కాళిదాసు పురుషోత్తం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కాళిదాసు పురుషోత్తం నెల్లూరులో నివసిస్తున్నాడు[1]. తల్లి రమణమ్మ, తండ్రి. విద్యావాచస్పతులు కాళిదాసు వెంకటసుబ్బాశాస్త్రి గారు. వీరి జననం1883 ప్రాంతం- మరణం 1953 సెప్టెంబర్ 30 వతేది. స్వస్థలం టంగుటూరు, కొండపి మార్గంలో 7వ మైలు వద్ద తూమాడు అగ్రహారం. వీరు అగ్రహారీకులు. వీరి తాత పట్టాభిరామచయనులు, తండ్రి చెంచురామయ్య. ఈ చెంచురామయ్య గారికి 1.వెంకటసుబ్బమ్మ, 2.పురుషోత్తమయ్య, 3.వెంకటసుబ్బాశాస్త్రి, 4.ఆదిలక్షమ్మ, 5.వెంకటరమణమ్మ, 6.పట్టాభిరామశాస్త్రి సంతానం. తాత పట్టాభిరామయ్య చయనంచేసి పట్టాభిరామ చయనులుగా ప్రసిద్ధి చెందారు. ఆయన మంత్రశాస్త్రవేత్త. కాళిదాసు వెంకటసుబ్బాశాస్త్రిగారు విజయదశమి నాడు అమ్మమ్మగారి ఇంట, నెల్లూరు జిల్లా, ఆత్మకూరు సమీపంలోని పొంగూరు గ్రామంలో జన్మించారు. తండ్రిగారి వద్ద ప్రాథమికవిద్య ముగిసిన తర్వాత రాజంపేట సమీపంలోని కొర్లగుంట గ్రామంలో వరసకు అన్న అయిన దాయాది ఇంట్లో వుండి కొంతకాలం చదువు సాగించారు. ఆ తర్వాత కాళహస్తి సమీపంలోని ఒక గ్రామంలో వైష్ణవ గురువు వద్ద పంచకావ్యాలు అభ్యసించారు. అక్కడ నుంచి తమిళదేశంలోని శ్రీ పెరుంబుదూరు వెళ్ళి ఒక మహావైష్ణవపండితుణ్ణి ఆశ్రయించారు. ఆ గురువుగారి వద్ద పాణిని ఆసాంతం అధ్యయనంచేశారు. శ్రీ పెరుంబుదూరులో ఉన్నంత కాలం మధ్యాహ్న భోజనం గుళ్ళో ప్రసాదంతో జరుపుకొని, రాత్రిపూట భోజనం ఒక ప్రభుత్వాధికారి- రిజిస్ట్రార్ గారియింట. నాలుగేళ్ళు తనకు భోజనం పెట్టిన గృహస్థుకు పంచకావ్యాలు పాఠంచెప్పారు. శాస్త్రిగారికి వేదాధ్యయనం చేయాలని బలమైన కోరిక ఉన్నా స్వరం పట్టుబడక ఆప్రయత్నం విరమించుకొన్నారట. అయితే వైదికసంస్కృత వ్యాకరణం సమగ్రంగా అధ్యయనం చేశారు. సంస్కతసాహిత్యం, వ్యాకరణాల్లో ఆయన మహాపండితులని, నిష్ణాతులని పేరు సంపాదించుకొన్నారు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత అల్లూరులో పొంగూరు సీతారామయ్య సోమయాజులు కుమార్తెను పెళ్ళిచేసుకొన్నారు. కొద్దికాలం బాపట్ల సంస్కృతపాఠశాలలో పనిచేసి, నెల్లూరు సమీపంలోని జేజేపేటలో, తర్వాత తుమ్మగుంటలో సంస్కృతపాఠశాల నడిపారు. ఇక్కడ ఆయన వివక్ష పాటించకుండా 'శూద్రుల'కు సంస్కృతం నేర్పించినట్లు మరుపూరు కోదండరామరెడ్డి తెలిపారు. పుష్పగిరి పీఠాధిపతులు ఆయనను ఆస్థాన పండితులుగా నియమించి, కనిగిరితాలూకా వీరరాంపురంలో శివాలయ జీర్ణోద్ధరణ బాధ్యత అప్పగించారు. ఏడాదిపాటు అక్కడే ఉండి ఆలయం పునరుద్ధరణ చేశారు. ఆవూళ్ళో వుండగానే భార్య మగబిడ్డను ప్రసవించి, తొమ్మిదోరోజు మశూచి సోకి చనిపోయింది. పదినెలల తర్వాత ఆయన మళ్ళీ పెళ్ళి చేసుకున్నారు. 