పిఎస్ఎల్‌వి- సి41

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పిఎస్ఎల్‌వి మాదిరి

పిఎస్ఎల్‌వి-సి 41 అనునది భారతీయ అంతరిక్షపరిశోధన సంస్థ అయిన ఇస్రో రూపొందించిన ఉపగ్రహవాహకనౌక లేదా రాకెట్.ఈ రాకెట్ అనబడు ఉపగ్రహ వాహక లేదా ప్రయోగ వాహనం ద్వారా ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఐ అను నావిగేషన్ (అనగా నౌకాయాన, వాయు యాన, భూఉపరితల యాన మార్గ పర్య వేక్షణ, ఇతర ప్రయాణ మార్గాల పర్యవేక్షణ, మార్గ నిర్దేశన ) ఉపగ్రహాన్నికక్ష్యలోకి పంపుటకు తయారు చేసింది.అనుకున్న విధంగా ఈ రాకెట్ 2018 ఏప్రిల్ 12 గురువారం రోజు తెల్లవారు జామున 4:04 గంటలకు ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా లోని శ్రీహరికోటలో వున్న సతిష్ ధవన్ అంతరిక్ష కేంద్రంలోని మొదటి ప్రయోగ కేంద్రం నుండి ప్రయోగింప బడింది.రాకెట్ కౌంట్ డౌన్ మంగళవారం రాత్రి 8:04 గంటలకు మొదలై నిర్వి ఘ్నంగా 32 గంటలు గురువారం ఉదయం వరకు సాగినది.కొంట్డౌన్ పూర్తవ్వగానే 44.4 మీటర్ల పొడవు, 321 టన్నుల బరువు వున్న పిఎస్ఎల్ వి- సి41 నిప్పులు కక్కుకుంటూ గగన మార్గంవైపు దూసుకెళ్లింది.రాకెట్ బయలు దేరిన 19 నిమిషాల తరువాత 506 కిలోమీటర్ల ఎత్తులో, సెకనుకు 9.6 కిలోమీటర్ల త్వరణంలో ఉపగ్రహన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టినది.[1]

పీస్ఎల్‌వి-సీ41 వివరాలు

[మార్చు]

పీస్ఎల్ వి-సీ41 ఉపగ్రహ వాహకనౌక పీస్ఎల్‌వి రాకెట్ శ్రేణిలో XL రకానికి చెందిన రాకెట్. XL రకంలో ప్రథమదశకు అదనంగా మరో ఆరు స్ట్రాపాన్ బూస్టరు చోదకాలు అమర్చబడి వుండును. ప్రధమ దశను కోర్‌అలోను దశ అనికూడా అంటారు. ఇస్రో పరిభాషలో ఈదశ PS1 (కోర్ దశ). ప్రథమ దశ, స్ట్రాపాన్ చోదకాలలో ఘన ఇంధనం నింపబడి వుండును. పీస్ఎల్ వి-సీ41 రాకెట్ అనేది పీస్ఎల్‌వి శ్రేణిలో 43 వ రాకెట్ కాగా, XL రకానికి చెందిన 20 వ రాకెట్. అలాగే సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రంలోని మొదటి ప్రయోగ కేంద్రంనుండి ప్రయోగించిన 32 వ ఉపగ్రహ వాహకనౌక. పీస్ఎల్ వి-సీ41 రాకెట్ నాలుగు చోదక దశలు కల్గివున్నది. మొదటి, మూడో దశలో ఘనఇంధనం ఉండగా రెండు, నాలుగో దశల్లో ద్రవ ఇంధనాన్ని రాకెట్ చోదకంగా ఉపయోగిస్తారు. నాల్గవదశ పైభాగాన ఉపగ్రహాం అమర్చబడి వుండును.[2]

పిఎస్‌ఎల్‌వి దశల వివరాలు

[మార్చు]

పిఎస్‌ఎల్‌వి ఉపగ్రహ వాహకనౌకలో నాలుగు దశలుంటాయి. నాలుగోదశ చివర, ప్రయోగించవలసిన ఉపగ్రహం లేదా ఉపగ్రహాలు అమర్చబడి ఉంటాయి. వివిధ దశలు మండే సమయం, అవి విడిపోయే ఎత్తులు కింది విభాగాల్లో ఇవ్వబడ్డాయి. వీటిని సూచన మాత్రంగా పరిగణించాలి. పేలోడ్ బరువు, నౌక కాన్ఫిగరేషను, చేరాల్సిన కక్ష్యలు మొదలైన వాటిపై ఆధారపడి ఇవి మారుతూ ఉంటాయి.

