Jump to content

పాంపే

అక్షాంశ రేఖాంశాలు: 40°45′0″N 14°29′10″E / 40.75000°N 14.48611°E / 40.75000; 14.48611
వికీపీడియా నుండి
పాంపే
పాంపే విహంగ వీక్షణం
పాంపే is located in Italy
పాంపే
Shown within Italy
స్థానంపాంపే, నేపుల్స్ ప్రాదేశికం, కంపానియా, ఇటలీ
నిర్దేశాంకాలు40°45′0″N 14°29′10″E / 40.75000°N 14.48611°E / 40.75000; 14.48611
రకంSettlement
వైశాల్యం64 to 67 హె. (170 ఎకరం)
చరిత్ర
స్థాపన తేదీ6th–7th century BC
వదిలేసిన తేదీశా.శ. 79
అధికారిక పేరుపాంపే, హెర్క్యులేనియమ్, టోర్ అనంజియాటా లోని పురావస్తు ప్రదేశాలు
రకంసాంస్కృతిక
క్రైటేరియాiii, iv, v
గుర్తించిన తేదీ1997 (21st session)
రిఫరెన్సు సంఖ్య.829
ప్రాంతంEurope

పాంపే ఒక ప్రాచీన రోమన్ నగరం. ఇటలీ లోని, కంపానియా ప్రాంతంలో నేపుల్స్ నగరం దగ్గరలోని ఆధునిక పాంపీ నగరానికి సమీపంలో ఈ ప్రాచీన నగరం ఉండేది. సా.శ 79 లో విసూవియస్ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందినపుడు దాని బూడిద కింద 4 నుండి 6 మీటర్ల లోతున సమాధి అయిపోయిన నగరం ఇది. దీనితో పాటు చుట్టుపక్కల ఉన్న హెర్క్యులేనియమ్ వంటి గ్రామాలు కూడా ఆ బూడిదలో సమాధై పోయాయి.

బూడిద కప్పి ఉండటం చేత నగరం చాలావరకు నాశనం కాకుండా సురక్షితంగా ఉంది. ఇక్కడ జరిపిన తవ్వకాల్లో బయటపడిన విశేషాలు, ఆనాటి రోమన్ ప్రజల జీవితాన్ని అసాధారణమైన వివరాలతో చూపిస్తున్నాయి. ఇది ఒక సంపన్న నగరం. ఇక్కడ చాలా చక్కని ప్రభుత్వ భవనాలు, విలాసవంతమైన ప్రైవేట్ ఇళ్ళు, విలాసవంతమైన అలంకరణలు, కళాకృతులూ ఉన్నాయి. తవ్వకాల తొలినాళ్లలో ఇవి ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. చెక్క వస్తువులు, మానవ శరీరాల వంటి సేంద్రియ అవశేషాలూ విస్ఫోటనం వెదజల్లిన బూడిదలో సమాధి అయిపోయాయి. తదనంతర కాలంలో అవి కృశించి నశించి పోయి అక్కడ ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ ఖాళీలను అచ్చులుగా వాడి అప్పటి ప్రజల ఆఖరి భీతావహ క్షణాలను పోత పోయవచ్చని పురావస్తు శాస్త్రవేత్తలు గ్రహించారు. గోడలపైన, లోపలి గదులపైనా గీసిన గ్రాఫిటీలు ఆనాటి ప్రజలు మాట్లాడిన వల్గర్ ల్యాటిన్ భాషకు ఉదాహరణలుగా నిలిచాయి.

పాంపే యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. ఇటలీలో అత్యంత ప్రాచుర్యం పొందిన పర్యాటక ఆకర్షణలలో ఒకటి. ఏటా సుమారు 25 లక్షల సందర్శకులు ఈ ప్రదేశాన్ని దర్శిస్తూంటారు. [1]

1960 కి పూర్వం జరిగిన అనేక తవ్వకాలలో నగరంలో చాలా భాగాన్ని వెలికితీసారు. అయితే అది క్షీణించిపోవడంతో, [2] మరిన్ని తవ్వకాలు జరపడాన్ని నిషేధించారు. ప్రత్యేకంగా ప్రాధాన్యత ఉన్న ప్రాంతాలకు మాత్రమే తవ్వకాలను అనుమతించారు. 2018 లో జరిపిన తవ్వకాలలో నగరంలో గతంలో కనిపెట్టని కొన్ని ప్రాంతాల్లో కొత్త ఆవిష్కరణలు వెలుగుచూసాయి. [3] [4] [5]

సా.శ 62–79 ల నాటి చరిత్ర

[మార్చు]