1922 జూలైలో పల్లిపాడు గ్రామంలో చతుర్వేదుల రాఘవయ్యగారు శ్రీ తిలక్ విప్రపాఠశాల నెలకొల్పి, వెంకటసుబ్బాశాస్త్రిగారిని ప్రధానాచార్యులుగా నియమించారు. షుమారు అయిదేళ్ళు అక్కడ విద్యార్థులను పరీక్షలకు తయారు చేశారు. పల్లిపాడు అగ్రహారంలో బ్రాహ్మణ కుటుంబాలవారంతా ఆయనకు ఆత్మీయులయ్యారు. అక్కడే ఆయుర్వేదం పైన ఆసక్తి కలిగి, విద్యార్థులకు వైద్యం కూడా నేర్పించడం మొదలు పెట్టారు. 1939 లో డాక్టర్ ఆచంట లక్ష్మీపతిగారు అధ్యక్షులుగా వ్వహరిస్తున్న Central Board of Indian Medicine, Madras ఆయనకు ,B గ్రేడు ఆయుర్వేద వైద్యులుగా ఆయుర్వేదవైద్యవృత్తి చేసుకునేందుకు గుర్తింపు-certificate ఇచ్చింది కాని ఆయన వైద్యాన్ని వృత్తిగా ఎన్నడూ కొనసాగించలేదు. 1927లో పల్లిపాడు విడిచిపెట్టి నెల్లూరులో స్థిరపడ్డారు. మళ్ళీ కొంతకాలం పుష్పగిరి ఆస్థాన పండితులుగా వుంటూ నెల్లూరులో అన్నవరం రాఘవాచార్యులుగారి వద్ద ప్రస్థానత్రయం చదివారు. తమగురువు రాఘవాచార్యులు పరమపదించిన పిమ్మట, వారిస్థానంలో నెల్లూరు కాశిఖేలవారి అగ్రహారం లోని వేదాంతమందిరంలో షుమారు యిరవైరెండేళ్ళు ప్రతిదినం ఉదయం ప్రవచనం చేశారు. నెల్లూరులో విద్యావంతులు, న్యాయవాదులు, పురప్రముఖులు ఆసమావేశాలకు హాజరయ్యేవారు. వేదాంత మందిరంలో ప్రతసంవత్సరం శంకరజయంతి సభల్లో శాస్త్రిగారి ఉపన్యాసాలు వినడానికి పురప్రముఖులు వచ్చేవారు. ఆయన అద్వైతప్రవచనంలో గొప్ప ఖ్యాతి గడిచారు. 1930-45 మధ్య నెల్లూరులో జరిగిన సాహిత్యసభల్లో వారు తరచూ పాల్గొని ఉపన్యసించినట్లు స్థానికపత్రికలు రాశాయి. నెల్లూరు రాయాజివీధిలోని, పుష్పగిరి మఠంలో సంస్కృతపాఠశాల నెలకొల్పి షుమారు పది సంవత్సరాలు నిర్వహించారు. ఇందులో కడప, నెల్లూరు జిల్లాల్లోని దూరప్రాంతాలనుంచి వచ్చిన విద్యార్థులు సంస్కృతం అభ్యసించారు. 1937 లో శాస్త్రిగారు పొగతోట, కస్తురిదేవినగర్ లొనివేశనస్థలం కొని ఇల్లు కట్టుకొని స్థిరపడ్డారు. నెల్లూరికి 7 మైళ్ల దూరంలోని గొలగమూడి గ్రామంలో భూములు కొని పూర్తిగా వ్యవసాయంమీదే దృష్టి పెట్టి, కృషీవదుడుగా జీవించారు. వ్యవసాయ యోగ్యంగా లేని పొలాలను కొని వాటినకి మరమ్మత్తులు చేసి సేద్యానికి యోగ్యమైన పొలాలుగా తయారు చేసేవారు. ఇందుకు చాలాసమయం,ధనం వెచ్చించేవారు.

