పరిణయ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పరిణయ్
(1974 హిందీ సినిమా)
దర్శకత్వం కాంతిలాల్ రాథోడ్
సంగీతం జయదేవ్
నిర్మాణ సంస్థ సమాంతర్ చిత్ర
భాష హిందీ

పరిణయ్(హిందీ: परिणय) 1974లో విడుదలయిన హిందీ చలన చిత్రం. సమాంతర్ చిత్ర బ్యానర్ పై ఈ సినిమా కాంతిలాల్ రాథోడ్ దర్శకత్వంలో వెలువడింది. ఈ చిత్రానికి ఉత్తమ జాతీయ సమైక్యతా చిత్రంగా నర్గీస్ దత్ ఉత్తమ జాతీయ సమైక్యతా చలనచిత్ర పురస్కారం లభించింది.

తారాగణం

[మార్చు]
పాత్ర పేరు నటుడు/నటి
రామ్ రమేష్ శర్మ
రేఖ షబానా అజ్మీ
రేఖ తల్లి అచలా సచ్‍‍దేవ్
రహీం బాబా కృష్ణకాంత్
దినేష్ ఠాకూర్
ప్రీతి గంగూలి
టి.పి.జైన్

సాంకేతికవర్గం

[మార్చు]
రంగము కళాకారుడు
దర్శకత్వం కాంతిలాల్ రాథోడ్
కథ హరీన్ మెహతా
చిత్రకథ వినయ్ శుక్లా,
కాంతిలాల్ రాథోడ్
సంభాషణలు వినయ్ శుక్లా,
అనురాగ్
ఛాయాగ్రహణం కె.కె.మహాజన్
సంగీతం జయదేవ్

చిత్రకథ

[మార్చు]

రామ్‌ ఆదర్శభావాలు కల యువకుడు. పెద్ద చదువులు చదవడం కోసం అతను గ్రామం నుంచి నగరానికి వచ్చాడు. తన చదువు స్వార్థానికి కాక, తన గ్రామానికి ఉపయోగపడాలన్నది అతని ఆశయం. చదువు పూర్తయ్యాక, గ్రామానికి వెళ్ళి అక్కడో బడి పెట్టాలనుకుంటాడు. అలా చేస్తే, నా అన్నవారు ఎవరూ లేని తనను చేరదీసి పెంచి పెద్ద చేసిన రహీంబాబా కోరిక కూడా తీరుతుందని అతని నమ్మకం.

నగరంలో కనిపించే నాగరికతకు, అక్కడ పొంగి పొరలే యువకోత్సాహానికి ప్రతీక రేఖా పండిట్. ఆమె తల్లి ఒక పత్రికా సంపాదకురాలు. ఆదర్శ యువకుడు రామ్‌, ఆధునిక యువతి రేఖ ఒకరినొకరు ఆకర్షించారు. ఆ ఆకర్షణ ప్రేమగా మారింది. రేఖకు తన ఆదర్శం తెలియజేశాడు రామ్‌. 'డబ్బుకూ, హోదాకూ తక్కువలేని తల్లికి ఒక్కగానొక్క బిడ్డవి. పూవులా పెరిగినదానివి. నీకు పల్లెటూరి జీవితం సరిపడదు రేఖా!' అని రామ్‌ గ్రామ జీవితంలో ఎదురయ్యే కష్టనష్టాల గురించి వివరంగా చెప్పాడు.

కాని అతని మీది ప్రేమతో అన్నీ మరచిపోయిన రేఖ 'నాకు కావలసింది నీ చెలిమి ఒక్కటే రామ్‌! అది ఉన్నంత కాలం నేనెక్కడుంటే నేం? నువ్వు వున్నచొటే నాకు స్వర్గం' అంటుంది. రామ్‌, రేఖల పెళ్ళి జరిగింది. వాళ్ళిద్దరూ కలిసి గ్రామానికి వెళ్ళి జీవితం ప్రారంభించారు.