మొదటి దశ (PS1)

[మార్చు]

మొదటిదశలోని S139 ఘన ఇంధన మోటారు, 4800 కిన్యూ (కిలో న్యూటన్) ల థ్రస్ట్ (thrust) ను ఇస్తుంది. ఈ దశలో 138 టన్నుల HTPB ఇంధనాన్ని వాడతారు. మొదటి దశ 105 సెకండ్ల పాటు మండి, నౌక 74 కిమీ ఎత్తుకు చేరాక, రెండవ దశ నుండి విడిపోతుంది. మొదటి దశ విడివడి దూరం అయ్యాక రెండవ దశ మండుతుంది.

స్ట్రాపాన్ బూస్టర్లు

[మార్చు]

మొదటి దశకు 6 స్ట్రాపాన్ బూస్టర్లను అమరుస్తారు. ఈ అరింటిలో 4 బూస్టర్లు మొదటి దశతో పాటే (అర సెకండు తేడాతో) మండిస్తారు. రాకెట్ పైకిలేచిన 25 సెకండ్ల తర్వాత మిగిలిన రెండు బూస్టర్లను మండిస్తారు. ఈ స్ట్రాపాన్ బూస్టర్లలో కూడా ఘన ఇంధనాన్నే వాడుతారు. స్ట్రాపాన్ ఇంజన్ కలుగజేయు థ్రస్ట్ 719 కిన్యూ. మొదటి 4 బూస్టర్లు 24 కిమీ ఎత్తున, మిగతా రెండు బూస్టర్లు 41 కిమీ ఎత్తున విడిపోయి పడిపోతాయి.

రెండవ దశ (PS2)

[మార్చు]

రెండవ దశలో ద్రవ ఇంధనం ఉపయోగిస్తారు. రెండవ దశకు వికాస్‌ ఇంజన్‌ను అమర్చారు. ఈ ఇంజన్ను లిక్విడ్ ప్రోపల్షన్ సిస్టమ్స్ సెంటర్ (Liquid Propulsion Systems Centre) తయారు చేసింది. ఇందులో ఉపయోగించే ఇంధనం UDMH + N2O4. ఈ ఇంజను ఇచ్చే థ్రస్ట్ 799 కిన్యూ. ఈ దశ 158 సెకండ్లు మండి, 277 కిమీ ఎత్తు వద్ద విడివడి పోతుంది.

మూడవ దశ (PS3)

[మార్చు]

ఈ దశలో ఘన ఇంధనం HTPB వాడతారు. ఇది 240 కిన్యూల థ్రస్ట్‌ను అందిస్తుంది. ఈ దశ 112 సెకండ్ల పాటు మండి, 580 కిమీ వద్ద విడిపోతుంది.

నాల్గవ దశ (PS4)

[మార్చు]

ఇది పిఎస్‌ఎల్‌వి లోని అంతిమ దశ. పేలోడ్ దీనికి చేర్చి ఉంటుంది. ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపే బాధ్యత ఈ దశదే. ఈ దశలోని రెండు PS-4 ద్రవ ఇంధన ఇంజనులు ఒక్కొక్కటి 7.6 కిన్యూ థ్రస్టును ఉత్పత్తి చేస్తాయి. ఉపయోగించు ఇంధనం MMH + MON. యాత్ర అవసరాన్ని బట్టి ఈ దశ 540 సెకండ్ల వరకు మండుతుంది.

నాల్గవ దశలోనే పరికరాల అర కూడా ఉంటుంది. ఈ అరలో ఇనర్షియల్ గైడెన్స్ వ్యవస్థ, ఫ్లైట్ కంప్యూటరు, టెలిమెట్రీ, ఏవియానిక్స్ పరికరాలు ఉంటాయి.