 ఒకమారు గాంధీజీ ఉపన్యసించిన సభలో విదేశీ వస్తత్రదహనం జరిగింది.
సభకువచ్చిన వారంతా మిల్లు పైపంచెలు, చొక్కాలు దహనంచేశారు, సభకువెళ్ళిన ఆయనమాత్రం పైపంచెను దారిలో ఒక యాచకునికిచ్చారు. జాతీయోద్యమ స్ఫూర్తితో నూలుకొని మాలవారికిచ్చి మగ్గంమీద నేసిన ధోవతులను, ఖద్దరు వస్త్రాలను ధరించారు. ఆయన ధోవతి, పైపంచె తప్ప చొక్కా వేసుకోలేదు, ఆయన ఆచారాలు, విశ్వాసాలు చాలా కఠినమైనవి. అయినా ఉదారవాది. గొలగముడి దళితవాడలో తనకు అనేక మంది మిత్రులు వుండేవారు. ఆయన ఆయుర్వేద ఔషధాలు తప్ప ఇంగ్లీషు మందులు వాడలేదు. జాతీయోద్యమస్ఫూర్తితో తన పిల్లలందరికీ హిందీ చెప్పించారు. శాస్త్రిగారివద్ద వందలమంది విద్యార్థులు సంస్కృతం చదువుకొన్నారు. నెల్లూరు మూలపేటలో వేదసంస్కృత కళాశాల నెలకొల్పినపుడు వెంకటసుబ్బాశాస్త్రి గారిని ప్రిన్సిపల్ పదవి చేపట్టమని కోరగా ఆయన ఆపదవిలో తన పూర్వవిద్యార్థి గాజులపల్లి హనుమచ్ఛాస్త్రిగారి నియమించమని కోరారు. వెంకటసుబ్బాశాస్త్రిగారికి  జ్యోతిషంలో గొప్ప ప్రవేశం వుంది. జ్యోతిషపండితులు స్వయంపాకుల శేషయ్యశాస్త్రి, ఉట్రవడియం కృష్ణశాస్త్రి వంటి యెందరో ప్రసిద్ధులు ఆయన శిష్యులు. వెంకటసుబ్బాశాస్త్రిగారు నెల్లూరులో స్థిరపడిన తర్వాత ఆయుర్వేదం మీద కృషికొనసాగించారు. మిత్రులు, ఆయుర్వేద వైద్యులు పులుగండ్ల నరసింహశాస్త్రిగారితో వైద్య విషయాలు చర్చించేవారు. మేనల్లుడు కోడూరు వెంకటరమణయ్యకు, పాటూరు సుబ్బరామయ్యకు, మరికొంతమందికి ఆయుర్వేదంలో శిక్షణ యిచ్చి పరీక్షలు పాసుచేయించారు. వాళ్ళు జిల్లాబోర్డులో వైద్యులై పేరుతెచ్చుకొన్నారు. నెల్లూరికి పండితులెవరు వచ్చినా వారిని వకీళ్ళవద్దకు, సంపన్నులవద్దకూ తీసుకొనివెళ్ళి పరిచయంచేసేవారు, సత్కరింపజేసేవారు. ప్రభాకర ఉమామహేశ్వర పండితులు అనే ఉత్తరాదినుంచివచ్చన పండితులొకరు శ్రీ కృష్ణుడు అయోనిజుడని నెల్లూరుసభలో ఉపన్యసిస్తూ అన్నారు. నెల్లూరు విద్వాంసులు ఆయన్ని ఖండించారు. వివాదం లో ఆ పండితుడు ఒంటరివాడయ్యాడు. వారంరోజులు గడువిస్తే, ఆ పండితులు చెప్పిన అంశాలకు గ్రంథాల్లో ఆధారాలు చూపుతానని సుబ్బాశాస్త్రిగారు సభలో విజ్ఞాపనచేశారు. వారంతర్వాత