పరువు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పరువు కోసం మనుషులు ఎన్నో సాహసాలు, దానధర్మాలు చేస్తారు. కులగౌరవం వంశప్రతిష్ఠ పెద్దపేరున్న కుటుంబం అంటూ కొన్నిసార్లు చేయకూడని అమానుషమైన పనులు చేస్తారు.

పరువు హత్యలు కూడా ఈ వర్గానికి చెందిన క్రూరమైన ప్రక్రియ.

పరువు కోసం కిరాతకం[మార్చు]

తమ నెత్తురు పంచుకు పుట్టిన బిడ్డలకు స్వయానా తామే బలిపీఠాల్ని పేర్చే మానవమృగాల ఘాతుకాన్ని"'ఆనర్ కిల్లింగ్" అని పిలుస్తున్నారు. అంటే స్వీయ గౌరవ పరిరక్షణ కోసం చంపేయడం! వంశప్రతిష్ఠ అనే ముసుగులోనో, కుటుంబ మర్యాద అనే మిషతోనో, కులగౌరవం అనే సాకుతోనో- ఇలా నెపం ఏదైతేనేం .కిరాతకంగా ఏటా అయిదు వేల మందికి పైగా మహిళల్ని చంపుతున్నారు. కుటుంబ పరువు ప్రతిష్ఠల పరిరక్షణ కోసమంటూ హత్యలకు పాల్పడుతున్నారు. బాయ్ ఫ్రెండ్స్'తో యువతులు ఊరు విడిచి పారిపోవడం తమ కుటుంబ ప్రతిష్ఠకు మచ్చ తెచ్చిందని, ఇష్టపడిన వ్యక్తితో పెళ్ళికి ముందే సహజీవనం సాగించడంవల్ల కుటుంబ ప్రతిష్ఠకు భంగం కలిగిందని, ఆ కళంకాన్ని తుడిచి పెట్టడానికి వారిని చంపుతున్నారు. చంపేయాల్సినంతటి ఘోర నేరాలా అవి? పరువు ప్రతిష్ఠల పేరిట పిల్లల ప్రాణాలను నిలువునా తీయటం ఆ కుటుంబానికి ఏ విధమైన గౌరవం? హంతక కుటుంబంగా మారడం ఆ వంశానికి ఏ రకమైన ప్రతిష్ఠ?

విస్తుగొలిపే కారణాలు: మహిళలు తమ పెద్దలు కుదిర్చిన పెళ్ళి సంబంధాన్ని నిరాకరించడం, తాము మనసు ఇచ్చిన మగవాడితో ఇంట్లోవారికి చెప్పకుండా వెళ్లిపోవడం, కులాంతర, మతాంతర వివాహాలు చేసుకోవడం, భర్త నుంచి విడాకులు కోరడం, అత్యాచారానికి గురవడం- అవన్నీ కుటుంబ ప్రతిష్ఠకు మచ్చ తెచ్చేవేనట. తల్లిగా, భార్యగా, సోదరిగా, కూతురుగా ఇలా ఏ హోదాలో ఉన్నా కుటుంబంలోని మగసభ్యుల నుంచి వారికి ఇప్పటికీ సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. మగవాళ్ల రక్షణలోనే మహిళలు ఉండాలన్న పితృస్వామిక భావజాలం మగవారిలో పాతుకుపోవడం అందుకు కారణం. తమ చెప్పుచేతల్లో మహిళలు నడుచుకోకపోవడాన్ని కుటుంబప్రతిష్ఠతో ముడిపెడుతూ, దాన్ని కాపాడటం కోసమంటూ మహిళల్ని హతమార్చడం అమానుషం. అత్యంత హేయం.

న్యాయస్థానవైఖరి[మార్చు]

ఇలా కుటుంబ గౌరవ ప్రతిష్ఠల పేరిట హత్యలకు ఒడిగట్టడం అనాగరికమని సర్వోన్నత న్యాయస్థానం గతంలో స్పష్టం చేసింది. కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్న యువతీ యువకుల్ని హింసించేవారిపై కఠిన చర్యలు తీసుకోవలసిందిగా పోలీసులను ఆదేశించింది. 'వివాహాలు ఆమోదయోగ్యం కాని పక్షంలో తల్లిదండ్రులు చేయగలిగింది తమ పిల్లలతో సామాజికంగా తెగతెంపులు చేసుకోవడమే. అంతేతప్ప వారిని వేధించడానికి వీలులేదు' అని స్పష్టం చేసింది. ఇచ్ఛాపూర్వకంగా కులాంతర, లేదా మతాంతర వివాహాలు చేసుకున్న వ్యక్తుల్ని కుటుంబగౌరవ పరిరక్షణ పేరిట బంధువులు హతమార్చడం- క్రూరత్వానికి, ఫ్యూడల్ మనస్తత్వానికి దృష్టాంతమనీ సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=పరువు&oldid=2823866" నుండి వెలికితీశారు