెను (ఆకాశము), నాల్గవది భూదేవి కుమార్తె అయిన సీతాదేవిని దర్శించెను (భూమి), ఐదవది లంకాపట్టణాన్ని అగ్నితో దహించెను (అగ్ని). తూర్పుముఖ ఆంజనేయుడు శతృసంహారము చేసి ఇష్టకామ్యార్ధ సిద్ధిని కలిగించును. దక్షిణ ముఖ ఉగ్ర నరసింహ ఆంజనేయుడు భూతప్రేతములను నశింపజేసి అభీష్ట సిద్ధిని కలిగించును. పశ్చిమ ముఖ గరుడ ముఖ ఆంజనేయుడు సర్వవిఘ్నములను నివారించి సకలసౌభాగ్యములను కలిగించును. ఉత్తర ముఖ వరాహ ముఖ ఆంజనేయుడు సకల సంపదలను, ధనమును ప్రసాదించును. ఊర్ధ్వ ముఖ హయగ్రీవ ముఖ ఆంజనేయుడు సమస్త జనవశీకరణ, సకలవిద్యా ప్రాప్తి, సకల జయములను కలిగించును.

(ముఖ్య గమనిక: పంచముఖ ఆంజనేయుని గురించి ఈ వివరాలను నేను 2015 సంవత్సరంలో పరిశోధనచేసి నా ఫేస్ బుక్ అకౌంట్ నందు అందించడం జరిగింది. దీనిని చాలామంది తరువాత వారి సైట్లలో వారే వ్రాసినట్లుగా కాపీ చేయడం జరిగింది. అటువంటివారు నా పేరును సూచించవలసినదిగా తెలియజేయుచున్నాను.) పంచముఖ ఆంజనేయునికి మాకుటుంబ సభ్యులందరి తరపున శతసహస్ర వందనములు. సమస్త జనులకు పంచముఖ ఆంజనేయ అనుగ్రహ ప్రాప్తిరస్తు........ సర్వేజనాః సుఖినోభవంతు.......... సమస్త సన్మంగళాని సంతు........ స్వస్తి.... Written by Nemani.V.V.S.N.Murty, Lecturer in Physics, Nedunuru, Inavilli Mandal, Konaseema District, Andhra Pradesh, Mobile: 9440249930.