పంచముఖ మహాశివుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పంచముఖ మహాశివుడు: సర్వాంతర్యామియైన శివుడు సృష్టి స్థితి లయకారకుడు. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో ఈయన అగ్రగణ్యుడు. శివునికి లెక్కలేనన్ని నామాలుకలవు. ఈశ్వరుడు, శంకరుడు, పరమశివుడు, సదాశివుడు, సర్వేశ్వరుడు, మహాదేవుడు, మహేశ్వరుడు, త్రినేత్రుడు, రుద్రుడు, నీలకంఠుడు, త్ర్యంబకుడు వంటి అనేకనామాలతో పిలువబడుతూ ఉంటాడు. ఈయనకు పాపాలను, పాపులను నశింపచేయుటకు అగ్నికీలలను వెలువరించి భస్మముచేయు శక్తికలిగిన మూడవనేత్రముండుటచే త్రినేత్రుడని పిలువబడెను. అంబకమనిన కన్ను అని అర్ధం. కాబట్టి మూడు కన్నులు కలిగియుండుటచే త్ర్యంబకుడు. క్షీరసాగర మధన సమయంలో వెలువడిన విషవాయువులను ఎవ్వరికీ హానికలిగించకుండా చేయుటకు తనకంఠమునందు నిక్షిప్తముచేసికొని నీలకంఠుడైనాడు. కోపముతో తనమూడవనేత్రమును తెరచినపుడు క్రోధాగ్నిజ్వాలలను వెలువరిస్తూ ఉగ్రరూపుడైన రుద్రుడైనాడు. ఈయనరుద్రరూపంలో శ్మశానమందు నివసించుటచే అది "రుద్రభూమి"గా పిలువబడెను. అర్ధాయుష్కుడైన మార్కండేయుని మృత్యుముఖమునుండి రక్షించి, యముని జయించి "మృత్యుంజయుడు" అయ్యెను. దక్షునిచే శాపానికి గురియైన చంద్రుని శాపాన్ని తొలగించి తన తలపై ధరించి చంద్రరేఖను మౌళియందుకలవాడు కాబట్టి “చంద్రశేఖరుడు”, “చంద్రమౌళీశ్వరుడు” అయ్యెను. నాగేంద్రుని (పామును) తన మెడకు అలంకరించుకొని “నాగభూషణుడు” అయ్యెను. భగీరధుడు ఘోరమైన తపస్సు చేసి గంగను దివినుండి భువికి తీసికొనివచ్చువేళ గంగాదేవి పరవళ్ళుత్రొక్కుతూ పైనుండి క్రిందకు వచ్చు వేగమును భూమి తట్టుకొనలేదనితలచి భగీరధుడు శివుని ప్రార్థించగా గంగను తన జటాజూటమునందు బంధించి “గంగాధరుడు” అయ్యెను. శివుడు హిమాలయములందు కైలాసగిరిపై నివసించును. నందీశ్వరుడు ఈయనకు వాహనము. శివాలయములో మొదట నందిని దర్శింపనిదే శివుని దర్శింపరాదు. శివుడు ఐదుముఖములుగలవాడు కాబట్టి పంచముఖ శివుడు. పంచవక్త్రుడని కూడా అనవచ్చును.

శివునికిగల పంచముఖములు పంచభూతములైన గాలి, నీరు, అగ్ని, ఆకాశము, భూమిలను సూచించును. పంచముఖ శివునిలో ఐదు ముఖములు వరుసగా ఈశానుడు, తత్పురుషుడు, అఘోరుడు, వామదేవుడు, సద్యోజాతుడు. వీటిలో తూర్పుముఖముగా ఉన్న శివుడు తత్పురుషుడు. ఆయన ఎల్లప్పుడు ధ్యానములో ఉండి సమస్తజీవులను, ప్రజలను కాపాడుచుండును. ఇదివాయురూపాన్ని సూచించును. దక్షిణ ముఖముగానున్న శివుడు అఘోరుడు. ఈయన "దక్షిణామూర్తి"గా పిలువబడుతున్నాడు. అఘోరుడు అగ్నికి ప్రతిరూపమై సృష్టిని లయంచేసి పునర్నిర్మించే శక్తినికలిగి ఉంటాడు. పశ్చిమ (పడమర) ముఖముగానున్న శివుడు సద్యోజాతుడు. సద్యోజాత అనగా అప్పుడే పుట్టినదని అర్ధం. ఈరూపం భూమిని పాలించే శక్తిని సూచిస్తూ జీవులను సృష్టించే తత్వాన్ని కలిగియుండును. ఉత్తరముఖముగానున్న శివుడు వామదేవుడు. ఈయన వరుణుడిపై (నీరు) ఆధిపత్యమును కలిగియుండి సృష్టి స్థితికి కారణమైఉన్నాడు. ఊర్ధ్వ (పైకి) ముఖముగలశివుడు ఈశానుడు. ఈయన ఆకాశముపై ఆధిపత్యమును కలిగియుండి పరమశివునిగా పిలువబడు ముఖ్యమైన రూపము.

(ముఖ్య గమనిక: పంచముఖ మహాశివుని గురించి ఈ వివరాలను నేను 2015 సంవత్సరంలో పరిశోధనచేసి నా ఫేస్ బుక్ అకౌంట్ లో అందించడం జరిగింది. దీనిని చాలామంది తరువాత వారి సైట్లలో వారే వ్రాసినట్లుగా కాపీ చేయడం జరిగింది. అటువంటివారు నా పేరును సూచించవలసినదిగా తెలియజేయుచున్నాను.) పంచముఖ శివునికి మాకుటుంబ సభ్యులందరి తరపున శతసహస్ర వందనములు. సమస్త జనులకు పంచముఖ శివుని అనుగ్రహ ప్రాప్తిరస్తు........ సర్వేజనాః సుఖినోభవంతు.......... సమస్త సన్మంగళాని సంతు........ స్వస్తి.... Written by Nemani.V.V.S.N.Murty, Lecturer in Physics, Nedunuru, Inavilli Mandal, Konaseema District, Andhra Pradesh, Mobile: 9440249930.