పల్ప్ ఫిక్షన్ (చలన చిత్రం)
పల్ప్ ఫిక్షన్ క్వెంటీన్ టరంటీనో దర్శకత్వం వహించిన 1994 నాటి అమెరికన్ బ్లాక్ కామెడీ క్రైమ్ సినిమా. సినిమాకు కథని టరంటినో, రోజర్ అవరీ అందించారు.[1] విశిష్టమైన సంభాషణలు, హాస్యం-హింసల సమ్మిళితిమైన సన్నివేశాలకు, నాన్-లీనియర్ నెరేషన్ కు, సినిమాటిక్ ఎల్యూజన్ కూ, పాప్ సంస్కృతిని చూపించడానికి ఈ సినిమా పేరుపడింది. ఈ సినిమాకు ఉత్తమ చలనచిత్రంతో సహా ఏడు ఆస్కార్ నామినేషన్లు వచ్చాయి. టరంటినో, అవరీ ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే ఆస్కార్ అవార్డు గెలుచుకున్నారు. 1994 కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో పల్మె డి'ఓర్ పురస్కారం పొదింది. సినిమా ప్రేక్షకాదరణ పొంది మంచి విజయాన్ని, విమర్శకుల ప్రశంసలను పొందింది. సినిమాలోని ప్రధాన పాత్రధారి జాన్ ట్రవోల్టాకు ఆస్కార్ నామినేషన్ రావడంతో పాటుగా సినిమా తర్వాత కెరీర్ పునరుత్తేజం పొందింది. సినిమాలో ఆయన సహపాత్రధారులైన శామ్యూల్ ఎల్.జాక్సన్, ఉమా థర్మన్ ల కెరీర్లు కూడా వేగం పుంజుకున్నాయి.
దర్శకుడు సినిమాను అత్యంత స్టైలిష్ శైలిలో తెరకెక్కించారు. పల్ప్ ఫిక్షన్ వివిధ సంఘటనల్లో వేర్వేరు చిన్న కథల్లో ఉండే లాస్ ఏంజెల్స్ గ్యాంగ్ స్టర్లు, చిన్న చిన్న నేరగాళ్లు, ఓ రహస్యం దాగున్న బ్రీఫ్ కేస్ లను కలుపుతూ కథ సాగుతుంది. సినిమాలో చెప్పుకోదగ్గ స్క్రీన్ టైం స్వగతాలు, సాధారణ సంభాషణలకు కేటాయించి, తద్వారా పాత్రల హాస్యస్ఫూర్తి, జీవితంపై వారి దృక్కోణం తెలిపారు. సినిమా టైటిల్ అయిన పల్ప్ ఫిక్షన్, 20వ శతాబ్ది మధ్యభాగంలో అమెరికాలో ప్రాచుర్యం పొందిన పల్ప్ మేగజైన్లు, అతి హింసాత్మకమైన సన్నివేశాలు, పంచ్ డైలాగులకు పేరొందిన క్రైమ్ నవలలను సూచిస్తోంది. పల్ప్ ఫిక్షన్ సినిమా ప్రారంభంలోనే టైటిల్ కార్డులో పల్ప్ అనే పదానికి రెండు నిఘంటు అర్థాలను ఇస్తారు. టరంటినో ఇతర సినిమాల్లాగానే, సినిమా ప్లాట్ కాలక్రమాన్ని అనుసరించకుండా సాగుతుంది.
సినిమాలోని సంప్రదాయ వ్యతిరేకమైన స్ట్రక్చర్ తో పాటుగా విస్తారంగా ఇతర సినిమాల నుంచి స్ఫూర్తి పొందడం, సంబంధిత సినిమాల కళను సంకేతాత్మకంగా చూపుతూ గౌరవించడం వంటివాటి వల్ల విమర్శకులు దీన్ని ఆధునికాంతర సినిమా (పోస్ట్ మోడర్న్ ఫిల్మ్)కి అత్యుత్తమమైన ఉదాహరణగా పేర్కొంటూంటారు. కొందరు విమర్శకులు దీన్ని బ్లాక్ కామెడీగా పేర్కొన్నా,[1] తరచుగా సినిమా నియో-నోయిర్గా కూడా పేరొందింది.[2] సినీ విమర్శకుడు గియోఫ్రే ఓ'బ్రియెన్ మరో విధంగా వాదిస్తూ: "పూర్వకాలపు నాయిర్ (సెక్స్, క్రైమ్ లను స్టైలిష్ గా చూపే సినిమా శైలి) కోర్కెలకు, తీవ్రమైన విషాదానికి, ఓపెరా శైలిలోని హత్య సీన్లకు-మొత్తంగా టరెంటినో మాయాజాలమైన ఈ వండర్ లాండ్ లో చోటులేదు. [ఇది] నియో-నాయిర్ కాదు, నాయిర్ కి పారడీ కూడా కాదు."
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 See, e.g., King (2002), pp. 185–7; Kempley, Rita (1994-10-14). "Pulp Fiction (R)". Washington Post. Retrieved 2007-09-19.
- ↑ See, e.g., Waxman (2005), p. 64; Silver and Ursini (2004), p. 65; Real (1996), p. 122.