పాంపే వాసులకు చిన్నపాటి భూకంపాలు అలవాటే. (ప్లినీ ది యంగర్ అనే రచయిత, భూ ప్రకంపనలు "పెద్దగా ప్రమాదకరమైనవేమీ కావు, కాంపానియాలో అవి మామూలే" అని రాసాడు). కానీ 62 ఫిబ్రవరి 5 న [6] వచ్చిన తీవ్రమైన భూకంపం బే చుట్టూ ఉండే ప్రాంతంలో, ముఖ్యంగా పాంపేలో గణనీయంగా నష్టం కలిగించింది. ఆ భూకంపం రిక్టర్ స్కేలుపై సుమారు 5, 6 మధ్య నమోదయి ఉంటుందని భావిస్తున్నారు. [7]

ఆ రోజు అగస్టస్‌ను జాతిపితగా గుర్తించిన రోజుకు వార్షికోత్సవం. పట్టణాన్ని కాపాడుతున్న దేవతల గౌరవార్థం విందు చేసుకునే రోజు కూడా. ఆ సందర్భాలను పురస్కరించుకుని నగరంలో రెండు క్రతువులు జరపాలని తలపెట్టారు. అవి జరుగుతూండగా భూకంపం రావడంతో అక్కడ గందరగోళం చెలరేగింది. భూకంప సమయంలో పడిపోయిన నూనె దీపాల వల్ల మంటలు చెలరేగి భయాందోళనలు ఉధృతమయ్యాయి. సమీప పట్టణాలైన హెర్క్యులేనియం, నుసేరియా లు కూడా భూకంప ప్రభావానికి లోనయ్యాయి. [7]

62 నుండి 79 నాటి విస్ఫోటనం వరకూ చాలావరకు నగర పునర్నిర్మాణం జరిగింది -కనీసం ప్రైవేటు రంగంలో. [8] పునర్నిర్మాణం పూర్తిగా జరగలేదని ఇటీవలి వరకు భావించారు. కాని కనబడకుండా పోయిన ఫోరమ్ విగ్రహాలు, పాలరాతి గోడ-వెనీర్లూ దొంగలు దోచుకున్నట్లు రుజువులు దొరకడంతో ఈ భావన సందేహాస్పదంగా మారింది. [9] [10] ఫోరమ్‌కు తూర్పు వైపున ఉన్న భవనాలను చాలావరకు పునరుద్ధరించారు. పైగా అందమైన పాలరాయి వెనీర్లు వగైరాలతో శిల్పకళను మెరుగుపరచారు కూడాను. [11]

సుమారు సా.శ 64 లో నీరో, అతని భార్య పొప్పే పాంపేని సందర్శించి, వీనస్ ఆలయానికి బహుమతులు ఇచ్చారు. బహుశా అతను నేపుల్స్ థియేటర్‌లో ప్రదర్శన ఇచ్చిన సందర్భంలో ఇది జరిగి ఉంటుంది. [12]

విసూవియస్ విస్ఫోటనం

[మార్చు]
విసూవియస్ విస్ఫోటనం వలన ప్రభావితమైన పాంపే, ఇతర నగరాలు. నల్ల మేఘం బూడిద విస్తరించిన ప్రాంతాన్ని సూచిస్తుంది. ఆధునిక తీరప్రాంతాలు చూపించబడ్డాయి.
విసూవియస్ విస్ఫోటనానికి ముందు అపోలో ఆలయం ఎలా ఉండి ఉండేదో ఆ చిత్రం -సైలార్క్ / యూనివర్శిటీ ఆఫ్ ఫెరారా వారి పరిశోధనల నుండి.
అదే స్థలం, నేడు

సా.శ 1 వ శతాబ్దం నాటికి, విసూవియస్ అగ్నిపర్వత పాదం వద్ద విలసిల్లిన అనేక పట్టణాల్లో పాంపే ఒకటి. ఈ ప్రాంతంలో సుమారు 12,000 - 15,000 మధ్య జనాభా ఉండేది [13] [14] ఈ ప్రాంతపు సారవంతమైన భూమి కారణంగా ఇక్కడి ప్రజలు సంపన్నులయ్యారు. 79 విస్ఫోటనంలో పాంపే పొరుగున ఉన్న అనేక సమాజాలు, ముఖ్యంగా హెర్క్యులేనియం కూడా దెబ్బతిన్నాయి లేదా నాశనమయ్యాయి. [15]

