కాళిదాసు వెంకటసుబ్బాశాస్త్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కాళిదాసు వెంకటసుబ్బాశాస్త్రి
విద్యావాచస్పతి కాళిదాసు వెంకటసుబ్బాశాస్త్రి
జననంకాళిదాసు వెంకటసుబ్బాశాస్త్రి
1883, విజయదశమి
నెల్లూరు జిల్లా, పొంగూరు గ్రామం
మరణంసెప్టెంబర్ 30,1953
వృత్తిఆస్థాన విద్వాంసుడు, పుష్పగిరి పీఠం
ప్రసిద్ధిసంస్కృత పండితుడు
మతంహిందూ
పిల్లలుకాళిదాసు పురుషోత్తం
తండ్రిచెంచురామయ్య

కాళిదాసు వెంకటసుబ్బాశాస్త్రి (1883-1953) సంస్కృత పండితుడు, వేదాంతవేత్త. అతనిని "విద్యావాచస్పతి" అన్న బిరుదుతో వ్యవహరించేవారు.

బాల్యం, విద్యాభ్యాసం[మార్చు]

కాళిదాసు వెంకటసుబ్బాశాస్త్రి 1883 ప్రాంతంలో విజయదశమి నాడు నెల్లూరు జిల్లా, ఆత్మకూరు సమీపంలోని పొంగూరు గ్రామంలో జన్మించాడు. వెంకటసుబ్బాశాస్త్రి తండ్రి పేరు చెంచురామయ్య. ఇతనిది పండిత కుటుంబం. తాత పట్టాభిరామయ్య చయనం చేసి పట్టాభిరామ చయనులన్న పేరు పొందాడు.

తండ్రి వద్ద ప్రాథమిక విద్య ముగించుకుని కడప కడప జిల్లా రాజంపేట సమీపంలోని కొర్లగుంట గ్రామంలో వరసకు అన్న అయిన దాయాది ఇంట్లో వుండి కొంతకాలం చదువుకున్నాడు. ఆ తర్వాత శ్రీ కాళహస్తి సమీపంలోని ఒక గ్రామంలో వైష్ణవ గురువు వద్ద పంచకావ్యాలు అభ్యసించాడు. అక్కడ నుంచి తమిళనాడులోని శ్రీపెరుంబుదూరు వెళ్ళి ఒక గొప్ప వైష్ణవ పండితుణ్ణి ఆశ్రయించాడు. ఆ గురువువద్ద పాణిని వ్యాకరణం ఆసాంతం అధ్యయనం చేశాడు.  ఆ నాలుగేళ్ళు తనకు భోజనం పెట్టిన ఒక ప్రభుత్వ ఉద్యోగోకి సుబ్బాశాస్త్రి పంచకావ్యాలు పాఠంచెప్పాడు. సుబ్బాశాస్త్రికి వేదాధ్యయనం చేయాలని బలమైన కోరిక ఉన్నా స్వరం పట్టుబడక ఆ ప్రయత్నం విరమించుకొన్నాడు. అయితే వైదిక సంస్కృత వ్యాకరణం సమగ్రంగా అధ్యయనం చేశాడు. సంస్కృత సాహిత్యం, వ్యాకరణాల్లో అతను మహాపండితుడని, నిష్ణాతుడని పేరు పొందాడు. సాహిత్యంలోనూ, వ్యాకరణంలోనూ కూడా గట్టి పట్టు ఉండడంతో "డబుల్ శాస్త్రి" అని అందరు పిలిచేవారు.

వృత్తి జీవితం[మార్చు]

కొద్దికాలం బాపట్ల సంస్కృత పాఠశాలలో పనిచేశాడు. ఆ తర్వాత నెల్లూరు సమీపంలోని జేజేపేటలో, తర్వాత తుమ్మగుంటలో సంస్కృత పాఠశాల నెలకొల్పి నిర్వహించాడు. ఇక్కడ అతను బ్రాహ్మణులకే నేర్పుతానన్న వివక్ష పాటించకుండా శూద్రులకు సంస్కృతం నేర్పించాడు. పుష్పగిరి పీఠాధిపతి సుబ్బాశాస్త్రిని ఆస్థాన పండితునిగా నియమించి, కనిగిరి తాలూకా వీరరాంపురంలో ఆలయ జీర్ణోద్ధరణ బాధ్యత అప్పగించగా నిర్వర్తించాడు. 1922 జూలైలో పల్లిపాడు గ్రామంలో చతుర్వేదుల రాఘవయ్య "శ్రీ తిలక్ విప్రపాఠశాల" నెలకొల్పి, సుబ్బాశాస్త్రిని ప్రధానాచార్యునిగా నియమించాడు. దాదాపు అయిదేళ్ళు అక్కడ విద్యార్థులను పరీక్షలకు తయారు చేశాడు. ఆయుర్వేదం పైన ఆసక్తి కలిగి, విద్యార్థులకు వైద్యం కూడా నేర్పించడం మొదలు పెట్టాడు.

