పిశుపాటి విశ్వేశ్వరశాస్త్రి
పిశుపాటి విశ్వేశ్వరశాస్త్రి సంస్కృత పండితుడు, కవి. అతను సూర్యాంధ్ర నిఘంటుకర్తలలో ఒకడు. పిఠాపురంలో 15 సంవత్సరాలు ఈ నిఘంటువు సంకలనంలో గడిపాడు.[1]
సంస్కృతాంధ్రాలలో మహాపండితుడైన పిశుపాటి విశ్వేశ్వరశాస్త్రి పరాభవ నామ సంవత్సరం చైత్ర బహుళ విదియ బుధవారం(11-4-1906) నెల్లూరుమండలం కరవదిలో సీతారామయ్య,కనకమ్మలకు జన్మించాడు. నెల్లూరు జిల్లా, విద్యానగర్ శ్రీ భీమేశ్వర ఓరియంటల్ కళాశాలలో 5 సంవత్సరాలు సంస్కృత అధ్యాపకుడిగా పనిచేసాడు. నెల్లూరు వెంకటగిరి రాజా కళాశాలలో తెలుగు ఆధ్యాపకునిగా 15 సంవత్సరాలు పనిచేశాడు. ’’ఆశుకవికేసరి", "శతావధాని’’,"అభినవ నన్నపార్య", "సరసకవి" బిరుదులు పొందాడు. మహా భాష్యాన్త వ్యాకరణ వేత్త. శంకర ప్రస్థాన త్రయాన్ని ఆకళింపు చేసుకున్న వేదాంతి. మంత్రశాస్త్ర ప్రవీణుడు. ప్రసిద్ధ పండితులు పుల్య ఉమామహేశ్వరశాస్త్రి వద్ద వ్యాకరణం, చావలి లక్ష్మీకాంత శాస్త్రి వద్ద వేదాంతం, శ్రీపాద నరసింహశాస్త్రి వద్ద మంత్రశాస్త్రం చదివాడు. మధుర కృష్ణమూర్తిశాస్త్రి, కాళిదాసు పురుషోత్తం, రేవూరి అనంత పద్మనాభరావు, చల్లా రాధాకృష్ణ శర్మ మొదలైనవారు ఇతని శిష్యులు.
సంస్కృతంలో ‘’ఆర్యా త్రిశతి ‘’అనే కావ్యాన్ని ఆర్యా వృత్తంలో భర్తృహరి సుభాషిత త్రిశతి లాగా గొప్పగా రాశాడు .ఆర్యా త్రిశతిలో మంత్రశాస్త్రానికి సంబంధించిన 64 తంత్రాలను వివరించాడు. ఈ గ్రంథాన్ని శాస్త్రి మరణం తర్వాత ఆయన కుమారుడు ప్రచురించాడు."రాజ ధర్మ" కావ్యానికి సంస్కృతంలో ‘’జయ వ్యాఖ్య ‘’రాసి మహా వ్యాఖ్యాతగా పేరొందాడు.ఆంధ్ర నక్షత్రమాలకు తానే వ్యాఖ్యానం వెలయించి, వ్యాకరణ శాస్త్రంతో రచనను అనుబంధిచి వివరించాడు. సోదరుడు చిదంబరశాస్త్రి పద్మపురాణ అనువాదాన్ని వి.ఆర్.కాలేజి విద్యార్థులు ఆర్ధిక సహకారంతో ప్రచురించాడు.[2]
1940 నుంచి 42 వరకు మధుర కృష్ణమూర్తి శాస్త్రి అతని వద్ద పంచకావ్యాలు, వ్యాకరణ శాస్త్రం కౌముది కొంతవరకు నేర్చుకున్నాడు.[3]
రచనలు
[మార్చు]- శ్రీరత్నపాంచాలిక(నాటిక)
- శ్రీ కాళిదాస కవితా వైభవము
- కామాక్షీవిలాసము
- ఆంధ్ర ప్రద్యుమ్నాభ్యుదయము
- శ్రీ పార్వతీపరిణయము{బాణా రూపకానికి ఆంధ్రీకరణ}
- ఆంధ్ర ఆంధ్ర దూతవాక్యము {భాస రూపకానికి అనువాదం}
- ఆంధ్రనక్షత్రమాల
- ఆధ్యాత్మరామాయణం{తెలుగు}
మూలాలు
[మార్చు]- ↑ "జ్ఞాపకాలు – వ్యాపకాలు-1సంచిక – తెలుగు సాహిత్య వేదిక | సంచిక - తెలుగు సాహిత్య వేదిక". 2020-04-05. Retrieved 2020-07-12.
- ↑ gdurgaprasad (2015-09-22). "గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3 స్వాతంత్ర్యానంతర సంస్కృత సాహిత్యం –నెల్లూరు జిల్లా-". సరసభారతి ఉయ్యూరు. Retrieved 2020-07-12.
- ↑ "మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు". Silicon Andhra SujanaRanjani. 2020-05-29. Retrieved 2020-07-12.
వెలుపలి లంకెలు
[మార్చు]విక్రమసింహపురి మండల సర్వస్వం, సంపాదకుడు: నేలనూతల శ్రీకృష్ణమూర్తి,1964 ప్రచురణ