విస్ఫోటనంలో వెలువడ్డ పదార్థాలను, మృతులనూ వల్కనలాజికల్, బయో ఏంత్రొపోలాజికల్ శాస్త్ర అధ్యయనాలు జరిపారు. ఈ ఫలితాలను ప్రయోగాలు, సిమ్యులేషన్లతో కలిపి పరిశీలించినపుడు ప్రజలు ప్రధానంగా వేడి వలన మరణించారనీ, గతంలో భావించినట్లు బూడిద వలన కాదనీ తేలింది. 2010 లో ప్రచురించిన ఈ అధ్యయన ఫలితాల ప్రకారం 10 కి.మీ. దూరంలోని అగ్నిపర్వత బిలం నుండి వెలువడ్డ 250 °C (482 °F) వేడి ప్రవాహాల (పైరోక్లాస్టిక్ ప్రవాహాలు) వలన ఇళ్ళలో ఉన్నవారితో సహా పాంపే ప్రజలకు తక్షణ మరణం ప్రాప్తించింది. ప్రజలూ భవనాలూ 25 మీటర్ల లోతైన 12 రకాల పొరల టెఫ్రా (అగ్నిపర్వతం వెదజల్లే బూడిద, రాళ్ళ ముక్కలు వగైరాలు) లో కూరుకుపోయారు. ఆరు గంటల పాటు ఈ టెఫ్రా వర్షం కురుస్తూనే ఉంది.

నేపుల్స్ బే కు అవతలి వైపు నుండి విసూవియస్ విస్ఫోటనాన్ని చూసిన ప్లినీ ది యంగర్, ఈ విస్ఫోటనం గురించిన వివరాలను రాసాడు. ఈ సంఘటన జరిగిన 25 సంవత్సరాల తరువాత అతడు ఇది రాసాడు. అతని మామ, ప్లినీ ది ఎల్డర్, బాధితులను రక్షించే ప్రయత్నంలో మరణించాడు. నౌకాదళ అడ్మిరలైన ప్లినీ ది ఎల్డర్, మిసెనమ్ వద్ద ఉన్న ఇంపీరియల్ నేవీ నౌకలను సహాయ ప్రయత్నాల్లో పాల్గొనేందుకు బేను దాటమని ఆదేశించాడు. అగ్నిపర్వత శాస్త్రవేత్తలు ఇలాంటి సంఘటనలను " ప్లీనియన్ " అని పిలిచారు. విస్ఫోటనం గురించి ప్లినీ ది యంగర్ రాసిన వ్యాఖ్యానపు ప్రాముఖ్యతను వాళ్ళు ఆ విధంగా గౌరవించారు. ఈ రచన యొక్క ఒక కూర్పు ఆధారంగా విస్ఫోటనం ఆగస్టులో జరిగినట్లు చాలాకాలం భావించారు. కాని మరొక వెర్షన్ ప్రకారం ఇది నవంబరు 23 న జరిగినట్లు తెలుస్తోంది. 2018 లో కనుగొన్న బొగ్గు శాసనంపై అక్టోబరు 17 న జరిగినట్లుగా ఉంది. ఇది మొదటి దాని కంటే తరువాత రాసి ఉండాలి. [16] [17]

విస్ఫోటనం అక్టోబరు / నవంబరుల్లో జరిగి ఉందని చెప్పేందుకు మరొక ఆధారం - ప్రజలు ధరించిన దుస్తులు. వాళ్ళు శీతాకాలంలో ధరించే మందపాటి దుస్తులు ధరించి ఉన్నారు. ఆగస్టులో నైతే తేలికపాటి వేసవి దుస్తులు ధరించి ఉండేవారు. దుకాణాలలో ఉన్న తాజా పండ్లు, కూరగాయలు కూడా అక్టోబరులోనే దొరికే రకాలు. పైగా ఆగస్టులో దొరికే పండ్లను ఎండబెట్టిన రూపంలో అమ్ముతున్నారు. ద్రాక్ష సారాయిని పులియబెట్టే జాడీల మూతులు కట్టివేసి ఉన్నాయి. ఈ పని సాధారణంగా అక్టోబరు చివరలో చేస్తారు. బూడిదలో కూరుకుపోయిన ఒక మహిళ పర్సులో దొరికిన నాణేలపై చక్రవర్తి బిరుదులలోని 15 వది ముద్రించి ఉంది. ఈ నాణేలను సెప్టెంబర్ రెండవ వారానికి ముందే ముద్రించే అవకాశం లేదు.