అతను 1927లో పల్లిపాడు విడిచిపెట్టి నెల్లూరులో స్థిరపడ్డాడు. తిరిగి కొంతకాలం పుష్పగిరి ఆస్థాన పండితునిగా ఉంటూ నెల్లూరులో అన్నవరం రాఘవాచార్యులు వద్ద ప్రస్థాన త్రయం చదువుకున్నాడు. రాఘవాచార్యులు మరణించాక, నెల్లూరు కాశిఖేలవారి అగ్రహారంలోని వేదాంత మందిరంలో అప్పటివరకూ రాఘవాచార్యులు నిర్వహిస్తున్న వేదాంత ప్రవచనాలను తాను కొనసాగించాడు. 1927 నుంచి 1951 వరకూ 23 సంవత్సరాల పాటు వేదాంత మందిరంలో రోజూ ఉదయం సుబ్బాశాస్త్రి వేదాంత ప్రవచనాలు చేశాడు. ఆ ప్రవచనాలకు నెల్లూరులోని విద్యావంతులు, ప్రముఖులు హాజరయ్యేవారు. ఆక్రమంలో అతను అద్వైత ప్రవచనంలో పేరు ప్రఖ్యాతులు సాధించాడు.

నెల్లూరులోని పుష్పగిరి మఠంలో సంస్కృత పాఠశాల నెలకొల్పి దాదాపు పదేళ్ళపాటు కొనసాగించాడు. ఇందులో కడప, నెల్లూరు జిల్లాల్లోని దూర ప్రాంతాలనుంచి వచ్చిన విద్యార్థులు సంస్కృతం అభ్యసించారు. 1937లో సుబ్బాశాస్త్రి నెల్లూరులో ఇల్లు కట్టుకొని స్థిరపడ్డాడు. నెల్లూరుకు 7 మైళ్ల దూరంలోని గొలగమూడి గ్రామంలో భూములు కొని పూర్తిగా వ్యవసాయంమీదే దృష్టి పెట్టి, వ్యవసాయదారునిగా జీవించాడు. వ్యవసాయ యోగ్యంగా లేని పొలాలను కొని వాటికి మరమ్మత్తులు చేసి సేద్యానికి యోగ్యమైన పొలాలుగా తయారు చేసేవాడు. ఇందుకు చాలా సమయం, ధనం వెచ్చించేవాడు.

1939లో మద్రాసులోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్‌ ఇండియన్ మెడిసిన్ నుంచి బి గ్రేడ్ ఆయుర్వేద వైద్యునిగా గుర్తింపు పట్టా లభించింది. కానీ, ఇతను వైద్యాన్ని వృత్తిగా ఎన్నడూ కొనసాగించలేదు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత నెల్లూరుకు సమీపంలో అల్లూరులో పొంగూరు సీతారామయ్య సోమయాజులు కుమార్తెను సుబ్బాశాస్త్రి పెళ్ళిచేసుకున్నాడు. కొన్నాళ్ళకు ఆమె బిడ్డను ప్రసవించి బాలింత వాయువుతో మరణించడంతో రెండవ పెళ్ళి చేసుకున్నాడు. వీరి సంతానంలో ఒకడైన కాళిదాసు పురుషోత్తం చరిత్ర, సాహిత్య పరిశోధకునిగా, సంపాదకునిగా పేరు సంపాదించుకున్నాడు.

మరణం[మార్చు]

వెంకటసుబ్బాశాస్త్రి 1953 సెప్టెంబర్ 30న మరణించాడు.

మూలాలు[మార్చు]

1.విక్రమ సింహపురి మండల సర్వస్వం: సంపాదకులు, నేలనూతల శ్రీకృష్ణమూర్తి,1963.

2. హిందూబంధవి, పక్షపత్రిక, సంపాదకులు :చతుర్వేదుల వెంకటరాఘవయ్య 1903-1907, 1921-1937 ౩.సాహిత్య అకాడమి ప్రచురణ సంస్కృతి మూడవ సంపుటం, రెండవ భాగం.