ప్రొటీన్లు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇవి శరీరాన్ని నిర్మించే జీవ రసాయనాలు. అమైనో ఆమ్లాలు, ప్రొటీన్ల నిర్మాణ క్రియాశీల ప్రమాణాలు. అమైనో ఆమ్లాల మధ్య ఏర్పడే పెప్టైడ్ బంధాల ద్వారా ప్రొటీన్ తయారవుతుంది. కణాల్లోని రైబోసోమ్‌లు అనే కణ భాగాలు ప్రొటీన్లు నిర్మిస్తాయి. జీవుల్లో ప్రొటీన్లు అత్యధికంగా ఎంజైమ్‌లుగా పనిచేస్తాయి. ఎంజైమ్‌లు జీవ ఉత్ప్రేరకాలు.

ఇవి శరీరంలో తక్కువ శక్తి వద్ద వేగంగా రసాయనిక చర్యలను నిర్వహిస్తాయి. ఎంజైమ్‌లు నిర్వహించే రసాయనిక చర్యల ద్వారానే శరీర పెరుగుదల, ఇతర లక్షణాలు సాధ్యమవుతాయి. జీర్ణక్రియ టయలిన్, పెప్సిన్, ట్రిప్సిన్, ఎరిప్సిన్ వంటి ఎంజైమ్‌ల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఆహారంలో సంక్లిష్ట పదార్థాలు మన శరీరం వినియోగించగల సరళ పదార్థాలుగా ఈ ఎంజైమ్‌లు మార్చుతాయి. అదేవిధంగా గాయమైనప్పుడు సకాలంలో రక్తం గడ్డకట్టడానికి రక్తస్కంధన కారకాలు అనే ఎంజైమ్‌లు రసాయనిక చర్యలను నిర్వహిస్తాయి.

కొన్ని ప్రొటీన్లు హార్మోన్‌లుగా కూడా వ్యవహరిస్తాయి. ఉదా: పెరుగుదల హార్మోన్, ఇన్సులిన్. మరికొన్ని ప్రొటీన్లు ప్రతిజనకాలు, ప్రతిదేహకాలు, పెరుగుదల కారకాలుగా కూడా వ్యవహరిస్తాయి

శరీరంలో ప్రొటీన్ల తయారీకి కావాల్సిన 21 అమైనో ఆమ్లాల్లో కొన్నింటిని శరీర కణాలు తయారు చేసుకుంటాయి. ఇవి అనావశ్యక అమైనో ఆమ్లాలు. ఆహారంలోని ప్రొటీన్ల రూపంలో వీటి అవసరం ఉండదు. శరీర కణాలు తయారు చేయలేనివి, ఆహారంలోని ప్రోటీన్ల రూపంలో కావాల్సినవి ఆవశ్యక అమైనో ఆమ్లాలు. చిన్నారుల్లో ప్రొటీన్ లోపం ద్వారా క్వాషియోర్కర్ వ్యాధి వస్తుంది.