పరామితులు మొదటి దశ రెండవ దశ మూడవ దశ నాల్గవ దశ
చోదకం/ఇంధనం సంయుక్త ఘన ఇంధనం ద్రవ ఇంధనం సంయుక్త ఘన ఇంధనం ద్రవ ఇంధనం
ఇంధన బరువు (టన్నులు) 138.2 (కోర్ దశ)
6x122 (స్ట్రాపాన్)
42.0 7.6 2.5
వ్యాసం (మీటర్లు) 2.8 మీ (కోర్)
1మీ (స్ట్రాపాన్)
2.8 మీ 2.0 1.34
పొడవు (మీటరులు) 20 మీ (కోర్)
1మీ (స్ట్రాపాన్)
12.8 3.6 3.0
గరిష్ఠ వాక్యుం త్రస్ట్ (KN) 4846.9 (కోర్)
6X703.5 (స్ట్రాపాన్)
803.78 239.6 2X7.33

పిఎస్ఎల్‌వి- సి41 ప్రయోగ వివరాలు

[మార్చు]

138 టన్నుల ఘన ఇంధనంతో వున్నప్రధమ దశ, 72టన్నుల ఘన ఇంధనంతో వున్న 6 స్ట్రాపాన్ బూస్టర్లు ,రాకెట్‌ను 1.50 నిమిషాలకు భూమికి 55 కిలో మీటర్ల ఎత్తుకు చేరవేసి విడిపోయాయి.వెంటనే 42 టన్నుల ద్రవ ఇంధనంతో వున్న రెండవ దశ మోటారుతో పనిచేస్తూ రాకెట్ తన ప్రయాణాన్ని కొనసాగించింది. 3:28 నిమిషాలకు రాకెట్ 112 కిలోమీటర్ల ఎత్తునకు చేరింది. ఈ దశలో రాకెట్ అగ్రభాగాన వున్న ఉప గ్రహం చుట్టూ రక్షణగా అమర్చిన ఉష్ణకవచం విజయవంతంగా విడిపోయింది.అనంతరం 4:23 నిమిషాలకు రాకెట్‌ను 131కిలోమీటర్ల ఎత్తుకు చేర్చి రెండవ దశ కుడా విడిపోయింది.వెనువెంటనే 7.6 తమ్ముల ఘనఇంధనమున్న మూడవదశ పని చెయ్యడం ప్రారంబించి 9.58 నిమిషాలకు183 కిలోమీటర్ల ఎత్తుకు రాకెట్ చేరుకుని మూడవ దశ ఇంజను విడిపోయింది. తరువాత 2.5 టన్నుల ద్రవ ఇంధన ఇంజను పనిచెయ్యడం మొదలై 18.47 నిమిషాలకు 454 కిలో మీటర్ల ఎత్తుకు చేర్చినది.ఈ స్థితిలో నాల్గవదశ ఇంజనును ఆపి వేసారు. మరో 52 కిలోమీటర్లు పయనించిన తరువాత 19:24 నిమిషాలకు 506 కిలోమీటర్ల ఎత్తులో ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశ పెట్టినది. కక్ష్యలోకి చేరిన రెండు నిమిషాలకు భూకేంద్రాలకు ఉపగ్రహం నుండి సంకేతాలు అందడంతో ఉపగ్రహ ప్రయోగం విజయవంతం అయ్యింది.

ప్రయోగానికి అయిన ఖర్చు

[మార్చు]

రాకెట్ ప్రయోగానికి అయినఖర్చు 243 కోట్లు

బయటి లింకుల వీడియోలు

[మార్చు]

ఈ వ్యాసాలు కూడా చదవండి

[మార్చు]

మూలాలు/ఆధారాలు

[మార్చు]
  1. "SRO to launch the IRNSS-1I navigation satellite aboard the PSLV-C41: All you need to know". firstpost.com. Archived from the original on 2018-04-12. Retrieved 2018-04-12.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "PSLV-C41/IRNSS-1I Mission Brochure". isro.gov.in. Archived from the original on 2018-04-12. Retrieved 2018-04-12.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)