పునరావిష్కరణ, తవ్వకాలు

[మార్చు]
"బందీల తోట". మృతుల ప్లాస్టర్ పోతలు ఇప్పటికీ ఈ స్థలంలో ఉన్నాయి. నేపుల్స్ యొక్క పురావస్తు మ్యూజియంలో చాలా పోతలు ఉన్నాయి.

నగరం సమాధి అయిన వెంటనే, బ్రతికి ఉన్న కొంతమంది లేదా దొంగలు ఫోరమ్ లోని పాలరాతి విగ్రహాలు, భవనాల లోని ఇతర విలువైన వస్తువులనూ కబళించేందుకు వచ్చారు. నగరం పూర్తిగా మునిగి పోలేదు. పెద్ద భవనాల పైభాగాలు బూడిద పైన కనబడుతూ ఉండేవి. దీంతో ఎక్కడ తవ్వాలో నిర్మాణ సామగ్రి ఎక్కడ దొరుకుతుందో స్పష్టంగానే తెలిసిపోయేది. [18] దొంగలు తాము వచ్చి వెళ్ళిన దానికి ఆనవాళ్లను వదిలిపెట్టారు కూడా. ఆధునిక పురావస్తు శాస్త్రవేత్తలు "ఈ ఇంటిని తవ్వేసాం" అని గోడ మీద రాసిన గ్రాఫిటోను కనుగొన్నారు. [19] ఏదేమైనా, తరువాతి శతాబ్దాలలో, దాని పేరూ స్థలమూ మరుగున పడిపోయాయి.

1592 లో, సర్నో నదిని మళ్లించడానికి భూగర్భ కాలువ తవ్వేటపుడు చిత్రపటాలు, శాసనాలూ ఉన్నపురాతన గోడలు కనిపించాయి. వాస్తుశిల్పి డొమెనికో ఫోంటానాను పిలిచారు. అతను మరికొన్ని కుడ్యచిత్రాలను వెలికితీశాడు. తరువాత వాటిని మళ్లీ మూసేసాడు. ఆ తరువాత ఇంకేమీ కనబడలేదు. ఒక గోడ శాసనంలో డెకురియో పాంపే ('పాంపే పట్టణ కౌన్సిలరు') గురించిన ప్రస్తావన ఉంది. కాని ఎప్పుడో మరచిపోయిన రోమన్ నగరాన్ని సూచిస్తున్న ఆ శాసనం గమనింపుకు నోచుకోలేదు.

1738 లో నేపుల్స్ రాజు, చార్లెస్ ఆఫ్ బోర్బన్ కోసం వేసవి మహలు నిర్మాణంలో పునాదుల కోసం తవ్వేటపుడు కార్మికులు హెర్క్యులేనియంను కనుగొన్నారు. ఆ కనుగోళ్ళ అద్భుతమైన నాణ్యత కారణంగా స్పానిష్ మిలిటరీ ఇంజనీర్ రోక్ జోక్విన్ డి అల్కుబియెర్ మరిన్ని తవ్వకాలు జరిపాడు. నగరం ఫలానా అని గుర్తించకపోయినా 1748 లో మరిన్ని పాంపే శిథిలాలను కనుగొన్నాడు. స్పెయిన్‌కు రాజైన తరువాత కూడా చార్లెస్ ఆఫ్ బోర్బన్ ఈ విషయాలపై చాలా ఆసక్తి చూపించాడు. ఎందుకంటే ఈ ప్రాచీన వస్తువులు నేపుల్స్ యొక్క రాజకీయ, సాంస్కృతిక ప్రతిష్టను ఇనుమడింప జేసాయి. 1763 ఆగష్టు 20 న [. . . ] రే పబ్లికే పాంపెనోరం [...] అనే ఒక శాసనాన్ని కనుగొనడంతో ఈ పట్టణాన్ని పాంపే అని గుర్తించారు. [20]

కార్ల్ వెబెర్ మొదటి శాస్త్రీయ తవ్వకాలకు నేతృత్వం వహించాడు. తరువాత 1764 లో మిలిటరీ ఇంజనీర్ ఫ్రాన్సిస్కో లా వేగా, అతడి తరువాత 1804 లో అతని సోదరుడు పయట్రో తవ్వకాలను కొనసాగించారు.