స్టోన్ హౌస్ పేట కన్యకా పరమేశ్వరి ఆలయంలో యేర్పాటయిన పండితసభలో వ్యాసభాగవతం, శ్రీ ధరవ్యాఖ్య తదితర గ్రఃథాలనుంచి ఆధారాలు చూపించి వెంకటసుబ్బాశాస్త్రి ఆ బయటవూరి పండితులవారి వాదాన్ని గట్టెంకిచ్చినట్లు నెల్లురు పత్రిక 'హిందూ బాంధవి' వివరంగా రాసింది. వేదంవారి శిష్యులు యానాదిరెడ్డి వంటివారు, వేదంవ్యతిరేకవర్గంలో దుర్భా సుబ్రహ్మణ్యశర్మ, దీపాల వంటి పండితులు ఆయను కలిసేవారు. మరుపూరు కోదండరామరెడ్డి, వేదం నారాయణసోమయాజులు, ఇంగువ శ్రీ కృష్ణయ్య, విశ్వనాథశ్రౌతి, రంగరామానుజాచార్యులు మొదలయిన పండితులు ఆయన సన్నిహితమిత్రులు. 1948-49 లో కంచి పరమాచార్యులు చాతుర్ మాసదీక్ష నెల్లూరు లొ జరుపుకున్నారు. వారు శాస్త్రిగారిని తమ సముఖంలో వుంచుకుని విద్వద్గోష్ఠులతో కాలం గడిపారు. స్వచ్ఛందంగా శాస్త్రిగారి యింటికి ఒకరోజు భిక్షకు వచ్చారు. స్వామివారు మైపాడు సముద్రతీరానికి విహారం వెళ్ళినపుడు, వెంకటసుబ్బాశాస్త్రిగారిని వెంటపెట్టుకుని తెప్పమీద సముద్రంలో 7 మైళ్ళ దూరంవరకూ వెళ్ళి, చాలా సేపు విహరించివచ్చారు. శాస్త్రిగారికి ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. అరవయ్యేళ్ళు దాటిన పిమ్మట శాస్త్రిగారు రంగరామానుజాచార్యుల వద్ద పూర్వమీమాంస చదువుకొన్నారు. తనకు ప్రకృతి అంటేప్రేమ. పరిసరవిగ్జానం, వనౌషధులు వంటి విషయాలమీద ఆసక్తి. తన సంతానానికి ప్రకృతి, మొక్కలు, ఆయుర్వేదం మీద అభిమానం కలిగించారు. ఆయనకు వ్యవసాయం పనులన్నీ కరతలామలకం. స్వయంగా పొలం దున్నేవారు. తాళ్ళు,తలుగులూ వేసేవారు. 1952 లో అనారోగ్యంతో, ఏడాది పాటు మంచంపట్టి 1953 సెప్టెంబర్ 30 వతేది కన్నుమూశారు. వైష్ణవదేశంలో వైష్ణవ గురువులవద్ద చదువుకోవడం వల్ల వైష్ణవభక్తి తత్పరత అలవడింది. దానికి తోడు వారి పూర్వులకాలం నుంచి నరసింహ భక్తులు, కృష్ణభక్తులు. ఆయనది నిండైన పాండిత్యం, ప్రతిభ, ఒకరికి తలవంచని స్వేచ్ఛాప్రవృత్తి. "నిండుమనంబు నవ్యనవనీతసమానము, పల్కు దారుణాఖండల శస్త్రతుల్యము .." పద్యం కాళిదాసు వెంకటసుబ్బాశాస్త్రి గారిపట్ల యధార్థమని ఆయన సంస్మరణ సభలో మాట్లాడిన పెద్దలు నివాళులర్పించారు.      
