పాకుండలు
మూలము | |
---|---|
మూలస్థానం | దక్షిణ ఆసియా |
వంటకం వివరాలు | |
ప్రధానపదార్థాలు | బియ్యపుపిండి, బెల్లం, కొబ్బరి తురుము. |
పాకుండలు అనేది ఒక వంటకం పేరు. ఉత్తరాంధ్రలో ఈ వంటకాన్ని ఎక్కువగా ఇండ్లలో చేసుకుంటారు.[1]
తయారీకి కావాల్సిన పదార్థాలు
[మార్చు]- బియ్యప్పిండి – 2 కప్పులు
- తురిమిన బెల్లం – 1 కప్పు
- యాలకుల పొడి – అర చెంచా
- కొబ్బరి తురుము – 1 చెంచా
- నెయ్యి – చెంచా
- నూనె – వేయించడానికి తగినంత
బియ్యప్పిండిని తయారీ చేసే విధానం
[మార్చు]బియ్యాన్ని శుభ్రంగా కడిగి రాత్రంతా నానబెట్టాలి. తర్వాత వడకట్టి మెత్తటి పొడిలా మిక్సీలో రుబ్బాలి. ఈ పిండి కొంతమేర తేమగా ఉండేలా చూడాలి.
తయారీ విధానం
[మార్చు]పెద్ద బాణలిలో బెల్లం తురుము వేసి, అందులో కొన్ని నీళ్లు పోసి చిన్న మంటపై బెల్లం కరిగే వరకు ఉంచాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని వడకట్టాలి. తర్వాత అదే పాత్రలోకి తీసుకొని, చిన్న మంటపై పాకం వచ్చే వరకూ వేడి చేయాలి. తర్వాత పొయ్యి కట్టేసి.. బెల్లం పాకంలో యాలకుల పొడి, కొబ్బరి తురుము, చెంచా నెయ్యి.. వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో ముందుగా తయారు చేసి పెట్టుకున్న బియ్యప్పిండిని కొద్ది కొద్దిగా వేస్తూ ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పిండిని చల్లారే వరకు వేచి ఉ:డాలి. పిండి పూర్తిగా చల్లారిన తర్వాత చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా పిండి మొత్తాన్నీ చేసుకోవాలి. తర్వాత డీప్ఫ్రైకి సరిపడా నూనె వేడి చేసి అందులో ఈ ముద్దల్ని వేసి స్టవ్ సిమ్లో పెట్టి బంగారు రంగులో వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇలా అన్నిటినీ కాల్చుకుని చల్లారనివ్వాలి. ఈ విధంగా పాకుండలను తయారు చేసుకోవచ్చు
ఆరోగ్య ప్రయోజనాలు
[మార్చు]- బియ్యప్పిండిలో ఫైబర్, ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థలోని వ్యర్థపదార్థాలను తొలగించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి.
- బెల్లం రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు జీర్ణవ్యవస్థను పటిష్టంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఫలితంగా మలబద్ధకం దరిచేరకుండా జాగ్రత్త పడచ్చు. అలాగే ఇందులో శరీర ఆరోగ్యానికి కావలసిన ఖనిజాలు,ఇనుము లభిస్తాయి.
- యాలకులు నోటి దుర్వాసనను దూరం చేయడానికి మాత్రమే కాదు.. ఆహారం సులభంగా జీర్ణమవడానికి కూడా ఉపయోగపడతాయి. అలాగే ఇవి శరీరంలోని విషతుల్యాలను తొలగించి.. శ్వాసవ్యవస్థను పటిష్ట పరుస్తాయి.
- నెయ్యి వల్ల లావవుతామేమోనన్న భయం అవసరం లేదు. ఎందుకంటే నెయ్యి శరీరంలోని ఇతర అనవసర కొవ్వులను కరిగించి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అలాగే జీర్ణ, రోగనిరోధక వ్యవస్థల పనితీరును మెరుగుపరచడంలో తోడ్పడుతుంది.
- కొబ్బరిలో ఉండే ఫైబర్ రక్తంలోకి గ్లూకోజ్ విడుదలవడాన్ని క్రమంగా తగ్గిస్తుంది. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయులు తగ్గి డయాబెటిస్ బారిన పడకుండా జాగ్రత్తపడచ్చు. అలాగే శరీర అలసటను తగ్గించి తక్షణ శక్తినివ్వడంలో సహాయపడుతుంది.