1799 లో ఫ్రెంచి వారు నేపుల్స్‌ను ఆక్రమించి, ఇటలీని పాలించిన కాలంలో, 1806 నుండి 1815 వరకు, అన్వేషణ మంచి పురోగతి సాధించింది. పాంపే ఉన్న భూమిని స్వాధీనం చేసుకున్నారు. తవ్వకాల్లో 700 మంది కార్మికులను నియోగించారు. తవ్వకాలు జరిపిన ఉత్తర, దక్షిణ స్థలాలను కలిపారు. వయా డెల్ అబ్బొండాంజా భాగాలు కూడా పశ్చిమ-తూర్పు దిశలో బహిర్గతమయ్యాయి. మొదటిసారిగా ఈ పురాతన పట్టణపు పరిమాణమూ, ఆకృతీ కళ్ళకు కట్టాయి. తరువాతి సంవత్సరాల్లో, నిధుల్లేక తవ్వకాలు సరిగ్గా జరగలేదు, నెమ్మదిగా సాగాయి. ఫాన్, విషాద కవి మెలేజర్, డియోస్కూరిల ఇళ్ళను గుర్తించారు.

1863 లో గియుసేప్ ఫియోరెల్లి నేతృత్వంలో తవ్వకాలు మరింతగా పురోగమించాయి. [21] మొదట్లో, బూడిద పొరల్లో అక్కడక్కడా ఖాళీలను, వాటిలో మానవ అవశేషాలనూ కనుగొన్నారు. అవి, మానవ దేహాలు నశించి పోగా మిగిలి పోయిన ఖాళీలని ఫియోరెల్లి గుర్తించి, విసూవియస్ బాధితుల రూపాలను పునఃసృష్టి చేయడానికి వాటిలో ప్లాస్టరును ఇంజెక్ట్ చేసే సాంకేతికతను రూపొందించాడు. ఈ సాంకేతికత నేటికీ వాడుకలో ఉంది. ఇప్పుడు ప్లాస్టరుకు బదులుగా పారదర్శక రెసిన్‌ను వాడుతున్నారు. ఇది మరింత మన్నికైనదే కాక, ఎముకలను నాశనం చేయదు. శాస్త్రీయ విశ్లేషణలకు మరింత అనుకూలంగా ఉంటుంది. [22]

ఫియోరెల్లి శాస్త్రీయ పుస్తకబద్ధీకరణను కూడా ప్రవేశపెట్టాడు. అతను నగరాన్ని ప్రస్తుతమున్న తొమ్మిది ప్రాంతాలు (ప్రాంతాలు), బ్లాక్స్ (ఇన్సులే) గా విభజించాడు. వ్యక్తిగత గృహాల (డోమస్) ప్రవేశ ద్వారాలకు సంఖ్యలను కేటాయించాడు. ఈ విధానంలో ప్రతి ఇంటినీ ఈ మూడు సంఖ్యల ద్వారా గుర్తించాడు. తవ్వకాల నివేదికలతో మొదటి పత్రికను కూడా ఫియోరెల్లి ప్రచురించాడు. ఫియోరెల్లి అనంతరం పనిచేసినవారు నగరపు పడమటి భాగం మొత్తాన్నీ వెలికితీసారు.

ఆధునిక పురావస్తు విశేషాలు

[మార్చు]

ఈ ఆవాస ప్రాంతపు చరిత్ర గురించి తెలుసుకోవడానికి 1920 లలో అమేడియో మైయూరి సా.శ 79 కన్నా పాత పొరలలో మొదటిసారి తవ్వకాలు జరిపాడు. 1950 లలో చివరిసారిగా మైయూరి భారీ తవ్వకాలు జరిపాడు. వయా డెల్ అబ్బొండాంజాకు, నగర గోడకూ దక్షిణాన ఉన్న ప్రాంతం పూర్తిగా బయటపడింది. కాని వాటిని సశాస్త్రీయంగా నమోదు చేయలేదు. సంరక్షణ సరిగ్గా చెయ్యలేదు. నేటి పురావస్తు శాస్త్రవేత్తలకు దీన్ని పరిశీలించడం కష్టతరమైన పనయింది. 1980 లో పెను విధ్వంసం సృష్టించిన భూకంపం తరువాత 1980, 1990 లలో చేసిన పునర్నిర్మాణ కార్యక్రమాలు సరిగ్గా జరగలేదు. అప్పటి నుండి, ప్రత్యేక లక్ష్యంతో చేపట్టిన శబ్దవేధి పరిశోధనలు, తవ్వకాలు మినహా, పనంతా తవ్విన ప్రాంతాలకే పరిమితమైంది. పెద్ద ఎత్తున మరిన్ని తవ్వకాలు జరిపే ప్రణాళికలు చెయ్యలేదు. నేటి పురావస్తు శాస్త్రవేత్తలు పునస్సృష్టి చేయడానికి, అక్షరబద్ధం చేయడానికి, అన్నింటికీ మించి క్షీణించడాన్ని ఆపడానికీ మాత్రమే ప్రయత్నిస్తున్నారు.