 వెంకటసుబ్బాశాస్త్రి గారి కుమారులు పురుషోత్తం నెల్లూరు వి. ఆర్. హైస్ల్కూలు విద్యార్థి. వి.ఆర్ కళాశాలలో బి.ఎ చదివాడు. హైదరాబాదు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు ఎం.ఏ లో ఫస్ట్ క్లాసులో, క్లాసులొ ఫస్ట్ గా మార్కులు సంపాదించుకొని, విశ్వవిద్యాలయం నుండి "గురజాడ అప్పారావు స్వర్ణపతక పురస్కారం" పొందాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి జాతీయ స్కాలర్షిప్ తో ఉస్మానియా విశ్వవవిద్యాలయంలో ప్రొఫెసర్ బిరుదురాజు రామరాజుగారి పర్యవేక్షణలో వెంకటగిరి సంస్థానం(నెల్లూరు జిల్లా) చరిత్ర, సాహిత్యం మీద పరిశోధించి డాక్టరేట్ పట్టా పొందాడు.నెల్లూరు శ్రీ సర్వోదయ డిగ్రీ కళాశాలలో తెలుగు డిపార్ట్మెంట్ అధిపతిగా, ఆ కళాశాల ప్రిన్సిపాల్ గా పనిచేసి 2000లో పదవీవిరమణ చేసాడు. నెల్లూరు సాంస్కృతిక జీవితంలో ముప్ఫయి సంవత్సరాలు క్రియాశీలంగా పనిచేసాడు. నెల్లూరు కెమెరా క్లబ్, కార్యదర్శిగా, ది ప్రోగ్రేసివ్ ఫిల్మ్ అసొసియేషన్ (ప్రో ఫిల్మ్)పేరుతొ మిత్రులతో కలసి పదేళ్ళు సినిమా సొసైటీ నిర్వహించాడు. దీన్ని ఫెడరేషన్ అఫ్ ఫిలిం అసోసియేషన్, నేషనల్ ఫిల్మ్ Archives, పూనేకి అనుబంధించి అపూర్వ మయిన చిత్రాలను నెల్లూరు కలాభిమానులకు ప్రదర్శించదమేకాక, ఈ సంస్థల సహకారంతో లొ సహకారంతో నెల్లూరు లో 10 రోజుల పాటు ఫిల్మ్ అప్రీసియేషన్ కోర్సు నిర్వహించాడు.ఈ కృషిలో సింగరాజు రాజేంద్రప్రసాద్, కే.పెంచలయ్య, ఎం.టి. శేఖర్ రెడ్డి , డాక్టర్ ఎం. శివరామప్రసాద్, డాక్టర్ పి.మధుసుదశాస్త్రి, డాక్టర్ సి.పి. శాస్త్రి, సి. సంజీవరావు, బాబు వంటి సహృదయులు ఎందరో సహకరించారు.

నెల్లురు వర్ధమాన సమాజ కార్యవర్గ సభ్యులుగా కవిత్రయ కవితావైజయంతి, ఫిడేలు రాగాల డజన్, కయిత నా దయిత పుస్తకాల ప్రచురణలో సహకరించాడు. కవిత్రయ కవితా వైజయంతి-వర్ధమాన సమాజం నిర్వహించిన కవిత్రయజయంతుల్లో పండితులు చేసిన ఉపన్యాసాలను కవిత్రయ కవితావైజయంతి పేరుతో పెన్నేపల్లి గోపాలకృష్ణ మరి ఇద్దదరు

మిత్రులతో కలిసి సహసంపాదకుడుగా ఒక సంకలనం తయారు చేయగా, వర్ధమాన సమాజం ఈ గ్రంథాన్ని ప్రచురించింది. దుర్భా సుబ్రహ్మణ్యశర్మ రచనలను పెన్నేపల్లి గోపాలకృష్ణతో కలిసి కావ్యపంచమి పేరుతో సంకలనంచేయగా, దుర్భా రామమూర్తి దాన్ని ప్రచురించారు. 