ఏ విధమైన సౌకర్యమూ, ఎలాంటి ఆకర్షణా లేని ఆ గ్రామంలో రామ్‌ బడి పెట్టాడు. కొత్త దంపతుల మధ్య కొత్తలో ఉండే ప్రేమాభిమానాలు క్రమంగా తగ్గసాగాయి. నగర జీవితానికి బాగా అలవాటుపడ్డ రేఖకు పల్లె బతుకు భారంగా కనిపించింది. రాత్రింబవళ్ళు బడికే అంకితమైన రామ్‌కు భార్య గురించి పట్టించుకోవడానికి తీరిక లేకపోయింది. ఇంట్లో నాలుగు గోడల మధ్య ఒంటరిగా గడ్డపడం రేఖకు భరించరానిదయింది. దాంతో ఆమె అడవి లాంటి ఆ పల్లెపట్టులో అర్థం లేని ఆశయంతో అలా బతకడం కంటే నగరానికి తిరిగి వెళ్ళి, అక్కడ లాయరుగా స్థిరపడి బాగా సంపాయించమని రామ్‌కు సలహా ఇస్తుంది. రామ్‌ ఆ సలహాను పెడచెవిన పెడతాడు. భార్యాభర్తల మధ్య దూరం మరింత పెరిగింది.

భర్తను మార్చలేక పోయిన బాధతో రేఖ నగరంలో ఉన్న తన తల్లి దగ్గరికి తిరిగి వచ్చింది. కూతురు చెప్పిందంతా విన్న ఆ తల్లి, 'భర్త చేస్తున్న పనులలో భార్య పాలుపంచుకోవాలి. నీకు అలా చెయ్యడం ఇష్టం లేకుంటే నీ బతుకేదో నువ్వు స్వతంత్రంగా బతుకు' అన్నది.

తన చదువుకు తగ్గ ఉద్యోగం కోసం అన్వేషణ సాగించింది రేఖ. చివరికి ఆమెకు అహ్మదాబాదులోని లగ్జరీ బస్ కంపెనీలో ' టూరిస్టు గైడు 'గా ఉద్యోగం దొరికింది. కొత్త ఉద్యోగం ఆకర్షణ కూడా తొందరలోనే కరిగిపోయింది. ఒంటరి తనం, నిరాశ రేఖను మళ్ళీ పీడించసాగాయి. రామ్‌ గురించిన జ్ఞాపకాలు ఆమెను ఎడతెరిపి లేకుండా వేధించాయి. క్షణాలు యుగాలుగా ఆమెను బాధించాయి.

ఇలా ఐదేళ్ళు బరువుగా సాగిపోయాయి. ఈ ఐదేళ్ళలోనూ రామ్‌ నెలకొల్పిన బడి బాగా అభివృద్ధి చెందింది. అతను తన బడిలో చదువుతున్న పిల్లలను విహారయాత్రకు తీసుకు వచ్చి అహ్మదాబాదుకు వచ్చాడు. బస్సులో రామ్‌ రేఖలు ఒకరినొకరు చూసుకున్నారు. పాత జ్ఞాపకాలు వారిని సన్నిహితం చేశాయి.

బస్సు - కదలాడే గోపురాలను చేరుకుంది. అక్కడి ముసలిగైడు ఆ గోపురాల గురించి చెబుతూ 'ఇవి విచిత్రమైన గోపురాలు. ఇవి ఒకే తీరుగా ప్రవర్తించే ప్రేమికుల లాంటివి. ఒక గోపురం ఏ వైపుకు వాలితే, రెండవది కూడా ఆ వైపుకే వాలుతుంది. ఇదే జీవితం పరిపూర్ణత ' అన్నాడు.

ఈ మాట్లు రేఖనూ, రామ్‌నూ కదిలించాయి. బస్సు స్టాండుకు చేరుకున్నాక రేఖ - రామ్‌ ఊరికెప్పుడు తిరిగి చేరుకుంటాడో కనుక్కుంది.

ఇంటికి చేరిన రామ్‌కు ఆశ్చర్యమూ, ఆనందమూ రెండూ కలిగాయి. ఐదేళ్లుగా కళా కాంతీ లేక పాడుపడ్డట్టు ఉన్న అతని ఇంట మళ్ళీ వెలుగు రేఖ ప్రసరించింది. అవును! అతని భార్య రేఖ ఇంటిని అద్దంలా సర్ది పెట్టి అందమైన చిరునవ్వుతో అతణ్ణి ఆహ్వానించింది.[1]

మూలాలు

[మార్చు]
  1. "జాతియ సమైక్యతా చిత్రం పరిణయ్". విజయచిత్ర. 10 (4): 22–23. 1 October 1975.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=పరిణయ్&oldid=4203656" నుండి వెలికితీశారు