పాంపే లక్ష్మి

[మార్చు]
పాంపే లక్ష్మి

1938 లో అమేడియో మైయూరి జరిపిన తవ్వకాల్లో ఒక చిన్న లక్ష్మి విగ్రహం బయటపడింది.[23] ఇది సా.శ మొదటి శతాబ్దానికి చెందినదని నిర్ధారించారు. దంతంతో చేసిన ఈ బొమ్మ ఆ కాలంలో విలసిల్లిన భారత ఇటలీ వాణిజ్య సంబంధాలను సూచిస్తోంది. ఈ బొమ్మ అద్దానికి ఉండే కాడ అయిఉండే అవకాశం ఉంది.[24]

ఈ బొమ్మను లక్ష్మీదేవి విగ్రహంగా తొలుత భావించినప్పటికీ,[25][26] విగ్రహశాస్త్రం ప్రకారం అది ఒక యక్షి అయిఉంటుందని తేల్చారు. ప్రస్తుతం ఈ బొమ్మ నేపుల్స్ మ్యూజియం లోని రహస్య విభాగంలో ఉంది.[27]

పరిరక్షణ

[మార్చు]

పాంపే క్రింద సమాధి అయిన వస్తువులు దాదాపు 2,000 సంవత్సరాల పాటు ఏ క్షీణత లేకుండా చక్కగా సంరక్షించబడ్డాయి. గాలి, తేమ లేకపోవడం దీనికి దోహదపడింది. అయితే, ఒకసారి బయట పడ్డాక ప్రకృతి సహజ శక్తులకు, మానవ నిర్మిత శక్తులకూ గురవడంతో, వీటి క్షీణత వేగం పెరిగింది.

వాతావరణం, కోత, ఎండ, నీటి కోత, నాసిరకపు తవ్వక, పునర్నిర్మాణ పద్ధతులు, మొక్కలు, జంతువులు, పర్యాటకం, దుశ్చర్యలు, దొంగతనాలూ.. ఇవన్నీ ఏదో ఒక విధంగా స్థలాన్ని దెబ్బతీశాయి. నగరంలో మూడింట రెండొంతుల తవ్వకాలు జరిగాయి. కాని పట్టణపు అవశేషాలు వేగంగా క్షీణిస్తున్నాయి. [28]

రెండవ ప్రపంచ యుద్ధంలో మిత్రరాజ్యాల దళాల దాడుల్లో వేసిన బాంబుల కారణంగా చాలా భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి లేదా నాశనమయ్యాయి. [29]

జూన్ 2013 లో యునెస్కో, పునరుద్ధరణ, సంరక్షణ పనులు “రాబోయే రెండేళ్ళలో గణనీయమైన పురోగతిని సాధించకపోతే,” పాంపేను ప్రమాదంలో ఉన్న ప్రపంచ వారసత్వ జాబితాలో ఉంచుతాం అని ప్రకటించింది. [30]

పర్యాటకం

[మార్చు]
ఫోరం - నేపథ్యంలో దూరంగా విసూవియస్ పర్వతం

250 సంవత్సరాలకు పైగా పాంపే ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది. ఇది గ్రాండ్ టూర్‌లో భాగంగా ఉంది. 2008 నాటికి, ఏటా ఇది దాదాపు 26 లక్షల మంది సందర్శకులను ఆకర్షిస్తోంది ఇటలీలో అత్యంత ప్రాచుర్యం పొందిన పర్యాటక ప్రదేశాలలో ఇదొకటి. [31] ఇది విసూవియస్ జాతీయ ఉద్యానవనంలో భాగం. 1997 లో యునెస్కో దీన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. పర్యాటక సంబంధ సమస్యలను ఎదుర్కొనేందుకు అక్కడి పాలక సంస్థ అయిన సోప్రిన్టెండెన్జా ఆర్కియలాజికల్ డి పాంపే, పర్యాటకులను హెర్కులేనియమ్, స్టాబే, విల్లా పొప్పే వంటి ప్రదేశాలను సందర్శించేలా మళ్ళించింది. ఈ స్థలాలను చూసేందుకు సందర్శకులను ప్రోత్సహించడం, అదే సమయంలో పాంపేపై ఒత్తిడిని తగ్గించడం వీరి ఉద్దేశం.