భారతి, ఉదయం, వార్త,ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, సాక్షి, జమీన్ రయితు, యూత్ కాంగ్రెస్, మిసిమి,జనసాహితి, చైతన్య మానవి, అమ్మనుడి,గ్రంథాలయ సర్వస్వం వంటి పత్రికల్లో సాహిత్యం, సినిమా, travelogues మీద రాసాడు. 198లో పూనే ఫిల్మ్ & టి.వి. ఇన్స్టిట్యూట్ లో 5వారాలు ఫిల్మ్ appreciation కోర్సు చేసాడు.(1976)కావలి జవహర్ భారతి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. పట్టాభిరామిరెడ్డి గారికి సహకరించి, ఆంధ్రప్రదేశ్ చరిత్రసభలు(A.P.History Congress)స్థాపించడంలో సహకారం అందించాడు. ఈ సంస్థ స్థాపక సభ్యుదు కూడా. 1986 నుండి Indian History Congress సభలకు హాజరువుతూ, పరిశోధన పత్రాలు సమర్పించాడు. ఫోటోగ్రఫీ, చరిత్ర, సినిమా, పర్యటన, గురజాడ అప్పారావు గారి రాతప్రతులు (manuscripts) పరిశోధించడం తన హాబీలు. 1988లో "గోపినాథుని వెంకయ్యశాస్త్రి జీవితం, సాహిత్యం" పుస్తకం తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆర్థిక సహకారంతో ప్రచురించాడు. వీరేశలింగం పంతులు సమకాలికులు, పీపుల్స్ ఫ్రండ్ ఆంగ్ల వారపత్రికా సంపాదకులు దంపురు నరసయ్యగారి జీవితం,కృషిమీద పరిశోధించి "ఇంగ్లిషు జర్నలిజంలొ తొలి తెలుగువెలుగు దంపూరు నరసయ్య" పుస్తం రచించాడు. వీరు, డాక్టర్ మాచవోలు శివరామప్రసాద్ గారు సహసంపాదకులుగా పూండ్ల రామకృష్ణయ్య సంపాదకత్వంలో వెలువడిన అముద్రిత గ్రంథచింతామణి మాసపత్రిక లోని వ్యాసాలలో ఎంపికచేసిన వ్యాసాలతో "అలనాటి సాహిత్య విమర్శ" గ్రంథాన్ని తయారు చేశారు. దీన్ని ఆంధ్రప్రదేశ్ Research and Oriental Manuscripts Library, Hyd వారు 2008లో ప్రచురించారు.

పెన్నేపల్లి గోపాలకృష్ణతో కలిసి గురజాడ అప్పారావు పంతులుగారి రాతప్రతులు, రికార్డు పరిశీలించి, గురజాడ సమగ్రరచనల సంకలనం "గురుజాడలు" సంకలనానికి కృషిచేశాడు. దీనికి ఎం.వి.రాయుడుతో పాటు సహసంపాదకులుగా వ్యవహరించాడు. ఈ గ్రంథాన్ని మనసు ఫౌండేషన్ స్వచ్ఛందసంస్థ ప్రచు రించింది. మనసు ఫౌండేషన్ గుర్రం జాషువ సమగ్ర రచనల సంంకలనం తీసుకొని వచ్చిన సందర్భంలో మధ్రాసు, ఇతరచోట్ల గ్రంథాలయాలన్నీ శోధించి జాషువ గ్రంథాల తొలిముద్రణలు సేకరించి సహకరించాడు. ఈ సంపుటాన్ని హైదరాబాదులో ఏర్పాటు చేసిన సభలో శ్రీ కాళీపట్నం రామారావు మాస్టారు ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ సభకు కాళిదాసు పురుషోత్తంను అధ్యక్షత వహించమని మనసు ఫౌండేషన్ కోరింది. సాక్షి దినపత్రిక నెల్లూరు టాబ్లాయిడ్ లో 2009-10లో 13 నెలలపాటు "పెన్న ముచ్చట్లు" పేరుతో నెల్లూరు జిల్లా చరిత్ర, సంస్కృతి, సాహిత్యం వంటి ఆంశాలమీద 62 వ్యాసాలు రాశాడు. ఇవి పుస్తకరూపంలో వెలువడ్డాయి. మనసు ఫౌండేషన్ ఎంవి.రాయుడుగారి సహకారంతో ఆచార్య ఆర్.వి.యస్. సుందరం, పారా అశోక్ సహసంపాదకులుగా ఆధునిక తెలుగుకవి పఠాభి(తిక్కవరపు పట్టాభిరామరెడ్డి)"లభ్య సమగ్రరచనల సంకల"నానికి సంపాదకులుగా వ్యవహరించాడు.ఈ గ్రంథాన్ని మనసు ఫౌండేషన్ 2019 ఫిబ్రవరి 19న పఠాభి శతజయంతి రోజు, నెల్లూరు టౌన్ హాల్ లో విడుదలచేసింది. 2019లోనే బంగోరె(బండి గోపాలరెడ్డి)జాబులను "బంగోరె జాబులు" పేరుతో డాక్టర్స్త మాచవోలు శివరామప్రసాద్ తో కలిసి, పరిష్కరించి,ప్రచురించాడు. బంగోరె సాహిత్యకృషి, జీవితం గురించి ఈపుస్తకం కొత్తవిషయాలను తెలియజేస్తుంది.ఈయన పర్యవేక్షణలో అముద్రిత గ్రంథచింతామణి సంపాదకులు పూండ్ల రామకృష్ణయ్య మీద మాచవోలు శివరామప్రసాద్, అల్లం రాజయ్యగారి నవలలు,కథలమీద పరిశోథించి కుమారి ఉభయభారతి డాక్టరేటీ పట్టాలు పొందారు.

రచనలు[మార్చు]

 1. కనక పుష్యరాగం - పొణకా కనకమ్మ స్వీయచరిత్ర (సంపాదకత్వం) సునయన క్రియేషన్స్, శ్రీ యం,వి.రాయుడు, బెంగుళూరు, 2011 [2]
 2. ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు దంపూరు నరసయ్య (జీవితచరిత్ర, కృషి. -పరిశోధన)సొసైటీ ఫర్ సోషల్ చేంజ్,నెల్లూరు,2007
 3. వెంకటగిరి సంస్థాన చరిత్ర - సాహిత్యం(ఉస్మానియా విశ్వవిద్యాలం నుంచి డాక్టరేట్ పట్టా పొందిన గ్రంథం-1971-ప్రథమ ముద్రణ2014)[3]
 4. కవిత్రయ కవితా వైజయంతి (పెన్నేపల్లి గోపాలకృష్ణతో కలిసి సంపాదకత్వం)నెల్లూరు వర్ధమాన సమాజం ప్రచురణ,1974.)
 5. కావ్యపంచమి (సంపాదకత్వం దుర్భా సుబ్రమణ్య శర్మగారి రచనలు.)1975 ప్రచురణ.
 6. శివారెడ్డి పద్యాలు (పెన్నేపల్లి గోపాలకృష్ణ, బండి నాగారాజు, బ్రహ్మారెడ్డి లతో కలిసి సంపాదకత్వం)1980
 7. అలనాటి సాహిత్య విమర్శ (.సంపాదకులు: కాళిదాసు పురుషోత్తం, Dr M. శివరామప్రసాద్), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రాచ్యలిఖిత గ్రంథాలయం, పరిశోధనాలయం, హైదరాబాద్.2008.
 8. గురుజాడలు (సంపాదకులు: పెన్నేపల్లి గోపాలకృష్ణ, కాళిదాసు పురుషోత్తం, యం.వి.రాయుడు. మనసు ఫౌండేషన్ , బెంగుళూరు2012.
 9. గోపినాథుని వెంకయ్యశాస్త్రి జీవితం, సాహిత్యం,TTD ఆర్ధికసహకారం తో ప్రచురణ.1988.
 10. పెన్న ముచ్చట్లు, (నెల్లూరు మండల చరిత్ర, సంస్కృతి మీద వ్యాసాలు) పల్లవి పబ్లికేషన్స్ , విజయవాడ, 2018.
 11. తెలుగు సంస్కృతి, రెండవ సంపుటం (కొన్ని వ్యాసాలు), తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ.1988.

మూలాలు[మార్చు]

 1. "నెల్లూరు: 6న ప్రజాకవి వేమన సాహితీ సమాలోచన". prabhanews.com. Retrieved 29-08-2018. {{cite web}}: Check date values in: |accessdate= (help)
 2. "కనకపుష్యరాగం – పొణకా కనకమ్మ స్వీయచరిత్ర". pustakam.net. Retrieved 29-08-2018. {{cite web}}: Check date values in: |accessdate= (help)
 3. "వెంకటగిరి సంస్థాన చరిత్ర - సాహిత్యం". prasthanam.com. Retrieved 29-08-2018. {{cite web}}: Check date values in: |accessdate= (help)

4. కవిత్రయ కవితా వైజయంతి, నెల్లూరు వర్ధమాన సమాజం ప్రచురణ.1974.

5శివారెడ్డి పద్యాలు, శివారెడ్డి సొంత ప్రచురణ.1980.

6. హిందుబంధవి పక్షపత్రిక,సంపాదకులు: చతుర్వేదుల వెంకటరాఘవయ్య.