సైట్ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ పియట్రో గియోవన్నీ గుజ్జో విధించిన తాత్కాలిక నిషేధం కారణంగా సైట్ వద్ద తవ్వకాలు నిలిచిపోయాయి. ప్రస్తుతం సందర్శన స్థలాలు గతంలో కంటే తక్కువగా ఉన్నాయి. 1960 లలో చూసేందుకు అందుబాటులో ఉన్న భవనాలలో మూడింట ఒక వంతు కన్నా తక్కువే ప్రస్తుతం ప్రజలు చూసేందుకు అందుబాటులో ఉన్నాయి.

సమీపం లోని ఆధునిక నగరం పాంపీ ఆర్థిక వ్యవస్థకు పాంపేయే వెన్నెముక. చాలా మంది స్థానికులు పర్యాటక, ఆతిథ్య పరిశ్రమల్లో టాక్సీ ,బస్సు డ్రైవర్లు, వెయిటర్లు లేదా హోటల్ సిబ్బందిగా పనిచేస్తున్నారు.

డాక్యుమెంటరీలు

[మార్చు]
  • ఇన్ సెర్చ్ ఆఫ్ .. ' లో ఎపిసోడ్ నం 82 పూర్తిగా పాంపే గురించే దృష్టి పెడుతుంది; దీన్ని 1979 నవంబరు 29 న ప్రదర్శించారు.
  • నేషనల్ జియోగ్రాఫిక్ స్పెషల్ ఇన్ ది షాడో ఆఫ్ విసూవియస్ (1987) పోంపీ, హెర్క్యులేనియం యొక్క సైట్‌లను అన్వేషిస్తుంది, ఇంటర్వ్యూలు (అప్పటి) ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్తలు, విసూవియస్ విస్ఫోటనం వరకు దారితీసిన సంఘటనలను పరిశీలిస్తుంది. [32]
  • ఏన్షియంట్ మిస్టరీస్ : పాంపే: బరీడ్ అలైవ్ (1996), లియోనార్డ్ నిమోయ్ చేత వివరించబడిన A & E టెలివిజన్ డాక్యుమెంటరీ. [33]
  • పాంపే: ది లాస్ట్ డే (2003), బిబిసి కొరకు నిర్మించిన ఒక గంట నాటకం. ఇది పాంపే, హెర్క్యులేనియం, నేపుల్స్ బే చుట్టూ నివసిస్తున్న అనేక పాత్రలతో (చారిత్రాత్మకంగా ధృవీకరించబడిన పేర్లతో, కానీ కల్పిత జీవిత కథలతో) నడుస్తుంది. ఇది విస్ఫోటనపు వాస్తవాలను కూడా వివరిస్తుంది.
  • పాంపే ఆండ్ ది ఎడి 79 ఇరప్షన్ (2004), టోక్యో బ్రాడ్కాస్టింగ్ సిస్టమ్ వారి రెండు గంటల డాక్యుమెంటరీ.
  • పోంపీ లైవ్ (జూన్ 28, 2006), ఛానల్ 5 వారిది. పోంపీ, హెర్క్యులేనియంల వద్ద ప్రత్యక్ష పురావస్తు తవ్వకాన్ని చూపిస్తుంది [34] [35]
  • పాంపే: ది మిస్టరీ ఆఫ్ ది పీపుల్ ఫ్రోజెన్ ఇన్ టైమ్ (2013), డాక్టర్ మార్గరెట్ మౌంట్‌ఫోర్డ్ సమర్పించిన బిబిసి వన్ వారి డ్రామా డాక్యుమెంటరీ. [36]
  • ది రిడిల్ ఆఫ్ పాంపే (మే 23, 2014), డిస్కవరీ ఛానల్.
  • పాంపేస్ పీపుల్ (సెప్టెంబర్ 3, 2017), డేవిడ్ సుజుకి సమర్పించిన సిబిసి జెమ్ డాక్యుమెంటరీ.

మూలాలు

[మార్చు]
  1. "Dossier Musei 2008" (PDF) (in Italian). Retrieved September 30, 2012.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  2. Giovanni Longobardi, Sustainable Pompeii, Rome, L'Erma di Bretschneider, 2002.
  3. "Pompeii victim crushed by boulder while fleeing eruption". BBC. May 30, 2018. Retrieved June 13, 2018.
  4. Squires, Nick (April 25, 2018). "Skeleton of child trying to shelter from Vesuvius eruption uncovered in Pompeii". The Telegraph. Retrieved June 13, 2018.
  5. Squires, Nick (May 11, 2018). "Remains of ancient Roman horse found at Pompeii in dig started by tomb raiders". The Telegraph. Retrieved June 13, 2018.
  6. "Patterns of Reconstruction at Pompeii". University of Virginia. Retrieved September 30, 2012.
  7. 7.0 7.1 "Visiting Pompeii". Current Archaeology. Archived from the original on 2012-01-24. Retrieved September 30, 2012. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "archaeology1" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  8. The World of Pompeii, Edited by John J. Dobbins and Pedar W. Foss,, p. 173
  9. Dobbins, J. J., “Problems of chronology, decoration, and urban design in the forum at Pompeii”, AJA, 1994, vol. 98, pp. 629–694
  10. Wallat, K., Die Ostseite des Forums von Pompeji, Frankfurt am Main, 1997.
  11. “Der Zustand des Forums von Pompeji am Vorabend des Vesuvausbruchs 79 n.Chr”, in T. Fröhlich and L. Jacobelli (eds), Archäologie und Seismologie. La regione vesuviana dal 62 at 79 d.C. Problemi archeologici e sismologici (Colloquium Boscoreale, 26–27 November 1993), Munich, 1995, pp. 75–92.
  12. M. Mastroroberto, “Una visita di Nerone a Pompei: le deversoriae tabernae di Moregine,” in A. D’Ambrosio, P. G. Guzzo and M. Mastroroberto (eds), Storie da un’eruzione. Exhib. Catalogue Naples–Bruxelles 2003–2004, 2003, pp. 479–523, who convincingly argues that the splendidly decorated hospitium south of Pompeii was built for this occasion.
  13. "Pompeii". History.com. History.com. 2010-08-27.
  14. "Pompeii Live: The eruption story". British Museum. Archived from the original on 2019-09-23. Retrieved 2019-10-01.
  15. "The Destruction of Pompeii, AD 79". EyeWitness to History.
  16. "Pompeii's destruction date could be wrong". BBC News. October 16, 2018.
  17. "The A.D. 79 Eruption at Mt. Vesuvius". Archived from the original on 2008-12-29. Retrieved 2019-10-01.
  18. John J. Dobbins, Pedar W. Foss, The World of Pompeii,, p. 125
  19. Mary Beard, Pompeii; The life of a Roman city, Seuil, 2012 p. 24
  20. Giuseppe Fiorelli: Pompeianarum Antiquitatum Historia. Volume Primum, p. 153
  21. Nappo, Salvatore Ciro (February 17, 2011). "Pompeii: Its Discovery and Preservation". Retrieved March 2, 2013.
  22. Gracco, Tiberio (28 April 2017). "Orto dei Fuggiaschi". Retrieved 23 June 2017.
  23. An Indian Statuette from Pompeii, Mirella Levi D' Ancona, Artibus Asiae, Vol. 13, No. 3 (1950), pp. 166–180[permanent dead link]
  24. "Abstracts of Articles". The Classical Weekly. 32 (18): 214–215. 1939. JSTOR 4340562.
  25. Beard, Mary (2010). Pompeii: The Life of a Roman Town. Profile Books. p. 24.
  26. Wangu, Madhu Bazaz (2003). Images of Indian Goddesses: Myths, Meanings, and Models (in ఇంగ్లీష్). Abhinav Publications. p. 57. ISBN 978-8170174165.
  27. "Lakshmi". Museo Archeologico Napoli. Retrieved 4 February 2017.
  28. Popham, Peter (May 2010). "Ashes to ashes: the latter-day ruin of Pompeii". Prospect Magazine. London. Retrieved 23 June 2017.
  29. "The Last Days of Pompeii: Destruction in World War II".
  30. "The Fall and Rise and Fall of Pompeii". Retrieved 2015-07-01.
  31. Nadeau, Barbie Selling Pompeii, Newsweek, April 14, 2008.
  32. "In the Shadow of Vesuvius". National Geographic. Retrieved August 1, 2014.
  33. "Ancient Mysteries: Season 3, Episode 22". A&E. Retrieved February 17, 2016.
  34. Shelley Hales; Joanna Paul (2011). Pompeii in the Public Imagination from Its Rediscovery to Today. Oxford University Press. p. 367. doi:10.1093/acprof:osobl/9780199569366.001.0001. ISBN 978-0199569366. The recent UK Channel 5 programme, transmitted live from Herculaneum on 29 June 2006...
  35. "Shows". Archived from the original on 2006-06-03. Retrieved 2019-10-01.
  36. "Pompeii: The Mystery of the People Frozen in Time". BBC. Retrieved April 6, 2013.
"https://te.wikipedia.org/w/index.php?title=పాంపే&oldid=3844914" నుండి వెలికితీశారు